11, జనవరి 2016, సోమవారం

గురుశిష్యుల అనుబంధం - కీ.శే. ద్వారం వెంకటస్వామి నాయుడు, కీ.శే. ఘంటసాల


గురు శిష్యుల అనుబంధం:
నాయుడు గారు ఘంటసాల గార్ల ఋణానుబంధం:
ద్వారం వేంకటస్వామి నాయుడు గారు 8.11.1893 న బెంగుళూరు లో జన్మించారు. వారి తండ్రి గారు ద్వారం వెంకట రాయలు. తాత గారైన ద్వారం వెంకట స్వామి నాయుడు గారి పేరే మనవడికి పెట్టుకున్నారు. తండ్రి, తాత ఇద్దరూ మైసూరు సంస్థానపు మిలిటరీ శాఖలో ఉన్నత పదవులు అలంకరించిన వారే. నాయుడు గారికి ఇద్దరు సహోదరులు, నలుగురు సోదరీమణులు. పెద్ద కుటుంబం. నాయుడు గారి 9 ఏ ళ్ళ ప్రాయంలో, బంగళూరు నుండి అనకాపల్లి పయనం, మరి కొంతకాలం తరువాత విశాఖపట్నం కడపటి గా విజయనగరం లో స్థిరనివాశం. నాయుడు గారి పెద్దన్నయ్య వేంకట కృష్ణయ్య గారు కూడ వాయులీన విద్వాంశులే. నాటి ప్రఖ్యాత సంగీత విద్వాంశులు శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారి కచేరీలలో ఆయనకు పక్క వాయిద్య కళాకారుడుగా వయోలిన్ వాయించేవారుట. దైవనిర్ణయం ఎవరికి ఎరుక - ఎవరు కాదన గలరు మిలిటరీ దుస్తులు ధరించిన కుటుంబం నుండీ వచ్చిన వారు జీవనోపాధికై ఫిడేలు పట్టుకోవలసి వస్తుందని. నాయుడు గారు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు మహోపాధ్యాయులుగా ఉన్న సమయంలోనే వాయులీన సంగీత శాఖలో ఉపాధ్యాయులుగా విజయనగర మహరాజావారి సంగీత కళాశాలలో ప్రవేశించి వారి తదనంతరం, మహోపాధ్యాయులుగ నియమితులయ్యారు. ద్వారం వారి ప్రతిభా పాటవాలు కిట్టని కొందరు సమకాలీన ఫిడేలు విద్వాంశులు ఓర్వలేనితనంతో, ఆయనపై దుష్ప్రచారానికి దిగారుట. ఆ ప్రచారం ఆయనను ఎంతగా కృంగతీసిందంటే, నాయుడు గారు రెండు వత్సరముల పాటు ఫిడేలు ను తాకకుండా నిరాశ నిస్ప్రుహలతో వుండిపోయారుట. కాలగమనంలో, దృష్టిలోపమున్నా, నిరంతర పట్టుదల, అ కుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో, తన ప్రతిభను దేశం గుర్తించాలన్న పట్టుదలతో, 72 మేళకర్త రాగాలను వాయులీనంపై వాయిస్తూ, నూతన ఒరవడిని సృష్టిస్తూ అఖండమైన పేరు ప్రఖ్యాతులు గణించేరు. అదిగో ఆ సమయంలోనే ఘంటసాల గారు కూడా విజయనగర సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న రోజులు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా చేతినున్న బంగారు ఉంగరం అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో విజయనగరం చేరుకున్న ఘంటసాల గారికి సంగీత కళాశాల శలవుల మూలంగా మూయబడి ఉండడంతో, వారు గాత్ర పండితులుగా అప్పుడు ఉన్నట్టి శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారిని కలవడం జరిగింది. అప్పుడు వారు సాలూరు చిన్న గురువు గారిగా మంచి ఖ్యాతి ఉన్న మహా మంచి మనిషి. 
పాఠశాల శలవులానంతరం శ్రీ ద్వారం వారిని కలిస్తే, గాత్ర పరీక్షణ చేసి, ఘంటసాల గాత్ర గంభీరత, కంఠమాధుర్యానికి ఆశ్చర్యపడి గాత్ర సంగీతం వేయి రెట్ల పేరు ప్రఖ్యాతులను తెచ్చేలా చేస్తుందనీ నాడే భవిష్య వాణి పలికేరుట గురువుగా. 1941లో విద్వాన్ పట్టా తీసుకుని, శ్రీ ఆదిభట్ల వారి చేతులమీదుగా తంబూరాను అందుకుని స్వంతఊరుకి చేరుకున్న ఘంటసాల 1944 మే నెలలో మద్రాసు కు పయనమవడం, శ్రీ సముద్రాల గారి ఇంట్లో మకాం, శ్రీ నాగయ్య గారు, శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గార్ల ప్రోత్సాహం ఆయనను రేడియో శ్రోతలకు, సినీ ప్రేక్షకులకు, సంగీతాభిమానులకు, ఆంధ్ర, తమిళ దేశ ప్రజల హృదయాలకు చేరువ చేసింది. 