30, సెప్టెంబర్ 2019, సోమవారం

జాషువ గారి 'పాపాయి పద్యాలు' ఘంటసాల గారి గళంలో



నేనొక చిత్రకారుణ్ణి.  నా pencil తో ఎందరో మహానుభావుల చిత్రాలను చిత్రీకరించే భాగ్యం నాకు కలిగింది. వారి చిత్రాలతో ఓ slide తయారు చేసి background లో వారి గీతాలతో youtube లో పోస్ట్ చెయ్యాలనిపించింది. ఇవి నలుగురికీ ఉపయోగపడితో అంతకు మించిన ఆనందం నాకు లేదు.

మహాకవి జాషువ రచించిన 'పాపాయి పద్యాలు' అమరగాయకుడు ఘంటసాల గారి గళంలో వీడియో క్లిక్ చేసి వినండి.  ... 

పద్యాలు చదువుతూ ఘంటసాల గారి గానం వినండి.




నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ)
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!
బొటవ్రేల ముల్లోకములు జూచి లోలోన
నానందపడు నోరులేని యోగి
తల్లి తండ్రుల తనూ వల్లరీ ద్వయికి వ
న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగ
కాస్వాదింప చను వెర్రిబాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరం
దము జాలువారు చైతన్య ఫలము
భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,
నిద్రపోవు, లేచి నిలువలేడు .. (చిన్ని నాన్న)
ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని,
మొన్న మొన్న నిలకు మొలిచినాడు!
గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలక
కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు,
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించ వచ్చిన పరదేశి,
తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి
ఏమి పనిమీద భూమికి నేగినాడొ,
నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని,
ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు!

ఊయేల తొట్టి ఏముపదేశ మిచ్చునో,
కొసరి నొంటరిగ నూ కొట్టుకొనును
అమ్మతో తనకెంత సంబంధమున్నదో,
ఏడ్చి యూడిగము చేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో,
బిట్టుగా కేకిసల్ కొట్టుకొనును
మూనాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో,
పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును
ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి,
చదువు సంధ్య నేర్చి బ్రతుకునపుడు
నాదు పసిడికొండ, నా రత్నమని, తల్లి
పలుకు పలుకులితడు నిలుపుగాక!




28, సెప్టెంబర్ 2019, శనివారం

మా తెలుగుతల్లికీ మల్లెపూదండ - టంగుటూరి సూర్యకుమారి



నేను చిత్రించిన టంగుటూరి సూర్యకుమారి గారి చిత్రంతోబాటు ఆమె గళంలో మధురంగా పలికిన ఈ పాట పైన ఉన్న బొమ్మ మీద క్లిక్ చేసి వినండి.

ఈ పాట తెలియని తెలుగువాడుండడు అంటే ఆశ్చర్యం లేదు. ఈ పాట సాహిత్యం క్రింద పొందుపరుస్తున్నాను.

శంకరంబండి సుందరాచారి గారు రచించిన ఈ పాట ఆర్. సుదర్శనం గారు స్వరపరిచారు. టంగుటూరి సూర్యకుమారి గారు గానం చేసిన ఈ పాట ఇప్పటికీ తెలుగు భాషాభిమానులు, సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ పాట ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి రాష్ట్ర గీతం.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతి నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

గోరింక జాడనే వెతకడం మానెలే - గజల్





నా చిత్రానికి శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు రచించిన గజల్

**ముషాయిరా గజల్**

గోరింక జాడనే వెతకడం మానెలే
గోరంత అండనే కోరడం మానెలే

మధురోహ మందార మొగ్గలా విరిసింది
ఎడబాటుతో ఎడద మండడం మానెలే

నమ్మకము కాపురపు సూత్రమని తెలిసింది
అనుమాన బీజాలు విసరడం మానెలే

ఆషాఢ మాసాన ఈ విరహమేలనో
గడియారమున ముల్లు కదలడం మానెలే

కమ్మనగు వంటకము చేదుగా తోచెనే
అధరాల మధురాలు కలవడం మానెలే

చేదోడు వాదోడు చింత తీర్చే తోడు
ఈనెలకు నాచెంత చేరడం మానెలే

గోపాలకృష్ణునికి చెలియనోయ్ రాధికని
గోధూళివేళైంది అలగడం మానెలే.


