31, జులై 2018, మంగళవారం
కనులు
నేను చిత్రించిన ఈ 'కనులు' చిత్రానికి faceook లో తమ కవితలతో స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.
వినీలాకాశంలో ఇంద్రధనుస్సుని చూస్తూ అచ్చెరువొందిన కనులు
కొండలనడుమ ఉదయిస్తున్న బాలభాస్కరునిని దర్శించి తరించిన కనులు
ఎగసిపడే కెరటాల విన్యాసాలాకి పులకరించిన కనులు
అరవిరసిన పూబాలల వింతవింత సోయగాలకి మైమరచిన కనులు
ఆలయంలో పరమాత్ముని దివ్యమంగళ దర్శనంతో అరమోడ్పులైన కనులు
పసిపిల్లల ముగ్ధత్వానికి పరవశించిన కనులు
కొండలలో, కోనలలో, ఏరులలో సెలయేరులలో ప్రకృతికాంత
అందాలకి దివ్యానుభూతి చెందిన కనులు ..
కంటిచూపు కరవై ఈ ఆనందానుభూతులకి దూరమైన కబోది ని చూసి
దుఃఖాశ్రువులతో నిండెను నా కనులు ..
అప్పుడు .. అప్పుడనిపించింది నాకు .. నా కనులతో ఆ అభాగ్యుడు
ఈ ప్రపంచాన్ని చూడగలిగితే చాలని!
ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నాయి నా కనులు.
చెలి! కనురెప్పలు
. .... ..............---- పొన్నాడ లక్ష్మి
.
సీ॥కొనగోట కాటుకఁ । కొసరి కొసరి యింతి
కనురెప్పలకు దిద్ది । కాంతు లద్ది
దోరనవ్వును నవ్వి । నోరచూపును రువ్వి
మూసి కందెఱలతో । బాస లాడు
చెలికాని స్వరములై । తొలి సంధ్య వెలుగులై
మధుర తోరణమయి । యెదురు చూచు
ఇరుల పూ దోటలో । వరుని చే దోటలో
అరమోడ్పు నయనాల । అరువు లిచ్చు
ఆ॥చెలియల కనురెప్ప । తొలి రాయబారమై
వచ్చి పలుక రించి । ముచ్చ టించు
నర్సపురని వాస । నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష । వినుర దీక్ష
.
.
. పద్య రచన
. రాజేందర్ గణపురం
. 30/ 07/ 2018
కందెఱ = కనురెప్ప
..Pvt Murthy.. గారు స్వహస్తాలతో.. గీసిన చిత్రం చూసి నే వ్రాసిన పద్యం..!
29, జులై 2018, ఆదివారం
ఆంధ్రావని - అందాల గని
ఆంధ్రావని - అందాలగని -
ఆస్వాదించే గుణం ఉంటే
ప్రతి సుమం సుగంధ భరితం
ప్రతి జీవితం ఆనందమకరందం
ప్రకృతి పులకరిస్తే చైత్రం
ప్రకృతి ప్రకోపిస్తే శిశిరం
ఆమని వస్తే ఆనందం
శిశిరం వస్తే దుఃఖం
సమదృష్టి లేకుంటే
ఆమని యైనా ఈమరి నే
చిత్తడియైనా చింతనే
సమదృష్టి ఉంటే
ఈమురి లో మురిపాలు.....
శిశిరంలో మనోరంజకాలు....
ఇదే జీవితం
ప్రతి క్షణం... ఆనందహేల
మరుపొక దివ్యౌషధలీల
ఆహ్వానం పలకమని రాయంచలను పిలిచినా
స్వాగత తోరణం కట్టమని కపోతాలను పిలిచినా
నీవు అడుగులదారిలో నా మనసునే తివాచీగా పరిచినా
నీ ఆస్వాదనతోనే అవి గుబాళిస్తాయ మిత్రమా!
- కావ్యాంజలి, కవిత Courtesy - Andhrabhoomi
నిజమే .. చక్కని పంటపొలాలు, తలలూగించే కొబ్బరి చెట్ల అందాలు, పంట కాలవల అందాలు చెప్పేదేముంది.
ప్రకృతితో సహజీవనం చేస్తే జీవితం నిజంగా ఆనందమయమే .. అదే భావాన్ని వెలిబుచ్చారు 'ఈనాడు'సంపాదకీయంలో.
