22, మార్చి 2020, ఆదివారం

పది కాలాలు చల్లగా ఉండు - కవిత



(మిత్రులు శ్రీనివాస్ వేమూరి గారి చక్కని కవితకి నా చిత్రం వారి అనుమతితో.)

పది కాలాలు చల్లగా ఉండు.

ఇంట్లో తోరణం కట్టినా,
వంట్లో నలతగా ఉన్నా,
మనసులో గుబులు గూడు కట్టినా,
ముంగిట్లోకి పండుగ వచ్చినా,
మొదటి పిలుపు నీకే,
మొదటగా తట్టే తలుపు నీదే
కారణం మా తలపుల నిండా నీవే!

పసుపు కొట్టే శుభవేళ,
పట్టు చీరలు కొనే ఆనందపు వేళ,
హారతి పట్టే మంగళకర వేళ,
నాన్న తలచేది,
అన్న చూసేదీ,
అమ్మ పిలిచేదీ నిన్నే

భగవంతుడి వాటా మొక్కు
పుట్టింటి వాటా నీ హక్కు,
మమ్మల్ని వెనకేసుకు వచ్చేది నీ వాక్కు,
మా మనసందుకే పరిగెడుతుంది నీ దిక్కు.

వదినను సరసంతో అల్లరి పెట్టినా,
మరదలిని ఆట పట్టించినా,
మేనల్లుడికి గోరుముద్దలు తినిపించినా,
మేనకోడలికి బట్ట సింగారించినా,
నీ స్వేచ్ఛను కాదనే వారు,
నీ ప్రవర్తనను సమర్ధించనివారు,
నీ ఉనికికి ఆనందపడనివారు,
ఎవ్వరూ ఉండరు.

పడుచుదనం తొంగి చూసినపుడు,
యుక్త వయసులోకి అడుగిడినపుడు,
ఒక వంశం నిలపడానికి సాగనంపాం,
అందుకే నువ్వు మా మనసుల్లో
అలాగే పడుచుగా నిలిచిపోయావు,
కాకపోతే ఆడ అత్తింట్లో ఉన్న పడుచువి,
అందుకే సోదరీ
నిన్ను ఆడ-పడుచంటాం.

నీ కొడుక్కి అన్నం పెట్టేటప్పుడు,
నీ కూతురికి స్నానం చేయించేటప్పుడు,
నీ మాటల్లో ఊరేది మా మీద ప్రేమ,
అందుకే చుట్టపు చూపుగా వచ్చే నీ పిల్లలు
మనసులో ఇస్తారు మాకు ప్రత్యేక విలువలు.

తాతింటి మీద ప్రేమ
ఉగ్గుపాలతో పిల్లలకు తాగిస్తావు,
అందుకే వాళ్ళకు మేమంటే అంతే చనువు.
అందుకే నేమో!
మన తల్లి దండ్రులకి,
వంశం నిలిపే మనవలు
ఆస్తులు గురించి,
నీ అంశతో పుట్టిన మనవలు
ఆప్యాయతల గురించి,
మాట్లాడుతూ ఉంటారు.

అందుకే వాళ్ళు ఏది సాధించినా
మాకు ఆనందం,
వాళ్ళు పేరు తెచ్చుకుంటే
మాకు గర్వం
నీకుటుంబ చేరికతో
మా జీవితాలు అవుతాయి పరిపూర్ణం.

చల్లగా ఉండు తల్లీ,
పసుపు కుంకుమలతో పదికాలం.



సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి

14, మార్చి 2020, శనివారం

నిశ్శబ్దం




నిశ్శబ్దం ( నా చిత్రానికి అనూశ్రీ కవిత ) 

గలగల కబుర్లలో
మురిసిన మనుషుల మధ్య
మాటలు కరువవుతున్నాయంటే
దూరమయ్యే క్షణం
అతి చేరువయ్యిందేమో.....
మాటల మధ్య పేరుకుంటున్న
సుదీర్ఘ నిశ్శబ్దం
హెచ్చరికేదో జారీచేస్తున్నట్టుంది
పంచుకునేందుకు నేడు
మనసు సిధ్ధంగా లేదని...
అరమరికలు లేక కలబోసుకున్న
అలనాటి అనుభూతులు
నిరీక్షణలో విసిగి నేడు
మౌనాన్ని తొడుగుతున్నాయేమో
ఒంటరితనంలో సేదతీరడం
ఆలోచనలతో సహవాసమే
అలవాటులా మారాక
తోడు రాని మనుషులకై ఆరాటమెందుకని
ఆ పాత మధురాలు అందేవి కావిక అని కాలం బోధిస్తూ మదిని
మరిపిస్తుందేమో మరి ఇలా...
అనూశ్రీ....

6, మార్చి 2020, శుక్రవారం

రాగతి పండరి - తెలుగు కార్టూనిస్ట్



స్మృత్యంజలి : ప్రఖ్యాత తెలుగు మహిళా కార్టూనిస్ట్ 'రాగతి పండరి' (నా pencil చిత్రం)

నవ్వించడమనేది ఓ అద్భుతమైన కళ. సమయానుకూలంగా, సందర్భానుసారంగా మాట్లాడి అప్పటికప్పుడు నవ్వు రప్పించేవారు జోకిస్టులు.

నాలుగు దశాబ్దాల్లో వేలాది బొమ్మలు
అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ప్రచురణ
వందలాది అవార్డులు, రివార్డులు పొందిన తెలుగు మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి వర్ధంతి నేడు.

