వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. యడవల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నటనలోను, పద్యపఠనంలోనూ మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. వీరిలాగా పాడాలని చాలామంది నటులు, నటీమణులు ఆరాటపడేవారు. పద్యంలోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది. ఆనాడు ఈయనకు ఈనాటి సినిమా తారలకున్నంత అభిమానులు ఉండేవారు. ఈయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టి మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ఒకే రాత్రి రెండు పట్టణాలలో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు ధరించిన రోజులు ఉన్నాయి. ఈయన నాటకానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. మైలవరం కంపెనీ మూతపడిన తర్వాత కిరాయి నాటకాలలో నటించారు.
ఈయన స్వరంతో వెలువడినన్ని గ్రామఫోన్ రికార్డులు ఆ రోజుల్లో ఏ నటుడు ఇవ్వలేదు. ఈ రికార్డులు ఆ రోజుల్లో కొన్ని వేలు అమ్ముడుపోయాయి. పెళ్ళిళ్లలోనూ, ఇతర శుభకార్యాలలోనూ కపిలవాయి రికార్డులనే విరివిగా పెట్టేవారు. ఇవి తమిళనాడు, మైసూర్ రాష్ట్రాలలో కూడా ప్రజాదరణపొందాయి. అతి తక్కువకాలంలో ఆంధ్రదేశమంతటా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు చేతులా సంపాదించాడు కానీ, సంపాదనంతా దురభ్యాసాలకు ఖర్చు చేశాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి