30, నవంబర్ 2021, మంగళవారం

కథక్ నృత్యకారుడు గోపికృష్ణ - Kathak dancher 'Gopikrishna'


Tribute to legendary kathak dancer 'Gopi Krishna' (1933-1994) -

My pencil sketch.
ప్రముఖ భారతీయ కథక్ నృత్యకారుడు, నటుడు నృత్యకారుడు 'పద్మశ్రీ' గొపీకృష్ణ. (ఆగష్టు 22, 1933 – ఫిబ్రవరి 18, 1994)
(Pencil sketch)
1955 సం. లో ప్రముఖ దర్శక నిర్మార వి. శాంతారామ్ నిర్మించిన 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే' .. ఇది భారతీయ నృత్యం మరియు సినిమా చరిత్రలో ఒక మైలురాయి చిత్రంగా నిలిచింది, ఇందులో ప్రధానపాత్ర పోషించాడు గోపీకృష్ణ. ఈ చిత్రం విజయవంతమైంది మరియు శాస్త్రీయ నృత్యంపై ప్రజల ఆసక్తిని పునరుద్ధరించడానికి సహాయపడింది. ఈ సినిమా గోపీకృష్ణ కి దేశ విదేశాల్లో పేరు తెచ్చిపెట్టింది.
1952 సంవత్సరంలో 17 ఏళ్ళ వయస్సులోనే అతి పిన్న వయస్కుడైన గోపీకృష్ణ 'సాకి' చిత్రంలో మధుబాల నృత్యానికి కోరియోగ్రాఫీ చేసి 'youngest choreographer' గా పేరు తెచ్చుకున్నాడు.
గోపీకృష్ణ సేవలు తెలుగు చిత్రసీమ కూడా వినియోగించుకొని తనను తాను గౌరవించుకున్నది. ముఖ్యంగా 'భక్త జయదేవ' చిత్రంలో రాధా కృష్ణుల నాట్య ఘట్టంలో కృష్ణునిగా నటించి, అలనాటి ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 'భూకైలాస్' లో శివతాండవం నృత్యం చేసి నభూతో నభవిష్యతి అనిపించాడు.
'సాగర సంగమం' చిత్రంలోని "నాదవినోదమం నాట్య విలాసం..." అనే పాటకు నృత్యకర్త ఈయనే. "నాచే మయూరి" హీరోయిన్ సుధా చంద్రన్ కి నాట్య శిక్షణను నేర్పి అమోఘంగా తీర్చిదిద్ది, ఆ చిత్ర విజయానికి ప్రధానకారకుడయ్యాడు. స్వర్ణకమలం సినిమాలో 'ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్ళు' పాటకు అమరత్వం కల్పించారు.
1960, 1970 లలో ఆయన భారత దేశ సరిహద్దు ప్రాంతాలలో "సునీల్ దత్" అజంతా ఆర్ట్స్ ట్రూప్ తో వెళ్ళి సైనికులకు వినోదం కల్పించారు. ఆ తర్వాత ఆయన నటేశ్వర్ భవన్ డాన్స్ అకాడమీ, నటేశ్వర్ కళా మందిర్ లను ప్రారంభించారు
ఆయన నిరంతరాయమ్గా 9 గంటల 20 నిముషాలు కథక్ నృత్యం చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
1975 లో భారత ప్రభుత్వం ఆయనకు విశిష్ట పురస్కారమైన "పద్మశ్రీ"ను అందజేసింది

విశిష్ట ప్రజాదరణ పొందిన తెలుగు చిత్రం 'భూకైలాస్' చిత్రం లో గోపికృష్ణ గారి న్ర్యత్యం బహు ప్రసంసలు పొందింది. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వీక్షించగలరు.

https://www.youtube.com/watch?v=FnGsCzwJyTI



27, నవంబర్ 2021, శనివారం

సంగీత దర్శకుడు సి. రామచంద్ర


 

Tribute to great composer C. Ramachandra (1918-1982) - My pencil sketch

సి. రామచంద్ర గారి గురించి సంక్షిప్తంగా ...