కార్టూన్‌ కళ ఏ కొద్ది మందికో దక్కే అపురూప వరం. ఆ నైపుణ్యం పట్టుబడాలంటే ఎంత జీవితం చూడాలి ? ఇంకెంత అవగాహన కావాలి ? మరెంత అనుభవం కావాలి ? - అంటారు ఆ విద్య తెలిసిన వారు. అయితే, ఆ వ్యంగ్య చిత్ర విధూషీమణి భాష్యంగా చూసిన ప్రపంచం అతి పరిమితం. ఇటువంటి స్థితిలోనూ ఆ పరిధిని అధిగమించి మానవ జీవితంలో అన్ని పార్వ్యాలనూ ఆమె విభిన్న కోణంలో సందర్శించగలిగారు. గిలిగింతలు పెట్టే హాస్యంతో, సున్నితమైన చమత్కారంతో జీవన చిత్రాలను పాఠకుల కళ్లముందుంచగలిగారు. ఆమెనే విశాఖ నగరానికి చెందిన రాగతి పండరి. నేడు ఆమె ఐదో వర్థంతి సందర్భంగా నా స్మృత్యంజలి.

5, మార్చి 2020, గురువారం

వేయికన్నుల వేచియున్నది..మోహమేదో తీరకే..! - తెలుగు గజల్

నా pencil చిత్రానికి ప్రఖ్యాత తెలుగు గజల్ రచయిత మాధవరావు కొరుప్రోలు గారి గజల్.
ధన్యుడను నేను. వారికి నా కృతజ్ఞతలు.


వేయికన్నుల వేచియున్నది..మోహమేదో తీరకే..!
యౌవనాగ్నికి బలౌతున్నది..రాగమేదో వీడకే..!
చీకటింటిని వీడజాలని..సుందరాంగియె మానసం..
సరసవీణా మాధురీసుధ..తత్వమేదో వెలుగకే..!
చిచ్చులేవో రగిల్చేనా..గుండె పిండే మాటలే..
ప్రేమ లోతును చూడగలిగే..నేత్రమేదో విరియకే..!
కురులమధ్యన మూగవోయిన..గులాబీదే లోకమో..
ప్రణయవీణా శృతిని కాచే..ధ్యానమేదో కుదరకే..!
శిశిరమాధురి రాలుఆకుల..హాసమందే దొరుకునా..
ఆశపడకే చిగురువేయగ..మార్గమేదో అందకే..!
నేర్చుకోగా ముచ్చటైతే..గురువు ఎవ్వరు మాధవా..
విశ్వమైత్రీ గగనమేలు రహస్యమేదో పట్టకే..!

కంచు కంఠీరవుడు కొంగర జగ్గయ్య - స్మృత్యంజలి

My pencil sketch of legendary Telugu actor Jaggayya

కంచు కంఠీరవుడు కొంగర జగ్గయ్య - స్మృత్యంజలి

కంచు కంఠం జగ్గయ్య సినీ నటుడే కాదు ఒక మంచి రచయిత, సాహిత్యకారుడు, కళావాచస్పతి, చిత్రకారుడు, సంపాదకుడు, రాజకీయవేత్త. ధరించిన పాత్ర ఏదైనా తన విలక్షణమైన నటనతో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసి ఒక ప్రత్యేకతను, నిండుతనాన్ని, హుందాతనాన్ని సంతరింపజేసిన విశిష్ట వ్యక్తి జగ్గయ్య. సినీరంగ ప్రవేశానికి ముందే దశాబ్దంపాటు నాటకరంగంలో విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి. ఎన్.టి. రామారావు, జమున, సావిత్రి, గుమ్మడి, ముక్కామల వంటి నటీనటులతో రంగస్థలం మీద నటించిన జగ్గయ్య ఎందరు నటులకో మార్గదర్శకుడు. నటి సావిత్రి నాట్యానికే పరిమితమైన ఆరోజుల్లో తను రచించిన ‘బలిదానం’ అనే నాటకం ద్వారా రంగస్థలనటిగా మార్చిన ఘనత జగ్గయ్యకు దక్కుతుంది. సినిమాలో నటిస్తున్నప్పుడుకూడా కళాశాల విద్యార్ధుల సమావేశాలకు వెళ్లి ‘పారిజాతాపహరణం’ వంటి ప్రాచీన కావ్యాల గురించి ప్రసంగాలు చేసిన సాహితీమూర్తి జగ్గయ్య. హైస్కూలు రోజుల్లోనే సంస్కృత, ఆంధ్రసాహిత్యాన్ని మధించిన అనుభవశాలి. ‘కళావాచస్పతి’ అనేది జగ్గయ్యకు ప్రదానం చేసిన బిరుదుకాదు. అది ఢిల్లీ లోని అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ డాక్టరేటు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక నటుడు జగ్గయ్య మాత్రమే. చిన్నతనం నుంచే జగ్గయ్య క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన తొలి దక్షినాది సినీ నటుడు ఆయనే. ఆయనకు చిత్రకళ, వాస్తుశాస్త్రం, సమ్మోహన విద్య (హిప్నాటిజం) మీద మంచి పట్టు వుంది. జగ్గయ్య ఇంటిలో ఉన్నంత పుస్తక భాండాగారం మరే ఇతర నటుల ఇండ్లలో కనిపించదు. “నాలో వున్న ఒకే ఒక గుణం ఆత్మవిశ్వాసం. అదే నాకు ఇంతకాలం ఆసరాగా నిలుస్తూ వచ్చింది. ఎంతటి దుర్బర జీవితాన్నైనా ఆత్మవిశ్వాసమొక్కటే రక్షించ గలదు” అని గట్టిగా నమ్మిన వ్యక్తి జగ్గయ్య.

5 మార్చి జగ్గయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుందాం.

(వివరాలు 'సితార' పత్రిక సౌజన్యంతో)

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...