6, అక్టోబర్ 2023, శుక్రవారం

పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా - అన్నమయ్య కీర్తన


పుట్టినమొదలు నేను పుణ్యమేమి గాననైతి
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా
చరణం 1
కామినుల జూచి చూచి కన్నుల గొంతపాపము
వేమరు నిందలు విని వీనుల గొంతపాపము
నామువార గల్లలాడి నాలిక గొంతపాపము
గోమున పాపము మేన గుప్పలాయ నివిగో

చరణం 2
కానిచోట్లకు నేగి కాగిళ్ళ గొంతపాపము
సేవ దానాలందుకొని చేతుల గొంతపాపము
మాననికోపమే పెంచి మతి గొంతపాపము
పూని పాపములే నాలో బోగులాయ నివిగో

చరణం 3
చేసినట్టి వాడగాన చెప్ప నీకు జోటులేదు
దాసుడ నేనైతి గొన దయతలచితివయ్య
యీసరవులెల్ల జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయబోయ బనులు

తాత్పర్యం :
మానవుడిగా ఈ భూమిమీద పుట్టిన రోజునుండి ఇంతవరకు నేను చేసిన మంచిపనులేమైనా ఉన్నాయా? ఏ మంచిపనులూ చేసెరగని నన్ను ఎలా కాడతేరుస్తావో?

వలపుతో సంబంధంలేకుండ కనబడినవారినెల్ల కామముతో చూసి కన్నులతో కొంత పాపము చేశాను. లోలోపలున్న చెడ్డవాణ్ణి(pervert) తృప్తి పరిచేందుకు చేరకూడని వారితో చేరి వినకూడని మాటలు విని చెవ్వులతో కొంత పాపము చేశాను. నోటిలో ఆవిరెండిపోయేంతవరకు అబద్ధమూ, దుర్భాషణమూ ఆడి నాలుకతో కొంతపాపము చేశాను. ఉన్నదెల్లా లెక్కలేని పాపములతో నింపుకున్న కాయము తప్ప మరోకటి లేదు!

వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి చేరకూడనివారిని కూడి భుజాంతరాల్లో కొంతపాపమంటించుకున్నాను. ఒళ్ళు వంచి పని చేయకపోవడమే కాదు నా పనులనుకూడా నౌకర్లతో చేయించుకుని చేతులకు మట్టంటకుండ చూసుకొని పాపమంటించాను. ఎల్లవేళలా అంతులేని కోపంతో రగిలే మతితో విహరించి మనసుకి పాపమంటించాను. ఇలా పాపుములు నాలో పూని మేనంతా పోగులైయున్నది.

ఎంతవాడైనాగానీ తాను చేసిన అన్ని తప్పులూ తానంతట తాను చెప్పుకోలేడు; దాచేస్తాడు. నేనూ అంతే! ఇన్ని పాపములు చేసినవాడిని నేనే; అన్నీ చెప్పలేకున్నాను. నీకు తెలుసు నేను పాపిని అని. నిన్ను శరణని దాస్యం వేడి వచ్చినరోజు నన్ను క్షమించ దయతలచుకున్నావు! ఇంతటి దయాళుత్వముగల నిన్ను నేను ఏమని నుతించగలనో? నా ప్రియాతి ప్రియమైన శ్రీవెంకటేశా, ప్రపంచంలోని అన్ని క్రియలూ నివలన జరుగునవే!

భావం : Courtesy శ్రీ అవినేని భాస్కర్
చిత్రం : పొన్నాడ మూర్తి

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...