11, మే 2018, శుక్రవారం

జిడ్డు కృష్ణమూర్తి - Jiddu Krishnamoorthi


జిడ్డు కృష్ణమూర్తి (నా pencil చిత్రం)
జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . మద్రాసు లోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజంకి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.

ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.

అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువును అవునని కాని, కాదని కాని ఏమీ వెల్లడించలేదు. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని ఆయన అమెరికా లోని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయాడు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 1925 లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచింది. ఆ దుఃఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు. నిత్యానంద మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ ఆయన ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద ఆయనకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య (Occultism) మీద కూడా ఆయనకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ ఆయనకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో ఆయన దృక్పథం మరింత బలీయమైంది.

కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం వరకూ కృష్ణమూర్తి అందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదు. అంతవరకూ తాను కృష్ణమూర్తినా లేక జగద్గురువునా అనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోయాడు. సోదరుని మరణం ఆయనలో తెచ్చిన దుఃఖం కొంతకాలానికి ఆయనలో ప్రతిక్రియను తెచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది ఆయనలోకి. ఆయనలో జీవం ప్రవేశించింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. ఆయన నడచేదారిలో గులాబిపూలు పోసేవారుకూడా. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన సౌధాన్నీ, అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించాడు. ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ "ను రద్దుపరచాడు.

ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది. డాక్టర్ అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తేబడింది. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని చాటసాగేడు. చివరకు లాభం లేకపోయింది. ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో మౌనం దాల్చారు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.

జిడ్డు క్రిష్ణమూర్తి ఫిబ్రవరి 17 1986 సంవత్సరంలో ఓజై, కాలిపోర్నియా లో మృతిచెందారు.

నా pencil చిత్రానికి పుచ్చా గాయత్రీదేవి గారి కవితా స్పందన :దివ్యజ్ఞానపు నీడలో ఎదిగి ఆత్మ జ్ఞానిగా మారిన ఓ చైతన్యమా !
గతమునుండి విడుదల కమ్మని పలికిన ఓ సత్యమా !
నమ్మిన నీ సిద్దాంతము కొరకు నక్షత్ర వైభవాలని తోసి,వదలి వైచిన
నీవు మరో బుద్ధునిగా మారిన నవ ప్రకాసమా !
పరిశీలనా పధములోనే అసలు ప్రజ్ఞ కలదని.
అసలైన విప్లవం హృదయపు లోతుల లోనే అని
సమూలమైన పరివర్తనే శాంతికి దారి అని భోదించిన ఓ యోధ !
కణ కణమున స్పందన శీలుడవై.
శోధన పధములోనే నీ తత్వము బోధించిన .
నిజమైన మతమంటే నీర్హేతుక మైన ప్రేమ కలిగి ఉండడమని
నిజమైన ప్రేమంటే ఏది ఆశించదని.
నమ్మకానికి దాసుడవు కావద్దని హెచ్చరించిన నియంత !
విముక్త మనస్సుతోనే విహంగము కమ్మని.
మంచి అని నేడు చలామణి అవుతున్నది చెడుమాత్రమే నని.
మంచితనానికి వ్యతిరేకత ఏది లేదని నమ్మిన కర్మ యోగి !
నిజమైన సమ సమాజము కావాలంటే ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమని,
అశాంతి, కార్పణ్యము కావసలని నినదించిన శిశు మానసి !
ఆలోచన అంటేనే గతము నుండి పుట్టినదని
దానివలన సత్యాన్ని గ్రహించలేమని.
నిజాన్ని దర్శించినప్పుడు మాత్రమె సత్య ఆవిష్కారం దర్సనమని
సూత్రీకరించిన సిద్దాంతి !
బాధలు సుఖాల కలయిక జీవితమైనప్పుడు
మనము నవ్వుతు ఆకువలె ఎందుకు రాలిపోలేము అని
సందేహపడిన విద్యార్ధి !
ప్రేమ ఉండి పేరాస లేని చోట సుఖము తనంతట తానె
పీట వేసుకుని ఉంటుందని నమ్మిన ఓ చాందస వాది.
నీ తత్వ వివేచనా ముందుతరాలకు ఆశా దీపం కావాలి.
ఎవరికి వారే జ్ఞాన దీప జ్యోతులై ప్రకాసించాలి.
-- పి. గాయత్రిదేవి.

 

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...