19, సెప్టెంబర్ 2022, సోమవారం

గురుతెరిగిన దొంగ కూగూగు వీడె | గురిలోనె దాగీనీ కూగూగు || - అన్నమయ్య కీర్తన


 

బొమ్మలు ః పొన్నాడ మూర్తి (బాపు బొమ్మలకు నకళ్ళు)


గురుతెరిగిన దొంగ కూగూగు వీడె | గురిలోనె దాగీనీ కూగూగు ||

|| నెలతల దోచీనీ నీళ్ళాడగానే | కొలని దరిని దొంగ కూగూగు |
బలువైన పుట్ల పాలారగించీనీ | కొలది మీరిన దొంగ కూగూగు ||

|| చల్లలమ్మగ చనుకట్టు దొడకీని | గొల్లెతలను దొంగ కూగూగు |
యిల్లిల్లు దప్పక ఇందరి పాలిండ్లు | కొల్లలాడిన దొంగ కూగూగు ||

|| తావుకొన్న దొంగ దగిలి పట్టుడిదె | గోవులలో దొంగ కూగూగు |
శ్రీ వేంకటగిరి చెలువుడో యేమో | కోవిదుడగు దొంగ కూగూగు ||

జానపదుల కోనం వారిశైలికనుగుణంగా వారి భాషవాడుతూ అన్నమాచార్యులవారు అసంఖ్యాకమైన కీర్తనలు చెప్పారు. ఆ మాటలు నేటి మన'ఆంగ్ల తెలుగు” మాత్రమే వచ్చిన మనలాంటి వారికి అర్ధంకావేమో.
వాడుకలో లేని కత్తి తుప్పు పట్టినట్లు 600 ఏళ్ళలో కొన్ని మాటలు నిఘంటువుల్లో కూడా కనుమరుగయిపోయాయి. 'కూగాగు అంటే సరియైన అర్ధం ఏమిటి? భాషమీద పట్టువున్న నా (సుబ్రహ్మణ్య దీక్షితులు గారి ) మిత్రులొకరి సూచనమేరకు కన్నడంలో 'కూగాగు' తెలుగులో 'దోబూచి గా అర్ధం చెప్పవచ్చు.

“గుఱుతెఱిగిన దొంగ అంటే జగత్‌ ప్రసిద్ధమైన చోరుడు అని అర్ధం
చెప్పుకోవచ్చు. వీడు జగత్‌ ప్రసిద్ధమైన దొంగ'దోబూచి. అంతేకాక ఈయన భక్తుల గుఱి లోనె (లక్ష్యములోనే) దాగియుందే కూగూగు (దోబూచి).
కొలనులో స్నానం చేద్దామని స్త్రీ లు నీళ్ళలో దిగగానే వాళ్ళ బట్టలను
యెత్తుకొనిపోయిన దొంగ కూగూగు ఇతడే. పెద్ద 'ఉట్లలో ఎత్తుగా కట్టిన పాలుకూడ తెలివిగా కాజేసిన అపరిమితమైన దొంగ కూగూగు ఇతదే. (మన తెలివితేటలు ఆయన చాకచక్యం ముందు పనిచేస్తాయా? ఎంత వెర్రివాళ్ళం మనం!!)
చల్లలమ్ముకోవటానికి గొల్లభామలు నెత్తిన చల్లకుండలు పెట్టుకొని నడుస్తుంటే
చనుకట్టు చలిస్తుండగా వాళ్ళవెంటబడి ఏడిపించే వాడే ఈ దొంగ కూగూగు.
వీరూవారని గాక రేపల్లెలో ప్రతి గోపిక స్తనవైభవాపహరణ ఈ దొంగ కూగూగే
గావించాడు. (ఎంత అదృష్టవంతులో!! సాక్షాత్తూ దేవతాస్రీలంతా, ఆ పురుషోత్తముని ప్రార్ధించి, వరముగా పొంది, గోపికలవలె జన్మించి ఆ సౌభాగ్యాన్ని పొందారట. అదికదా! జన్మ అంటే)
ఈ మహనుభావుడు (నేడు తిరుమలలో) నెలకొనిన దొంగ. ప్రయత్నించి
పట్టుకోండి (మీ తరమా?) గోవిందా అనండి. ఎందుకంటే ఈయన గోవులతో
సంచరించే దొంగ కూగూగు. శ్రీ వేంకటగిరి మీద స్థిరపడిన సుందరాకారుడో
ఏమో? అట్లా అయితే మాత్రం ఈ దొంగ కూగూగు జ్ఞానేశ్వరుడే. సందేహం లేదు.

భావం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

సేకరణ : గాన మాధురి - facebook group నుండి.

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...