కాకమ్మ కబుర్లు
***
కాకమ్మ కబుర్లు చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాము, చెబుతూనే ఉన్నాము, అయినప్పటికీ ఎప్పటికీ విసుగు పుట్టించవు.
చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు చేసి పెడుతూ, యీ కాకిని పిలుస్తూ కాకమ్మ కథలు చెబుతూనే మనల్ని పెంచడం వల్ల ముందస్తుగా కాకి తోనే మన జీవ యానం మొదలు అవుతుంది. అసలు యీ పెద్దవాళ్ళంతా లేచేది నిద్రనుండి తెల్లారే కాకుల కూతల తో బాటే. అలాగ పెద్దవాళ్ళకీ, పిల్లలకీ, పిల్ల తల్లులకూ కాకితో అనుబంధం మొదలవుతుంది. పిల్లలు బడికి వెళ్లేసరికి మళ్ళీ, బళ్ళో కూడా కాకమ్మ కధలే చెబుతారు మాష్టార్లు. కథలు పాటలతో సహా చెబుతారు.... కాకి ఒకటి నీళ్ళకొరకు కావు కావు మనుచునూ అంటూ చిన్న నర్సరీ క్లాసుల్లో . కొంచెం పెద్దయ్యాక నక్కా కాకీ కథ, పంచ తంత్రం కాకి కధలూ చెబుతారు పిల్లలకు మాష్టార్లు.
అలాగ బళ్ళో అయితే ఇంటి వద్ద బయట ఏ వడియాలో, అప్పడాలనో ఎండబెట్టి... కాకి ఎత్తుకునిపోకుండా పిల్లల్ని కాపలా పెడతారు తల్లులు, బామ్మలు, అమ్మమ్మలూ. కాకులు చిన్న నేతి గిన్నెలు, చెంచాలు, సబ్బులూ ఎత్తుకుని పోవడం, వాటిని నూతి లో పారెయ్యడం సర్వసామాన్యం వెనకటికి. ఇప్పుడు నూతులు అసలు లేవుగా !!
చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ ఇచ్చిన ఏ బూరెనో, గారెనో, మరో తాయిలాన్నో బైట తింటూ ఉంటే చప్పున, రివ్వు మంటూ ఓ కాకి వచ్చి తన్నుకుని పోవడం, పిల్లలు ఏడుచుకుంటూ అమ్మదగ్గరకు పోవడం చాలా సాధారణ దృశ్యం మా చిన్నప్పట. కాకి తాయిలాన్ని తన్నుకు పోయే సందర్బంగా దాని వాడి ముక్కూ, గోళ్ళు పిల్లల చేతులకు గీరుకొని రక్తం రావడం కూడా జరిగేది. వెంటనే అమ్మ ఆ గాయం కడిగి, మందు పూసి, పిల్లల కంటి నీరు తన పైట చెంగుతో తుడవడం... పిల్లాణ్ణి ఊరుకో బెట్టడం ఎంత కమ్మటి సన్నివేశం !
కాకమ్మ కబుర్లు... 2.
***
పిల్లలు ఒకోసారి వాళ్ళు తినకూడనివి ఏవో ఇమ్మంటారు, లేదా వాళ్ళు తాకకూడనివి ఏవో అడిగితే, పెద్దలు పఠించే మంత్రం "హుష్ కాకీ ". అయ్యో కాకి ఎత్తుకుని పోయిందిరా దాన్ని అంటూ వెనకాల ఎక్కడో దాచేసి, ఖాళీ పిడికిలి విప్పి చూపిస్తే, అల్లరి పెట్టే పిల్లలు శాంతిస్తారు... ఆ హుష్ కాకి మహాత్యం వల్ల.
ఇంటి వెనకాలి ఏ చెట్టుమీదో, ఇంటి ముందు గోడ మీదో పొద్దున్నే కావు, కావు మని కాకి అరుపు వినబడటం ఆలస్యం, ఇంట్లో వంటింట్లో నుంచి బామ్మో, ఆమ్మో అందుకునే వారు... అదిగో కాకి అరుస్తోంది... ఇవాళ ఏమి కబురు వినాలో, ఎవరి ఉత్తరం వస్తుందో అని. ఒకో సారి నిజంగానే ఆరోజు ఉత్తరాలు వచ్చేవి పోస్ట్ మాన్ తేవడం తో.
