నేను వేసిన పై చిత్రానికి చిన్న చిన్న కధలు అల్లి facebook లో మిత్రులు కొందరు పోస్ట్ చేసారు. మీరూ చదవండి.
బొమ్మ కి కధలు :
(1)
గుడి(#గుండె) #గంటలు
ఇష్టంగా పెంచుకున్న తోట,పక్షుల కిలకిలా రావాలు,వీధి చివర గుడిలోంచి వినిపిస్తున్న సుప్రభాతం,కిటికీ లోంచి ముఖాన్ని తాకుతున్న చల్లని సమీరం..లేవగానే ఇలా కిటికీలోంచి రోజూ ఇష్టంగా చూసే దృశ్యాలే ఆరోజు కూడా శాంతమ్మ గారికి.భర్త బ్రిగేడియర్ రాజేంద్రప్రసాద్ శలవులకి వచ్చినప్పుడు ఈ తోటలో సిమెంట్ బెంచీపై కూర్చుని ఇద్దరూ కలిసి కాఫీ తాగుతూ, డికాక్షన్ నుంచి ఢిల్లీ దాకా చెప్పుకున్న కబుర్లు,కొడుకుతో గడిపిన క్షణాలు ఆ కిటికీలోంచి చూస్తూ గుర్తు చేసుకోవడం,మౌనంగా ప్రకృతితో మాట్లాడడం భర్త పదిహేనేళ్ళకే యుద్ధభూమిలో తనను వదిలి అందరాని తీరాలకు వెళ్ళినప్పటినుంచే ఆవిడకి అలవాటు. "అత్తయ్యా, కాఫీ.."అన్న కోడలు దేవి మాటలతో ఇటు తిరిగి,"
దేవీ!అబ్బాయేమైనా
ఫోన్ చేశాడా?"అడిగింది శాంతమ్మ."అత్తయ్యా, ఆయనకి సిగ్నల్స్ లేవేమో. నాన్న చెప్పారు కదా, తప్పకుండా టైంకి వచ్చేస్తాడు
బావ"చెప్పింది దేవి.దేవి శాంతి తమ్ముడి కూతురే.కొడుకు రవిని,దేవిని కూడా ఎంబీబీఎస్ చదివించారు.ఇద్దర్నీ డాక్టర్లు చేయాలని, దేవిని తన కోడలిగా చేసుకోవాలనీ
మొదటి నుంచీ శాంతి కోరిక.తమ్ముడి కుటుంబానికి
కూడా ఇష్టమే.దేవికైతే బావంటే పంచప్రాణాలే.
కానీ, చివరికి ఏదైతే జరగకూడదని అనుకుందో అదే జరిగింది."అమ్మా!నీకోసం మెడిసిన్ చదివినా,నా దృష్టంతా నాన్నలా సైన్యంలో చేరి దేశసేవ చేయాలనే ఉంది. ఈ విషయం నీకూ తెలుసు.కానీ, నాన్న లాగే నా ప్రాణాలకూ ఏదైనా అవుతుందని నీ భయం.అందరికీ అలా అవదమ్మా.నాన్న కోరిక కూడా నేను సైన్యంలో చేయాలనే కదా."
అన్నాడోరోజు
రవి.ఎప్పుడు ఈమాట వినాలో అని భయపడుతూనే ఉన్న శాంతి ఆవేశంతో ఊగిపోయింది."అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోండిరా.కనీసం దేవి గురించి కూడా ఆలోచించవా?నీమీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతోంది."
ఏడుస్తున్న తల్లి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని, "ఈ విషయం మావయ్యతో,దేవితో మాట్లాడానమ్మా.నాకు ఇష్టం లేని పని ఎలా చేయను?దేవికి నాకంటే మంచి భర్త దొరుకుతాడమ్మా.తను చాలా తెలివైన పిల్ల."
రవి అంటుండగానే వచ్చిన దేవి తండ్రి శంకరం,"నీలాగే అదీ మొండిదేరా.నువ్వు సైన్యంలో చేరినా సరే నిన్నే చేసుకుంటానని
పట్టుబట్టి కూర్చుంది."అన్నాడు. దేవి కూడా ధైర్యం చెప్పింది,"అత్తయ్యా,బావని తప్ప ఎవరినీ భర్తగా ఊహించలేను.బావ అప్పుడప్పుడు
వస్తూనే ఉంటాడుగా. నేను కూడా నీ కోడలు కాదు కొడుకునే అంటావుగా.బావ లేనప్పుడు నేను నీ కొడుకై చూసుకుంటాను."
