30, డిసెంబర్ 2022, శుక్రవారం

వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ - అన్నమయ్య కీర్తన


 ఈ వారం అన్నమయ్య కీర్తన - వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||

ప|| వీడివో యిదె వింతదొంగ | వేడిపాలు వెన్న వెరజినదొంగ ||
చ|| వెలయ నీట జోప్పువేసేటి దొంగ | తలగాననీక దాగుదొంగ |
తలకక నేలదవ్వేటిదొంగ | తెలిసి సందెకాడ దిరిగేటి దొంగ ||
చ|| అడుగుకింద లోకమడచేటి దొంగ | అడరి తల్లికినైన నలుగుదొంగ |
అడవిలో నెలవైయున్న దొంగ | తొడరి నీలికాసెతో నుండుదొంగ ||
చ|| మోస మింతుల జేయుమునిముచ్చుదొంగ | రాసికెక్కినగుఱ్ఱంపుదొంగ |
వేసాల కిటు వచ్చి వెంకటగిరిమీద | మూసినముత్యమై ముదమందుదొంగ ||


భావం :
అన్నమయ్య ఈ కీర్తనలో పరమాత్ముణ్ణి దొంగగా అభివర్ణిస్తాడు. ఇందులో అవతారాలన్నీ దాగి ఉన్నాయి.గమనించండి.
ఎదుట ఉన్న వ్యక్తిని నిర్దేశించడంలో వీడెవో అనే పదబంధం అన్నమయ్య ఎక్కువగా వాడుతుంటాడు. వేంకటాచలంలో మన కళ్ల కెదురుగా కనబడుతున్న వీడే వింత దొంగ. ఈ వేంకటేశుడే కృష్ణావతారంలో వేడిపాలు, వెన్న కొల్లగొట్టిన దొంగ.
ఈ వేంకటేశుడే ప్రకాశిస్తూ మత్స్యావతారంలో నీటిలో తేలియాడు లేదా మార్గాలు వెదకు దొంగ. కూర్మావతారంలో తల కనబడకుండా దాక్కున్న దొంగ.. (తలదాచుకునేది తాబేలు) చలించక వరహావతారంలో భూమిని తన కోరతో తవ్విన దొంగ. తెలిసి తెలిసి నరసింహావతారంలో సంధ్యాకాలంలో (పగలుకాని, రాత్రికాని) తిరిగిన దొంగ.
ఈ వేంకటేశుడే వామనావతారంలో తన అడుగు కింద లోకాన్నంతటిని అణచిన దొంగ అతిశయించి (అడరి) పరశురామావతారంలో తండ్రి మాట పాటించటం కోసం తల్లిపై కోపించి, ఆమెను సంహరించిన దొంగ. రామావతారంలో అడవిని తన స్థానముగా (నెలవు) చేసుకున్న దొంగ. అనుకరించి (తొడరి) బలరామావతారంలో నల్లటి కుచ్చెళ్ళు పోసిన ధోవతి కట్టిన దొంగ.
ఈ వేంకటేశుడే బుధ్ధావతారంలో త్రిపురాసుర కాంతలను మోసము చేసిన కపట సన్యాసి రూపంలో దొంగ. (ముని ముచ్చుదొంగ) కల్క్యావతారంలో ప్రసిధ్ధి చెందిన (రాసికెక్కు) గుర్రాన్ని ఎక్కి, పాపాత్ములను శిక్షీంచు దొంగ.
ఇన్ని రకాల వేషాలు వేసి – ఇలా వచ్చి వేంకటాచలం మీద తెలిసియు తెలియనట్లు నటించే వానిగాా (మూసిన ముత్యం) తాను ఆనందంగా ఉంటూ, మనందరిని ఆనందంతో ఉంచే దొంగ.
భావం సౌజన్యం : డా. తాడేపల్లి పతంజలి గారు,
చిత్రం : పొన్నాడ మూర్తి

3

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...