"దట్టమైన ముసురులో చలిగాలి రివ్వున తాకుతుంటే- ‘మొయి వలిగొని(ఒంటికి చలేసి) ధాత్రీ పురంధ్రి(భూదేవి) వలిపచ్చని కంబళి కవిచికొన్న విధమున పొలుపుగ చిప్పరువు(చిప్పగడ్డి) గవిసె భూతలమెల్లన్’ అన్నాడు కుమార సంభవంలో! భగవంతుడి సృజన వైభవాన్ని ప్రత్యక్షంగా పరికించాలంటే- ప్రకృతిని అనునిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిండుగా కళకళలాడే మహారణ్యాలు, జీవకళ ఉట్టిపడుతూ గలగల పారే నదులు, ఎగసి దూకే సెలయేళ్లు, ఆహ్లాదకరమైన పంటపొలాలు, వాటిపై పున్నమి వెన్నెల సంతకాలు, నిలువెత్తుగా పెరిగి నింగినే ముద్దాడే గిరి వృక్షాలు, పక్షుల కువకువలు, నిడుపైన కొండలు, లోతైన లోయలు, విశాల సాగర తీరాలు... ఈ సమస్త ప్రకృతి సంరంభాన్ని, రాశీభూత దివ్య సౌందర్య విభవాన్ని విద్యారణ్య మహర్షి ‘ఈశ్వర కల్పిత మహాజగత్తు’గా అభివర్ణించారు. ఆ అందాలను ఆస్వాదించాలంటే మనసుకు రుచిమొగ్గలు మొలవాలి. ‘కమలేందీ వరషండ మండిత లసత్ కాసార సేవారతిన్ గమికర్మీకృతనైకనీవృతుడనై కంటిన్...’ అని శ్రీనాథుడు చెప్పినట్లు ప్రత్యేక చిత్తవృత్తితో ప్రకృతిని పరికించగల అభిరుచి విశేషం మనసును ఆవరించాలి. అది వరించిననాడు అల్లసాని పెద్దనకే కాదు, ‘ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ’ లయ గతి మన చెవులనూ సోకుతుంది. ‘విజయుం చేరెడి వన్నెకాడు... మది నావేశించు నెల్లప్పుడున్’ అని పోతనతోపాటు మనకూ అనిపిస్తుంది. ప్రకృతితో, దాని సృష్టికర్తతో తాదాత్మ్యస్థితి కలుగుతుంది. ‘ఎటులయినా ఇచటనే ఆగిపోనా’ అని భావకవులు తహతహలాడింది ఆ చిరునామా కోసమే!
ప్రకృతితో కలిసి నడిచిన రోజులే మనిషికి జీవించిన రోజులు. ఎదుటివారిని మెప్పించడానికో ఒప్పించడానికో వెచ్చించినవన్నీ గడిచిపోతున్న దినాలు. ప్రకృతి సజీవ చైతన్యాన్ని గమనించడం కవులకు ఓ పండుగ. ‘విరివై వెన్నెలవై వికాసపథివై విద్వాణివై వీణవై సిరివై సింజినివై సితాంబుజమవై సీమంతవై సీతవై...’ కనిపించిన గోదావరిని చూసి మురిసిపోయారు మరింగంటివారు. సీతావియోగ దుఃఖంలో రాముడికి అడవి సీతమ్మవారిలా తోచిందన్నారు కొండేపూడి కవి. ‘కమ్ర హసితాస్యమున తిలకమ్ము దిద్ది, శిరమునందున పూవులు తురుముకొనిన జనకజనుబోలు కానన తటమ్ము’ అన్నారాయన. ప్రకృతి దర్శనంతో తమకు కలిగిన సజీవ చైతన్య దివ్యానుభూతిని పాఠకులకూ ప్రసారం చేయడంలో కవులు సిద్ధహస్తులు. ఆముక్తమాల్యదలో ‘తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్ తైలాభిగార స్వనత్ ధారా...’ ఇత్యాది గ్రీష్మరుతు వర్ణన పద్యాలు చదివితే- మనకు గొంతెండిపోయి దాహం వేస్తుంది. నన్నయ ‘శారద రాత్రులు’ పద్యం ఆస్వాదిస్తుంటే- ‘సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములు’ ఎదను హత్తుకొంటాయి. వాల్మీకి వర్షరుతు వర్ణన వింటుంటే- కనురెప్పలు శ్రావణమేఘాలై రాముడి సీతావియోగ దుఃఖాన్ని మన కళ్లలోంచి వర్షిస్తాయి. జీవించే క్షణాలంటే అవే! ‘క్రొందమ్మి రేకులో కురిసిన నునుమంచు అద్దమ్ముపైన అరుణాంశు రేఖ’ను గమనించడం మనసుకు ఆహ్లాదకరమైన అనుభవం. ‘పరువంపు వరిపైరు పనలపై ప్రోవులై మిసమిసల్ వోయెడి పసిడి పంటల’ను తిలకించడం కళ్లకు సంక్రాంతి పండుగ. దురదృష్టవశాత్తు ప్రకృతికి, మనిషికి మధ్య దూరం బాగా పెరిగింది. ఎంతగా అంటే- మనుచరిత్ర వర్ణించిన ‘చంపక కురవక పనస నెమ్మి నిచుల దాడిమీ విచికిల ఆమ్ర పాటలీ పూగ కేసర...’ వంటి ఎన్నో జాతుల్లో ఒకటి రెండు మినహా గుర్తించలేనంత! విద్యుద్దీపాలన్నీ ఆరిపోతేగాని వెన్నెల ఉనికి తోచనంత దూరం జరిగాం మనం ప్రకృతికి!