అని ఒప్పించేసరికి
ఇష్టం లేకుండానే పిల్లల ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకుంది శాంతి. ఆ నెలలోనే రవి,దేవిల పెళ్ళి జరగడం రవి ట్రైనింగ్ కి వెళ్ళడం జరిగింది. మూడు నెలల ట్రైనింగ్ అనంతరం కాశ్మీర్ బోర్డర్ లో అపాయింట్ చేశారని చెప్పాడు.దేవి అత్తయ్యతోనే
ఉండడానికి నిర్ణయించుకుంది.
ఆరోజు రవి పుట్టినరోజు.
రవి పుట్టినరోజంటే
ఊరంతా పండుగే.ఆ ఊర్లో వారిదే పెద్ద కుటుంబం అవడంతో ఊరంతటికీ భోజనాలు, బట్టలు పెడతారు.ఘనంగా పుట్టినరోజు
వేడుకలు జరిగిన తర్వాత రవి ప్రయాణమవుతుండగా
దేవి కాస్త దిగులుగా అంది,"కనీసం పుట్టినరోజు
నాడైనా ఇంటికి వస్తే అత్తయ్య సంతోషపడుతుంది"అని."మరి నీకు సంతోషం కాదా
?"అన్నాడు కొంటెగా రవి."పో బావా,నీకన్నీ వేళాకోళమే.బుంగమూతి పెట్టింది దేవి."ఇది మన పెళ్ళయాక నీ మొదటి పుట్టినరోజు.ఈరోజే నీ దేశసేవ మొదలు.నువ్వు మొదటి సారి మమ్మల్ని వదలి దూరంగా..
దేశ సరిహద్దుకు దగ్గరగా వెళ్తున్న ఇదే నీ మొదటి పుట్టినరోజు
మాకు.ఇక్కడి నుంచి ప్రతి పుట్టినరోజుకూ
నీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తాం."అని కంటినీరు దాచుకునే ప్రయత్నం చేస్తూ,ముఖాన్ని రవి గుండెలపై దాచుకుంది దేవి. తర్వాత సంవత్సరం వచ్చినప్పుడు
తనకు మేజర్ గా ప్రమోషన్ వచ్చిందనీ,తన సేవలకు మెచ్చి ప్రభుత్వం ఈ విధంగా సత్కరించిందనీ,తన బాధ్యతలు పెరగడం మూలంగా తరచూ రాలేకపోయినా,మావయ్యకి ఫోన్ చేస్తుంటాననీ
చెప్పాడు.తల్లి శాంతకు ఉత్తరమే వ్రాస్తాడు.తన తండ్రి ఉత్తరాలన్నీ
తల్లి తరచితరచి చదువుకోవడం చాలా సార్లు గమనించాడు రవి.అందుకే ఇంట్లో ఫోన్ కూడా ఉండనివ్వదు శాంతమ్మ.తల్లికి ఇష్టమైనట్లే
ఉత్తరాలే వ్రాస్తాడు.మళ్ళీ తను ఉత్తరం వ్రాసే వరకూ వేయి సార్లు చదువుతుందని
తెలుసు తనకి. ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ తర్వాత ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు రవి రాకకై ఎదురు చూడడమేగానీ తను వచ్చింది లేదు. శాంతమ్మ తమ్ముడు,దేవి ఎప్పటికప్పుడు రవి ఫోన్ లో చెప్పే క్షేమ సమాచారాలు తనకి చెప్తూనే ఉన్నారు. పాకిస్థాన్ తో గొడవల వల్ల కార్గిల్ బోర్డర్ లో ఎప్పుడూ ఏదో ఒక ఆపరేషన్ ఉండడం, ఈమధ్యనే సర్జికల్ స్ట్రైక్స్ వంటి మిషన్లలో చాలా బిజీగా ఉండడంతో ఉత్తరాలు వ్రాయడం కుదరటం లేదని తల్లికి చెప్పమంటుంటాడు.కానీ, దేవి బలవంతం మీద ప్రతి సంవత్సరం రవి పుట్టినరోజు ఎప్పటిలా జరుపుతూ ఉంది శాంతమ్మ. దేవి కొడుకు రవితేజ ను స్కూల్ లో జాయిన్ చేశాక ఖాళీగా లేకుండా ఏదొకటి చేయాలనుకుంది దేవి."రవి అంటే నా కొడుకు, మనవడూ ఇద్దరూ ఒకేసారి పలుకుతారే.."అని తేజ అనే పిలుస్తుంటుంది
శాంతి. దేవి మాత్రం రవి అనే పిలుస్తుంది.ఆ ఊర్లోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్తూ,యువకులకు నీట్ కోచింగ్ ఇవ్వడానికి 'శాంతి నివాసం' అనే సంస్థను ఏర్పాటు చేసింది దేవి.తన కొడుకును డాక్టర్ చేయాలనుకున్న
తన ఆశ తీరకపోయినా,దేవి ద్వారా ఇంతమంది డాక్టర్లను తయారు చేయగలుగుతున్నందుకు కోడలిని మనసులోనే దీవించేది శాంతమ్మ. తను నీట్ కోచింగ్ ఇచ్చేటప్పుడు అత్తగారిచే చిన్న పిల్లలకు దేశభక్తి గీతాలు, కథలు చెప్పిస్తుంది.శాంతి అప్పుడప్పుడు రవికి వ్రాసే ఉత్తరాలు దేవి పోస్ట్ చేస్తుంటుంది. ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ ఈసారి మాత్రం గట్టిగా పట్టు పట్టింది శాంతమ్మ. ఈసారి రవి వస్తేనే పుట్టినరోజు జరుపుతానని మొండికేసింది.కారణం.. తను వెళ్ళాక ఇది రజతోత్సవ పుట్టినరోజు.