చదువులో వెనకబడి ఎప్పుడూ క్లాసులో 'లాస్ట్' అని చెప్పుకునే చితల్కర్ రామచంద్ర సంగీత ప్రపంచంలో ఒకరుగా అగ్ర స్థానంలో నిలిచారు. వీరు స్వరపరచిన "Aye mere vatan ke logo" లతా మంగేష్కర్ పాడిన ఈ దేశభక్తి పాట చరిత్ర సృష్టించింది.

అనార్కలి, నవరంగ్, స్త్రీ, అల్బెలా, ఆజాద్ .. వంటి హిట్ సినిమాలు సంగీతపరంగా కూడా రికార్డు సృష్టించాయి. ఈ చిత్రాల్లో కొన్ని పాటలు తెలుగు సంగీతకారుల్ని కూడా ప్రభావితం చేసాయి. మరాఠి, తెలుగు, తమిళ్, భోజ్పురి చిత్రాలకు కూడా సంగీతం సమకూర్చారుట రామచంద్ర. వీరు 'చితల్కర్' పేరుతో లతామంగేష్కర్ వంటి అగ్ర గాయణీమణులతో playback పాటలు పాడారు.

ఆజాద్ (తెలుగు అగ్గిరాముడు remake) చిత్రంలో వీరు స్వరపరచిన Na Bole Na Bole re, Dekhoji Bahar aayi పాటల బాణీలు తెలుగులో చింతామణి చిత్రంలో భానుమతి గారు 'రావోయి రావోయి ఓ మాధవా', అనే పల్లవితో, 'పున్నమీ చకోరినోయి' అనే పల్లవితో చాలా చక్కగా పాడారు.

యే జిందగీ ఉసీకి హై జో కిసీకా హోగయా ... హిందీ లో లతా మంగేష్కర్ పాడిన ఈ పాట స్వరపరచారు సి. రామచంద్ర. క్రింది క్లిక్ చేసి వినండి.


ఇంచుమించుగా  ఇదే బాణీ ని తెలుగులో అంజలీ దేవి మీద తెలుగు 'అనార్కలి' చిత్రంలో సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు గారు స్వరపరిచారు. కూడా  ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


ఇంక తెలుగు తమెళ్ చిత్రంలొ వచ్చిన అగ్గిరాముడు చిత్రాన్ని హిందీలో remake చెయ్యదలిచారు ఆ నిర్మాత. దీని వెనుక ఒక కధ ఉంది. ఈ నిర్మాత మొదట హిందీ చిత్రాలలో అగ్ర సంగీత దర్శకుడు నౌషాద్ ని సంప్రదించారట. పాటలు  అర్జెంటుగా ఓ 15 / 20 రోజులలో స్వరపరచగలరా అని అడిగారట.  అలాగైతే కొంచెం పెద్ద మొత్తాన్నే ఇవ్వడనికి సిధ్ధమయాడు సదరు నిర్మాత. అంత తక్కువ వ్యవధిలో స్వరపరచడానికి కుదరదు అన్నారట నౌషాద్. అప్పుడు సి. రామచంద్ర గారిని సంప్రదించమని ఎవరో ఈ నిర్మాత కి సలహా ఇచ్చారుట. ఈ నిర్మాత సి. రామచంద్ర ని సంప్రదించారట. ఈ విషయం ముందుగానే తెలిసిన సి. రామచంద్ర గారు నౌషాద్ గారికి మీరు ఎంత పారితోషకం ఇవ్వ దలుచుకున్నారో అంతే పారితోషకం ఇస్థె మీరనుకున్న కాల వ్యవధి లో పాటలు స్వరపరచగలనని చెప్పారు. పాటలు సూపర్ హిట్ అవతాయని గ్యారంటీ ఇచ్చారట. ఆ షరతుకు ఆ నిర్మాత అంగీకరించడం, 'ఆజాద్' పేరుతో ఆ సినిమా దిలిప్ కుమార్, మీనాకుమారి వంటి అగ్ర తారాగణంతో తెరకెక్కింది.     సినిమా, అందులో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఈ విషయం ప్రఖ్యాత విశ్లేషకుడు, నటుడు, అంత్యాక్షరి సృష్టికర్త అయిన  అన్ను కపూర్ తన The Golden Era with Annu Kapoor కార్యక్రమంలో తెలియజేశారు.  That is C. Ramachandra, the great composer  !!