మనిషిని అనునిత్యం ప్రకృతితో కలిపి ఉంచాలన్నది కవుల తాపత్రయం. మనిషి కేంద్రంగా అల్లుకున్న ప్రతి ప్రబంధంలోను ప్రకృతి వర్ణనలకు తప్పనిసరిగా వారు చోటు కల్పించారు. కణ్వుడి ఆశ్రమంలోకి ప్రవేశించే దుష్యంతుడు ‘సహకారములన్(మామిడి చెట్లు) కదళీ తతులన్ (అరటితోటలు) చూచుచు, శుక కోకిల సుస్వరముల్ వీనులకు ఇంపెసగన్ వినుచున్’ సంతోషపడ్డాడు. ఆదికవి మొదలు ఆధునిక కవుల వరకు ఇదే పంథా అనుసరించారు. ‘నిను వీక్షించుచు కూరుచుండుటది అంతే చాలునో తల్లి! బంధు నికాయంబులు చూడ వచ్చినటు, మిత్రుల్ చేరి ఆత్మీయ భాషణముల్ చేసినయట్లు, సత్కవుల వాచా మాధురుల్ విన్నయట్లు...’ గోదావరి ఒడ్డున రికామీగా కూర్చొన్నా చాలు, అది బ్రహ్మానందమే అంటారు బేతవోలు కవి. నిజమే అంటున్నారు బ్రిటన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అనారోగ్యం అనిపించినప్పుడు వెంటనే మాత్రలు మింగేయడం కాకుండా, కాసేపు ఆరుబయట పచ్చిగాలి, మట్టి వాసన, పచ్చని పరిసరాలు... ఏదోదాన్ని ఆశ్రయించండి, వెంటనే ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఏండీ జోన్స్ అనే ఆ బృంద నాయకుడు. ‘పడిసంబో, తలనెప్పియో, జ్వరమో సంప్రాప్తించుచో వైద్యులన్ తడవన్ లాభము కల్గినన్ కలుగు, దుర్దాంత వ్యధాభారముల్ (తీవ్ర వేదనలు) దాపగుచో... నీ అడుగులు పట్టుటయే రుజాపనయనోపాయంబు’ అన్నారు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తమ ‘ఆరోగ్య కామేశ్వరి’ శతకంలో! వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందినా రోగం వస్తే మనిషి భగవంతుడిపై భారం వేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సాధారణ రోగాలకు సైతం మాత్రలు మింగడం, తిరిగి వాటి దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కోసం మరో విడత ఔషధ సేవనం మానేసి పచ్చని ప్రకృతితో చెలిమి చేయడం ద్వారా సహజసిద్ధమైన స్వస్థత సాధించడం నిజానికి మంచి ఆలోచనే మరి!" (courtesy ఈనాడు సంపాదకీయం)
18, జులై 2018, బుధవారం
సముద్రాల రాఘవాచార్య
సముద్రాల రాఘవాచార్య - నా పెన్సిల్ చిత్రం.
సముద్రాల రాఘవాచార్య - నా పెన్సిల్ చిత్రం
ఈ రోజు సముద్రాల వారి జయంతి.
రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతారామకథను వినరయ్యా
పాట వినపడగానే మనకు తెలియకుండానే భక్తిభావంలో మునిగిపోతుంటాం. ఈ పాట1963 నాటి లవకుశ
చిత్రంలోనిది. అయినా అలాంటి సాహిత్యం మళ్లీ రాలేదంటే అతిశయోక్తికాదు. అంతటి గొప్పపాటను రాసింది
సముద్రాల రాఘవాచార్య. సినిమా రంగంలో సీనియర్ సముద్రాలగా అయన అందరికీ సుపరిచితులు. రామాయణం మొత్తాన్ని కేవలం నాలుగు పాటల్లో చెప్పి తన సాహితీ ఘనకీర్తిని చాటుకున్న గొప్ప రచయిత
సముద్రాల.
సముద్రాల రాఘవాచార్య గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని పెదపులివర్రు గ్రామంలో1902 జూలై 19న లక్ష్మీ తాయారు దంపతులకు జన్మించారు. పండితవంశంలో జన్మించడం వల్ల ఆయనకు బాల్యం నుంచి సాహిత్యంపట్ల ఆసక్తి ఏర్పడింది. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే కవిత్వం రాయడం, చెప్పడం చేసేవాడు. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో భాషాప్రవీణ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు.
పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు రాయడంతో సినీరంగప్రవేశం చేశారు. స్క్రిప్టులు, పాటలు రాయడంతో పాటు సినిమా నిర్మాతగా, దర్శకునిగా, నేపథ్యగాయకుడిగానూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సముద్రాల పూర్తిస్థాయిలో పనిచేసిన తొలి సినిమా కనకతార. చందాల కేశవదాసు రాసిన నాటకాన్ని సరస్వతీ టాకీస్ వారు 1937లో సినిమాగా నిర్మించారు. ఈ సినిమాలో మొత్తం 12 పాటలుంటే ఏడు పాటలు రాఘవాచార్యనే రాశారు. అజ్ఞానంబున ఆశలు బాసీ, ఈ వసంత శోభా కాంచిన నామది పొంగిపోవుగా, ఏల ఈ పగిది తాలిమి మాలీ, కానరా మానరా హింస మానరా, దయారహితమీ దుర్విధి జీవా, దేవుని మహిమ తెలియగ వశమా, వారే చరితార్థులు భూమిన్ పాటలు ఆయన రాసినవే. ఈ సినిమాకు పాటలతోపాటు సంభాషణలు కూడా రాశారు. ఈ సినిమా సమయంలోనే బి.ఎన్.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డిలు రోహిణీ పిక్సర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి గృహలక్ష్మి సినిమాకు రచయితగా పెట్టుకున్నారు. ఆ తరువాత బి.యన్.రెడ్డి రోహిణి నుండి బయటకు వచ్చి వాహినీ సంస్థను స్థాపించారు. అలా వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయారు. దాదాపు 80 సినిమాలకు వెయ్యి వరకు పాటలు రాసి తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకున్నారు.
సానిసదనీపద మపదప మాపదని
మంచి సమయము రారా
ఇది మంచి సమయము రారా
చలమేల జేసేవౌరా
సముద్రాల రాసిన ఈ పాట తెలుగు చలనచిత్ర రంగ చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతంగా కీర్తికెక్కింది. పోతన (1942) సినిమా కోసం ఈ పాటను రాశారు. నిజానికి ఈ పాట పల్లవిలో కొంచెం మార్పు చేశారు. మూలంలో రారా సామి నీకు మ్రొక్కేరా అని ఉంటుంది. కానీ చలమేరా ఇంటికి రారా అన్న పంక్తిని చలమేల జేసేవౌరా అని మార్చారు.
తెరతీయగరాదా దేవా
తెరతీయగరాదా దేవా
తన వారూ పరవారలనీ
తరతమ భావములు మానీ
1947లో విడుదలైన పల్నాటి యుద్ధం చిత్రంలోని ఈ పాట చివరిగీతం. రణరంగంలో రక్తపాతాన్ని చూసిన బ్రహ్మనాయుడు, నాగమ్మ పరివర్తన హృదయాలతో రక్తసిక్తమైన చేతులు జోడించి గుడిలో పశ్చాత్తాపంతో చెన్నకేశవుని వేడుకొంటారు. తెరతీయరా అన్న అన్నమయ్య ధోరణిలో గీతాన్ని రాశారు సముద్రాల.
గృహలక్ష్మి సినిమాలోని కల్లుమానండోయ్ బాబూ, కళ్లు తెరవండోయ్ అన్న గీతం రాఘవచార్యకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ పాట ఆతర్వాత కాలంలో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమాల్లో ప్రచార గీతంగా పనికివచ్చింది.
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా 1953లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించిన పాట. భగ్నప్రేమికులైన దేవదాసు పార్వతిల ప్రేమ విఫలమై జీవితం మీద వైరాగ్యంతో తత్వాల్ని జీవిత సత్యాల్ని రంగరించి విషాదంగా ఆలపిస్తాడు. ఈ సినిమా ఆనాడు ఒక సంచలనం. ఇందులోని ప్రతిపాటా నేటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంది.
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా, అందం చూడవయా ఆనందించవయా, ఓ దేవదా చదువు ఇదేనా, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతే, పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో ఇలా విజయవంతమైన పాటలన్నీ ఆయన కలం నుంచి జాలువారినవే.
కేవలం సంభాషణలు, పాటలు రాయడమే కాకుండా సముద్రాల వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకునిగా, దేవదాసు (1953), శాంతి (1952), స్త్రీ సాహసం (1951) చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. భక్త రఘునాథ్ చిత్రానికి పాటలు కూడా పాడారు. రాఘవాచార్యులను సీనియర్ సముద్రాల అంటే ఆయన కుమారుడు సముద్రాల రామానుజాచార్యులను సముద్రాల జూనియర్‌గా పిలిచేవారు. ఆయన కూడా పలు సినిమాలకు పాటలు రాశారు. ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన శ్రీరామకథ సినిమాకు చివరి పాటను రచించిన సముద్రాల రాఘవాచార్య మరుసటి రోజు 1968 మార్చి 16న మరణించాడు.
జననీ శివకామిని జయశుభకారిణి
విజయరూపిణి
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
నీచరణములే నమ్మితినమ్మ
శరణము కోరితినమ్మా భవాని నర్తనశాల (1963) సినిమా కోసం సముద్రాల రాసిన భక్తిగీతం. నేటికి దేవాలయాల్లో విరివిగా వినవచ్చే గీతం.
