2, ఏప్రిల్ 2020, గురువారం

సీతాదేవి కల్యాణ ఘట్టం




నా చిత్రానికి  శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు రచించిన పద్యాలు యధాతధంగా ః

అనంతచ్ఛందము వారు రచియింపజేసిన రామాయణంలో సీతాదేవి అనసూయాదేవికి చెప్పిన తన కల్యాణ ఘట్టం

కీర్తిమతి సీత యామెకు కేలుమోడ్చ
ముగ్ధు రాలైన ననసూయ ముదిత జూచి
వినగ గోరె స్వయంవర వివరములను!
వల్లెయనిసీత యాకథఁబలుక దొడగె!
క్షాత్ర ధర్మానురక్తుడౌ క్ష్మాపతియగు
జనకుడేలుచు మిథిలను జన్నమొకటి
చేయదలపెట్టి నాగలిన్ జేతబట్టి
దున్నుచుండగ భూమిలో దొరికినాను
ముష్టి నోషథులనుబట్టి పుడమియందు
జల్లుచున్నరాజునకక్క*జంబుగలుగ
మైపరాగమునిండగ మెరయుచున్న
శిశువుగానున్న ననురాజు స్వీకరించి
కూతురిదియని బ్రకటించె కూర్మితోడ
“నీదు ధర్మము చేతనే నీకుదక్కె
మానుషంబనియెంచకు మనుచు “దివ్య
వాణివినిపించె నింగిని బ్రజలు వినగ !
ఇష్టమైనట్టి వస్తువునిచ్చినటుల
రాజు నన్నిచ్చె బట్టపు రాణికపుడు
నాటి నుండియు బ్రేమతో నన్నుబెంచి
మాతృమూర్తియై బంచెను మమతనాకు!
వయసువచ్చిన సుతజూచి వగచె తండ్రి
ధనము బోగొట్టు కొనినచం దమున దాను
కూతు గలవారి తక్కువ చూతు రకట
యలుసు గాజూడ భరియింప వలెననంగ!
ఎడము లేదట్టి స్థితికని యెరిగి తండ్రి
చింతయనుకడలినబడి చేరడాయె
తెప్ప లేనివారికివోలె తీరమునకు
కన్య తండ్రికి తప్పదీ కలత యెపుడు .
నేనయోనిజ నగుటచే ననువగువరు
గాననందున యోచించి జనక రాజు
మేలగుస్వయంవరముమన మైథిలికని
దగిన యేర్పాట్లు జేయింప దలచె నమ్మ !
వరుణు డొక మహాయిష్ఠిన పెరిమ గలిగి
ధనువు శరధుల రెంటిని తండ్రి కొసగె
వీర యోధులు సైతమా భార మైన
కార్ముకమునెత్త జాలరు కలనుగూడ!
)
ధరణి పతులను రావించి ధనువు జూపి
జనకుడిట్లనె వారితో సత్యవాది
“దీని నెక్కిడ గలిగిన ధీర వరుడు
పత్నిగానాదు దుహితను బడయ గలడు”
శైలమునుబోలి యెత్తనసాధ్యమైన
కార్ముకముజూచి రాజులు గరము మోడ్చి
మాకు శక్తిచాలదనుచు మలగి చనగ
గడచి పోవుచునుండెను కాలమట్లు
కౌశికుడొకనాడు మిథిల కరుగుదెంచి
భూమినాథుని సముచిత పూజలంది
రామలక్ష్మణులనుజూపి రాజు నపుడు
చాపమున్ జూప గోరెను ఛాత్రు లకును !
తపసి మాటల నాలించి తండ్రి యపుడు
విల్లు దెప్పింప చూచిన వీరవరుడు
వంచె నాక్షణముననె బి*గించ నల్లె
త్రాడు లాగగ రెండుగ ధనువు విరిగె!
నశని పాతంపు శబ్దంబు దిశలునిండె !
సత్య వాదియౌ నాతండ్రి జనకుడపుడు
రామునకునన్నొసంగనీ*రమునుబట్టె
తండ్రి దశరథు ననుమతి నడుగకుండ
సీత జేపట్ట లేనని చెప్పె విభుడు
తరలి వచ్చెను శ్వసరుండు దండ్రిపిలువ
వేడ్కమీరగ జరిగెను పెండ్లిమాకు
ప్రియస హోదరి యూర్మిళ పెండ్లి కూడ
లక్ష్మణునితోడ జరిగెను లక్షణముగ !
అట్లు పెళ్ళాడి రాముని ననుసరించి
ధర్మవర్తనమునుగల దాన నగుచు
ననయమనురాగ నైయుంటి ననుచు వివర
ముగ మునిసతికి జెప్పెను పుడమిపుత్రి !
****************
శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి కృతజ్ఞతలతో
చిత్రాకారులు పొన్నాడ మూర్తిగారికి కృతజ్ఞతలు

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...