21, మే 2018, సోమవారం

లాలమ్మ లాలనుచు -- ఉంగాల కబుర్లు చెప్పరా తండ్రీ



నా చిత్రానికి మిత్రుల కవితా స్పందన

॥చిట్టితండ్రి ॥ "ఉంగాల కబురులే చెప్పరా తండ్రీ"
నా pencil చిత్రానికి Umadevi Prasadarao Jandhyala గారి తెలుగు గజల్.
ఉంగాల కబురులే చెప్పరా తండ్రీ!

వాటిలో అర్థాలు విప్పరా తండ్రీ!

పూలరేకులవంటి పాదాలు ఊపీ
అందాలు యిల్లంత చల్లరా తండ్రీ!

ఊయలూపేవేళ జోలల్లు వింటూ
మైమరచి నిదురపో కమ్మగా తండ్రీ!

వెండి వెన్నెల్లోన బువ్వపెడుతుంటే
మారాము మానుకొని పట్టరా తండ్రీ!

కృష్ణకృష్ణాఅంటు భజనవినగానే
లేలేత చప్పట్లు కొట్టరా తండ్రీ !

అమ్మకొంగునదాగి దోబూచులాడీ
ఆటలో ఎప్పుడూ నెగ్గరా తండ్రీ !
—————————
ఉమాదేవి జంధ్యాల



ఈ చిత్రానికి మిత్రురాలు సింహాద్రి జ్యోతిర్మయి రాసిన పాట :

లాలమ్మ లాలనుచు జోల పాడాలి

జోల విని పాపాయి నిదురపోవాలి
ఆటపాటల చాల అలిసేవు గాని
చాలించి కాసేపు కునుకుతీయాలి : 

కొసల్య ఒడిలోన శ్రీరామ లాలీ
నందగోపుని ఇంట కన్నయ్య లాలీ
రామయ్య సుగుణాలు
కృష్ణయ్య లీలలు
చూపించి బుజ్జాయి తాను ఎదగాలి

లాలమ్మ లాలి ఇది అమ్మమ్మ లాలీ
నీ ముద్దుమురిపాలు నే చూసి మురవాలి

కరిరాజ ముఖునికి గిరితనయ లాలీ
దాశరథి ‌పుత్రులకు ధరణిసుత లాలీ
ఆదిపూజితునిలా అమ్మ కనువెలుగులా
నిలిచి చిన్నారి మా పేరు నిలపాలి

లాలమ్మ‌లాలి ఇది నాన్నమ్మ లాలీ
మా వంశ దీపమై
నీవు వర్థిల్లాలీ

వేంకటాచలపతికి వకుళమ్మ లాలీ
మువ్వురయ్యలకును మునిపత్ని లాలీ
ఉయ్యాల పాపడే ఊళ్ళేలి‌పదుగురూ
మెచ్చి దీవించేటి మేటి కావాలీ

లాలమ్మ లాలి ఇది మీ అమ్మ లాలీ
శతమానమై సకల‌ శుభములందాలీ
--------------------------------------------------------
సింహాద్రి జ్యోతిర్మయి
21.5.2018

లాలనుచు నూచేరు లలనలిరుగడలా
పాట ట్యూన్ లాగా పాడుకోవచ్చు
శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి కవిత కి  శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారు పాడిన పాట ఈ క్రింది లింకు క్లిక్ చేసి వినండి.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...