వందేమాతరం (మాటలు, పాటలు)
సుమంగళి (మాటలు, పాటలు)
దేవత (మాటలు పాటలు)
భక్త పోతన (కథ, మాటలు, పాటలు)
జీవన్ముక్తి (పాటలు)
గరుడ గర్వభంగం (మాటలు )
భాగ్యలక్ష్మి (మాటలు పాటలు)
పంతులమ్మ (మాటలు పాటలు)
స్వర్గసీమ (మాటలు పాటలు)
త్యాగయ్య (మాటలు పాటలు)
యోగి వేమన (మాటలు పాటలు)
రత్నమాల (మాటలు పాటలు)
లైలామజ్ను (మాటలు పాటలు)
కృష్ణావతారం (మాటలు పాటలు)
శ్రీరామకథ (చివరగా రచించిన సినిమా)
తారాశశాంకం (మాటలు,కొన్ని పాటలు)
(చివరగా విడుదలైన సినిమా)
మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి అనార్కలి
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఒక సంగీతభరిత గీతం. ఇది అనార్కలి చిత్రం (1955) కోసం సముద్రాల
రచించింది. మొఘల్ రాజు అక్బర్ దర్బారులో నర్తకి అనార్కలి అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆశ్చర్యచకితుడైన యువరాజు సలీం ఆమెను ప్రేమిస్తాడు. అనార్కలి సినిమాకు చాలా కీలకమైన పాటకోసం ఖవ్వాలి బాణిలో ఉత్తర హిందుస్తానీ తరహా కథక్ నాట్యంతో దీన్ని చిత్రీకరించారు. అద్భుత ప్రేమ దృశ్యకావ్యంగా ఈ సినిమా నిలిచిపోయింది.
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
లవకుశులు.. వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ ఆయోధ్య చేరి రాజవీధిలో గానం చేసే సందర్భంలోనిదీ గీతం.
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో
తల్లి దీవెన తాతయ కరుణ వెన్ను కాయగా వెరువగనేలా
హయమును విడువుముగా
రాముడి అశ్వమేథ యాగానికి చెందిన అశ్వాన్ని బంధించి రాముని సోదరులు సైన్యంతో గానం చేసే సందర్భంలోనిది.
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఈ పాటలన్నీ కూడా లవకుశ(1963) సినిమా కోసం సముద్రాల రాసిన పాటలు. రామయణాన్ని ఈ నాలుగు పాటల్లో వివరించారాయన.
(వ్యాసం : courtesy 'నమస్తే తెలంగాణ' పత్రిక)
17, జులై 2018, మంగళవారం
నేను పడిపోతిని - గజల్
నా రేఖా చిత్రానికి మిత్రురాలు లక్ష్మి రాయవరపు గారి తెలుగు గజల్ :
కారుమబ్బు కమ్మినపుడు బెదిరి నేను పడిపోతిని
కన్ను చూపు తగిలి మనసు చెదిరి నేను పడిపోతిని..
నేలతల్లి పరచినదీ ఎర ఎర్రని చీరచెరగు
తనకు నాకు బంధమేదొ కుదిరి నేను పడిపోతిని..
నవ్వులన్ని మాలకట్టి వేచానూ నీ కొరకే
కనుల ముందు నిన్ను చూసి అదిరి నేను పడిపోతిని...
ఆకసాన పయనించుచు నవ్విరెవరొ నన్ను చూసి
తళుకు బెళుకు నాకంటగ పొదిరి నేను పడిపోతిని
వలపు వాన జల్లాయెను కొండ కోన వాగు వంక
కన్ను మిన్ను ఎన్నెలలే ముదిరి నేను పడిపోతిని
16, జులై 2018, సోమవారం
అద్భుత గాయని - కె. రాణి (ఉషారాణి)
అద్భుత గాయని - కె. రాణి (ఉషారాణి) - నా పెన్సిల్ చిత్రం
*ఎన్ని టేకులు తింటున్నావమ్మా....ఎందుకని ఈ రోజు సరిగ్గా పాడలేకపోతున్నావు!?* అంటూ సంగీత దర్శకుడు సుబ్బురామన్ గారు గట్టిగా అడిగేసరికి...10ఏళ్ళ ఆ అమ్మాయికి ఏడుపొచ్చినంత పనయ్యింది.*
*నిన్న అంతా భ్రాంతియేనా*....బాగా పాడావు. ఇప్పుడీ పాటకెందుకు...ఇలా...అంటూ ఉంటే....అప్పుడు చెప్పింది....*నాకు ఘంటసాల గారిని చూస్తుంటే....భయమేస్తుందండి. నేను పాడలేకపోతున్నాను!* అంటూ.*
*చూడూ...ఘంటసాల గారేం పులి కాదు....నిన్ను మింగెయ్యరు! ఈ సారి సరిగ్గా పాడకపోతే...నీ తల పైన తిరగకుండా ఉందే ...ఆ ఫాన్ ...దానిని ఊడదీసి...నీ మీద వేసేస్తాను...జాగ్రత్త!* అంటూ గదిమారు సుబ్బురామన్ గారు!*
*ఈ సారి బాగా పాడింది. చెలియలేదు...చెలిమి లేదు..వెలుతురే లేదు...అనే డ్యూయెట్ సాంగ్.*
*నిండా పదేళ్ళు లేని చిన్న పిల్ల ....మరి ఘంటసాల గారిని చూస్తే ...భయపడదా!
*అది ఓ పాఠం గా తీసుకుంది ఆ చిన్నారి గాయని కె.రాణి. (అసలు పేరు ఉషారాణి) ఇక ఎవ్వరినీ చూసి భయపడకూడదు. నాకు వచ్చినంతవరకు..నా డ్యూటీ లాగా పాడెయ్యాలి అని...నిర్ణయైంచుకుంది.
