31, జనవరి 2019, గురువారం

సురయ్య - Suraiya


అలనాటి మేటి గాయని, నటి సురయ్య - నా pencil చిత్రం.
అవి నా చిన్నప్పటి రోజులు. అప్పుడు సురయ్య పేరు తరచుగా వినేవాళ్ళం. ఎవరీ సురయ్య .. కొంత పెద్దయ్యే వరకూ ఆమె గురించి నాకు తెలియదు. తర్వాత తెలిసింది ఆమె ఓ అద్భుత గాయని, నటి అని. 1940 వ దశకంలో ఆమె హిందీ తెరపై ఒక సూపర్ స్టార్ అనిపించుకోవడమే కాకుండా నాటి యువ హృదయాల్లొ ఓ sensation. ఈమె ఓ రేడియో కార్యక్రమంలో పాడుతుంటే, ఆమె గురించి తెలుసుకుని నాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్ ఆమెని హిందీ తెరకి పరిచయం చేశాడట. పృధ్వీ రాజ్ కపూర్ తో కలిసి నటించిన చిత్రం 'రుస్తుమ్ సొహ్రాబ్' చిత్రం చూసేవరకూ ఈమె గురించి నాకు అంతగా తెలియదు. అందులో ఆమె పాడిన 'యె కైసీ గజబ్ దాస్తాన్ హో గయీ.." అంటే నాకు చాలా ఇష్టం.
'మీర్జా గాలిబ్' లో ఆమె చౌద్వీన్ పాత్ర పోషించడమే కాకుండా ఆమె పాడిన గాలిబ్ గజళ్ళు విని నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆమెను 'you have brought back Ghalib to life' అని ప్రశంసించారట.
ప్రముఖ నటుడు దేవానంద్, సురయ్య ప్రేమ వ్యవహారం కుటుంబ కారణాల వల్ల విఫలం కావడంవల్ల ఆమె జీవితాంతం అవివాహితగానే మిగిలిపోయింది.  కానీ ప్రేమ విఫలమైనా.....ప్రేమించిన వాడిని గుండెల్లో నింపుకుని జీవితమంతా హాయిగా గడిపేసిన ధృవ తార సురయ్యా గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు!  ప్రేమంటే రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు. రెండు హృదయాలకు సంబంధించినది! అని నిరూపించిన సురయ్యా .....నిజంగా అభినందనీయురాలు
సురయ్య జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఓ తపాలా బిళ్ళని కూడా విడుదల చేసింది.
ఈ రోజు సురయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహా గాయని, నటి కి నా నివాళి



29, జనవరి 2019, మంగళవారం

జార్జ్ ఫెర్నాండెజ్ - George Fernandez

నాకెంతో ఇష్టమైన నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్, పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించిన నాయకుడు - నా pencil చిత్రం.
వారి గురించి ఈనాడు పత్రికలో వచ్చిన వార్త.

"కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఫెర్నాండెజ్‌ 88 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశారు.

జార్జి ఫెర్నాండెజ్‌ స్వస్థలం మంగళూరు. క్యాథలిక్‌ కుటుంబంలో పుట్టిన ఫెర్నాండెజ్‌ చదువును మధ్యలోనే ఆపేసి మతాధికారిగా శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ముంబయి(అప్పటి బొంబాయి)కి మకాం మార్చి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రైల్వే శాఖలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో బంద్‌లు, రాస్తారోకోలు చేపట్టారు.

అలా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో సంయుక్త సోషలిస్టు పార్టీ తరఫున దక్షిణ బాంబే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌ఏ పాటిల్‌పై విజయం సాధించి తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఫెర్నాండెజ్‌ జైలుకు వెళ్లారు.

ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో జైలులో ఉన్న ఫెర్నాండెజ్‌ అక్కడి నుంచే పోటీ చేశారు. జనతా పార్టీలో చేరి బిహార్‌‌లోని ముజఫర్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్‌ను గద్దెదింపింది. మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫెర్నాండెజ్‌కు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు.

