24, ఏప్రిల్ 2018, మంగళవారం

ముక్కెర

ముక్కెర (Pencil sketch)
ముత్యంలా తళుకులీనె ముక్కెరవని భావించా ..
నిశలేవీ నాదాకా రాలేవని భావించా ...
నీ ఊర్పుకు వణికిపోయి మెరిసినదీ నాసికా
ముక్కెర నే తొడిగినదీ నీ కొరకే ప్రియతమా ...
(రోహిణీ ఉయాల గారి గజల్ - 'గజల్ సుమాలు' పుస్తకం నుండి సేకరణ)

మగని మనసుకే గురుతు
మగువ ముక్కు పుడక
ఆ సిరి ఉంటే బ్రతుకంతా
ఏడడుగుల నడక (Simhadri Jyothirmayi)

నీలాల కురులలో
నా కంటి పాపలో...మెరుపు

అద్దాల చెక్కిలిలో
అధరాల వంపులో...ఎరుపు

ఫాలమంటి నుదుటిపై
కొనదేలిన ముక్కుపై.....నునుపు

నీ వల్లనే వచ్చిందనుకొని
విర్రవీగకు ముక్కెరా!
అలంకారం లేకున్నా
నేను అందగత్తెనే సుమా!


-- (రచన : సింహాద్రి జ్యోతిర్మయి)
'ముక్కు చూడు ముక్కందం చూడు
ముక్కున ఉన్న ముక్కెర చూడు' అంటాడొక సినీ కవి.
ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.
అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.
ముక్కెర మంగళసూత్రంకన్నా చాలా ముందుకాలం నాటిది. ముక్కుపుడక అడ్డకమ్మ నత్తు బాసర ముంగర బులాకీ బేసరి ముక్కెర... అంటూ పిలుచుకొనే నాసికాభరణం ఆడవారి అయిదోతనానికి గుర్తు. ఉత్తర దేశంలో పాపిట సిందూరం లాగే దక్షిణాదిన ముక్కెర, కాలిమెట్టెలు ఇల్లాలితనాన్ని సూచిస్తాయి. అందుకే తన తమ్ముడు నిగమశర్మ తన ముంగరను దొంగిలిస్తే ‘క్రొత్తగా చేయించుకొన్న ముక్కెరకునై అడలు దుర్వారయై ఆడబిడ్డ’ భోరున విలపించిందని పాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు వర్ణించాడు. విని నేర్చుకొనే చదువులు (వేద విద్యలు) చెవికెక్కడానికి దోహదం చేసే చెవిపోగులూ(బావగారివి) నిగమశర్మ ఎత్తుకెళ్లాడు. ‘జామాత వెతబొందు వ్యామోహియై నవగ్రహ కర్ణవేష్టన(నవరత్నాలు పొదిగిన) భ్రంశమునకు’ కారణమయ్యాడు.
(విషయ సేకరణ : వెబ్ దునియా.కామ్, ఈనాడు సంపాదకీయం, ఇంకా ఇక్కడా అక్కడా)

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...