18, జనవరి 2019, శుక్రవారం

చిరస్మరణీయుడు NTR

న భూతో న భవిష్యతి అన్న ఎంటీఆర్


ఈ రోజు అన్న NTR వర్ధంతి. ఈ సందర్భంగా నా pencil చిత్రాలలో వారు పోషించిన విభిన్న పాత్రలు.


శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి నా చిత్రాలకు స్పందనగా అందించిన కవిత చదవండి :

నట (నాయక) రత్న.
నరుడా!ఏమి నీ కోరిక?
అంటూ
ఏ దేవత తెలుగువారిని
దీవించి అతడిని
పంపిందో గానీ
అందాల ఆ తోటరాముడు
ఆంధ్రుల ఆరాధ్య రాముడయ్యాడు.
అన్నికోణాల కెమేరా కంటికీ
ఇంపుగా కనిపించే రూపమతడిది.

అందం,ఆవేశం,గాంభీర్యం
అభినయం,అంకితభావం
క్రమశిక్షణ,కఠోరశ్రమ
చొచ్చుకుపోయే చొరవ
పట్టును వీడని తెగువ
ఇన్నింటికీ ఒక్కటే పేరు.
ఎవరు తెలుగునాట
ఈ నందమూరిని
ఎరుగని వారు?

రాముడి సౌమ్యం
కృష్ణుడి చాతుర్యం
రావణ దర్పం
రారాజు గర్వం
అతడిలో పలకని భావమేది?
అతడులేని
తెలుగు సినిమా
ఊహకందనిది.

నిండు యవ్వనాన 
పండుముసలి భీష్ముడీ బడిపంతులు
ఏడు పదుల వయసులోనూ
వాడితగ్గని నట చంద్రకాంతుడు
ఆ నటనా కౌశలంలో
ప్రతినాయకుడైనా నాయకుడే.

జగదేకవీరుడై అలరించినా
జగన్నాటక సూత్రధారి అనిపించినా
ఆ‌ నటరత్నం
తెలుగు హృదయాలు
కొల్లగొన్న బందిపోటు.
విశ్వ విఖ్యాత నటనను
అభిమానుల కెరవేసిన వేటగాడు.

పౌరాణిక పాత్రకతడు ఏకవీరుడు
యమగోల చేయగల సింహబలుడు
బృందావనంలో అందరి గోవిందుడు తాను
మెప్పించగలిగాడు బృహన్నలగానూ.

అతడి రక్త సంబంధం
తెప్పిస్తుంది కంటిచెమ్మ
అన్న అన్నమాటకతడు
ఆంధ్రుల ఇంటి చిరునామా.

వందల సినిమాల
విలక్షణ నటన తీరు
మరపురాదు ఎన్నటికీ
అతని మాయాబజారు.

ఆత్మగౌరవ నినాదం తెలుగువారికి
అందించిన ఘనత మన నందమూరిది.

ఓ! నట సార్వ భౌముడా!
నువ్వు తెలుగువాడివి కావటం
తెలుగు జాతి పుణ్యఫలం

భారతీయ సినిమాకి ఆత్మవి నువ్వు
భారత (మాత మెడలోని)రత్న హారానివి‌ నువ్వు .

సింహాద్రి
జ్యోతిర్మయి
న ర సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

18.1.2019
అన్నగారు దివంగతులైనప్పుడు రాసిన కవిత ఇది.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...