1951 నాటికి ఘంటసాల గారు మద్రాసు నగర నివాశి అయి స్వంత ఇంటికి యజమాని అయేరు. ఉస్మాన్ రోడ్ గృహప్రవేశానికి గురువులందర్నీ ఆహ్వానించడంతో, సముద్రాల వారూ పట్రాయని వారు, ద్వారం వారు అందరూ విచ్చేసి ఆశీర్వదించేరు. శ్రీయుతులు యామిజాల పద్మనాభ స్వామి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆత్రేయ, సముద్రాల, రామానుజం, కొసరాజు, దాశరధి, ఆరుద్ర, నారాయణ రెడ్ది, కేశవదాసు గార్లాంటి మహానుభావులే కాక, పుష్పగిరి స్వామీజీ, బెజవాడ గోపల రెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, శృంగేరీ స్వామీజీలు, పొట్టి శ్రీరాములు గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆ ఇంటికి తరచూ వస్తూండే వారట. ద్వారం వారు అయితే ప్రతీ సంవత్సరం మూడు నాలుగు సార్లు కచేరీ ల కోసం 7-8 మంది బృందం తో వచ్చి శిష్యుడి ఇంట్లోనే మకాం. శిష్యుడు సంపాదన, ఖ్యాతి ఆయనను ముగ్ధుల్ని చేసేదట. నిజమే ఆ అనుబంధానికి పదాలు చాలవు. కచేరీ చేసి వచ్చి ఆ అందిన సొమ్ము ఎంత అని చూడకుండా ఘంటసాల గారి చేతిలో పెట్టి, అబ్బాయ్ తిరుగు ప్రయాణానికి ఇంత సొమ్ము ఉండాలిరా అనేవారట. అంత అత్మీయానుబంధం వారిద్దరిదీ. శిష్యుడ్ని పెంచిన గురువు, గురువుని మించిన శిష్యుడు. ఇద్దరూ దానాల్లో దానకర్ణులే. వారి గృహం ఎంతమందికో అన్నపూర్ణాశ్రయమే. 
కార్వేటి నగర రాజవంశీయులు శ్రీ ఆర్ బి రామకృష్ణం రాజు గారు అప్పటి ఎం ఎల్ సి గా ఉన్న హోదాతో నాటి గవర్నర్ గారైన త్రివేదీ గార్ని కలుసుకుని నాయుడు గారి సంగీత కచేరీ తో బాటు ఒక సన్మాన సభ ఏర్పాటు చేయించి వారిని సత్కరించి 25000 రొక్కమును బహూకరింప చేయించిరట. రాజు గారి సలహా మేరకు మద్రాసు లో మకాం గురించీ శిష్యుడైన ఘంటసాల తో ఆలోచన చేసి ఆ పూర్తి రొఖ్ఖం ఘంటశాల చేతిలో పెట్టి మంచి ఇల్లు కొని పెట్ట మన్నారుట. గురువు గారి ఋణం తీర్చుకునే తగిన సమయం ఇదే ననీ, వారి జ్యేష్ట గురు పుత్రులు తమ్ముడి తో సమానమైన శ్రీ ద్వారం సత్యనారాయణ తో మద్రాస్ మహాపట్టణపు వీధుల న్నీ తిరిగి, శోధించీ, చివరికి శ్రీ శంకర రావు అనబడే ఒక అభిమాని, స్నేహితుడి బంగళా లాంటి ఇంటిని ట్రిప్లికేను లో బండ్ల వేణుగొపాల్ వీధిలో గురువు గారు అందజేసిన సొమ్ముతో బాటు తన వద్ద ముందు దాచిన సొమ్ము కూడా కలిపి 35, 000 రూప్యములు చెల్లించీ ఇంటి తాళాలను స్వాధీనం చేసుకున్నారు. ద్వారం వారి కుటుంబ సభ్యుల సమేతంగా గృహప్రవేశం చేయించడమే కాకుండా, తాను వీనుల విందైన మూడు గంటల సంగీత కచేరీని గృహప్రవేశం రోజు చేసి, “గురు ఋణం” తీర్చుకున్నాననీ ఘంటసాల వారు సంతృప్తి చేందేరుట. 
అలా ఘంటసాల గారు తన తొలి దినాల్లో సహాయం అందించిన ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా జ్ఞాపకం ఉంచుకుని వారి ఋణం తగిన రీతిలో తీర్చేరు అనడానికి ఎన్నెన్ని వివరణలో.. తరువాతి భాగాల్లో చదువుకుందాం.

(courtesy ; Sudhakar Yadavalli garu - Facebook post of 9th Jan. 2016)

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...