పిల్లలు ఆడుకుంటూ అదేపనిగా అరుస్తూ, కేకలు వేస్తూఉంటే పెద్దాళ్ళు వాళ్ళని విసుక్కుంటూ ఆపండిరా కాకిగోల అనడం మామూలే. కాకులు ఎక్కడైనా ఆహారం చూచినా, లేదా దాహంగా ఉన్నా కావు, కావు మని అరచి గోల పెడతాయి. ఎక్కడైనా ఒక కాకి చచ్చి పడి ఉంటే, దాన్ని చూచిన ఆ చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ గుమికూడి సామూహికం గా కావు కావు మనే మహా గోల చేస్తాయి. అన్ని కాకులు ఒక చోట చేరి కావు కావు మని అరవడం వాటిలో ఉన్న ఐకమత్యం, సంఘీభావములను తెలియజేస్తాయి.
మన పరిసరాలలోని అపరిశుభ్రమైన వాటిని తినడం ద్వారా కాకులు మనకు ఉపకారమే చేస్తాయి. మన తెలుగు భాషలో కాకికి సముచిత స్థానం ఉంది కాబట్టే కాకిగోల, కాకినలుపు, కాకి దాపరికం, కా కా పట్టడం, కాకితో కబురు పంపడం, శత్రుత్వాన్ని తెలుపుతూ ఆ ఇంటిమీది కాకి యీ ఇంటిమీద వాలదు, కాకి ఎంగిలి, కాకి బంగారం లాంటి మాటలు వాడుకలో ఉన్నాయి. ఎక్కువ కాలం జీవించే వాళ్ళను కాకిలా కలకాలం బతికే వాడు ఆంటారు. ఒక్కడూ ఉంటే వాడు ఏకాకి అని ఆంటారు. పిల్లలు అదేపనిగా తిరుగుతూ ఉంటే ఆగమ్మ కాకిలా తిరగొద్దు అని గదమాయిస్తారు పెద్దలు.
కాకికోకిల అవుతుందా అని కాకి గొంతు మృదువుగా ఉండదు అని సూచిస్తారు. నల్లటి దేహ వర్ణం ఉంటే... కాకి నలుపు ఆంటారు.
శని దేముడి వాహనం యీ కాకే !!
ఇంకా తలమీది జుత్తు అస్తవ్యస్తం గా ఉంటే, అదేమిటీ కాకి గూడులా ఉందీ అని వెక్కిరిస్తారు.
కాకుల్లో బాగా నలుపు ఎక్కువగా ఉండే వాటిని మాల కాకులు ఆంటారు. కొంచెం పెద్దగా ఉండేవాటిని బొంత కాకులు ఆంటారు.
ఇంక మానవజీవితం ముగిశాక చేసే అంత్యక్రియలలో, భారతీయులు... పెద్దలకు పెట్టే పిండప్రదానాలను కాకి ముట్టక పోతే, చనిపోయిన వాళ్ళకు ఏవో కోరికలు తీరకుండా ఉండిపోయాయి అని అనుకోవడం సర్వ సామాన్యం.
కథల్లో కాకి కధలే ఎక్కువ. చిత్రలేఖనం నేర్చుకునే వాళ్ళూ కాకి బొమ్మతోనే మొదలెడతారు అభ్యాసం. కాకులు కోకిల గుడ్లు పొదిగి, పిల్లలను చేయడం ద్వారా పరోపకారాన్నీ ఉద్బోధిస్తాయి.
ఇలాగ కాకమ్మ కబుర్లు ఎన్నెన్నో.... మీకూ తెలుసుకదా !!
కాకమ్మ కబుర్లు... 3.