అదీగాక కొడుకు, కోడలు పెళ్ళయి కూడా పాతికేళ్ళు.ఈసారి ఖచ్చితంగా రావాలని కాస్త ఘాటుగానే కొడుక్కి లెటర్ వ్రాసింది.
"త్వరగా రెడీ అవండి అత్తయ్యా, ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ వచ్చిన మన పిల్లలకు కూడా సన్మానం ఇవ్వాలని నిర్ణయించాం
కదా.అందరూ వచ్చేస్తుంటారు.ఈలోపు కింద వంటల
sent 11 November at 21:14
"త్వరగా రెడీ అవండి అత్తయ్యా, ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ వచ్చిన మన పిల్లలకు కూడా సన్మానం ఇవ్వాలని నిర్ణయించాం
కదా.అందరూ వచ్చేస్తుంటారు.ఈలోపు కింద వంటల సంగతి ఓసారి చూసి వస్తాను."
గబగబా అంటూ వెళ్ళబోయిన దేవి చేయి పట్టుకుని ఆపి,"నాకు హార్టెటాక్ వచ్చినప్పుడే
రానివాడు ఇప్పుడు వస్తాడంటావా?అడ్డాలనాడు బిడ్డలు గానీ, గడ్డాలనాడు కాదంటారు అందుకే. ఒకవేళ నిన్ను కూడా మోసం చేసి అక్కడే ఏ హిందీ అమ్మాయినో చేసేసుకుని సెటిలైపోలేదు
కదా?"
ఆదుర్దాగా అడిగింది శాంతి.అలా ఏంలేదు అత్తయ్యా. తప్పక వస్తారు. బహుశా ఏదైనా సీక్రెట్ మిషన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదుట.తను వచ్చాక అన్నీ చెప్తాడుగా.ఈలోపు మనం వచ్చిన వారిని నిరాశపరచకుండా
ఎప్పటిలా తన పుట్టినరోజు
రజతోత్సవం ఘనంగా చేయాలి. దేశమాత రక్షణ కోసం పోరాడుతున్న
రవి కోసం మనం ఈమాత్రం చేయలేమా?"
అని ఓదార్చి క్రిందకు వెళ్ళింది."
ఆరోజు ప్రత్యేకంగా
ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా వచ్చి శాంతమ్మగారి గొప్పదనాన్ని,
దేవి కృషిని పొగిడి,శాంతి నివాస్ ద్వారా ఎంపికైన మెడికల్ స్టూడెంట్స్,
డాక్టర్లను సన్మానించారు.
" ఈ బడబాగ్నిని ఎన్నాళ్ళు కడుపులో మోస్తావురా?ఇప్పటికి పాతికేళ్ళుగా
శాంతి గుండె బలహీనంగా ఉందని చెప్పకుండా దాచావు...రవి వెళ్ళిన రెండేళ్ళకే తీవ్రవాదుల దాడిలో చనిపోయిన విషయం.ఇక తన గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. చెప్పేయడం మంచిదేమో."
దేవి తల్లిదండ్రులు
చెప్పారు.
"నాన్నా!అత్తయ్యకి మనం నిజం చెప్తే ఇప్పుడే తన గుండె బద్దలైపోతుంది.కొడుకు మీద కోపం ఉన్నా, దేశసేవలో ఉన్నాడని, క్షేమంగానే ఉన్నాడని భావిస్తోంది.
మనవడు, కోచింగ్ సెంటర్ కి వచ్చే పిల్లల్లో కొడుకును చూసుకుంటోంది.అందుకే తను ఎప్పుడూ బిజీగా ఉండేలా చూసుకుంటున్నాను.బావ ఎలాగూ రాడు.కనీసం మన అత్తయ్యనైనా
కొన్ని రోజులు కాపాడుకుందాం."
