12, నవంబర్ 2021, శుక్రవారం

చిత్రకారుడు 'ఆంట్యాకుల పైడిరాజు'


ఆంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు  (My pencil sketch)


ఇతడు నవంబర్ 1, 1919న బొబ్బిలిలో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది.

విజయనగరం మహారాజా కళాశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.

పైడిరాజు 1949లో విజయనగరములో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు లండన్పోలెండ్ఆఫ్ఘనిస్తాన్రష్యాఅమెరికాసింగపూర్ లకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి. విజయనగరంలో బొడ్డు పైడన్న, పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు, వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినవే.

అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి. భారతీయత, ఆంధ్రత్వం, అధివాస్తవికత, క్యూబిజం ఇతని చిత్రాలలో జీవకళగా ఉట్టిపడుతూ ఉంటాయి.

1977లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆహ్వానాన్ని మన్నించి లలితకళా విభాగ ఆచార్యులయ్యారు. చిత్రకళా శిరోవిభూషణ, కళా ప్రపూర్ణ గౌరవాలందుకున్నారు. బోగి జగన్నాధరాజు, అబ్బూరి గోపాలకృష్ణ, కేతినీడి, వేదుల రాజ్యలక్ష్మి, శ్యామా కౌండిన్య, ద్వివేదుల సోమనాథశాస్త్రి మొదలగు వారెందరో పైడిరాజు శిష్యులు.

కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు 1986 సంవత్సరంలో డిసెంబరు 26న విశాఖపట్నంలో మరణించాడు.


Courtesy : Wikipedia


మరిన్ని వివరాలు 64 Kalalu.com 

 సౌజన్యంతో. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.


 https://64kalalu.com/tag/%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%88%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81/ .

11, నవంబర్ 2021, గురువారం

మాలా సిన్హా - Mala Sinha


 Mala Sinha - My pencil sketch

అలనాటి ప్రఖ్యాత హిందీ, బెంగాలీ, నేపాలీ నటి మాలాసిన్హా కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కధాంశం విని అటువంటి పాత్రలు పోషిస్తే తమ కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అని కొందరు అగ్ర నటీమణులు స్వీకరించని పాత్రలు ఈమెను వరించడమే కాకుండా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు : ధూల్ కా ఫూల్, మిట్టీ మే సోనా (మట్టిలో బంగారం), Gumrah (దారి తప్పిన యువతి) మొదలైనవి. గురుదత్, BR Chopra వంటి అగ్రశ్రేణి దర్శకులు ఈమెకు మంచి పాత్రలు ఇచ్చారు. సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ స్థాన్నాన్ని సంపాదించుకున్నా కొత్త నటులైన మనోజ్ కుమార్, బిశ్వజీత్ వంటి నటులతొ నటించడానికి వెనుకాడలేదు. That is Mala Sinha అనిపించుకుంది.

Anpadh (చదువురాని అమ్మాయి/యువతి) లో ఈమె పై చిత్రీకరించిన, మదన్ మోహన్ స్వరపర్చిన రెండు super hit పాటలు aap ki nazron samjha, jiya le gayo ji mora sawariyana, ఆ పాటలకు ఆమె అభినయం ఆమె ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసాయి.

Birthday Greetings to Mala Sinha, veteran actress of 1950s, 60s, and early 1970. She is better known as the 'daring diva' of the 50's, earned the title for taking on roles her contemporaries back then never touched.

7, నవంబర్ 2021, ఆదివారం

సత్యభామ సరసపు నగవు - అన్నమయ్య కీర్తన


 

చిత్రం : పొన్నాడ మూర్తి

ప|| సత్యభామ సరసపు నగవు | నిత్యము హరి మదినే నెలవు ||

చ|| రుకుమిణి దేవికి రూపయవ్వనికి |
సకల విభవముల సౌఖ్యతలు |
చికురాంబరమున జెదరిన యలకలు |
వికచాబ్జ ముఖము వెయి వేలాయె ||
చ|| తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై |
నడపులమురిపెపు నగుమోము |
తడయక వారిధి దచ్చిన హరికిని |
బడలికవాపను పరమంబాయ ||
చ|| అనుదినమునును నీ యలుమేలుమంగ |
కనుగవ జంకెన గర్వములు |
దినదినంబులును తిరువేంకటపతి |
చనువుల సొబగుల సంపదలాయ ||