నన్నునేలినాడితడు నరసింహుడు అన్నిటానుజాణడు ప్రహాద నార సింహుడు - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన

వివరణ- డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం- శ్రీ Pvr Murty garu

సీ॥
శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర! - సాధురక్షణ! శంఖచక్ర హస్త!
ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల! - పల్లవారుణపాదపద్మయుగళ
తే. చారుశ్రీచందనాగరుచర్చితాంగ! - కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర !
(శ్రీ నారసింహ శతకం నుండి)

🔹అన్నమయ్య కీర్తన👇🏿
నన్నునేలినాడితడు నరసింహుడు
అన్నిటానుజాణడు ప్రహాద నార
సింహుడు
నగవులవాడుగదె నరసింహుడు
వెగటులేనివాడు వీరనరసింహుడు
నగముపైనున్నవాడు నరసింహుడు
అగపడెమనకు ప్రహ్లాదనరసింహుడు
ననవిలుతునితండ్రి నరసింహుడు
కనక్పుకాశవాడు గజనరసింహుడు
ననుపు పొందులు సేసే నరసింహుడు
అనిశము బాయడు ప్రహ్లాద
నరసింహుడు
నాతో సరసమాడీ నరసింహుడు నా
చేతికి ఉంగరమిచ్చె శ్రీ నరసింహుడు
ఏతుల శ్రీవేంకటాద్రినిదే అహోబలమున
అతుమలో ( ఆత్మలో) బాయడు ప్రహ్లాదనరసింహుడు!
~~~~~~~~~~~~~~~

శ్రీమన్నారాయణుని దశావతారాలలో
నాల్గవ అవతారమైన నరసింహస్వామికి అనేక విశేషణాలతో పేర్లున్నాయి. వాటిలో నవనారసింహులు ప్రసిద్ధమైనవి. అవి
1. ఉగ్ర నారసింహుడు
2. కృద్ధ నారసింహుడు
3. వీర నారసింహుడు
4. విలంబ నారసింహుడు
5. కోప నారసింహుడు
6. యోగ నారసింహుడు
7. అఘోర నారసింహుడు
8. సుదర్శన నారసింహుడు
9. శ్రీలక్ష్మీ నారసింహుడు
నరసింహ క్షేత్రాలలో అహోబిలం , కదిరి, సింగరకొండ, మంగళ గిరి, యాదగిరి గుట్ట, సింహాచలం వంటి ప్రసిద్ధక్షేత్రాలనేకం.
ఇన్ని అవతారాలెత్తిన ఆ శ్రీ హరే కలియుగంలో సప్త గిరులపై వెలసిన శ్రీ వేంకటపతి!
ఈ సంగతి స్మరిస్తూ వ్రాసిన అన్నమయ్య కీర్తన విశేషాలు చూద్దాం.
*కీర్తన భావం
************
‘నన్నేలే ఈ వేంకటపతి ఆ నారసింహుడే. అన్నిటిలో నేర్పరి ఈ ప్రహ్లాద నారసింహుడు’అని అన్నమయ్య నారసింహుని స్తుతిస్తూ రచించిన కీర్తన ఇది.