ఇక ఎప్పుడూ....మైక్ ముందు కానీ....ఘంటసాల తో కచేరీలలో గానీ...భయానికి...తావివ్వలేదిక!*
ఇక ఎప్పుడూ....మైక్ ముందు కానీ....ఘంటసాల తో కచేరీలలో గానీ...భయానికి...తావివ్వలేదిక!*
*కడప లో సెటిల్ అవడం వల్లో ఏమోగానీ...రాణి కి జంకు పోయింది. పాటల రికార్డింగ్ అప్పుడు....విరామ సమయంలో మెయిన్ సింగర్స్ కు ఓవల్టిన్లు....కోరస్ పాడే అమ్మాయిలకు టీ ఇచ్చేవారట! *తెస్తే..అందరికీ ఓవల్టిన్లు తీసుకురండి...లేకపోతే అసలక్కరలేదని...తిప్పిపంపేసి...అందరికీ ఓవల్టిన్లు తెప్పించేది!*
*అలాగే...విజయా గార్డెన్స్ లో గులాబీలు బాగా పూచేవి. ఓ రోజు 7 గురు అమ్మాయిలున్నారు ...రికార్డింగ్ కోసమని. 7 గులాబీలు తెంచి...తలా ఒకటి ఇచ్చేసింది. * ఎవరిని అడిగి కోసవే సీమటపాకాయ్* అని గార్డెన్ నిర్వాహకులు ..నిలదీస్తే....*ఎవరిని అడగాలి ? పూలుండేది ఆడపిల్లల కోసమే కదా! కోశాను. ఇచ్చాను. ఐ డోంట్ కేర్.* అంటూ రెక్లెస్ గా సమాధానమిచ్చేది...అందర్లోకి చిన్నపిల్ల అయిన రాణి.*
*1943 లోకర్ణాటక లోని తుముకూరు లో పుట్టిన రాణి....తండ్రి రైల్వే ఆఫీసర్ కావడం చేత....ఉత్తర హిందూస్థానం నుండి...దక్షిణ హిందూస్థానమంతా...తిరగవలసివచ్చింది. అదీ ఒకందుకు మేలయ్యింది. ఆయా రాష్ట్ర భాషలు....నేర్చుకోగలిగింది. అందుకే తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, సిం హళ & ఉజ్బెక్ భాషలలో షుమారు 500 పాటలు పాడగలిగింది.*
*సిం హళ జాతీయగీతం.....మెయిన్ సింగర్ గా కె.రాణే గానం చేసింది. 1950లలో ఎక్కువగా...రావు బాలసరస్వతి గారు, జిక్కి & లీల గార్లు పాడేవారు. వారితో కంపేర్ చేస్తే.....రాణి ...చిన్న పిల్ల. శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. ఏదో దైవదత్తమైన కంఠస్వరముంది. ఇక సంగీత స్రష్టలు ఎం.ఎల్.వసంత కుమారి గారు, ఎ.పి.కోమల గార్లు ఉండనే ఉన్నారు. వీరితో పోటీ పడటమంటే....సామాన్యం కాదు కదా!*
*మాంచి ఘాటు పాటలు...రాణి బాగా పాడుతుంది*....అనేవారట ఘంటసాల గారు. *మిరపకాయ్* అని పిలిచేవారట!
*1952 లో ధర్మదేవత...తెలుగులో...తమిళం లో కూడా 3 పాటలు పాడింది. సావిత్రి నటించిన రూపవతి లో 2 పాటలు పేరు తెచ్చాయి. అన్నిటికంటే....ఇప్పటికీ....చిరస్థాయిగా నిలిచిన పాట....*అంతా భ్రాంతియేనా...దేవదాసు లోది. ఇక ఓ...దేవదా ....పాట వలన జిక్కి గారికి మనస్తాపం కలిగిన విషయం...మీకు తెలిసే ఉంటుంది. పాటంతా జిక్కి & రావు బాలసరస్వతు లతో పాడించి....ఒక్క హమ్మింగ్ మాత్రం.....ఓహొ హొ...ఓహో...అనే హమ్మింగ్ మాత్రం...కె.రాణి తో పాడించి...అలాగే చిత్రీకరించినా...టైటిల్స్ లో జిక్కి గారి పేరు వేయలేదు. రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు! మరి మతలబు ఏమిటో చిన్న పిల్ల రాణి కేం తెలుస్తుంది.
