20, నవంబర్ 2021, శనివారం

ఇంకఁ బాయరావు సుమ్మీ యీ సంగాతాలు కంకణ దారాలాయఁ గడు సంగాతాలు - అన్నమయ్య కీర్తన


 

వారం వారం అన్నమయ్య
(॥పల్లవి॥)
ఇంకఁ బాయరావు సుమ్మీ యీ సంగాతాలు
కంకణ దారాలాయఁ గడు సంగాతాలు
(॥ఇంక॥)
చల్లలమ్మేవారితోడి సంగాతాలు
చల్లుఁజెలమలవూట సంగాతాలు
జల్లెడలోపోఁకలు మాసంగాతాలు
యెల్లవారు నెఱిఁగిరి యీసంగాతాలు
(॥ఇంక॥)
జంగిలిగొపికలసంగాతాలు నీకు
సంగడి బండికండ్లాయ సంగాతాలు
సంగతాయ పొరుగిండ్లసంగాతాలు
యెంగిలిపోత్తులతోడియీసంగాతాలు
(॥ఇంక॥)
సరిబేసులాయ మనసంగాతాలు
సరుగ మరవరానిసంగాతాలు
యిరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నిరతిఁ గూడఁగఁజేసె నీనాసంగాతాలు
ఇదొక జానపద కీర్తన. అన్నమయ్య ఏమి ఊహించి ఈ కీర్తన రాశాడో మనం చెప్పలేం ఆంటారు ప్రముఖ గాయకులు డా. బాలకృష్ణప్రసాద్ గారు. 'ఇంక బాయరావు' అంటే ఇంక విడదీయరానిది అని అర్ధం. సంగాతాలు అంటే స్నేహం, బంధం అని అర్ధం చెప్పుకోవచ్చు. (మేము చాలా సంవత్సరాలు ఒడిస్సా లో ఉన్నాము. ఒడియా భాషలో 'సంగొ' అంటే స్నేహితుడు అని అర్ధం. ఈ కీర్తన చదవగానే నాకు అదే భావం స్ఫురించింది.

డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు ఈ కీర్తనని బహు చక్కగా విశ్లేషించారు. ఆమె విశ్లేషణ చాలా వివరణాత్మకంగా ఉంది. ఆమె వివరణ ఇక్కడ యధాతధంగా పొందుపరుస్తున్నాను.
గోపికలు తమకూ , కృష్ణునికీ మధ్యగల చెలిమిని గురించి ఇలా అంటున్నారు.
చాలా దారాలు కలిపి చేతికి తోరం కట్టినట్లున్న మన గట్టి స్నేహబంధం ఎన్నటికీ తెగిపోదు।గోపికలతో స్నేహం నీటి చెలమ జల్లులాగా హాయిగా ఉంటుంది.
జల్లెడలో పోకలు ( వక్కలు)జారనట్లు మా స్నేహబంధాలు జారవు।
గోపికల బృందంతో స్నేహాలు ప్రేమ అనే బండికి చక్రాలు!
ఈ ఎంగిలి పొత్తులు , స్నేహాలు ఇరుగు పొరుగుకు మాట్లాడుకునే సంగతులు!
ఈ స్నేహాలు సరి నుండి బేసికి పెరిగేవే గానీ తరగనివి.తోరాలు 5,7,9,11 ఇలా బేసి పోగులు పోయడం మనకు తెలుసు। సరి భాగింప బడుతుంది। బేసి పటిష్టమైనదని అర్థం.
అలమేలు మంగను వేంకట పతిని స్థిరముగ మనమంతా కలిసి ప్రస్తుతింప జేసేది నీ నా స్నేహమే.
గోపికలు ధనుర్మాసంలో కలిసి వ్రతాలు , పూజలు, యాత్రలు చేయడం లోనూ స్నేహమే ప్రథాన పాత్ర వహిస్తున్నది!
——-
జంగిలి- మంద
సంగడి- స్నేహము
సంగాతము- స్నేహము
పోకలు- వక్కలు
బండికండ్లు- చక్రాలు



కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...