15, సెప్టెంబర్ 2016, గురువారం

గృహిణీ గృహముచ్యతే - Pencil Sketch - శ్రీమతి ఉమాదేవి జంధ్యాల గారి కవిత

నా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి ఉమాదేవి జంధ్యాలు గారు వ్రాసిన కవిత (గజల్). వారికి నా ధన్యవాదాలు.

।।గృహిణీ గృహముచ్యతే।। ఉమాదేవి జంధ్యాల
--------------------------------------------
చీకటినే తొలగించే ఉదయానివి నువ్వేగా
మేలుకొలుపు సుప్రభాత గీతానివి నువ్వేగా!
కనుతెరువగ కమ్మనినీ నగుమోమే చాలునులే
కనుపాపగ మముకాచే దైవానివి నువ్వేగా!
గడియారంతోపోటీ పడుతుంటావేరోజూ
అలుపెరుగక తిరుగాడే కాలానివి నువ్వేగా!
ఏదెక్కడ పెట్టామో తెలియదుమా కెవ్వరికీ
చేతిలోకి వస్తుందను ధైర్యానివి నువ్వేగా!
కరిగిఅరిగి పోతున్నా కనిపించదు మాకళ్ళకు
అద్దంలా యిల్లుంచే పనిమనిషివి నువ్వేగా!
ఎనిమిదికాకుండానే అందరికీ తొందరలే
పదిచేతుల పనిచేసే యంత్రానివి నువ్వేగా!
నీచల్లని చేయితాక మాయమౌను రుగ్మతలే
ఒడినిజేర్చి ఓదార్చే దయామయివి నువ్వేగా!
సర్దిచెప్పలేకనీవుసతమతమౌతుంటావు
అందరి నిందలు మోసే సహనానివి నువ్వేగా!
నీపనులకు సెలవులేదు నీసేవకు విలువలేదు
ఎదుగుటకై వాడుకునే నిశ్శ్రేణివి నువ్వేగా!
ఒక్కపూట గడవదమ్మ పడకేస్తే నువ్వింట్లో
నిన్నునీవు చూసుకోని త్యాగానివి నువ్వేగా!
చేయేతలగడకాగా కటికనేల పడకాయే
నిద్రించుటకేతీరని మహరాణివి నువ్వేగా !
నాల్గుపదుల వయసులోనె వడిలినపూవైనావే
అయినా పోడిమితగ్గని అందానివి నువ్వేగా!
ఆడదిలేనట్టియిల్లు అడవికన్న అధ్వానం
పైకిమేము అనకున్నా ప్రాణానివి నువ్వేగా !
-----------------------------
** పొన్నాడ మూర్తిగారి చిత్రానికి గజల్
( నిశ్శ్రేణివి = నిచ్చెనవి)

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...