4, డిసెంబర్ 2022, ఆదివారం

దాచుకో నీపాదాలకు దగ నే జేసినపూజ లివి - అన్నమయ్య కీర్తన


 ఈ వారం అన్నమయ్య కీర్తన : దాచుకో నీ పాదాలకు దగ నే జేసిన పూజ లివి.

దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా
..
వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన - దాచి వుండనీ
వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా
..
నానాలికపైనుండి - నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను -బొగడించితివి
వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా
..
యీమాట గర్వము గాదు - నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను - నేరము లెంచకుమీ
శ్రీమాధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా
అర్ధములు : పూచి : పూని, కీరితిరూపపుష్పములు = కీర్తి రూపముననున్న పూలు, వేనామాల వెన్నుడా = సహస్రరూపములగల విష్ణుడా, చేముంచి = పనిబూని, నేమానన్ = నియమముతో
--------------------------------------------------------------------------
భావం సౌజన్యం : "సాహిత్యశిరోమణి' సుముద్రాల లక్ష్మణయ్య
దేవా! నేను రచించిన ఈ సంకీర్తనలు నీ చరణములకు తగురీతిగా పూని నేనొర్చిన పూజలే. ఇవి నీ యశోరూపములైన కుసుమములు. కాన భద్రముగా దాచుకొనుము.
వేలకొలదిగా నున్న ఈ పాటలలో అన్ని విధముల అనుకూలమై మమ్ము కాపాడుటకు ఒక్కపాటయే చాలు. మిగిలినవెల్లా భాండాగారములో దాచి ఉండనిమ్ము. నీ నామము దుర్లభము. దాని వెల తక్కువ. కాని దాని ఫలము మిక్కిలి దొడ్డది. ఆ నామ సంకీర్తన ప్రభావముచేతనే నాకు దిక్కై నన్ను నీవు రక్షించితివి. ఇక నీ నామ సంకీర్తనలే నాకు తరిగిపోని సంపదలయ్యా..!
అందుకని పూని నా నాలుకపై నిలిచి పెక్కు సంకీర్తనలతో నాచే నిన్ను స్తుతింపజేసితివి. వేయి నామములుగల విష్ణుదేవా నిన్ను స్తుతింప నేనెంతవాడను? నీవే నాపై దయతలచి కానిమ్మని నాకీ పుణ్యము అంటగట్టితివి. ఇంతే.
నేనీమాట గర్వముతో పలుకుటలేదు. నీ మహిమనే నేనిట్లు నుతించితిని కాని పనిబూని నా స్వాతంత్ర్యమును నేను చెప్పుకొనలేదు. నియమము తప్పక నిన్ను నిత్యము గానము చేయుచున్నాను. నాలోని తప్పులెంచకు. శ్రీమాధవా! నీవు శ్రీవేంకటేశ్వరుడవు. నేను నీ దాసుడనయ్యా..!

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...