12, నవంబర్ 2020, గురువారం

గాన సరస్వతి శ్రీమతి పి. సుశీల - pencil sketch



 

My pencil sketch with a reference photo


పాల కడలిపై శేషతల్పమున పవళించేవా దేవా..

బాలుని నను.....
అంటూ....కీ.శే. బాలు గారి స్వరానికి పాఠాలు నేర్పిన స్వరమది.
ఆ మాటకోస్తే....ఆయనే కాదు....కొన్ని దశాబ్ధాలు... ఆవిడ గారి పాటలు ఇంటింటా పాడుకోని...అమ్మాయిలు...అబ్బాయిలు....తెలుగు నేలపై లేరు!
ఈ నాటికీ....పాడుతా తీయగా అంటూ.... పాడే అమ్మాయిలు...
సఖియా వివరించవే....అనో...
మనసే అందాల బృందావనం....అనో..
మదిలో వీణలు మ్రోగే....అంటూనో..
మొదటి రౌండ్ లో వారి పాటలనే ఎంచుకుంటారు మామూలుగా.
ఎందుకంటే...ఆ స్వరం...ఓ బెంచ్ మార్క్.
ఆవిడ గారు తెలుగమ్మాయి గా పుట్టడం....మన అదృష్టం.
ఎన్ని భాషలలో పాడినా మనతెలుగమ్మాయి అని అనుకోవడంలో...ఓ సంతృప్తి ఉంది.
ప్రతి తెలుగమ్మాయి కలలు కనే గళ మాధుర్యం ఆమె సొంతం.
ప్రతిరోజు మన చెవిన పడి....కాసేపు సాంత్వన కలిగించి...గుండెలకు చల్లదనం అందించే....చందన పరిమళం....ఆ దైవదత్తమైన దివ్య స్వరం!
ఆమె పాటలో ఓ జాతి సంస్కారం....సంస్కృతి ఉన్నాయి.
అంతెందుకు....తెలుగు సినీ సంగీతమంతా సుశీల మయం.
దక్షిణా పథమంతా ఏకఛత్రాధిపత్యం గా తన గాన మాధుర్యం తో ఓలలాడించి...గిన్నీస్ కెక్కిన....గాన విధుషీమణి.
***********
ఏంటమ్మాయ్.....పాట వ్రాసుకున్న పేపర్ పోగొట్టుకున్నావా!....పైకి రావలసిన దానివి....ఇప్పుడే ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా!?....నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు కోపంగా అడిగాడు....ఆ అమ్మాయిని.
నా హాండ్ బాగ్ లోనే పెట్టానండి. ఇప్పుడు వెతికితే కనపడటం లేదు....కాస్త జంకుతూనే...భయం భయం గా చెప్తున్న ఆ అమ్మాయిని....దర్శకుడు కె.వి.రెడ్డి...మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల....ఆదుకుని....
సర్లేండి....ఎవరైనా మర్చిపోతారు....దానిదేముంది......అంటూ... ఇంకో కాపీ తెప్పించి....ఆ అమ్మాయితో పాడించారు.
పందొమ్మిదేళ్ళ ఆ అమ్మాయి కది....గొప్ప గుణపాఠమే అయ్యింది. ఇక అప్పటి నుండి....ఏనాడూ....పాట లిరిక్స్ ఉన్న పేపర్ కానీ...పుస్తకం గానీ...మరచిపోయింది లేదు.
ఆ పాటే....అనురాగము విరిసేనా...ఓ రేరాజా....దొంగరాముడు(1955) చిత్రం లోనిది.
***********
వాహినీ స్టూడియోలో ఆ పాట పాడి ఆ అమ్మాయి వెళ్ళాక....ప్రక్కనే...విజయా వారి...మిస్సమ్మ షూటింగ్ జరుగుతోంది.
రికార్డ్ చేసుకున్న పాటను....దుక్కిపాటి & కె.వి.రెడ్డి గార్లు వింటున్నారు....రిలాక్స్ అవుతూ. అప్పుడే అటుగా వచ్చిన ఎల్.వి.ప్రసాద్ & చక్రపాణి గార్లు.....ఆ అమ్మాయి పాడిన ఆ పాటను వింటూ....
అరే...ఏం రెడ్డి గారూ....లతా మంగేష్కర్ పాట వింటున్నారా....సాధనా వారికోసం పాడారటగా లతా....అదేనా ఇది......అంటూ ఆరా తీశారు ఎల్.వి.ప్రసాద్.
ఇది మా సినిమా దొంగ రాముడు కోసం రికార్డ్ చేసింది. పాడింది పి.సుశీల.....అన్నారట.