1988లో జనతా పార్టీ నుంచి జనతా దళ్‌ విడిపోయింది. అప్పుడు ఫెర్నాండెజ్‌ కూడా జనతా దళ్‌లో చేరి వీపీ సింగ్‌ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జనతాదళ్‌ నుంచి కూడా విడిపోయి సమతా పార్టీని స్థాపించారు. 1998-2004 మధ్య వాజ్‌పేయీ హయాంలో రక్షణమంత్రిగా వ్యవహరించారు. భారత్‌-పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం ఈయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. 2004లో శవపేటికల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని రక్షణమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చివరిసారిగా 2009-2010 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఫెర్నాండెజ్‌ ఆ తర్వాత అనారోగ్య కారణాల రీత్యా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు".

21, జనవరి 2019, సోమవారం

కౌగిలింత




కౌగిలింత








నా pencil చిత్రాలకి శ్రీమతి శశికళ ఓలేటి గారు రచించిన ద్విపదలు. నాకు తట్టని భావాలు ఆమె తన ద్విపదల్లో చక్కగా వ్యక్తీకరించారు. శశికళ గారికి నా ధన్యవాదాలు.

కౌగిలింత……శ్రీ. Pvr Murty గారి అద్భుత పెన్సిల్ స్కెచెస్ కు నా ద్విపదలు.
1. సృష్ట్యాది మొదలుగా స్పృశియించి తెలుపు
సర్వ జీవులు తమ స్పందన, తపన.!!

2.మాతృ గర్భముననె మాయ కౌగిలిలొ
మాధుర్య మందెదమ్మదెమాతృ స్పర్శ!!

3.కనులు విప్పిన నిను కంటిపాప వలె
కరముల ప్రోదులో కౌగిలించు నమ్మ.!!

4. పొదివి పట్టుకునిన పెదవి విచ్చునదె
పదములన్నియు నేర్పు పొదుగు యదియె!!!

5. గాఢమైన పరిష్వంగమున నీ తండ్రి,
గారమెంతయుఁ జేయు గాంభీర్య మొలక!!

6.కౌగిలిచ్చిన నాన్నె కావలై నిన్ను,
గైకొని పోవదె కఠిన మార్గమున.!!

7.స్నేహ హస్తము జాపి చెంత జేర్చుకుని,
జీవితాంతము నీకు చేదోడు నిలుచు

8. చెలిమి కౌగిలి లోని చిలిపితన మదె
చినబోవ నివ్వని స్నేహ దుర్గమది.!!!

9. యవ్వన మందించు జవ్వని పొందు.
గువ్వ జంట లలెను సవ్వడించెదరు.

10.ప్రియ పరిష్వంగాన లయమై, నయముగ,
పరవశించు రదియె నొరుల కౌగిలిలొ!!

11.ముదిమి మీద బడగ ముచ్చట్లు కరువు
మనుమడు వాటేయ మరుపాయె వయసు!!

12. నిర్వేదమున నీవు నీర్గారినపుడు,
నీవారి కౌగిలే నీ వ్యధ తీర్చు.

13. వేదనంతయు దీర్చి వెత హరియించు,
సేద తీర్చునదియె చిన్మయుని బిగి.

14. విడువ కెన్నడు నీవు విభుని కౌగిలిని,
వినును గుండెల సడి విన్నవించు మదె!!!

15,.ఆలింగనము సేయు మాత్మభవునకు
ఆర్తులన్ని హరించు ఆపన్నమదియె.!!!

*****************************21-01-2019

-- Sasikala Voleti

19, జనవరి 2019, శనివారం

నీవో సగం నేనో సగం


నా line drawing కి మిత్రులు వేంకటేశ్వర ప్రసాద్ గారు అల్లిన కందం. వారికి నా ధన్యవాదాలు.

కం .
నాతోడుగ నీవుండగ
నీతోడుత నుందు నేను నీతో సగమై
నాతిచరామను కొనుచును
చేతులు కలిపియు నొకటిగ జీవింపంగన్


18, జనవరి 2019, శుక్రవారం

చిరస్మరణీయుడు NTR

న భూతో న భవిష్యతి అన్న ఎంటీఆర్


ఈ రోజు అన్న NTR వర్ధంతి. ఈ సందర్భంగా నా pencil చిత్రాలలో వారు పోషించిన విభిన్న పాత్రలు.


శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి నా చిత్రాలకు స్పందనగా అందించిన కవిత చదవండి :

నట (నాయక) రత్న.
నరుడా!ఏమి నీ కోరిక?
అంటూ
ఏ దేవత తెలుగువారిని
దీవించి అతడిని
పంపిందో గానీ
అందాల ఆ తోటరాముడు
ఆంధ్రుల ఆరాధ్య రాముడయ్యాడు.
అన్నికోణాల కెమేరా కంటికీ
ఇంపుగా కనిపించే రూపమతడిది.

అందం,ఆవేశం,గాంభీర్యం
అభినయం,అంకితభావం
క్రమశిక్షణ,కఠోరశ్రమ
చొచ్చుకుపోయే చొరవ
పట్టును వీడని తెగువ
ఇన్నింటికీ ఒక్కటే పేరు.
ఎవరు తెలుగునాట
ఈ నందమూరిని
ఎరుగని వారు?

రాముడి సౌమ్యం
కృష్ణుడి చాతుర్యం
రావణ దర్పం
రారాజు గర్వం
అతడిలో పలకని భావమేది?
అతడులేని
తెలుగు సినిమా
ఊహకందనిది.

నిండు యవ్వనాన 
పండుముసలి భీష్ముడీ బడిపంతులు
ఏడు పదుల వయసులోనూ
వాడితగ్గని నట చంద్రకాంతుడు
ఆ నటనా కౌశలంలో
ప్రతినాయకుడైనా నాయకుడే.

జగదేకవీరుడై అలరించినా
జగన్నాటక సూత్రధారి అనిపించినా
ఆ‌ నటరత్నం
తెలుగు హృదయాలు
కొల్లగొన్న బందిపోటు.
విశ్వ విఖ్యాత నటనను
అభిమానుల కెరవేసిన వేటగాడు.

పౌరాణిక పాత్రకతడు ఏకవీరుడు
యమగోల చేయగల సింహబలుడు
బృందావనంలో అందరి గోవిందుడు తాను
మెప్పించగలిగాడు బృహన్నలగానూ.

అతడి రక్త సంబంధం
తెప్పిస్తుంది కంటిచెమ్మ
అన్న అన్నమాటకతడు
ఆంధ్రుల ఇంటి చిరునామా.

వందల సినిమాల
విలక్షణ నటన తీరు
మరపురాదు ఎన్నటికీ
అతని మాయాబజారు.

ఆత్మగౌరవ నినాదం తెలుగువారికి
అందించిన ఘనత మన నందమూరిది.

ఓ! నట సార్వ భౌముడా!
నువ్వు తెలుగువాడివి కావటం
తెలుగు జాతి పుణ్యఫలం

భారతీయ సినిమాకి ఆత్మవి నువ్వు
భారత (మాత మెడలోని)రత్న హారానివి‌ నువ్వు .

సింహాద్రి
జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

18.1.2019
అన్నగారు దివంగతులైనప్పుడు రాసిన కవిత ఇది.

16, జనవరి 2019, బుధవారం

మహాకవి గుర్రం జాషువ

9+


జతగూడిన ఇరు తనువులు  :
సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగు.లో మరింక లేవేమో!
పాపాయి పద్యాలు
“అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ ” అన్నది ఎంత అందమైన భావన. మనం రోజూ చూసే సామాన్యమైన విషయాల్లోంచి అందమైన కవిత్వాన్ని సృష్టిస్తాడు కవి. జాషువా చేసింది అదే! “అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కాస్వాదింప చను వెర్రిబాగులాడు” అని కానీ ” ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని, మొన్న మొన్న నిలకు మొలిచినాడు” అని కానీ అప్పుడే పుట్టిన పాపాయిని వర్ణించడం గొప్ప కవులు మాత్రమే చెయ్యగలరు. తల్లికి పిల్లలపై ఉన్న ప్రేమ గురించి గొప్ప కవులు ఆర్ద్రతతో ఎంతో సాహిత్యం సృష్టించారు కానీ, “అమ్మతో తనకెంత సంబంధమున్నదో, ఏడ్చి యూడిగము సేయించుకొనును” వంటి భావంతో తల్లి-బిడ్డల బంధాన్ని ఇంత చక్కగా వర్ణించటం జాషువా గారికే చెల్లింది.
ఈ పాపాయి పద్యాలలో ఇంత మంచి సాహిత్య సృష్టి జరిగింది. కానీ, ఆ సాహిత్యాన్ని అనుభవించి, పలవరించకపోతే అద్భుతమైన సంగీత సృష్టి అసాధ్యం. ఆ పని చేసి ఘంటసాల ఈ పద్యాలకు చిరాయువు కల్పించాడు. సంగీతాన్ని శాస్రీయంగా అభ్యసించిన అందరూ పద్యాలకు ఇంత అందంగా బాణీలు కట్టలేరు. అసలు సాహిత్యాన్ని చూడగానే (అందులో పద్యాలకి మరీను) ఇలా బాణీ కట్టాలని సంగీతకారుడుకి ఎలా తెలుస్తుందో!
(నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!)
నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,.
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ)
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!
*సేకరణ చేసిన మిత్రులు శాయి గారికి కృతజ్ఞతలు.