*ఘంటసాల అంతటి వారికే తప్పలేదు. పాండురంగ మహాత్యం లో ఘంటసాల గారి పాటలు ఎంత పాపులరో అందరికీ తెలుసు. జయకృష్ణా ముకుందా మురారి, అమ్మా అని అరచినా పాటలు మరెవ్వరైనా పాడగలరా! టైటిల్స్ లో పొరబాటున...ఘంటసాల వారి పేరు వేయడం మరచిపోయారు! * పరవాలేదు....నా గొంతు ప్రజలకు తెలుసులెండి బాబు. నాపేరు లేకపోయినా పరవాలేదు!* అన్నారట మాస్టారు. నందమూరి క్షమాపణ కూడా చెప్పారట.*
*గొంతు ఎంత బాగున్నా....క్రమేణా...సంగీతదర్శకులకు....అనుగుణంగానే కాక...వాయిస్ ను....మెరుగు పరుచుకుంటూ పోవడంలో పి.సుశీల గారు, ఎస్.జానకి గారు ప్రఖ్యాతి గాంచి....ఇక వారి యుగం ప్రారంభమయ్యింది 1960ల నుండి.*
*కె.రాణి గారు...ఎక్కువగా తమిళం లోను, కన్నడ లోనే పాడారు. మద్రాస్ లో షిప్పింగ్ వ్యాపారస్తులు తమిళ ముస్లింస్ హనీఫా వారు కచేరీలు ఏర్పాట చేసేవారు. ఘంటసాల, తలత్ మహమూద్, ముఖేష్....లాంటి వారితో కలిసి....ఎన్నో కచేరీలు చేసేది రాణి. ఎక్కువ పాటలు రాణి చేతే పాడించేవారట ఘంటసాల వారు.*
*అలాంటి ఓ కచేరీలో...ఓ మైనే ప్యార్ కియా(జిస్ దేస్ మే గంగా బెహ్తీ హై), మై క్యాకరూరా ముఝే బుఢ్ఢా మిల్ గయా(సంగం) పాటలు రాణి పాడినప్పుడు...రాజ్ కపూర్ డప్పు వాయించడం...ఓ మరచిపోలేని జ్ఞాపకం కె.రాణి గారికి.*
*1966 లో జి.సీతారామిరెడ్డి గారితో వివాహం...కడపలో సెటిల్ అయ్యారు. హైదరాబాద్ లోని షమా థియేటర్ వద్ద....ఓ స్టూడియో ..సదరన్ స్టూడియో ఉండేది. అది వీరిదే. సతీ అరుంధతి(1968) & నిజంచెపితే నమ్మరు లాంటి మూవీస్ తీశారు. 1975 లో రెడ్డి గారు స్వర్గస్తులయ్యారు. ఆ వైభవాలు...ఆయనతోనే...అంతరించాయట!*
* ఇద్దరు కుమార్తెలు. ఒకరు హైదరాబాద్ లో...మరొకరు బెంగలూర్ లో సెటిల్ అయితే ...రాణి గారు షటిల్ సర్వీస్ చేస్తుండేవారు. పాడటం ఎప్పుడో మానుకున్నాను. ప్రశాంతంగా జీవితం గడుపుతున్న...రాణి గారు నిన్న 13 జూలైన (75 ఏళ్ళు) కాలధర్మం చెందారు.*
*ఇప్పటి పాటల గురించి అడిగితే....వాయిద్య ఘోష ఎక్కువయ్యింది. పాటలలో క్లారిటీ ఉండడం లేదు. అసలు అర్థం కావడంలేదని...అమూల్య మైన అభిప్రాయం చెప్పారు!*
*అంతా భ్రాంతియేనా...జీవితానా వెలుగింతేనా......పాట మాత్రం చిరస్థాయిగా మిగిలిపోయింది!
(ఈ వివరాలు facebook లో అందించిన మిత్రులు శ్రీ Prasad Kvs గారికి ధన్యవాదాలు)
14, జులై 2018, శనివారం
గాయని కె. రాణి - శ్రధ్ధాంజలి
అలనాటి గాయని అస్తమయం తొలితరం గాయని కె.రాణి (75) కన్నుమూశారు. దాదాపుగా అయిదువందల గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసిన రాణి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. 'దేవదాసు'లో 'అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా' అనే మరపురాని విషాద గీతం ఆమె ఆలపించినదే. అదే చిత్రంలో 'చెలియ లేదు.. చెలిమిలేదు' గీతం కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 'జయసింహ'లో 'కొండమీద కొక్కిరాయి...'; 'పెళ్లి చేసి చూడు'లో 'అమ్మా... నొప్పులే...'; లాంటి ఎన్నో జనరంజకమైన గీతాలను ఆమె ఆలపించారు. ఆమె అసలు పేరు.. కె.ఉషారాణి. 1942లో కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించారు. తండ్రి రైల్వేలో ఉద్యోగి. వీళ్ల కుటుంబం ఉత్తర భారతదేశం నుండి వచ్చి కడపలో స్థిరపడ్డారు. 1966లో జి.సీతారామరెడ్డితో రాణికి వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.
కొంతకాలంగా హైదరాబాద్‌లోని కళ్యాణ్ నగర్‌లో తన పెద్ద కుమార్తె విజయతో కలసి ఉంటున్నారు. తన తొమ్మిదవ యేటనే సినీ నేపథ్యగాయనిగా అరంగేట్రం చేశారీమె. పలు భాషల్లో పాటలు పాడిన ఆమె సింహళ, ఉజ్‌బెక్ భాషల్లో పాడిన తొలి గాయనిగా గుర్తింపు పొందారు. శ్రీలంక జాతీయగీతం ఆలపించిన ఘనత కూడా రాణికి దక్కింది.