భావ సౌందర్యం - సౌజన్యం : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

సత్యభామ ( భూలక్ష్మి) సరసమైన నవ్వులకు శ్రీవేంకటపతి మనసే స్థావరం.
ఇక ఆ రుక్మిణీదేవి(శ్రీలక్ష్మి) రూపలావణ్యాలు వర్ణనాతీతములు.
నల్లని ఆమె కేశ సౌందర్యం నిరుపమానం. ఆ నల్లని ముంగురులు
వికసించిన ఆమె ముఖపద్మంమీద వేనకు వేలు అల్లల్లాడుతున్నాయి.(అవి తుమ్మెదలలా ఉన్నాయని ధ్వని)
ఆమె మేని మెరుపు ఆభరణాల కాంతిని మించిపోయింది.
(ఆభరణాల అవసరమే లేదని భావం)
క్షీరసాగర మధన సమయంలో శ్రీహరి కూర్మావతారమెత్తి మందర పర్వతాన్ని మోసిన బడలికను తీర్చినది ఈ లావణ్యవతి లక్ష్మీదేవే కదా!
ఇక ఇప్పుడు అలమేలు మంగగా దర్శనమిస్తున్నది. ఆమె కనుగవలోని అరుణిమలు నిత్యమూ ఆ వేంకట పతికి దగ్గరతనాన్ని కూర్చే శృంగార రేఖలు! సొగసులు!’
( భర్త శ్రమను మరిపించేది, మురిపించేది ఇల్లాలి నడవడీ, అందమే… ఆ భర్తభగవంతుడైనా సరే!! అన్నదే మనం కీర్తనతో గ్రహించే సత్యం!)
కీర్తనలో తొడవులు, నగవులు, నడపులు, సొగసులు, విభవము, మెరుగులు వంటి లఘువులతో కూడిన పదాల కూర్పు కీర్తనకు మెరుగులు దిద్దిన తొడవులే!
కొన్ని పదాలకు అర్థాలు
చికురాంబరము- నల్లని కురులు
అలకలు-ముంగురులు
వికచాబ్జముఖము- వికసించిన పద్మము వంటి ముఖము
తొడవులు-ఆభరణములు
నడపు-ప్రవర్తన
తడయక- ఆలస్యము చేయక
బడలిక-అలసట
జంకెన-బెదిరించు

కీర్తన భావానికి ఉమాదేవి గారి పద్యం
తే.గీ
క్షీర సాగర మధనంబుఁజేయు వేళ
హరిభరించెనుఁగూర్మమై గిరిభరంబు
తీరె బడలిక పత్నులుఁజేరి కొలువ
శ్రమను మరిపించ గలవారు సతులు గారె!

1, నవంబర్ 2021, సోమవారం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం - అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలితం.



ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా అమర గాయకుడు KBK మోహన్ రాజు గారు పాడిన
పాట వారి కుమార్తె శ్రీమతి ఉషా మోహన్ రాజు గారు  నేను వేసిన చిత్రాలతో facebook లో పోస్ట్ చేశారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినవచ్చును.

ధన్యవాదాలు.

30, అక్టోబర్ 2021, శనివారం

ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది - అన్నమయ్య


 


అన్నమయ్య  కీర్తన : ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది
చిత్రం : పొన్నాడ మూర్తి, 
విశ్లేషణ : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

పల్లవి:

ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది
చరణములు:
ఈ పాదమే కదా యిందఱును మ్రొక్కెడిది
యీ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది
ఈ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది
యీ పాదమే కదా యీ బ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది
ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా యిల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది

ఓం నమో వేంకటేశాయ !

ప్రార్ధన ( భాగవతం)
మ॥
ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుసన్ నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!

శ్రీమన్నారాయణుని చరణారవిందాల ఘనతను వర్ణించిన ……

‘ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||’ అనే
అన్నమయ్య కీర్తనను గురించి మనం ఈ వారం తెలుసుకుందాం.

