29, జులై 2018, ఆదివారం

ఆంధ్రావని - అందాల గని




ఆంధ్రావని - అందాలగని - 

ఆస్వాదించే గుణం ఉంటే

ప్రతి సుమం సుగంధ భరితం
ప్రతి జీవితం ఆనందమకరందం


ప్రకృతి పులకరిస్తే చైత్రం

ప్రకృతి ప్రకోపిస్తే శిశిరం
ఆమని వస్తే ఆనందం
శిశిరం వస్తే దుఃఖం
సమదృష్టి లేకుంటే
ఆమని యైనా ఈమరి నే


చిత్తడియైనా చింతనే

సమదృష్టి ఉంటే
ఈమురి లో మురిపాలు.....
శిశిరంలో మనోరంజకాలు....
ఇదే జీవితం
ప్రతి క్షణం... ఆనందహేల
మరుపొక దివ్యౌషధలీల
ఆహ్వానం పలకమని రాయంచలను పిలిచినా
స్వాగత తోరణం కట్టమని కపోతాలను పిలిచినా
నీవు అడుగులదారిలో నా మనసునే తివాచీగా పరిచినా
నీ ఆస్వాదనతోనే అవి గుబాళిస్తాయ మిత్రమా!
- కావ్యాంజలి, కవిత Courtesy -  Andhrabhoomi

నిజమే .. చక్కని పంటపొలాలు, తలలూగించే కొబ్బరి చెట్ల అందాలు, పంట కాలవల అందాలు చెప్పేదేముంది. 
ప్రకృతితో సహజీవనం చేస్తే జీవితం నిజంగా ఆనందమయమే .. అదే భావాన్ని వెలిబుచ్చారు 'ఈనాడు'సంపాదకీయంలో.



"దట్టమైన ముసురులో చలిగాలి రివ్వున తాకుతుంటే- ‘మొయి వలిగొని(ఒంటికి చలేసి) ధాత్రీ పురంధ్రి(భూదేవి) వలిపచ్చని కంబళి కవిచికొన్న విధమున పొలుపుగ చిప్పరువు(చిప్పగడ్డి) గవిసె భూతలమెల్లన్‌’ అన్నాడు కుమార సంభవంలో! భగవంతుడి సృజన వైభవాన్ని ప్రత్యక్షంగా పరికించాలంటే- ప్రకృతిని అనునిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిండుగా కళకళలాడే మహారణ్యాలు, జీవకళ ఉట్టిపడుతూ గలగల పారే నదులు, ఎగసి దూకే సెలయేళ్లు, ఆహ్లాదకరమైన పంటపొలాలు, వాటిపై పున్నమి వెన్నెల సంతకాలు, నిలువెత్తుగా పెరిగి నింగినే ముద్దాడే గిరి వృక్షాలు, పక్షుల కువకువలు, నిడుపైన కొండలు, లోతైన లోయలు, విశాల సాగర తీరాలు... ఈ సమస్త ప్రకృతి సంరంభాన్ని, రాశీభూత దివ్య సౌందర్య విభవాన్ని విద్యారణ్య మహర్షి ‘ఈశ్వర కల్పిత మహాజగత్తు’గా అభివర్ణించారు. ఆ అందాలను ఆస్వాదించాలంటే మనసుకు రుచిమొగ్గలు మొలవాలి. ‘కమలేందీ వరషండ మండిత లసత్‌ కాసార సేవారతిన్‌ గమికర్మీకృతనైకనీవృతుడనై కంటిన్‌...’ అని శ్రీనాథుడు చెప్పినట్లు ప్రత్యేక చిత్తవృత్తితో ప్రకృతిని పరికించగల అభిరుచి విశేషం మనసును ఆవరించాలి. అది వరించిననాడు అల్లసాని పెద్దనకే కాదు, ‘ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ’ లయ గతి మన చెవులనూ సోకుతుంది. ‘విజయుం చేరెడి వన్నెకాడు... మది నావేశించు నెల్లప్పుడున్‌’ అని పోతనతోపాటు మనకూ అనిపిస్తుంది. ప్రకృతితో, దాని సృష్టికర్తతో తాదాత్మ్యస్థితి కలుగుతుంది. ‘ఎటులయినా ఇచటనే ఆగిపోనా’ అని భావకవులు తహతహలాడింది ఆ చిరునామా కోసమే! 