చాలా బాగుంది వాయిస్. మన పిక్చర్ మిస్సమ్మ లో రెండవ హీరోయిన్ కోసం 2 పాటలు ఈ అమ్మాయి చేత పాడించేద్దాం....అని నిర్ణయించి పాడించిన పాటలే....
మిస్సమ్మ లోని....బాలనురా మదనా & బృందావనమది అందరిది పాటలు.
***********
బాలవినోదం విన్నాము....బాలల్లారా ఈపూట..
చాలిక కథలు..చాలిక మాటలు...చాలిక పాటలు..నాటికలు..
చెంగున రారండి...చెంగు చెంగున పోదాము..
1950లనుండి కొనసాగిన బాలానందం ప్రోగ్రాం రేడియోలో వినని వారుండరు. న్యాపతి రాఘవ రావు(రేడియో అన్నయ్య) గారు రూపొందించిన ఆ ప్రోగ్రాం లో పి.సుశీల గారు కూడా పాడేవారట.
పెండ్యాల గారు 1953 లో కన్నతల్లి అనే మూవీ కై...బృందగానం కోసం 10 మందిని పంపమని రేడియో అన్నయ్యను కోరితే ...పంపిన వారిలో పి.సుశీల గారు ఒకరు!
కొమ్మనే...ముద్దుగుమ్మనే...అనే బృందగానం మొదట బిట్స్ పాడారు. వాయిస్ బాగుంది అనిపించి...
లావొక్కింతయు లేదు...ధైర్యము విలోలంబయ్యే..పద్యం సొలో గా పాడించారు.
ఇంకా బాగున్నట్లనిపించి...ఏకంగా ఏ.ఎం.రాజా తో డ్యూయెట్టే పాడించేశారు!
ఎందుకో....పిలిచావెందుకో.... అనే యుగళం.
***********
ఆ రికార్డింగ్ చేసిన సౌండ్ ఇంజనీర్ నాగరాజన్...ఏ.వి.ఎం.చెట్టియార్ కు ఉప్పందించాడు.
ఒక అద్భుతమైన వాయిస్ అని.
అంతే...విని...ఏ.వి.ఎం.తో కాంట్రాక్ట్ కు ఒప్పుకున్నారు పి.సుశీల గారు.
ఐనా..కేవలం వారికి మాత్రమే పాడాలంటే...ఎన్ని పాటలుంటాయి!
అలా బాధ పడ్తున్న సుశీల గారికి...అన్నపూర్ణా సంస్థ ఆపన్నహస్తమయ్యింది.
ఆ తరువాత...అడపా దడపా పాడుతున్నా....ఎన్నదగ్గ పాటలేం రాలేదు!
1953 లోనే అశ్వత్థామ గారి స్వర రచనలో ప్రక్కింటి అమ్మాయి కోసం పాడినా....అందులో ఎ.ఎం.రాజా గారి పాటలే బాగా హిట్ అయ్యాయి గానీ......పి.సుశీల గారికి అంత ప్రత్యేక గుర్తింపు రాలేదు!
**********
అనురాగము విరిసేనా...ఓ రేరాజా...
తెలిసిందా బాబు..ఇపుడు తెలిసిందా బాబు..
భలేతాత మన బాపూజీ...
బాల గోపాలా...తరంగం
1955లో దొంగరాముడు (అన్నపూర్ణా వారిది) కోసం పాడిన ఈ 4 పాటలు సుశీల గారి గళజీవితానికో మలుపునిచ్చాయి!
1957 లో దుక్కిపాటి మధుసూధన రావు గారే పూనుకుని..ఏ.వి.ఎం.కాంట్రాక్ట్ నుండి తప్పించారట.
అందుకే మాతృసంస్థలుగా అన్నపూర్ణా & విజయా వారిని తలుచుకుంటారు సుశీల గారు.
**********
విజయనగరంలో 5 సంవత్సరాలు..మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ అంతకు ముందే పూర్తి చేసినా...
ఆమె అభిమాన గాయనీమణి లతామంగేష్కర్.
సినిమా పాటలంటేనే ఇష్టం. ఎన్ని కర్ణాటక కచేరీలు చేసినా...మనసంతా సినిమా పాటల మీదే ఉండేది!
విజయనగరంలో ఉన్నప్పుడు....ఘంటసాల వారు రేడియో వినేందుకు ...సుశీల గారి ఇంటికి వచ్చేవారట!
మిస్సమ్మ, మాయాబజార్ లలో పాడాక...ఇక తెలుగు సంగీతమంతా పి.సుశీల మయమైపోయింది.
తేటతేనియలొలికే గళమధురిమ....స్పష్టమైన ఉచ్చారణ...సంగీత సంస్కారం....వెరసి....