గుడిపూడి రాధికారాణి(19.9.2019)

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

టంగుటూరి సూర్యకుమారి - మా తెలుగుతల్లికి మల్లెపూదండ

టంగుటూరి సూర్యకుమారి - నా pencil చిత్రం

టంగుటూరి సూర్యకుమారి గారి పేరు వినని తెలుగు వాడు ఉండడు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ‘ పాటకి ఆవిడ ప్రాణం పోశారు. చాలా చిన్నప్పుడే, ఆరితేరిన గాయకురాలిగా, నృత్య కళాకారిణిగా ప్రసిద్ధికెక్కినన తెలుగు ఆడపడుచు. టంగుటూరి ప్రకాశం పంతులుగారి రాజకీయ ఉపన్యాసాలకి నాందిగా ఆవిడ చక్కని జాతీయ గీతాలు పాడేవారట. ఎన్నోఆనాటి చలన చిత్రాల్లో నటించి ఖ్యాతి గడించారు.
ఇంగ్లండులో స్థిరవాసం ఏర్పరచుకొని, ఆవిడ మన తెలుగు వారి సాంస్కృతిక రాయబారి అయ్యారు. అక్కడ నృత్యకళాశాల పెట్టారు. ఎన్నో Shadow Plays ప్రదర్శించారు. 1925 సంవత్సరంలో జన్మించిన ఈమె 2005 ఏప్రిల్ లో స్వర్గస్తులయ్యారు.

3, సెప్టెంబర్ 2019, మంగళవారం

మదిభావం


(నా చిత్రానికి శ్రీమతి జ్యోతి కంచి గారి కవిత)

మదిభావం ॥ ఛాయాచిత్రం॥
———————————————
ఓ నిద్రరాని రేయి సాక్షిగా నాకోసం రాసుకున్న రాతలివి
మన ప్రేమబంధం సాక్షిగా నీకోసం
దాచుకున్న ఊహలివి
ఝల్లై చల్లబడుతోంది మేఘం..
నీ మోములోని వెచ్చదనాన్ని మరి భరించలేనట్లు
ఖాళీ కాగితంపై అత్తరుతో దిద్దిన అక్షరమౌతోంది....
తొణికిసలాడే నీ నవ్వులలోని భాషేమో
రాత్రి కి రంగువేస్తూ సాహసం చేస్తోంది.....జాలుగా జారే నీనల్లని కురుల కుచ్చులా
ఇదిగో నాలో ధమనులనో సిరలనో గుచ్చేస్తోంది
ఇంకెవరు నీవాల్చూపుల మెరుపుల తపంచానే
దోసగింజంతఉంటుందేమో దొంగది కళ్ళందాన్ని పెంచేస్తూ నుదుటిపై దర్జాగా కూర్చొనుంటది
పచ్చని చెట్ల పరిమళమెప్పుడూ నీ చిలిపితనాన్ని నాకుగుర్తుచేస్తుంది
నల్లబడిన ఆకాశం కింద
ఇలా ఎంతసేపని నీ ఛాయచిత్రాన్నే చూడడం...
దివినుండి ఓ వెలుగురేఖ తాకేలోపు
మనసు చల్లబడి తెల్లవారేలోపు
మరికొంచం 'కల'వరమై కనికరించవా?
JK 31.8.19

2, సెప్టెంబర్ 2019, సోమవారం

||పార్వతి తనయా గజాననా !||

||పార్వతి తనయా గజాననా !||

మందాక్రాంతము ॥

శ్రీవిఘ్నేశా నినుగొలిచినన్ సెబ్బరల్ బాయవే నా
భావంబందీవునిలువగ సంప్రాప్త మౌలాభ ముల్ యో
దేవా హేరంబ గణపతి !యాధీనమయ్యా జగంబుల్
కావంగన్ నీవగతి మము శుక్లాంబరా ! వక్రతుండా !