ఈమెను 'మెల్లిసై రాణి' అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె.కామరాఙ్ కీర్తించారు. అప్పటి భారత రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో తన గానా మృతంతో ఓలలాడించారు. విషాద గీతాలకు రాణి ప్రసిద్ధి. ఆమె గొంతులోని కోమలత్వం పాటకు కొత్త సొగసుల్ని తీసుకొచ్చేది.
ఆ తరంలో దాదాపు అగ్రగణ్యులైన గాయనీ గాయలకులు, సంగీత దర్శకులందరితో పనిచేశారు. - న్యూస్‌టుడే, వెంగళరావునగర్ కె.రాణి కొన్ని సూపర్ హిట్ గీతాలివి... * ''నా తనువే సుమా స్వర్గసీమా కమ్మని తావి వెదజల్లు'' (రూపవతి) * ''నా జీవిత సౌధము నవశోభలతో నిలిపే పాపవే'' (అత్తింటి కాపురం) * ''ఏ ఊరే చిన్నదానా తొలకరి మెరుపల్లె మెరసేవు'' (ధర్మ దేవత) * ''బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా'' (పెళ్లి చేసి చూడు) * ''ఆవో మహారాజ్..ఒక జాన్ కడుపే లేదంటే ఈ లోకాన లేదు గలాటా'' (సింగారి) * ''ఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ ఆహా హా బ్యూటీ'' (పుట్టిల్లు) * ''సార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ చెక్కు చెదరితే డబ్బులు వాపస్'' (నిరు పేదలు) * ''మా వదిన మా వదిన నా పేరున ఒక జాబును వ్రాసింది'' (మా గోపి) * ''ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా'' (చిరంజీవులు) * ''అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి''(బాల సన్యాసమ్మ కథ) * ''సొగసరి దాననయ్య రంగేళి'' (అల్లావుద్దీన్ అద్భుతదీపం) * ''ఎంతెంత దూరం కోశెడు దూరం నీకు మాకు చాలా చాలా దూరం'' (తోడి కోడళ్లు) * ''రావో రావో ప్రియతమా'' (వద్దంటే పెళ్లి) * ''ఒకటే మా వయసు'' (మాయాబజార్) * ''తమలపాకు సున్నము పడుచువాళ్లకందము'' (కొండవీటి దొంగ) * ''వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారియేగా'' (శోభ) * ''ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావు'' (దైవ బలం) * ''ఓహోహో కాంతమ్మ ఒక్కసారి చూడమ్మా కొత్త పెళ్ళి కూతురులా'' (మనోరమ) * ''గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి'' (మనోరమ) * ''ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో'' (సిపాయి కూతురు) * ''ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం'' (కన్న కూతురు) * ''ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో''(ఉషా పరిణయం) * ''ఆంగ్ల నాగరిక రీతులు అధ్బుతమైన కళాజ్యోతులు''(ధాన్యమే ధనలక్ష్మి) * ''టిక్కు టెక్కుల చిట్టి టెక్కు నిక్కు హోయల చిట్టి''(యోధాన యోధులు)
News courtesy : dailyhunt
ముషాయిరా గజల్
ముషాయిరా గజల్.
(నా చిత్రానికి శ్రీమతి గుడిపూడి రాధికారాణి రాసిన ముషాయిరా గజల్ - పుస్తక పఠనం తగ్గి mobiles, laptops రోజులివి. పుస్తకం గతకాలపు వైభవమే మరి)
చిరకాలపు ప్రాభవమే తలచినదీ మానసమే
పుస్తకమే హస్తమొదిలె ఫోనులవే రోజులాయె
ఆ కమ్మని రచనలెన్నొ తవ్వినదీ మానసమే
ఆ కమ్మని రచనలెన్నొ తవ్వినదీ మానసమే
ఆటలేవి? అల్లరేది? ఈతలేవి? ఊసులేవి?
నేటి బతుకురీతులకే కుమిలినదీ మానసమే
నేటి బతుకురీతులకే కుమిలినదీ మానసమే
అతివేగము.. అదుపుతప్పె వాహనమా? బతుకు కూడ
సురక్షితపు పయనమునే వేడినదీ మానసమే
సురక్షితపు పయనమునే వేడినదీ మానసమే
వయసువరస పాటింపక పెరుగుచుండె నేరాలూ
మంచుకొండ శీతలమై వణికినదీ మానసమే
మంచుకొండ శీతలమై వణికినదీ మానసమే
గురువులనే గేలిచెయకు తరువులనే తెగనరకకు
మరల మంచి భవిత కోరి విరిసినదీ మానసమే
మరల మంచి భవిత కోరి విరిసినదీ మానసమే
పాతపాట హాయిగాను పాడుకుంది రాధికమ్మ
నేటి పాట హోరునకే హడలినదీ మానసమే******************************
గుడిపూడి రాధికారాణి(11.7.2018)
నేటి పాట హోరునకే హడలినదీ మానసమే******************************
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...