దానికన్నాముందు పాదాల ప్రాముఖ్యత
గురించి నాలుగు మాటలు!
పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరించడం భారతీయ సంప్రదాయం.
వినయ విధేయతలకు గుర్తు!
పాదాలకు నమస్కరించడం వెనక అంతరార్థం ఏవిటి?
మనలోని అహంకారం తగ్గించుకుంటేనే వంగి మరొకరి కాళ్ళకు నమస్కరించ గలుగుతాం.
కాబట్టి అహంకార రాహిత్యానికి అది నిదర్శనం.
మనపాదాలు ఇతరులకు తగలకుండా చూసుకోవడం మర్యాద!
ఎవరికైనా మనపాదాలు తగిలితే మన్నించమంటాం.
శరీరంలో అవయవాలన్నిటికన్నా అడుగున ఉన్నందుకేమో పాదానికి అడుగు అనే పేరుంది. కానీ ఆ అడుగులు తడబడితే పడతాం.
అవి సరిగా పడితే ముందుకు వెళతాం।
అడుగున ఉన్నా మనశరీరాన్నంతా మోసేవి పాదాలే!
వాటి విలువను మనం గ్రహించక పెద్దగా వాటిని పట్టించుకోం.
కానీ అవిశుభ్రంగా ఉంటే సగం ఆరోగ్యం ఉన్నట్లే. పెద్దల అడుగుజాడలు అంటాం. అంటే వాళ్ళ పద్ధతులు అని అర్థం!
పాదాలకు కూడ సాముద్రికముంది. పాదాల వ్రేళ్ళను బట్టికూడ మనస్తత్వంచెబుతారు.
కావ్యనాయికల వర్ణనలలో పాదాల వర్ణన కనబడుతుంది. వాటిని పద్మాలతో, చివురాకులతో పోల్చడం, మువ్వల పట్టీలున్న, పారాణి పెట్టుకున్న పాదాల అందాలు వర్ణించడం వంటివి ఎన్నో ఉన్నాయి.
ఎవరినైనా పూర్తిగా వర్ణిస్తే
ఆపాద మస్తకం వర్ణించారంటాం. దేవాలయంలో అర్చామూర్తిని దర్శించేటప్పుడు మనచూపులు పాదాలనుంచి క్రమంగా పైకి జరగాలి.
ఇలాంటివి అనేక విశేషాలు చెప్పుకోవచ్చు.

*జగన్నాథుని పాదాలఅందచందాలు
‘శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే’ మకుటం గాగల శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిలో
ఏవిధంగా కీర్తించారో మనందరికీ విదితమే. ఒక్క వర్ణనను ఆస్వాదించి
తరవాత అన్నమయ్య కీర్తన చూద్దాం.

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥

భావం-
ఆ చరణముల అరుణ ద్యుతి పద్మరాగమునే గెలవగలిగినది. ఆ మీగాలి ( పాదంపై భాగం) కాంతి ముందు ఇంద్రనీలమణి ప్రభలు ఎందుకూ కొరగావు. ఇక గోళ్ళు చంద్రకాంతిని తలదన్నగలవి. అటువంటి స్వామి వారి పాదాలను శరణుగోరుతున్నాము .

ఇటువంటి శ్రీపతి పాదాలను
నిరంతరం ధ్యానించే అన్నమయ్య తన కీర్తనలో శ్రీ హరి పాద మహిమను ప్రస్తుతిస్తున్నాడు.