హ్లాదానికి పైమెట్టు ప్రహ్లాదం. అంటే చెప్పలేనంత ఆనందాన్నిచ్చేవాడు. ఈ ఆనందం అభౌతికం. ఈ ఆనందం అనిర్వచనీయం. ఈ ఆనందం అనుభవైక వేద్యము. పసితనంలోనే హరినామ స్మరణ తో అంతటి ఆనందం పొందిన భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాద చరిత్ర మనకందరికీ తెలిసినదే! పోతన గారి భాగవతంలో అత్యంత రమణీయమైన ఘట్టం. ప్రతి పద్యమూ మందార మకరందమే.
~~~~
*నగవులవాడు గదే నారసింహుడు. ప్రహ్లాదుని వంటి భక్తులను చిరునగవులతో మురిపిస్తే ,హిరణ్యకశిపుని వంటి అసురులను వికటాట్టహాసంతో దడిపించినవాడు ఆ పంచాస్యాననుడు.
ఎన్ని సార్లు విన్నా ఆ నృసింహస్వామి చరిత్ర , మహిమ వెగటు కలిగించవు. మరీ మరీ లోతుగా తెలుసుకోవాలని
పిస్తుంది. అలాగే ఆయనది నరశార్దూల రూపమైనా కన్నార్పక చూడాలనే అనిపిస్తుంది। వెగటు తోచదు।
*నగముపై నున్నవాడు నరసింహుడు…..
సాధారణంగా నరసింహ స్వామి ఆలయాలన్నీ కొండమీదనో , కొండ బిలంలోనో ఉంటాయి। హిరణ్య కశిపుని వధానంతరం ఆ ఉగ్రత్వం తగ్గేవరకు ఆయన కొండలలో తిరగడం, చెంచులక్ష్మిగ అమ్మవారు ఆయనకు దగ్గరై శాంతింపజేయడం మనమెరిగినదే.
*ననవులుతుని తండ్రి నారసింహుడు
దుష్టుల విషయంలో నరసింహుడేగానీ సౌందర్యానికి మారుపేరయిన మన్మధుని( ననవిలుతుని) తండ్రి ఈ స్వామి!
ఈ నారసింహుడు ననపు పొందులు చేయగలవాడు. అంటే …కోపం తగ్గి శాంతించిన తరువాత ఆయన అనురాగ మూర్తి !
నమ్మిన వారిని ఎల్లప్పుడు విడువక కాపాడే దయామయుడు!
అందుకే ఆదిశంకరులు •••••
‘సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్’ అంటూ నృసింహ స్తోత్రం చేసారు .ఆయన చేయూత తో
ఎంతటి ఆపదనైనా దాటవచ్చు.
*అన్నమయ్య మధుర భక్తి తత్పరుడు.
కాసేపు తానే చెంచితగా ఊహించుకొని తనకు ఆయన సరసుడై ఉంగరమిచ్చినట్లు మురిసిపోయాడు.
ఈ వేంకటాద్రిపైన , ఆ అహో బిలంలో నే కాదు తన ఆత్మ( అతుమ) లోనూ ఎన్నడూ తనను వీడక నిలిచి ఉన్నాడని నమ్మికతో మొక్కుతున్నాడు అన్నమయ్య!
నరసింహావతారం గొప్పదనం ధర్మరాజుకు చెబుతూ నారదుడిలా అన్నాడు.
ఉ॥

