24, సెప్టెంబర్ 2022, శనివారం

మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి

 


'మహామహోపాధ్యాయ' వైణికుడు ఈమని శంకరశాస్త్రి -



నా చిత్ర నివాళి

(వివరాలు WhatsApp ద్వారా సేకరణ.. అందించిన అజ్ఞాత వ్యక్తికి నా ధన్యవాదాలు)
ఆయన వేళ్లలో ఏదో తెలియని అమృతగుణం ఉంది
ఆయన ఆలోచనలో ఏదో తెలియని కొత్తదనం ఉంది
ఆయన వీణలో సాక్షాత్తు సరస్వతి కొలువై ఉంది
ఆయన వీణకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు
వీణ మీద సాంఘిక అంశాలను సైతం పలికించారు
వీణను అందరికీ చేరువ చేశారు...
ఆయనే మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి.
వీణానాదం శుభానికి ప్రతీక. వాస్తవానికి వీణ ప్రకాశించవలసినంతగా తెలుగునాడులో ప్రకాశించలేదనే చెప్పాలి. అటువంటి వీణకు అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లి, వీణానాదానికి వైభవాన్ని తీసుకువచ్చిన మహనీయుడు ఈమని శంకరశాస్త్రి. వీణ ధ్వని స్థాయి తక్కువగా ఉంటుంది. అందువల్ల... వేయి మంది కూర్చున్న సభలో, దూరంలో కూర్చున్నవారు వీణావాదం వినలేకపోయేవారు. ఆ కారణంగా వీణ కచేరీలకు శ్రోతలు అనుకున్న స్థాయిలో హాజరయ్యేవారు కాదు. వీణకు సరయిన ఆదరణ లేకపోవడం వల్ల, వీణను అభ్యసించేవారి సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఈ రెండు కారణాల వల్ల వీణానాదనకు క్షీణదశ ఏర్పడింది. మైకులు అందుబాటులోకి వచ్చాక ఈ ధ్వనిని అందరూ ఇంపుగా వినగలుగుతున్నారు. సంగీత ముత్తుస్వామి దీక్షితార్ వీణ వాయించేవారని ప్రసిద్ధి. మహామహులెందరో వీణానాదం చేశారు. అయితే వారు మాత్రమే కీర్తిని సంపాదించుకున్నారు కాని, వీణకు ఘనత తీసుకురాలేకపోయారు. పరమశివుడు వీణ వాయించాడని ప్రతీతి. అటువంటి వీణకు ప్రఖ్యాతి తెచ్చినవారు ఈమని శంకరశాస్త్రి. శివుడే మళ్లీ జన్మించాడనో, మరే కారణమో కాని, ఆయనకు శంకరశాస్త్రి అని పేరు సార్థకం అయింది. మిగతా వాద్యపరికరాలతో సమానంగా వీణకు స్థాయి తీసుకువచ్చారు శాస్త్రిగారు.
1922, సెప్టెంబరు 23న, తూర్పుగోదావరి జిల్లా దాక్షారామంలో జన్మించిన శాస్త్రిగారు, వారి తండ్రిగారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. వీణానాదంలో అతి సున్నితంగాను, అతి గంభీరంగాను... రెండువిధాలుగానూ ఆయన వీణానాదం ఉంటుంది. వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. లలితసంగీతం, శాస్త్రీయ సంగీతం... రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిగారిదే. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకునిగా నిలబడగలగటానికి కారణం ఆయనలోని ఆధునికతే. ఆ తరవాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించారు.
సంగీతబ్రహ్మ త్యాగ్యం తన చివరి రోజులలో ‘మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు’ అనే కీర్తన పాడేవారని చరిత్ర చెబుతోంది. యాదృచ్చికమో ఏమో కాని, శాస్త్రిగారు గుంటూరులో చేసిన ఆఖరి కచేరీలో కూడా ఇదే కీర్తన వాయించారు. ఇక తన వీణానాదాన్ని అమరలోకంలో దేవతలకు వినిపించాలనుకున్నారో ఏమో 1986, డిసెంబరు 23న వీణాగానం చేస్తూ నారదునితో సంచారం చేయడం ప్రారంభించారు.



కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...