*కీర్తన భావ సౌరభం
~~~~~~~~~~~
ఈ పాదమే కదా వామనావతారంలో భూమండలమంతా కొలిచింది!ఈ పాదం నుండే గంగ పుట్టి విష్ణు పాదోద్భవ అయింది. ఆ గంగను బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడట. వామనావతారంలో శ్రీ హరి తన రెండవ అడుగుగా ఆకాశాన్ని కొలిచినప్పుడు బ్రహ్మ తన దగ్గరున్న గంగతో ఆయన పాదం కడగడం వలన బ్రహ్మకడిగిన పాద మైంది.
ఈ పాదం అనంతమైనది. ఇంద్రాది దేవతల కు ఆ అడుగే ఇడుములు పోగొట్టగలది.
కరిరాజును బ్రోచిన పాదం ,లోకాలకు మేలు చేసే పాదం ఆ హరిపాదమే! భక్తితో మొర పెడితే పరుగున వచ్చిన కథలెన్ని!!
ఈ పాదానికి మించిన అందం ఎక్కడుంది?
ఈ పాదమే కదా రామావతారంలో అహల్యకు శాపవిమోచనం కలిగించింది !
(కృష్ణావతారంలోని ఈ పాదమహిమ మరో కీర్తనలో అన్నమయ్య కీర్తించాడు. అక్కడి విశేషాలలో కాళీయ మర్దనం ముఖ్యమైనది.)
అంతటి మహిమ గలవి, అందమైనవీ, సుకుమారమైనవీ అయిన పాదాలు ఎందరి భక్తుల కోసం పరుగులు తీసి అలిసిపోయాయో అని లక్ష్మీ దేవి ప్రేమతో పాదాలొత్తుతుంది ! భాగ్యదేవతఅయిన లక్ష్మీదేవి అది తన భాగ్యమనుకుంటుంది.

ఈ కీర్తన భావానికి నాహృదయ స్పందన జోడించి సీసపద్యంగా వ్రాసాను . చిత్తగించండి.
సీ॥
ఏచరణకమలమ్మిల గొల్చినట్టిది
యద్దాని దాల్తునా యౌదలందు!

ఏపాద పద్మమ్ము నిభరాజు శరణనె
నద్దాని నెదపైన హత్తుకొందు!

ఏయంఘ్రిఁదామర నిందిర సేవించు
నదినన్ను బ్రోవగ నాశ పడుదు!

ఏపదకంజమ్ము నింద్రుడుమ్రొక్కునో
నయ్యది చూపదే యసలు ద్రోవ!

తే.గీ
ఆయడుగె తీర్చుఁగష్టములమరతటికి !
అదియె మోక్షమార్గమనిరి యఖిల మునులు!
అదియనగనేది మరియేది హరిపదంబు!
అనుచు కీర్తించె నన్నమయ్యార్తితోడ

ఆ హరి చరణాలను సేవించి తరిద్దాం.

నీపాద కమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును
తాపస మందార నాకు దయసేయ గదే!

22, అక్టోబర్ 2021, శుక్రవారం

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె మద్దులు విరిచిన మా మాధవుడు - అన్నమయ్య కీర్తన

 





భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రాలు : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు
చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు
మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు

ప్రార్థన

శా. శ్రీలక్ష్మీధవ! వాసుదేవ!వరరాజీవాక్ష! పద్మాసన!
వ్యాళాధీశ్వర!శర్వషణ్ముఖ శుకాద్యస్తోత్రసత్పాత్ర! గో
పాలానీకముఖాబ్జభాస్కర!కృపాపాథోది! నన్ గావు, మూ
ర్ధాలంకార మయూరపించధర!కృష్ణా! దేవకీనందనా!
ఓం నమో వేంకటేశాయ 🙏
ఈ వారం మనం విశ్లేషించుకో బోయే అన్నమయ్య కీర్తన ……
“ముద్దు గారీ చూడరమ్మా మోహన మురారి వీడే” ఈ కీర్తన చూడటానికి చాలా సులభమైన పదాలతో ఉన్నట్లే కనబడుతుంది. చాలా పదాలు వాడుకలో లేనివి, చాలా అంతరార్థం కలవీ. నాకు తెలిసినంత వరకూ ప్రయత్నిస్తాను।

🔹పల్లవి

‘ముద్దు గారీ జూడరమ్మ మోహనా మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు’