****
కాకులు మనుషులతో కలసిమెలసి, జనావాసాలకు దగ్గర నివసిస్తాయి. మనం పారేసే ఆహారపదార్ధాలను ఆరగిస్తాయి ఆనందం గా, వీలయితే తన్నుకుపోతాయికూడా మనం ఏమరి ఉంటే. అవి రోజూ క్రమం తప్పక ఒకే ప్రాంతంలో సంచరిస్తాయి ఆహారం కోసం. శాకాహారం, మాంసాహారం రెంటినీ తింటాయి. ఆశుద్ధాలనూ తినేసి మన పరిసరాలు శుభ్రం చేసి మనుషులకు ఉపకారమే చేస్తున్నాయి.
ఇవి వాటి గుడ్లనూ, పిల్లలనూ చాలా జాగ్రత్తగా చూచుకుంటాయి. వాటి గూళ్ళు ఉన్న చెట్లక్రిందుగా ఎవ్వరినీ రానివ్వవు, వేడితే కావు కావు మని అరుస్తుంటాయి, ముక్కుతో, కాలిగోళ్ళతో పొడిచి తరుముతాయి.
ఓ సారి, మా బాబాయిగారు వర్షం, ఎండా లేకపోయినా ఒక గొడుగు వేసుకుని నడుస్తూ వెడుతున్నారు అఫీసు బస్సును అందుకుందుకు. సరే సాయంత్రం ఇంటికి వచ్చాక అదేమిటి మీరు రోజూ గొడుగు వేసుకొని వెడుతున్నారు, ఎండా వానా లేకపోయినా అని నేను నా ధర్మసందేహం అడిగాను. దానికి అయన నవ్వుతూ... కాకి నాయనా కాకి !! అన్నారు. అసలు కథ ఏంటంటే ఆయన అఫీసు త్రోవలో ఓ పెద్ద నేరేడు చెట్టు ఉందిట, దానిమీద ఓ కాకమ్మ గూడు పెట్టింది. గూటిలో గుడ్లూ పెట్టింది. వాటి రక్షణ కోసం ఎవ్వరినీ ఆ దరిదాపుల్లోకి రాకుండా తరిమేస్తోందిట. రోజూ అత్రోవలో వెడుతూ, దాని చేత తన్నించుకునే బాధ తప్పుంచుకుందుకు గొడుగు వేసుకోవడం మార్గంగా ఈయన ఎన్నుకున్నారు. అదీ సంగతి.
మన కవులూ కాకోలూకీయం, పంచతంత్రము వగయిరా కథల్లో కాకమ్మ గూర్చి, నక్కా కాకీ కథలు, ఇలా ఎన్నెన్నో రాసేరు. రామాయణం లో కూడా సీతాఅమ్మవారు, హనుమంతునితో కాకాసురుని కథను, రాముడు దర్భనే బ్రహ్మాస్త్రం గా ప్రయోగించడం, తరువాత దానిని క్షమించి ఒక కన్ను పోగొట్టి ప్రాణాలతో వదలిపెట్టడాన్ని గుర్తుగా రాములవారికి చెప్పమనడం ప్రముఖంగా చెప్పేరు వాల్మీకి మహర్షి.
ఇంక చక్కగా.. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అన్న పాటలో... కాకినైనా కాక పోతినీ అనీ చరణం ఉంది.
పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అన్న నానుడి కూడా ఉంది మన తెలుగులో !ఎద్దు పుండు కాకికి రుచి అని కూడా ఆంటారు. ఆఖరుకు కాకిలేని కథ, పాటా ఉండవు కదా.
3 కామెంట్‌లు:
కాకితో ఒకసారి కబురంపినావని కలలోన నిను చాల కలవరించాను
సముద్రంలో కాకిరెట్ట
ఎద్దు పుండు కాకికి నొప్పా?
పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ?
కాకులు దూరని కీకారణ్యం
కాకితో ఒకసారి కబురంపినావని కలలోన నిను చాల కలవరించాను
సముద్రంలో కాకిరెట్ట
ఎద్దు పుండు కాకికి నొప్పా?
పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ?
కాకులు దూరని కీకారణ్యం
కాకితో ఒకసారి కబురంపినావని కలలోన నిను చాల కలవరించాను
సముద్రంలో కాకిరెట్ట
ఎద్దు పుండు కాకికి నొప్పా?
పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ?
కాకులు దూరని కీకారణ్యం
కామెంట్‌ను పోస్ట్ చేయండి