అన్న దేవి మాటలకు గట్టిగా హత్తుకుంది తల్లి,"
నీలాంటి కూతుర్ని కన్నందుకు గర్వంగా ఉంది తల్లీ.నీలో ఎంతో బాధను దిగమింగుకుంటూ,అత్తయ్య ఆశను ఎందరో డాక్టర్లను తీర్చి దిద్దడం ద్వారా తీర్చడమేగాక,
రవి ఆశయాన్ని పూర్తి చేయడం కోసం నీ కొడుకును ఆర్మీలో జాయిన్ చేయాలనుకుంటున్నావు.మీవంటి కుటుంబాలే దేశానికి అవసరం. ఓపక్క బాధగా ఉన్నా, నిన్ను చూసి గర్వంగా ఉందిరా" అని కూతురి వద్ద శలవు తీసుకుని వెళ్ళిపోయారు
దేవి తల్లిదండ్రులు.
వాళ్ళు వెళ్ళగానే,దేవి అప్పటిదాకా కళ్ళలో దాచుకున్న బడబాగ్ని ఒక్కసారిగా బయటికొచ్చిన
లావాలా తెల్లారే వరకూ ప్రవహిస్తూనే
ఉంది. ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ తర్వాత రోజు ఉదయం ఎప్పటిలా బెడ్ రూమ్ కిటికీ వద్ద నిల్చుని అభావమైన మొహంతో బయటికి చూస్తూనే ఉంది శాంతి. గుడిగంటలే తన గుండె ఘోషగా భావిస్తూ ఒక స్థిర నిశ్చయంతో మనవడి రూంకి వెళ్లి మనసారా"రవీ!"అని పిలిచింది.ముందు రోజు బాగా ఆడి అలసిపోయాడేమో,మత్తుగా పడుకున్నాడు.తర్వాత కోడలు నిద్ర పోయినట్లు చూసి, తనే కాఫీ కలిపి కోడలికి ఇవ్వాలని వెళ్ళింది. దేవికేం తెలుసు...తన బెడ్రూం లోని అలమరలో దాచిన మిలట్రీ హెడ్ క్వార్టర్స్
నుంచి వచ్చిన దుస్తులు,టోపీ,బ్యాడ్జ్,జాతీయ పతాకం కొడుకువేనని
గుర్తు పట్టినరోజే శాంతి గుండెకు చిల్లు పడి,ఆసుపత్రి పాలైందని.తనగుండె అంత బలహీనమైనదైతే
భర్తతోపాటే పోయేదిగా.అప్పుడు కొడుకు కోసం గుండె దిటవు చేసుకున్నట్లే
ఇరవై మూడేళ్ళ నుంచీ కోడలి కోసం గుండె ఆగకుండా చూసుకుంటోందని
వీళ్ళెవరికీ
తెలీదు. తెలిస్తే దేవి రవి ఆలోచనలతో ఇంకా కుమిలిపోయేది.ఇప్పుడు తనకోసం, కొడుకు కోసం అయినా తీరిక లేకుండా పని చేస్తూ,తనని సంతోషంగా ఉంచుతున్నాననే
తృప్తిలో బ్రతుకుతోంది.
అందుకే తనకెప్పుడో ఈ విషయం తెలుసనే సంగతి ఎవరికీ చెప్పలేదు ప్రకృతికి,గుడిలో దేవుడికీ తప్ప.బహుశా ఎప్పటికీ ఒకరికొకరు చెప్పుకోరేమో.గుడిగంటలు ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి శనివారం కావడంతో.తోటి మనుషులకు మానసికంగా అండగా నిలబడడమే స్వచ్ఛమైన ప్రేమ.తోటివారికిచ్చే
చిన్న చేయూత ఎందరి జీవితాలనో నిలబెడుతుంది.
...................
లక్ష్మీ మురళి
---------------------------------------
అనుశ్రీ కవిత
అత్తంటే అధికారమే కాదు
ఆదరించే ఆప్యాయతకూడా..
మదిలో ఏదో దిగులు తొలుస్తూ
ఆ అనురాగం కలత చెంది
బెంగ నీడన చేరిన వేళ
కోడలే కావాలి కూతురుగా...
అమ్మలాంటి అత్తకు
కూతురంటి కోడలి ఆదరణ
భరోసానిచ్చే ఔషధమై
మనసున దీపమై వెలగాలి..
తరాలలోనే అంతరాలుగానీ
అంతరంగాన అతివ ఆలోచనలన్ని
అమ్మగానే సహనమున్న ధరణిగానే..
ఇరువురి మధ్యా స్నేహం సుమగంధమే.