జతగూడిన ఇరు తనువులు - కవిత


నా చిత్రానికి శ్రీమతి పుచ్చా గాయత్రీదేవి గారి కవిత. వారికి నా ధన్యవాదాలు.

జతగూడిన ఇరు తనువులు 
అనురాగపు సంగమములు
మధురమైన జ్ఞాపకాలు 
నవజీవన సంగతులు 

ఉహించని మన కలయిక
వలపుల శ్రీ రాగ మాలిక.
ఇరు మనసుల చేరిక
శృతిలయల జోడిక.
హంసధ్వని రాగములో
ఆహ్వానపు గీతమునై.
మనజీవిత రంగములో
రసగానము వినిపించన.

శుకపికముల కిలకిలలే
వేదమంత్ర ధ్వనులుగ.
నీ మాటల పొందికలే
తలంబ్రాల వేడుకగా.
నీ చుంబన గురుతులే
మట్టెలు మరి సూత్రములుగా.
జరిగేనోయి మన పరిణయం
మన ఆత్మలే సాక్షిగా.
పి. గాయత్రిదేవి. 

వ్యధ-గజల్


నా చిత్రానికి శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి కవిత. వారికి నా ధన్యవాదాలు


వ్యధ-గజల్
—————
కనురెప్పల అలికిడికే కలలు చెదిరి పోయాయే!
కలలు చెదిరి పోగానే భ్రమలు వదిలి పోయాయే!
తెలిమేఘం కురిసేనని నేల కేల అంత ఆశ ? 
గాలివీచి మబ్బులన్ని ఎటోకదిలి పోయాయే !
మరోపూవు బాగుందని మధుపానికి తొందరలూ
రాతిరంత వేచిచూచి పూలువడిలి పోయాయే!
జ్ఞాపకాల పూలకొమ్మ కన్నీటికి బ్రతుకుతోంది
ఆపూవుల పరిమళాలు గాలికెగిరి పోయాయే !
గజల్ - ఉమాదేవి జంధ్యాల

10, జనవరి 2019, గురువారం

జేసు దాస్


 మిత్రులు వేంకటేశ్వర ప్రసాద్ గారు నా చిత్రానికి వారిచ్చిన పద్య స్పందన. వారికి నా ధన్యవాదాలు. 

"మధుర గాత్ర మాంత్రికుడు శ్రీ జేసుదాసు గారి జన్మదిన సందర్భంగా ప్రముఖ చిత్ర కారులు శ్రీ పీవీఆర్ మూర్తి గారు చిత్రించిన అద్భుత చిత్రానికి నా పద్య వ్యాఖ్య చిత్రదాత మూర్తి గారికి కృతజ్ఞతలతో
ఆ.వె
జేసుదాస మీకు జేజేలు పలురీతి
మధురమైన గాత్ర మాంత్రికుండ!
జన్మదినము లెన్నొ చక్కంగ జరుగంగ
వేద వేద్యునకును వినతి జేతు
ఆ.వె
దైవ గాత్ర ధర్మ దాక్షిణ్య మలరారు
జేసుదాసు గొంతు జెవుల బడగ
మాయదేమొ గాని మంత్రముగ్ధత నొంది
చిత్తశాంతి గల్గు శీఘ్రముగను
కం.
కనుపించు దైవ సన్నిధి
వినగా నా జేసుదాసు విస్మయ గాత్రమ్
తనువెంతో పులకించును
మనమున జెకూరు శాంతి మత్తిల జేయున్"

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...