7, నవంబర్ 2021, ఆదివారం

సత్యభామ సరసపు నగవు - అన్నమయ్య కీర్తన


 

చిత్రం : పొన్నాడ మూర్తి

ప|| సత్యభామ సరసపు నగవు | నిత్యము హరి మదినే నెలవు ||

చ|| రుకుమిణి దేవికి రూపయవ్వనికి |
సకల విభవముల సౌఖ్యతలు |
చికురాంబరమున జెదరిన యలకలు |
వికచాబ్జ ముఖము వెయి వేలాయె ||
చ|| తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై |
నడపులమురిపెపు నగుమోము |
తడయక వారిధి దచ్చిన హరికిని |
బడలికవాపను పరమంబాయ ||
చ|| అనుదినమునును నీ యలుమేలుమంగ |
కనుగవ జంకెన గర్వములు |
దినదినంబులును తిరువేంకటపతి |
చనువుల సొబగుల సంపదలాయ ||

భావ సౌందర్యం - సౌజన్యం : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

సత్యభామ ( భూలక్ష్మి) సరసమైన నవ్వులకు శ్రీవేంకటపతి మనసే స్థావరం.
ఇక ఆ రుక్మిణీదేవి(శ్రీలక్ష్మి) రూపలావణ్యాలు వర్ణనాతీతములు.
నల్లని ఆమె కేశ సౌందర్యం నిరుపమానం. ఆ నల్లని ముంగురులు
వికసించిన ఆమె ముఖపద్మంమీద వేనకు వేలు అల్లల్లాడుతున్నాయి.(అవి తుమ్మెదలలా ఉన్నాయని ధ్వని)
ఆమె మేని మెరుపు ఆభరణాల కాంతిని మించిపోయింది.
(ఆభరణాల అవసరమే లేదని భావం)
క్షీరసాగర మధన సమయంలో శ్రీహరి కూర్మావతారమెత్తి మందర పర్వతాన్ని మోసిన బడలికను తీర్చినది ఈ లావణ్యవతి లక్ష్మీదేవే కదా!
ఇక ఇప్పుడు అలమేలు మంగగా దర్శనమిస్తున్నది. ఆమె కనుగవలోని అరుణిమలు నిత్యమూ ఆ వేంకట పతికి దగ్గరతనాన్ని కూర్చే శృంగార రేఖలు! సొగసులు!’
( భర్త శ్రమను మరిపించేది, మురిపించేది ఇల్లాలి నడవడీ, అందమే… ఆ భర్తభగవంతుడైనా సరే!! అన్నదే మనం కీర్తనతో గ్రహించే సత్యం!)
కీర్తనలో తొడవులు, నగవులు, నడపులు, సొగసులు, విభవము, మెరుగులు వంటి లఘువులతో కూడిన పదాల కూర్పు కీర్తనకు మెరుగులు దిద్దిన తొడవులే!
కొన్ని పదాలకు అర్థాలు
చికురాంబరము- నల్లని కురులు
అలకలు-ముంగురులు
వికచాబ్జముఖము- వికసించిన పద్మము వంటి ముఖము
తొడవులు-ఆభరణములు
నడపు-ప్రవర్తన
తడయక- ఆలస్యము చేయక
బడలిక-అలసట
జంకెన-బెదిరించు

కీర్తన భావానికి ఉమాదేవి గారి పద్యం
తే.గీ
క్షీర సాగర మధనంబుఁజేయు వేళ
హరిభరించెనుఁగూర్మమై గిరిభరంబు
తీరె బడలిక పత్నులుఁజేరి కొలువ
శ్రమను మరిపించ గలవారు సతులు గారె!

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...