ప్రకృతితో కలిసి నడిచిన రోజులే మనిషికి జీవించిన రోజులు. ఎదుటివారిని మెప్పించడానికో ఒప్పించడానికో వెచ్చించినవన్నీ గడిచిపోతున్న దినాలు. ప్రకృతి సజీవ చైతన్యాన్ని గమనించడం కవులకు ఓ పండుగ. ‘విరివై వెన్నెలవై వికాసపథివై విద్వాణివై వీణవై సిరివై సింజినివై సితాంబుజమవై సీమంతవై సీతవై...’ కనిపించిన గోదావరిని చూసి మురిసిపోయారు మరింగంటివారు. సీతావియోగ దుఃఖంలో రాముడికి అడవి సీతమ్మవారిలా తోచిందన్నారు కొండేపూడి కవి. ‘కమ్ర హసితాస్యమున తిలకమ్ము దిద్ది, శిరమునందున పూవులు తురుముకొనిన జనకజనుబోలు కానన తటమ్ము’ అన్నారాయన. ప్రకృతి దర్శనంతో తమకు కలిగిన సజీవ చైతన్య దివ్యానుభూతిని పాఠకులకూ ప్రసారం చేయడంలో కవులు సిద్ధహస్తులు. ఆముక్తమాల్యదలో ‘తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్‌ తైలాభిగార స్వనత్‌ ధారా...’ ఇత్యాది గ్రీష్మరుతు వర్ణన పద్యాలు చదివితే- మనకు గొంతెండిపోయి దాహం వేస్తుంది. నన్నయ ‘శారద రాత్రులు’ పద్యం ఆస్వాదిస్తుంటే- ‘సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములు’ ఎదను హత్తుకొంటాయి. వాల్మీకి వర్షరుతు వర్ణన వింటుంటే- కనురెప్పలు శ్రావణమేఘాలై రాముడి సీతావియోగ దుఃఖాన్ని మన కళ్లలోంచి వర్షిస్తాయి. జీవించే క్షణాలంటే అవే! ‘క్రొందమ్మి రేకులో కురిసిన నునుమంచు అద్దమ్ముపైన అరుణాంశు రేఖ’ను గమనించడం మనసుకు ఆహ్లాదకరమైన అనుభవం. ‘పరువంపు వరిపైరు పనలపై ప్రోవులై మిసమిసల్‌ వోయెడి పసిడి పంటల’ను తిలకించడం కళ్లకు సంక్రాంతి పండుగ. దురదృష్టవశాత్తు ప్రకృతికి, మనిషికి మధ్య దూరం బాగా పెరిగింది. ఎంతగా అంటే- మనుచరిత్ర వర్ణించిన ‘చంపక కురవక పనస నెమ్మి నిచుల దాడిమీ విచికిల ఆమ్ర పాటలీ పూగ కేసర...’ వంటి ఎన్నో జాతుల్లో ఒకటి రెండు మినహా గుర్తించలేనంత! విద్యుద్దీపాలన్నీ ఆరిపోతేగాని వెన్నెల ఉనికి తోచనంత దూరం జరిగాం మనం ప్రకృతికి! 
మనిషిని అనునిత్యం ప్రకృతితో కలిపి ఉంచాలన్నది కవుల తాపత్రయం. మనిషి కేంద్రంగా అల్లుకున్న ప్రతి ప్రబంధంలోను ప్రకృతి వర్ణనలకు తప్పనిసరిగా వారు చోటు కల్పించారు. కణ్వుడి ఆశ్రమంలోకి ప్రవేశించే దుష్యంతుడు ‘సహకారములన్‌(మామిడి చెట్లు) కదళీ తతులన్ ‌(అరటితోటలు) చూచుచు, శుక కోకిల సుస్వరముల్‌ వీనులకు ఇంపెసగన్‌ వినుచున్‌’ సంతోషపడ్డాడు. ఆదికవి మొదలు ఆధునిక కవుల వరకు ఇదే పంథా అనుసరించారు. ‘నిను వీక్షించుచు కూరుచుండుటది అంతే చాలునో తల్లి! బంధు నికాయంబులు చూడ వచ్చినటు, మిత్రుల్‌ చేరి ఆత్మీయ భాషణముల్‌ చేసినయట్లు, సత్కవుల వాచా మాధురుల్‌ విన్నయట్లు...’ గోదావరి ఒడ్డున రికామీగా కూర్చొన్నా చాలు, అది బ్రహ్మానందమే అంటారు బేతవోలు కవి. నిజమే అంటున్నారు బ్రిటన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అనారోగ్యం అనిపించినప్పుడు వెంటనే మాత్రలు మింగేయడం కాకుండా, కాసేపు ఆరుబయట పచ్చిగాలి, మట్టి వాసన, పచ్చని పరిసరాలు... ఏదోదాన్ని ఆశ్రయించండి, వెంటనే ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఏండీ జోన్స్‌ అనే ఆ బృంద నాయకుడు. ‘పడిసంబో, తలనెప్పియో, జ్వరమో సంప్రాప్తించుచో వైద్యులన్‌ తడవన్‌ లాభము కల్గినన్‌ కలుగు, దుర్దాంత వ్యధాభారముల్ ‌(తీవ్ర వేదనలు) దాపగుచో... నీ అడుగులు పట్టుటయే రుజాపనయనోపాయంబు’ అన్నారు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తమ ‘ఆరోగ్య కామేశ్వరి’ శతకంలో! వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందినా రోగం వస్తే మనిషి భగవంతుడిపై భారం వేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సాధారణ రోగాలకు సైతం మాత్రలు మింగడం, తిరిగి వాటి దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కోసం మరో విడత ఔషధ సేవనం మానేసి పచ్చని ప్రకృతితో చెలిమి చేయడం ద్వారా సహజసిద్ధమైన స్వస్థత సాధించడం నిజానికి మంచి ఆలోచనే మరి!" (courtesy ఈనాడు సంపాదకీయం)






కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...