ఉ॥
చేటల వంటికర్ణముల చీకులచింతల చెప్పవిందువో
మేటివి బొజ్జనిల్పితివి మేదిని యాదిగగోళకోటులన్
ఏటికినొక్కమారిలకనింద్యుడు మోయగ వచ్చిపోదువే!
దీటుగ రమ్ముస్వామి వ్రత దీక్షల వారిని నుద్ధరింపగా !

సీ॥
 గౌరిజేసినబొమ్మ ఘనమైన దేవుండు
తొలిపూజ లొనరింప కలుగు జయము !
పట్టుపుట్టము లేల  పసుపు పంచయెజాలు
మట్టి బొమ్మను మెచ్చు మహిత మూర్తి
ఆకులలముజాలు నడుగడు భోగముల్
 భక్తితో నొసగగ పత్రి మెచ్చు
 పిండివంటల కన్నబియ్యపుండ్రాళ్ళతో
 కుడుముల నర్పింప కోర్కెదీర్చు!
ఆ.వె।।
తెలిసి చేయుడయ్య తెలివొంది
తనపూజ
జానడైన రూపె చాలు చాలు
మురుగు నీట ముంచ మ్రొక్కిన ఫలమేమి
తరువు మొదట నుంచ తగవు గాదె !
—————————

ఉమాదేవి జంధ్యాల
( చిత్రం Pvr Murty (పొన్నాడ మూర్తి)గారు

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

నాతో నేను - కవిత



శ్రీమతి ఝాన్సీ మంతిన గారి కవిత కి నా చిత్రం
నాతో నేను

నాతో నేను మాట్లాడి ఎంత కాలమైందని
చిన్నప్పుడెప్పుడో నా మాట నేను వినేదాన్ని
నాతో నేను ఎంతో సంతోషంగా మాట్లాడేదాన్ని
లొపలొకటి బయట ఒకటి లేదు
అంతా ఒకటే నేను కేవలం నేనే
ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు మరి
క్రమంగా నాలో నుండి నేను విడిపోవడం
నాతో నేను మాట్లాడడానికి భయపడడం
నాతో నేను మాట్లాడడం మరచి పోయానుక్రమంగా
హడావిడి బతుకులో నేను నాలోనుండి విడిపోయాను
కొన్నాళ్ళ దాకా తెలియక పోయినా
నాలో నెమ్మదిగా దిగులు
ఏదో పోగొట్టుకుంటున్నానన్న తికమక
చేతులోని మంచు ముక్కలా తెలియకుండానే
కరిగిపోయే రాత్రులు, .పగళ్ళు, రోజులు , నెలలు, సంవత్సరాలు
ఎలా గడిచి పోయాయో,
కాలం గడుస్తున్న కొద్దిి ఏదో తెలియని దిగులు
నా మాట నేను వినకుండా కాలం తో పోటీ పడి పెట్టిన పరుగుల ఫలితం
వేగంగా పెరుగుతూ తగ్గుతూ గాజుగొట్టం లో పాదరసమ్ చూపించే 120/80 ని దాటిపోయిన సంఖ్యలు
వైద్యుడిని చూస్తే గాని తగ్గని గుండెలోని గాభరా
యోగ చేయండి, ధ్యానం చేయండి వైద్యుడి సలహా
అదిగో అప్పుడు గుర్తొచ్చింది నాతో నేను మాట్లాడి ఎన్నో ఏళ్లు గడిచాయని
నెమ్మదిగా నేను నేను గా మారడానికి ప్రయత్నం మొదలుపెట్టా
కొంత నయం కానీ చిన్నప్పుడంత బాగా నాతో నేను మాట్లాడడానికి ఎంతకాలం పడుతుందో మరి.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...