18, జనవరి 2017, బుధవారం

నన్నయ - పోతన



ప్రాచీన కవుల పద్యాలలో సంవదించే పద్యాలు కొన్ని పొతన గారి భాగవతంలొ అక్క డక్కడ గొచరిస్తాయని ఒక ఆక్షేపణ ఉంది. అది వాస్తవంగా ఆలొచిస్తే పోతన్నకు ఉత్కర్షే కాని అపకర్ష ఏ మాత్రం కాదు. అలా రాసినందువల్ల పోతన్న గారికి తనకంటే పూర్వకవుల మీద ఉండే పూజ్యభావమూ, ఆదరాభిమానాలూ అభివ్యక్తమవుతాయి. అటువంటి విధంగా సంవదించే పద్యాలు పూర్వకవుల పద్యాలతో సరిసమానంగానూ, కొన్నిచోట్ల పూర్వకవి పద్యాలకు మెరుగులు దిద్దేవిగానూ ఉన్నాయి.
నన్నయ భట్టారుకులు ఆదిపర్వంలో మహాభారతాన్ని పారిజాతంతో పోలుస్తూ ఈ క్రింది పద్యం వ్రాసారు.
అమితాఖ్యానకశాఖలం బొలిచి, వేదార్థామలచ్చాయమై
సుమహావర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ నానాగుణకీర్తనార్థ ఫలమై, ద్వైపాయనోద్యాన జా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై.
నన్నయగారి మీద గౌరవంతొ ఆయన భావాన్నే స్వీకరించి పొతన్న తన భాగవతాన్ని కల్పతరువుతో పోలుస్తూ అటువంటి మత్తేభాన్నే నడిపించాడు. చిత్తగించండి.
లలితస్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామమ్ము, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబు నై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
నన్నయగారి పారిజాతాన్ని, పొతనగారి కల్పవృక్షాన్నీ పోల్చి చూడండి. నన్నయగారి పద్యం లో రూపకాలంకారంతో కూడిన విశేషణాలు ఆరు ఉంటే పోతన్న గారి పద్యం లో పది విశేషణాలు ఉన్నాయి. నన్నయగారి అడుగుజాడల్లొ నడిచిన చక్కదనాల పద్యమిది. హృద్యానవద్యమైన ఈ పద్యం వంటి పద్యం ఆంధ్రసాహిత్యంలో మరొక్కటి లేదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పద్యాన్ని నన్నయ గారు వింటే “నా కంటె బాగా వ్రాశావోయి నాయనా!” అని పోతన్న గారి వీపు తట్టి ఆశీర్వదించి ఉండేవారు.
వ్యాఖ్యానం : కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) 
- పొన్నాడ లక్ష్మి

కామెంట్‌లు లేవు:

Will

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...