22, అక్టోబర్ 2021, శుక్రవారం

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె మద్దులు విరిచిన మా మాధవుడు - అన్నమయ్య కీర్తన

 





భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రాలు : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు
చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు
మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు

ప్రార్థన

శా. శ్రీలక్ష్మీధవ! వాసుదేవ!వరరాజీవాక్ష! పద్మాసన!
వ్యాళాధీశ్వర!శర్వషణ్ముఖ శుకాద్యస్తోత్రసత్పాత్ర! గో
పాలానీకముఖాబ్జభాస్కర!కృపాపాథోది! నన్ గావు, మూ
ర్ధాలంకార మయూరపించధర!కృష్ణా! దేవకీనందనా!
ఓం నమో వేంకటేశాయ 🙏
ఈ వారం మనం విశ్లేషించుకో బోయే అన్నమయ్య కీర్తన ……
“ముద్దు గారీ చూడరమ్మా మోహన మురారి వీడే” ఈ కీర్తన చూడటానికి చాలా సులభమైన పదాలతో ఉన్నట్లే కనబడుతుంది. చాలా పదాలు వాడుకలో లేనివి, చాలా అంతరార్థం కలవీ. నాకు తెలిసినంత వరకూ ప్రయత్నిస్తాను।

🔹పల్లవి

‘ముద్దు గారీ జూడరమ్మ మోహనా మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు’
‘ముద్దుకారిపోయే ఆ మోహన మురారిని చూడండమ్మా!
ముద్దులొలికే పసి బాలుడు ఆ రోలు నెట్లా లాగాడు? ఆ మద్దిచెట్ల నెట్లా విరిచాడు మా మాధవుడు?… అంటూ మాధవుడని తనకు సొంతం చేసుకొని గర్వపడిపోతూ చెబుతున్నాడు.

🔹ఇక మొదటి చరణంలో ….
‘చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు’ అంటాడు!

*చల్లలమ్మ నేర్చిన జాణలట గోపెమ్మలు. చల్ల అమ్ముడు పోవాలంటే ఎంత మాటకారితనం ఉండాలి … అందులోనూ పాడి పుష్కలంగా ఉన్న ఆ కాలంలో మజ్జిగమ్మడమంటే మాటలా!
ఆ మాటలు నేర్చిన జాణలకు ప్రేమ పాశం వేసినవాడు ఈ చిన్న వాసుదేవుడు। ఎలా వేసాడు పాశం? తన మోహన రూపంతో , తన చిలిపి పనులతో …।
వాళ్ళంతా (మొల్లపు)అతిశయం గల గోపికలు! అయితేనేం దొండ పళ్ళవంటి వాళ్ళ పెదవుల మధువులను కొల్లగొట్టిన వాడు. ఈ మాట చెబుతూ గోల గోవిందుడు అంటూ బాగా సరిపోయే విశేషణం తగిలించాడు అన్నమయ్య!

🔹మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
*మందడి సానులంటే గొల్లభామలు. వాళ్ళ ముఖాలు పద్మాలలాగా ఉన్నాయి। ఆ ముఖపద్మాల మీద వాలే తుమ్మెద శ్రీకృష్ణుడు । వాళ్ళంతా పద్దతిగల గోపాలకుల భార్యలు। అంటే అందమైన పసి పిల్లలను ముద్దాడే వయసేగదా! ముద్దులొలికే కన్నయ్య వాళ్ళ కళ్ళకు విందు! ఇక్కడా అంతే మా విఠలుడు అంటాడు. భక్తుడిగా భగవంతునితో చనువు సంపాదించుకున్న అన్నమయ్య కనబడతాడీ కీర్తనలో!
🔹హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు
*ఆ మోహనాకారుని హత్తుకున్న గోపకాంతలకు చెలిమి బంధం( friend ship band) అదే పొత్తుల సూత్రం ఎవరంటే మా కొంటెబుద్ధుల హరే!
ఆ ముగ్ధమనోహర సౌందర్యాన్ని త్రాగిన గోపికలు మత్తిల్లి ఉన్నారు. భక్తి పారవశ్యమూ మత్తేగదా! అది నిండు మనసు గలవారికే సాధ్యం! అటువంటి మనసుగల వారికందరికీ మన్మధుని వంటి వాడు శ్రీ వేంకటేశుడు! కామమంటే కోరిక! కాముడు భగవంతుని భక్తుని ఏకం చేయగల వాడు. కోరిక ఏదైనా చిత్తమునందే పుడుతుంది. అందుకే తనవైపు ఆకర్షించుకునే చిత్తజుడే నాటి గోవిందుడు ….. నేటి వేంకట పతి 🙏

*పదాలకు అర్థాలు
~~~~~~~~~
వల్లెత్రాడు- పాశము
మొల్లపు -అతిశయముగల
కొల్లకాడు- కొల్లగొట్టు వాడు
మందడి సానులు- గొల్లభామలు
మోము దమ్ములు- వదనారవిందములు
దొడ్డివారి- గొల్లవారి
పొత్తుల సూత్రము- స్నేహ బంధం
వ్రేతెలు- గోపికలు
చిత్తజుడు- మన్మధుడు
~~~~~~
చివరగా కీర్తన సారం నాకందపద్యాలలో ……
కం॥
ముద్దులొలుకు పసితనమున
మద్దులనేగూల్చి నట్టి మాధవుడతడే
ముద్దియల మోము దమ్ములఁ
దద్దయు భ్రమరంబువోలెఁదమితో వ్రాలున్!
కం॥
ఎంతటి పుణ్యము వారిది
అంతటి శ్రీకాంతునట్లు హత్తుకుపోరే!
కంతుండైమది దోచెను
వింతల గోవిందుడతడు వ్రేతల మధ్యన్ !
స్వస్తి 🙏

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...