5, మార్చి 2020, గురువారం

కంచు కంఠీరవుడు కొంగర జగ్గయ్య - స్మృత్యంజలి

My pencil sketch of legendary Telugu actor Jaggayya

కంచు కంఠీరవుడు కొంగర జగ్గయ్య - స్మృత్యంజలి

కంచు కంఠం జగ్గయ్య సినీ నటుడే కాదు ఒక మంచి రచయిత, సాహిత్యకారుడు, కళావాచస్పతి, చిత్రకారుడు, సంపాదకుడు, రాజకీయవేత్త. ధరించిన పాత్ర ఏదైనా తన విలక్షణమైన నటనతో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసి ఒక ప్రత్యేకతను, నిండుతనాన్ని, హుందాతనాన్ని సంతరింపజేసిన విశిష్ట వ్యక్తి జగ్గయ్య. సినీరంగ ప్రవేశానికి ముందే దశాబ్దంపాటు నాటకరంగంలో విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి. ఎన్.టి. రామారావు, జమున, సావిత్రి, గుమ్మడి, ముక్కామల వంటి నటీనటులతో రంగస్థలం మీద నటించిన జగ్గయ్య ఎందరు నటులకో మార్గదర్శకుడు. నటి సావిత్రి నాట్యానికే పరిమితమైన ఆరోజుల్లో తను రచించిన ‘బలిదానం’ అనే నాటకం ద్వారా రంగస్థలనటిగా మార్చిన ఘనత జగ్గయ్యకు దక్కుతుంది. సినిమాలో నటిస్తున్నప్పుడుకూడా కళాశాల విద్యార్ధుల సమావేశాలకు వెళ్లి ‘పారిజాతాపహరణం’ వంటి ప్రాచీన కావ్యాల గురించి ప్రసంగాలు చేసిన సాహితీమూర్తి జగ్గయ్య. హైస్కూలు రోజుల్లోనే సంస్కృత, ఆంధ్రసాహిత్యాన్ని మధించిన అనుభవశాలి. ‘కళావాచస్పతి’ అనేది జగ్గయ్యకు ప్రదానం చేసిన బిరుదుకాదు. అది ఢిల్లీ లోని అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ డాక్టరేటు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక నటుడు జగ్గయ్య మాత్రమే. చిన్నతనం నుంచే జగ్గయ్య క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన తొలి దక్షినాది సినీ నటుడు ఆయనే. ఆయనకు చిత్రకళ, వాస్తుశాస్త్రం, సమ్మోహన విద్య (హిప్నాటిజం) మీద మంచి పట్టు వుంది. జగ్గయ్య ఇంటిలో ఉన్నంత పుస్తక భాండాగారం మరే ఇతర నటుల ఇండ్లలో కనిపించదు. “నాలో వున్న ఒకే ఒక గుణం ఆత్మవిశ్వాసం. అదే నాకు ఇంతకాలం ఆసరాగా నిలుస్తూ వచ్చింది. ఎంతటి దుర్బర జీవితాన్నైనా ఆత్మవిశ్వాసమొక్కటే రక్షించ గలదు” అని గట్టిగా నమ్మిన వ్యక్తి జగ్గయ్య.

5 మార్చి జగ్గయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుందాం.

(వివరాలు 'సితార' పత్రిక సౌజన్యంతో)

2 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

జగ్గయ్య గారి గురించి విశేషాలు పంచుకున్నందుకు ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

Jaggaih Garu was a dignified actor

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...