శ్రీ రమణీయమైన నరసిం
హ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడై
న నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచా
రత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము
గల్గని లోకము జెందు భూవరా!

స్వస్తి🙏
~~<~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల
May be an illustration

 

20, నవంబర్ 2021, శనివారం

నేపధ్య గాయకుడుగా 60 సంవత్సారాలు పూర్తిచేసుకున్న జేసుదాస్ - అభినందనలు


Greetings to Jesudas, one of the most celebrated playback singers of India, on completing 60 years of playback singing on 14th Nov. 2021

సంగీతానికి సంబంధించిన చర్చల్లో భాగంగా ప్రముఖ సంగీత స్వరకర్త MB శ్రీనివాసన్ కేరళ వచ్చారు. అప్పుడు యువ గాయకుడు జేసుదాస్ అవకాశం కోసం అతనిని సంప్రదించాడు ...ఆ యువకుడు బహుదరి రాగంలో ‘బ్రోవభారమా రఘురామా’ ఆలపించాడు. అతని ప్రతిభకు MBS అవాక్కయారు. అయితే అక్కడితో ఆగకుండా షణ్ముఘప్రియ రాగంలో మరో కర్ణాటక సంగీతాన్ని ఆలపించారు. ఈ ప్రఖ్యాత స్వరకర్త నోరు మెదపలేదు... దీని తరువాత, MBS ఆ వ్యక్తికి శ్రీ నారాయణ గురు వ్రాసిన నాలుగు లైన్లు ‘కాల్పడుకల్’ సినిమా కోసం పాడే అవకాశం కల్పించారు. ఈ పాట భరణి స్టూడియో లో రికార్డ్ చేయబడింది ....
కేరళీయులు తొలిసారిగా నవంబర్ 14, 1961 న ఆయన మధురమైన గాత్రాన్ని ‘కల్ప్పడుకల్’ సినిమాలోని ‘జాతిభేదం మతద్వేషం ఎతుమిల్లతే సర్వరుమ్’ పాట ద్వారా విన్నారు. అప్పటి నుండి జేసుదాస్ కేరళీయులకు అత్యంత అభిమాన గాయకుడయ్యాడు. ఇంక జేసుదాస్ కి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వీరికి దక్షినాదిన ఎంత పేరుందో హిందీ చలనచిత్ర పరిశ్రమలోనూ అంతే పేరుంది. Chotisi Baat, Chithchor వంటి సినిమాల్లో పాటలు ever green గా నిలిచాయి. అగ్రశ్రేణి సంగీత దర్శకులైన సలీల్ చౌదరి, ఖయ్యాం, బప్పిలహరి వంటి స్వరపరచిన పాటలు పాడి శెభాష్ అనిపించుకున్నారు. ప్రముఖ నటులైన అమితాబ్ బచ్చన్, అమొల్ పాలేకర్, జీతేంద్ర కి playback పాటలు పాడారు. పద్మశ్రీ, పద్మభూషణ్, ;అద్మవిభూషణ్ వంటి ప్రతిష్తాత్మక జాతీయ పురస్కారలతోపాటు ఎనిమిదిసార్లు Best Playback Singer awards అందుకున్నారు.

ఇంకఁ బాయరావు సుమ్మీ యీ సంగాతాలు కంకణ దారాలాయఁ గడు సంగాతాలు - అన్నమయ్య కీర్తన


 

వారం వారం అన్నమయ్య
(॥పల్లవి॥)
ఇంకఁ బాయరావు సుమ్మీ యీ సంగాతాలు
కంకణ దారాలాయఁ గడు సంగాతాలు
(॥ఇంక॥)
చల్లలమ్మేవారితోడి సంగాతాలు
చల్లుఁజెలమలవూట సంగాతాలు
జల్లెడలోపోఁకలు మాసంగాతాలు
యెల్లవారు నెఱిఁగిరి యీసంగాతాలు
(॥ఇంక॥)
జంగిలిగొపికలసంగాతాలు నీకు
సంగడి బండికండ్లాయ సంగాతాలు
సంగతాయ పొరుగిండ్లసంగాతాలు
యెంగిలిపోత్తులతోడియీసంగాతాలు
(॥ఇంక॥)
సరిబేసులాయ మనసంగాతాలు
సరుగ మరవరానిసంగాతాలు
యిరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నిరతిఁ గూడఁగఁజేసె నీనాసంగాతాలు
ఇదొక జానపద కీర్తన. అన్నమయ్య ఏమి ఊహించి ఈ కీర్తన రాశాడో మనం చెప్పలేం ఆంటారు ప్రముఖ గాయకులు డా. బాలకృష్ణప్రసాద్ గారు. 'ఇంక బాయరావు' అంటే ఇంక విడదీయరానిది అని అర్ధం. సంగాతాలు అంటే స్నేహం, బంధం అని అర్ధం చెప్పుకోవచ్చు. (మేము చాలా సంవత్సరాలు ఒడిస్సా లో ఉన్నాము. ఒడియా భాషలో 'సంగొ' అంటే స్నేహితుడు అని అర్ధం. ఈ కీర్తన చదవగానే నాకు అదే భావం స్ఫురించింది.

డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు ఈ కీర్తనని బహు చక్కగా విశ్లేషించారు. ఆమె విశ్లేషణ చాలా వివరణాత్మకంగా ఉంది. ఆమె వివరణ ఇక్కడ యధాతధంగా పొందుపరుస్తున్నాను.
గోపికలు తమకూ , కృష్ణునికీ మధ్యగల చెలిమిని గురించి ఇలా అంటున్నారు.
చాలా దారాలు కలిపి చేతికి తోరం కట్టినట్లున్న మన గట్టి స్నేహబంధం ఎన్నటికీ తెగిపోదు।గోపికలతో స్నేహం నీటి చెలమ జల్లులాగా హాయిగా ఉంటుంది.
జల్లెడలో పోకలు ( వక్కలు)జారనట్లు మా స్నేహబంధాలు జారవు।
గోపికల బృందంతో స్నేహాలు ప్రేమ అనే బండికి చక్రాలు!
ఈ ఎంగిలి పొత్తులు , స్నేహాలు ఇరుగు పొరుగుకు మాట్లాడుకునే సంగతులు!
ఈ స్నేహాలు సరి నుండి బేసికి పెరిగేవే గానీ తరగనివి.తోరాలు 5,7,9,11 ఇలా బేసి పోగులు పోయడం మనకు తెలుసు। సరి భాగింప బడుతుంది। బేసి పటిష్టమైనదని అర్థం.
అలమేలు మంగను వేంకట పతిని స్థిరముగ మనమంతా కలిసి ప్రస్తుతింప జేసేది నీ నా స్నేహమే.
గోపికలు ధనుర్మాసంలో కలిసి వ్రతాలు , పూజలు, యాత్రలు చేయడం లోనూ స్నేహమే ప్రథాన పాత్ర వహిస్తున్నది!
——-
జంగిలి- మంద
సంగడి- స్నేహము
సంగాతము- స్నేహము
పోకలు- వక్కలు
బండికండ్లు- చక్రాలు



17, నవంబర్ 2021, బుధవారం

వి. శాంతారాం - భారతీయ చలనచిత్ర దిగ్గజం

(My pencil sketch of V. Santaram, Doyen of Indian cinema)


డా వి.శాంతారామ్‌ 
మహారాష్ట లోని కొల్హాపూర్కు సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించాడు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించాడు. సుమారు 90 సినిమాలు నిర్మించాడు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించాడు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచాడు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్త్రీ, అమర్‌ భూపాలీ, డా కోట్నిస్‌కీ అమర్‌ కహానీ మొ. సినిమాలు శాంతారామ్‌ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్‌, గీత్‌ గాయా పత్థరోంనే, ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే మొ. చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించాడు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను వ్రాసుకున్నాడు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ,  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్తాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే, పద్మవిభూషణ్ పురస్కారాలు వీరిని వరించాయి.   అంతేకాక నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందిన ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించాడు. ( వికీపీడియా ఆధారంగా)



 

16, నవంబర్ 2021, మంగళవారం

టంగుటూరి ప్రకాశం పంతులు



My pencil sketch of Tanguturi Prakasam Pantulu garu.


నేను వేసిన చిత్రాలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. కొన్ని నా  దృష్టికి  వస్తున్నాయి. కొన్ని రావడం లేదు. అంతా సోషల్ మీడియా మహిమ.  ఈ క్రిందన నా బొమ్మకి జతపరచి సోషల్ మీడియా లో విహారం చేస్తున్న ఓ  పోస్ట్ ఇది. అంశం బాగుందని నా బ్లాగులో షేర్ చేసుకుంటున్నాను. మీరూ చదవండి.

పుస్తకం అమ్మేశాడు

🚩🚩

***👉🏿ఒక వీధిబడిలో మాష్టారు తెలుగుపాఠం చెబుతున్నారు! ***

ఒక పిల్లాడు లేచి సార్ ఈడికి నిన్న ఇచ్చిన పుస్తకం అమ్మేశాడు అని

*** ఒక అబ్బాయిని చూపుతూ చెప్పేడు.దానికి మాష్టర్ ఏమిరా వెధవా నిజమేనా అని అడిగితే నిజమే అని చెప్పేడు ఆకుర్రాడు.***

*** ఏమిరా వెధవా ! నీకెలా అని గద్దించగా నేను మొత్తం చదవేశానండీ ఆ పుస్తకాన్ని అన్నాడు ఆ పిల్లాడు.***

*** దానికి కోపంతో మాష్టర్ బడుద్దాయ్ నాకే అబద్దం చెబుతావా అయితే చెప్పు 8 వ పేజీలో ఏముంది అనగా ,మొత్తం గడగడా చెప్పేశాడాబ్బాయి. ఆశ్చర్యపోయిన మాష్టర్ వివిధ పేజీలలో ఏముందో అడిగేడు.***

అన్నింటిని చెప్పేడు ఆ కుర్రాడు. చివరకి 48 వ పేజీలో ఏముందో చెప్పమనగా , అసలు ఆ పుస్తకంలో 48 వ పేజీ లేదు కదసార్ అన్నాడు

***. దానితో మాష్టర్ ఆనందభాష్ఫాలు రాలుస్తుా నాయనా నువ్వు చాలా గొప్పవాడివవుతావురా అని దగ్గరకు తీసుకొని దీవించాడు. ఆ దీవెనలు ఊరకే పోలేదు. ఆ అబ్బాయి గొప్ప బారిష్టర్ అయినాడు. ***

***రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా అయినాడు అతని పేరే తెలుగువారు గర్వంగా #ఆంథ్రకేసరి అని పిలుచుకొనే ***

#టంగుటూరి ప్రకాశం పంతులు గారు.

14, నవంబర్ 2021, ఆదివారం

ఆంజనేయ అనిలజ హనుమంతా నీ రంజకపు చేతలు సురలకెంత వశమా - అన్నమయ్య కీర్తన


 

కీర్తన : ఆంజనేయ అనిలజ హనుమంతా...

విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా
——————————-
విశ్లేషణ
~~~~~~~
ఓం నమో వేంకటేశాయ 🙏
ప్రార్థన 👇🏿
మ॥
నిజగర్భస్థిత శైవతేజము సమున్నిద్రాత్మతేజంబు గూ
డ జగత్ప్రాణుఁడమోఘ కేసరివనాటక్షేత్రమందర్థినిం
చజయశ్రీ మహిమాప్తి నయ్యు భయతేజంబుల్ రహిన్ మిశ్రమై
త్రిజగంబుల్ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్ మారుతీ!
(మారుతీ శతకము)
---------------------------------
పదకవితా పితామహుడు అన్నమయ్య ఈ కీర్తనలో పవన తనయుడు, వజ్రకాయుడు, రుద్రతేజుడు, మహా బలవంతుడు, చిరంజీవి, అన్నిటికీ మించి రామభక్తుడు అయిన ఆంజనేయుని కీర్తిస్తున్నాడు।
పల్లవిలో …
“హనుమంతా! నీరంజకపు చేతలగురించి వర్ణించడం ఆ దేవతలకు కూడ అసాధ్యం!”అంటూ హనుమంతుడు చేసిన లంకాదహనం తలుచుకొని పొంగిపోయాడు. రంజకము అంటే అగ్ని. అగ్నినేత్రుడైన రుద్రుని తేజమే ఆంజనేయునిగా రామావతార సమయంలో భూమిపై అవతరించింది. రుద్రాంశ సంభూతుడిని నిప్పేం చేయగలదు! వాళ్ళ (లంకలోని రాక్షసులు) నిప్పుతో వాళ్ళ నగరమే దగ్ధంచేసాడు!
హనుమంతుడు చిరంజీవి . ద్వాపరయుగంలో పాండవులకూ ఆయన మేలు చేయడం ప్రస్తావిస్తూ ‘తేరిమీద నీరూపు తెచ్చిపెట్టి …..’అంటూ “అర్జునుడు నిన్ను తన రథకేతనంపై నిలుపుకొని అర్జునుడు కౌరవులను రణరంగంలో గెలిచాడు”అని విజయాన్ని కలిగించే మహాశక్తి సంపన్నునిగా కీర్తించాడు.
అశ్వమేధ యాగం తలపెట్టిన ధర్మరాజు భీముడిని పురుషామృగం తెమ్మని ఆదేశించాడు. పురుషామృగం అంటే సగం మనిషి సగం జంతువుగా ఉన్న భయంకరాకారంగల జంతువు। అది తేవడానికి భీముడు వెళుతున్నప్పుడు అతడికి రక్షగా హనుమ తన రోమాలను ఇచ్చాడు. కీర్తనలో ప్రస్తావించిన ఈ విషయం హనుమంతుడిశక్తి ఆయన దేహంలోని అణువణువునా చివరకు రోమములలోకూడ వ్యాపించి ఉందని తెలియచేస్తోంది।
త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికీ మారుతికి ఉన్న అనుబంధం అజరామరం !
“స్వామీ పవన కుమారా! నీ వలననే గదా రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడింది! నీ వలనననేగదా తన ఇల్లాలైన సీతను రావణుని చెరనుండి రక్షించి తిరిగి తాను పొందగలిగాడు!”అని ఆ సంఘటనలన్నీ గుర్తుచేసుకున్నాడు అన్నమయ్య తరవాత చరణంలో!
శ్రీమద్రామాయణంలో కనబడే అనేకబంధాలలో మైత్రి మాటొస్తే రామసుగ్రీవులను చెబుతాం. సుగ్రీవ మైత్రి అనే నానుడికూడ ఉంది.
వారిద్దరికీ స్నేహం కుదిర్చిన వాడు హనుమంతుడే. మంచి స్నేహితుడిని చూపడం కంటే మేలైన విషయం ఏముంటుంది?

మహా బలశాలి వాలి తన సోదరుడు సుగ్రీవుణ్ణి అపార్థం చేసుకొని అతణ్ణి చంపడానికి వెంటపడితే పోయి ఋష్యమూకంలో తలదాచుకున్నాడు. తన భార్యను వాలి తీసుకుపోతే నిస్సహాయుడై దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు రాముడి మైత్రి హనుమ వలన దొరికింది. తరవాత కథంతా మీకు తెలిసిందే. వాలిని శ్రీరాముడు సంహరించి సుగ్రీవుడిని కపిరాజును చేసాడు. సీతమ్మ జాడ కనుక్కొని , వారథి నిర్మాణం జరిపి, రామరావణ యుద్ధంలో రామునికి తానూ తన వానరసేన తోడుగా నిలబడి ఆ ఋణం తీర్చుకున్నాడు సుగ్రీవుడు।

ఆ మహాసంగ్రామంలో హనుమ పాత్ర ఎంత ముఖ్యమైనది! ఎంతమంది రాక్షసులను సంహరించాడు? ఎంత పరాక్రమం ప్రదర్శించాడు! తలుచుకుంటే “హనుమే లేకపోతే సీతారాముల పునస్సమాగమం కుదిరేదా!” అనిపిస్తుంది!
“ఇప్పుడు ఈ కలియుగంలో ఆ వేంకటపతి సన్నిధిన మంగాంబుధిలో కొలువై ఆ వేంకటేశ్వరుని దర్శింపవచ్చే భక్తులను అనుగ్రహిస్తున్నాడు।”అని అన్నమయ్య ఆ ఆంజనేయస్వామిని కీర్తిస్తుంటే మనం ఆదృశ్యాలను మనోయవనికపై చూస్తూ పరవశించి పోతాం!
మహాబలాయ వీరాయ చిరంజీవిన్ నమోస్తుతే
హారిణే వజ్రదేహాయ ఉల్లంఘిత మహాబ్థయే!
స్వస్తి
~~~~~~~~~~~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...