22, మార్చి 2020, ఆదివారం

పది కాలాలు చల్లగా ఉండు - కవిత



(మిత్రులు శ్రీనివాస్ వేమూరి గారి చక్కని కవితకి నా చిత్రం వారి అనుమతితో.)

పది కాలాలు చల్లగా ఉండు.

ఇంట్లో తోరణం కట్టినా,
వంట్లో నలతగా ఉన్నా,
మనసులో గుబులు గూడు కట్టినా,
ముంగిట్లోకి పండుగ వచ్చినా,
మొదటి పిలుపు నీకే,
మొదటగా తట్టే తలుపు నీదే
కారణం మా తలపుల నిండా నీవే!

పసుపు కొట్టే శుభవేళ,
పట్టు చీరలు కొనే ఆనందపు వేళ,
హారతి పట్టే మంగళకర వేళ,
నాన్న తలచేది,
అన్న చూసేదీ,
అమ్మ పిలిచేదీ నిన్నే

భగవంతుడి వాటా మొక్కు
పుట్టింటి వాటా నీ హక్కు,
మమ్మల్ని వెనకేసుకు వచ్చేది నీ వాక్కు,
మా మనసందుకే పరిగెడుతుంది నీ దిక్కు.

వదినను సరసంతో అల్లరి పెట్టినా,
మరదలిని ఆట పట్టించినా,
మేనల్లుడికి గోరుముద్దలు తినిపించినా,
మేనకోడలికి బట్ట సింగారించినా,
నీ స్వేచ్ఛను కాదనే వారు,
నీ ప్రవర్తనను సమర్ధించనివారు,
నీ ఉనికికి ఆనందపడనివారు,
ఎవ్వరూ ఉండరు.

పడుచుదనం తొంగి చూసినపుడు,
యుక్త వయసులోకి అడుగిడినపుడు,
ఒక వంశం నిలపడానికి సాగనంపాం,
అందుకే నువ్వు మా మనసుల్లో
అలాగే పడుచుగా నిలిచిపోయావు,
కాకపోతే ఆడ అత్తింట్లో ఉన్న పడుచువి,
అందుకే సోదరీ
నిన్ను ఆడ-పడుచంటాం.

నీ కొడుక్కి అన్నం పెట్టేటప్పుడు,
నీ కూతురికి స్నానం చేయించేటప్పుడు,
నీ మాటల్లో ఊరేది మా మీద ప్రేమ,
అందుకే చుట్టపు చూపుగా వచ్చే నీ పిల్లలు
మనసులో ఇస్తారు మాకు ప్రత్యేక విలువలు.

తాతింటి మీద ప్రేమ
ఉగ్గుపాలతో పిల్లలకు తాగిస్తావు,
అందుకే వాళ్ళకు మేమంటే అంతే చనువు.
అందుకే నేమో!
మన తల్లి దండ్రులకి,
వంశం నిలిపే మనవలు
ఆస్తులు గురించి,
నీ అంశతో పుట్టిన మనవలు
ఆప్యాయతల గురించి,
మాట్లాడుతూ ఉంటారు.

అందుకే వాళ్ళు ఏది సాధించినా
మాకు ఆనందం,
వాళ్ళు పేరు తెచ్చుకుంటే
మాకు గర్వం
నీకుటుంబ చేరికతో
మా జీవితాలు అవుతాయి పరిపూర్ణం.

చల్లగా ఉండు తల్లీ,
పసుపు కుంకుమలతో పదికాలం.



సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...