‘ముద్దుకారిపోయే ఆ మోహన మురారిని చూడండమ్మా!
ముద్దులొలికే పసి బాలుడు ఆ రోలు నెట్లా లాగాడు? ఆ మద్దిచెట్ల నెట్లా విరిచాడు మా మాధవుడు?… అంటూ మాధవుడని తనకు సొంతం చేసుకొని గర్వపడిపోతూ చెబుతున్నాడు.

🔹ఇక మొదటి చరణంలో ….
‘చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు’ అంటాడు!

*చల్లలమ్మ నేర్చిన జాణలట గోపెమ్మలు. చల్ల అమ్ముడు పోవాలంటే ఎంత మాటకారితనం ఉండాలి … అందులోనూ పాడి పుష్కలంగా ఉన్న ఆ కాలంలో మజ్జిగమ్మడమంటే మాటలా!
ఆ మాటలు నేర్చిన జాణలకు ప్రేమ పాశం వేసినవాడు ఈ చిన్న వాసుదేవుడు। ఎలా వేసాడు పాశం? తన మోహన రూపంతో , తన చిలిపి పనులతో …।
వాళ్ళంతా (మొల్లపు)అతిశయం గల గోపికలు! అయితేనేం దొండ పళ్ళవంటి వాళ్ళ పెదవుల మధువులను కొల్లగొట్టిన వాడు. ఈ మాట చెబుతూ గోల గోవిందుడు అంటూ బాగా సరిపోయే విశేషణం తగిలించాడు అన్నమయ్య!

🔹మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
*మందడి సానులంటే గొల్లభామలు. వాళ్ళ ముఖాలు పద్మాలలాగా ఉన్నాయి। ఆ ముఖపద్మాల మీద వాలే తుమ్మెద శ్రీకృష్ణుడు । వాళ్ళంతా పద్దతిగల గోపాలకుల భార్యలు। అంటే అందమైన పసి పిల్లలను ముద్దాడే వయసేగదా! ముద్దులొలికే కన్నయ్య వాళ్ళ కళ్ళకు విందు! ఇక్కడా అంతే మా విఠలుడు అంటాడు. భక్తుడిగా భగవంతునితో చనువు సంపాదించుకున్న అన్నమయ్య కనబడతాడీ కీర్తనలో!
🔹హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు
*ఆ మోహనాకారుని హత్తుకున్న గోపకాంతలకు చెలిమి బంధం( friend ship band) అదే పొత్తుల సూత్రం ఎవరంటే మా కొంటెబుద్ధుల హరే!
ఆ ముగ్ధమనోహర సౌందర్యాన్ని త్రాగిన గోపికలు మత్తిల్లి ఉన్నారు. భక్తి పారవశ్యమూ మత్తేగదా! అది నిండు మనసు గలవారికే సాధ్యం! అటువంటి మనసుగల వారికందరికీ మన్మధుని వంటి వాడు శ్రీ వేంకటేశుడు! కామమంటే కోరిక! కాముడు భగవంతుని భక్తుని ఏకం చేయగల వాడు. కోరిక ఏదైనా చిత్తమునందే పుడుతుంది. అందుకే తనవైపు ఆకర్షించుకునే చిత్తజుడే నాటి గోవిందుడు ….. నేటి వేంకట పతి 🙏

*పదాలకు అర్థాలు
~~~~~~~~~
వల్లెత్రాడు- పాశము
మొల్లపు -అతిశయముగల
కొల్లకాడు- కొల్లగొట్టు వాడు
మందడి సానులు- గొల్లభామలు
మోము దమ్ములు- వదనారవిందములు
దొడ్డివారి- గొల్లవారి
పొత్తుల సూత్రము- స్నేహ బంధం
వ్రేతెలు- గోపికలు
చిత్తజుడు- మన్మధుడు
~~~~~~
చివరగా కీర్తన సారం నాకందపద్యాలలో ……
కం॥
ముద్దులొలుకు పసితనమున
మద్దులనేగూల్చి నట్టి మాధవుడతడే
ముద్దియల మోము దమ్ములఁ
దద్దయు భ్రమరంబువోలెఁదమితో వ్రాలున్!
కం॥
ఎంతటి పుణ్యము వారిది
అంతటి శ్రీకాంతునట్లు హత్తుకుపోరే!
కంతుండైమది దోచెను
వింతల గోవిందుడతడు వ్రేతల మధ్యన్ !
స్వస్తి 🙏

బెజవాడ రాజారత్నం - నటి, గాయని

   బెజవాడ రాజారత్నం -  pencil sketch  ​అలనాటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలితరపు నటి మరియు తొలి నేపథ్య గాయనీమణులలో బెజవాడ రాజారత్నం గారు ప్...