తెలుగు వారికి దొరికిన అమృతభాండం..పి.సుశీల గారి గళం! వారి పాట విననిదే ఏ రోజూ గడిచేది కాదు మనకు!
**********
5 దశాబ్ధాలు....షుమారు 40 వేల పాటలు (అన్ని భాషలు కలిపి)...శ్రోతల హృదయాలను...ఆనంద పరవశం లో డోలలాడించారు శ్రీమతి.పి.సుశీల గారు.
పద్మ భూషణ్ కైవసం చేసుకున్నారు. నేషనల్ అవార్డులకు, ఇతరత్రా అవార్డులకు..లెక్క లేదు.
ఇక మిగిలినది ఒక్కటే....ఏకంగా భారత రత్న అవార్డ్ ఇచ్చెయ్యొచ్చు. అన్నివిధాలా అర్హత ఉన్న వీరికి...తప్పక లభించాలి.
సౌత్ ఇండియానే కాదు..నార్త్ భాషలలో సైతం పాడారు. ఇక మన ప్రభుత్వానికి అభ్యంతరమేముందో నాకైతే అర్థం కావడం లేదు!
ఇప్పటివరకు...మళ్ళీ ఎవ్వరికీ అంతటి గళమాధుర్యం లేదంటే అతిశయోక్తి కాదు.
స్వాతిముత్యం మూవీ లో వటపత్రసాయికి...పాటకు నేషనల్ అవార్డ్ వస్తుందని భావించారట. అది కొంచెం బాధించిందని చెప్తారు.
మరొక విఘాతం..శ్రీవారి మరణం. అమెరికాలో హార్ట్ సర్జెరీ అయ్యాక 6 రోజుల తరువాత 1990లో స్వర్గస్తులయ్యారు. ఈ రెండు సంఘటనలు మినహాయిస్తే...తన జీవితం ఎంతో హాయిగా గడిచిందంటారు.
ఆ దైవదత్తమైన స్వరం నా అదృష్టం.
ఈ జన్మకే కాదు...మరో జన్మలో కూడా.....
సంగీతమే ఊపిరిగా ఉండాలని....శ్రీమతి.పి.సుశీల గారు అంటుంటారు.
13 నవంబర్ - శ్రీమతి. పి.సుశీల గారి 85 వ పుట్టిన రోజు. వారి స్వరం వింటూ...పెరిగిన మనకు నిజంగా పండుగ రోజే!

(మంచి వివరాలు అందించిన మిత్రులు డా. ప్రసాద్ కె.వి.ఎస్ గారికి ధన్యవాదాలు)

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

ప్రశ్న. భారతరత్న పి. సుశీల అనటానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటీ?
జవాబు. పి.సుశీల తెలుగమ్మ. అదే కారణం. తెలుగు వాళ్ళకి అడిగే దుమ్ము లేదు. అది మరొక కారణం. అంతే

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...