ఈ వారం అన్నమయ్య కీర్తన
వివరణ- డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం- శ్రీ Pvr Murty garu
సీ॥
శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర! - సాధురక్షణ! శంఖచక్ర హస్త!
ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల! - పల్లవారుణపాదపద్మయుగళ
తే. చారుశ్రీచందనాగరుచర్చితాంగ! - కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర !
(శ్రీ నారసింహ శతకం నుండి)
అన్నమయ్య కీర్తన
నన్నునేలినాడితడు నరసింహుడు
అన్నిటానుజాణడు ప్రహాద నార
సింహుడు
నగవులవాడుగదె నరసింహుడు
వెగటులేనివాడు వీరనరసింహుడు
నగముపైనున్నవాడు నరసింహుడు
అగపడెమనకు ప్రహ్లాదనరసింహుడు
ననవిలుతునితండ్రి నరసింహుడు
కనక్పుకాశవాడు గజనరసింహుడు
ననుపు పొందులు సేసే నరసింహుడు
అనిశము బాయడు ప్రహ్లాద
నరసింహుడు
నాతో సరసమాడీ నరసింహుడు నా
చేతికి ఉంగరమిచ్చె శ్రీ నరసింహుడు
ఏతుల శ్రీవేంకటాద్రినిదే అహోబలమున
అతుమలో ( ఆత్మలో) బాయడు ప్రహ్లాదనరసింహుడు!
~~~~~~~~~~~~~~~
శ్రీమన్నారాయణుని దశావతారాలలో
నాల్గవ అవతారమైన నరసింహస్వామికి అనేక విశేషణాలతో పేర్లున్నాయి. వాటిలో నవనారసింహులు ప్రసిద్ధమైనవి. అవి
1. ఉగ్ర నారసింహుడు
2. కృద్ధ నారసింహుడు
3. వీర నారసింహుడు
4. విలంబ నారసింహుడు
5. కోప నారసింహుడు
6. యోగ నారసింహుడు
7. అఘోర నారసింహుడు
8. సుదర్శన నారసింహుడు
9. శ్రీలక్ష్మీ నారసింహుడు
నరసింహ క్షేత్రాలలో అహోబిలం , కదిరి, సింగరకొండ, మంగళ గిరి, యాదగిరి గుట్ట, సింహాచలం వంటి ప్రసిద్ధక్షేత్రాలనేకం.
ఇన్ని అవతారాలెత్తిన ఆ శ్రీ హరే కలియుగంలో సప్త గిరులపై వెలసిన శ్రీ వేంకటపతి!
ఈ సంగతి స్మరిస్తూ వ్రాసిన అన్నమయ్య కీర్తన విశేషాలు చూద్దాం.
*కీర్తన భావం
************
‘నన్నేలే ఈ వేంకటపతి ఆ నారసింహుడే. అన్నిటిలో నేర్పరి ఈ ప్రహ్లాద నారసింహుడు’అని అన్నమయ్య నారసింహుని స్తుతిస్తూ రచించిన కీర్తన ఇది.
హ్లాదానికి పైమెట్టు ప్రహ్లాదం. అంటే చెప్పలేనంత ఆనందాన్నిచ్చేవాడు. ఈ ఆనందం అభౌతికం. ఈ ఆనందం అనిర్వచనీయం. ఈ ఆనందం అనుభవైక వేద్యము. పసితనంలోనే హరినామ స్మరణ తో అంతటి ఆనందం పొందిన భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాద చరిత్ర మనకందరికీ తెలిసినదే! పోతన గారి భాగవతంలో అత్యంత రమణీయమైన ఘట్టం. ప్రతి పద్యమూ మందార మకరందమే.
~~~~
*నగవులవాడు గదే నారసింహుడు. ప్రహ్లాదుని వంటి భక్తులను చిరునగవులతో మురిపిస్తే ,హిరణ్యకశిపుని వంటి అసురులను వికటాట్టహాసంతో దడిపించినవాడు ఆ పంచాస్యాననుడు.
ఎన్ని సార్లు విన్నా ఆ నృసింహస్వామి చరిత్ర , మహిమ వెగటు కలిగించవు. మరీ మరీ లోతుగా తెలుసుకోవాలని
పిస్తుంది. అలాగే ఆయనది నరశార్దూల రూపమైనా కన్నార్పక చూడాలనే అనిపిస్తుంది। వెగటు తోచదు।
*నగముపై నున్నవాడు నరసింహుడు…..
సాధారణంగా నరసింహ స్వామి ఆలయాలన్నీ కొండమీదనో , కొండ బిలంలోనో ఉంటాయి। హిరణ్య కశిపుని వధానంతరం ఆ ఉగ్రత్వం తగ్గేవరకు ఆయన కొండలలో తిరగడం, చెంచులక్ష్మిగ అమ్మవారు ఆయనకు దగ్గరై శాంతింపజేయడం మనమెరిగినదే.
*ననవులుతుని తండ్రి నారసింహుడు
దుష్టుల విషయంలో నరసింహుడేగానీ సౌందర్యానికి మారుపేరయిన మన్మధుని( ననవిలుతుని) తండ్రి ఈ స్వామి!
ఈ నారసింహుడు ననపు పొందులు చేయగలవాడు. అంటే …కోపం తగ్గి శాంతించిన తరువాత ఆయన అనురాగ మూర్తి !
నమ్మిన వారిని ఎల్లప్పుడు విడువక కాపాడే దయామయుడు!
అందుకే ఆదిశంకరులు •••••
‘సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్’ అంటూ నృసింహ స్తోత్రం చేసారు .ఆయన చేయూత తో
ఎంతటి ఆపదనైనా దాటవచ్చు.
*అన్నమయ్య మధుర భక్తి తత్పరుడు.
కాసేపు తానే చెంచితగా ఊహించుకొని తనకు ఆయన సరసుడై ఉంగరమిచ్చినట్లు మురిసిపోయాడు.
ఈ వేంకటాద్రిపైన , ఆ అహో బిలంలో నే కాదు తన ఆత్మ( అతుమ) లోనూ ఎన్నడూ తనను వీడక నిలిచి ఉన్నాడని నమ్మికతో మొక్కుతున్నాడు అన్నమయ్య!
నరసింహావతారం గొప్పదనం ధర్మరాజుకు చెబుతూ నారదుడిలా అన్నాడు.
ఉ॥
శ్రీ రమణీయమైన నరసిం
హ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడై
న నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచా
రత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము
గల్గని లోకము జెందు భూవరా!
స్వస్తి
~~<~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి