29, జూన్ 2024, శనివారం

తెలగాణ్య అగ్రగణ్య తేజము - పీవీ నరసింహారావు


 నా చిత్రానికి మిత్రుడు పొన్నాడ మురళి గారి భావ వ్యక్తీకరణ

తెలగాణ్య అగ్రగణ్య తేజము, రాజ్య పూజ్యము పీవీ

ఇల నిలిచి గెలిచిన పలు ప్రజ్ఞల పండిత ప్రతిభా జీవి !!


శిల నుండి చెక్కిన సుందర శిల్పమోలే ఖ్యాతి గాంచినావు

పలుభాషలనవలీలగ నేర్చి విశ్వమున ఘనతనొందినావు !!


విలువల రాజకీయము సల్పి మేలు పదవులెన్నో చేపట్టినావు

మలుపుల కుటిల మర్మముల కౌటిల్య కౌశలము చూపినావు !!


తలవని తలపున తలుపు తట్టిన అత్యున్నత పదవి

కలి కష్ట కాలమున చేపట్టి, హస్తిన నేలిన జగజ్జెట్టీవీవు !!


మలి సంధ్యన భరత భువినేలి మేటి పాలనందించినావు

పలు విధముల విపణి వీధుల తెరిచి విత్త విస్తరణ చేసినావు !!


అలుపెరుగక శ్రమ సలిపి ఆర్ధిక పరిపుష్టి చేకూర్చినావు

నేల నలు చెరగుల మన ఖ్యాతినినుమడింపజేసినావు !!


కలనైనా ఇల మరువదు నిను...ఓ మాన్య ధన్య చిరంజీవి

మేలిమి బంగరు వన్నెల మేటి, పాములపర్తి వెంకట నరసింహ ఠీవి !!

25, జూన్ 2024, మంగళవారం

ఏకాంత సమారాధన - కవిత



Ammu Bammidi కవితకి నా చిత్రం. సమ్మతించిన అమ్ముకి ధన్యవాదాలు. శుభాశీస్సులు


ఏకాంత సమారాధన

( కృష్ణార్పణం ; శుభోదయం)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


గాలి తరంగాలకెంత ఇష్టమో..!

నీ చూపును భుజాలపై మోసుకుని

నేరుగా నా కళ్ళలోకి చేర్చాలని!!


ఎన్నాళ్ల తర్వాతో ఆ కలయిక!

వసంతంలా ఒక్క ఉదుటున 

ఆ చూపు నన్నల్లుకోగానే..

మనసు పువ్వై విరబూస్తుంది..!


ఊపిరి ఎన్ని సార్లు ప్రవహించిందో..

ఇరు మనసుల మధ్య వారధి కట్టాలని!!


పరస్పర యోగక్షేమాల పలకరింపుల్లో

గుండె అంచును 

ఎన్నిసార్లు తాకిందో సంతోషం.!


ఒకే కొమ్మకు రెండు లతలల్లుకున్నట్టు

ఒకే రేఖపై ఇరు చూపులూ ఏకమై 

అప్రమేయంగా పలికిన మౌనరాగం

ఒక్క క్షణమే అయినా..

ఆజన్మాంతం సరిపడా ప్రణయకావ్యమేగా!!


చిమ్మచీకట్లో దారి చూపే

నక్షత్రాల వెలుగు.. ఆ చూపు..!

కష్టాల చీకట్లో తోడు నిలిచే 

కిరణఖడ్గం ఆ చూపు!


రోజూ వేలాది కృత్రిమ నవ్వుల 

పలకరింపుల కన్నా..

నీ కంటి చూపుతో జరిపే

ఏకాంత సమారాధన ఒక్కటి చాలుకదా

నా ఉనికి తెలపడానికి..!!


- ఎస్. అమ్మూ బమ్మిడి



https://www.facebook.com/share/p/8mKi2q4LBz4ETYLC/?mibextid=oFDknk


20, జూన్ 2024, గురువారం

శ్రమ జీవన సౌందర్యం


నా charcoal pencil sketch చిత్రానికి Facebook లో ఓ  మిత్రుని స్పందన


సామాజిక సమస్యల మీద, శ్రమైకజీవన సౌందర్యం మీద గతంలోనూ చాలా మంది చిత్రకారులు బొమ్మలు వేశారు. తెలంగాణ సాయుధపోరాటం మీద చిత్తప్రసాద్ చరిత్రలో నిలిచే చిత్రాలు గీసాడు. యం.ఎఫ్. హుస్సేన్ చిత్రాలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఏ సమాజంలో ప్రజల తమ మీద జరిగే అన్యాయాలు, అక్రమాలు. దోపీడి చెప్పలేని అశక్తతతో మౌనం దాల్చుతారో ఆ మౌనాన్ని బద్దలుచేసే బాధ్యతను కవులు,  గాయకులు,చిత్రకారులు, కళాకారులు భుజాన్నేసుకొంటారు. చైతన్యపరిచే గేయాలు, కథలు, నాటికలతో కవులు,రచయితలు, ఆలోచనలను రేకేత్తించే భావస్పోరక చిత్రాలతో చిత్రకారులు ముందుకు వస్తారు. కళ కళ కోసం కాదు దానికి సామాజీక ప్రయోజనం ఉందని భావించే వారి సృజనాత్మకత సాధారణ కళలకు భిన్నంగా ఉంటుంది. 


       ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని భావించే కవులు, కళాకారులే తమ కళను దీక్షగా సాధన చేస్తారు, మరింత మెరుగుపర్చుకొని అద్భుతాలు సృష్టస్తారు.


    మూర్తి గారు! మీ బొమ్మలు మీ గురించి చెబుతున్నాయి. తన గురించి తాను కాదు తన కళతో మాట్లాడించేవాడు ఉత్తమ కళాకారుడు

17, జూన్ 2024, సోమవారం

నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹ -- గజల్


Pvr Murty  బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం...


నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹

మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే  ౹౹


ఆలోచన అంతులేని కథలెన్నో చెప్పునులే

మనజీవితమొక కథగా మార్చనివ్వు ఇలాగే ౹౹


చేయివదలి వెళ్ళకయా చేయూతవు నీవేగా

మమకారం నీ స్పర్శన పలుకనివ్వు ఇలాగే ౹౹


అనురాగపు ఆ చూపులు దాటవేయలేనులే

నీ కన్నుల కనులుకలిపి చూడనివ్వు ఇలాగే ౹౹


బంధాలే వదలినంత బలముకోలిపోములే

మనజంటే ఆదర్శం సాగనివ్వు ఇలాగే ౹౹


మరుపురాని జ్ఞాపకాలు మధురమైన తోరణాలు

అనుభూతుల నెమరవేత చిలకనివ్వు ఇలాగే ౹౹


చెమరింతలు ఎందుకులే అలుక వీడినానులే

నీ హృదయపు నీడలోన దాగనివ్వు ఇలాగే ౹౹


... వాణి కొరటమద్ది

9, జూన్ 2024, ఆదివారం

సన్నాయి పాట - కధ


 PVR మూర్తి గారి బొమ్మకు కథ.


శీర్షిక: " సన్నాయి పాట" కథ, రచన : భవాని కుమారి బెల్లంకొండ


సుబ్బారాయుడు భార్య రాజమ్మ తో కలిసి రెండో కొడుకు అచ్యుత పెళ్ళిచూపులకని బయల్దేరాడు. సుబ్బారాయుడు స్వశక్తి తో పైకి వచ్చిన మనిషి. ఆయనకు ముగ్గురు పిల్లలు , ముగ్గురిలోకి పెద్దయిన సరోజకి ఐదెకరాల పొలం కట్నం గా ఇచ్చి పెళ్ళిచేసాడు. రెండోవాడు జోగారావు. ఎక్కువ కష్టపడకుండా పైకి రావాలని, డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుండేవాడు. అందుకే అతని అందం చూసి మోహపడి చేసుకోవాలని మోజుపడిన వనజని పెళ్లి చేసుకొని , ఇల్లరికం పోయాడు. వనజ డిమాండ్ మీద ఐదెకరాలు పెద్ద కొడుక్కి రాసిచ్చాడు సుబ్బారాయుడు. . రాజమ్మ కొడుకు పరాయి వాడైపోయాడని భాధ పడటం చూసి నవ్వేవాడు సుబ్బారాయుడు. 

" ఇవ్వాళ్ళ, రేపు ఎవరుంటున్నారే కన్నోళ్ల దగ్గిర, చదువుకున్న వాళ్ళు అంతే, వ్యవసాయం చేసుకొనే వాడైనా ఇంతే,రేపు అచ్యుత అయినా మన దగ్గిర ఉంటాడా ఏమిటీ ?పెళ్లి కాగానే వేరుపడడా ఏమిటి" అంటూ భార్యని ఓదార్చేవాడు సుబ్బారాయుడు.

తండ్రి అలా మాట్లాడినప్పుడల్లా అచ్యుత తమాషాగా నవ్వి " అబ్బా నీ పెంపకం మీద నీకెంత నమ్మకం నాన్నా" అనేవాడు. 

ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత కాడెత్తుకున్నాడు అచ్యుత. మిగిలిన పదెకరాల భాద్యత నెత్తికెత్తుకున్నాడు. వయసుమీద పడుతున్న సుబ్బారాయుడులో రోజు, రోజుకీ శక్తి సన్నగిల్లుతోంది. పల్లెనుడి పట్నం వలసపోయిన కూలిచేసే వాడినైనా పెళ్లిచేసుకోవటానికి అమ్మాయిలూ సిద్దపడుతున్నారుగానీ, అచ్యుత్ లాంటి యువరైతులకి మ్యాచెస్ రావటం కష్టమవుతుంది రోజు, రోజుకి. సుబ్బారాయుడుకి ఇదే చింత. పట్నానికి పాతిక కిలోమీటర్ల దూరం లోఉన్న వూరిలో ఉండటానికి కూడా అమ్మాయిలు ఇష్టపడటం లేదు.  

పట్నానికి ఆవలివైపు మరో ముప్పై కిలోమీటర్ల దూరంలో వున్న మరో చిన్న టౌన్ అది.పిలపేరు చంద్రకళ. పదోక్లాస్ చదివింది. ఇల్లు సామాన్యంగా వుంది. ముగ్గురాడపిల్లల్లో చివరిది చంద్రకళ. . పెద్ద కళ్ళు, తీరైన రూపురేఖలు, చక్కటి శరీర సౌష్టవం తో చక్కని చుక్కలా వుంది. అచ్యుత చూపు ఆమె ముక్కు మీద నిలిచింది. ముక్కుకున్న ముక్కెర గమ్మత్తుగా అనిపించింది. మనసంతా ఆ ముక్కెర లో చిక్కుకు పోయినట్టనిపించింది అచ్యుతకు. అదెందుకు పెట్టుకుందో అర్ధం కాలేదతనికి. తమవైపు ఇటువంటి ఆచారం లేదు. 

ఏతా, వాతా తేలిందేమంటే పిల్ల తండ్రికి ఇద్దరు కూతుళ్ళ ను పెళ్లి చేసి సాగనంపేసరికి , మిగిలింది రెండెకరాల మాగాణి, ఒక ఎకరం మెట్ట. ఎట్లాగో రెండు లక్షలు కూడబెట్టాడు, అందులోనే పెళ్లి ఖర్చులు, వాళ్లకిచ్చే సొమ్ము అంతా అందులోనే అంటూ చెప్పుకొచ్చాడు. రాజమ్మకి ఈ సంబంధం సుతరామూ నచ్చలేదు. తోటి రైతు ఆవేదన సుబ్బారాయుడుకి అర్ధమయ్యిందికానీ భూమి కట్నం గ ఇచ్చే వాళ్ళైతే బావుండుననుకున్నాడు. 

వెళుతూ, వెళుతూ అచ్యుత కేసి ఒకసారి చూసి, లోపలికెళ్ళింది చంద్రకళ.

.ఇంటికి తిరిగొచ్చాక అడిగాడు సుబ్బారాయుడు కొడుకుని" ఏమంటావురా?" కొడుకు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.

 అచ్యుత ఏదో అనేలోపే రాజమ్మ అన్నది," పిల్ల చక్కగా వుంది, ఈ వయసు వాళ్ళు అదొక్కటే ఆలోచిస్తారు, మంచి, చెడ్డా పెద్దవాళ్ళం మనం ఆలోచించాలిగానీ" అన్నది విసురుగా. 

 అచ్యుత మరేమీ మాట్లా డలేదు. తన వాళ్ళు తన శత్రువులు కారు. . కానీ చంద్రకళని మర్చిపోలేకుండా వున్నాడు. ఆ ముక్కెరఅతని హృదయాన్ని . గాలానికి చిక్కిన చేపపిల్లలా కలవర పెడుతోంది. పాపం, వాళ్ళ నాన్న తానేమైనా మాట్లాడతానేమోనని ఎంత ఆశగా చూసాడు! అసలు ఒకళ్ళని ఇబ్బంది పెట్టి లాగేసుకున్న భూమి తనకు సంతోషమిస్తుందా? కానీ నాన్న మాట తీసెయ్యలేకుండా వున్నాడు. ఆయన తమని ఏంటో ప్రేమతో పెంచి పెద్ద చేసాడు. కష్టజీవి. అన్నయ్య ఇల్లరికం పోయాడని చాలా భాధ పడున్నాడు ఇప్పటికీ, నాన్నకు ఏమి చెప్పాలి? నుకుంటూ పొలానికి వెళ్ళాడు.

మరో రెండు రోజుల తర్వాత కోడలు వనజ ఫోన్ చేసి, వాళ్ళ పిన్నికూతురు వున్నది, చూసిమాట్లాడుకోవచ్చని చెప్పింది. ఈ సారి అచ్యుత లేకుండా రాజమ్మని తీసుకొని వెళ్ళాడు. అచ్యుత ఏమీ మాట్లాడలేదు, నిర్లిప్తంగా ఊరుకున్నాడు. 

కోడలి తో కలిసి పిల్లని చూడటానికి వెళ్లారు. అచ్యుత మంచి పొడవు, బావుంటాడు. పిల్ల సన్నగా పీలగా వున్నది. . పిల్ల తండ్రి ఐదెకరాల పొలం, మూడు లక్షల కాష్ ఇచ్చి, పెళ్లి బాగా చేస్తామని చెప్పాడు. 

ఇంటికొచ్చాక వనజ అన్నది." వాళ్ళు మీకో విషయం చెప్పమన్నారు, మాకిచ్చినట్టే అచ్యుత పేరున ఐదెకరాలు పెట్టమన్నారు. మిగతా ఐదెకరాలు ఇప్పుడే చెరి సగం రాసిస్తే ఒప్పుకుంటామని చెప్పమన్నారు".అన్నది.

" నేనింకా బ్రతికే వున్నా కదమ్మా" కోపంగా అన్నాడు సుబ్బారాయుడు. 

"కానీ మామయ్యా, అంతా మీస్వార్జితం కదా, అచ్యుత మీతోనే ఉంటున్నాడు, రేపు మీరు మిగతా ఐదెకరాలు అచ్యుతకో, వదినకో రాస్తే, మేము అన్యాయమవమా ? అన్నది. 

రాజమ్మకి ఒళ్ళుమండిపోయింది, " చాల్లే, పెద్ద చెప్పొచ్చావు, ఇంక చాలు, మేము బ్రతికుండగానే పిండం పెట్టేలాగున్నావు. ఎవరూ మాకు పెట్టనక్కర్లేదు,ఒకడిని నీకు ధారాదత్తం చేసాంగా, ఇంక చిన్నవాడిని కూడా వదులుకోమంటావా, మా ఆస్థి, మా ఇష్టం" అంటూ సర్రున లేచి"పదయ్యా, వెళదాం" అంటూ సుబ్బారాయుడిని బయల్దేరదీసింది.

రాజమ్మ. 

అచ్యుత తెల్లవారకముందే లేచి పొలానికి వెళ్లి, కూరగాయల మళ్లకు నీరు పెట్టాడు. మనసు మనసులోలేదు, మాటి, మాటికీ ముక్కెరే గుర్తొస్తోంది. మద్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి వెళ్లాలనిపించలేదు. నిర్విరామంగా పనిచేశాడు రెండింటిదాకా.. తర్వాత వేపచెట్టు క్రింద నవారు మంచం వేసుకొని మోచేయి మొహానికి అడ్డం పెట్టుకొని పడుకున్నాడు. తండ్రి కి మనసువిప్పి చెప్పలేని అశక్తత. కంట నీరు తిరిగింది, చంద్రకళ గుర్తొచ్చి. 

మూడయినా కొడుకు భోజనానికి రాకపోయేసరికి తానే బయల్దేరి వచ్చాడు పొలానికి సుబ్బారాయుడు. . వేళకాని వేళ అలా పడుకొన్న కొడుకుని చూసి ఆలోచనలో పడ్డాడు>

 "అచ్యుతా , అచ్యుతా ఏందిరా అయ్యా ఈ టైములో పడుకున్న వేందిరా ప్రాణం బాగాలేదా ఏంటిరా?" కొడుకు నుదిటిమీద చేయివేసి చూస్తూ అన్నాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అచ్యుత, కొడుకు కళ్ళల్లో నీళ్లు చూసి ఖిన్నుడయ్యాడు సుబ్బారాయుడు.

పదరా అయ్యా, అన్నం తిందువుగానీ" అంటూ వెంట తెచ్చిన క్యారియర్ అచ్యుత కు ఇచ్చి, అరటి ఆకు కోసుకొచ్చి, అచ్యుత తిన్నదాకా ఉండి, ఇంటికెళ్ళాడు.ఇంటికెళ్ళగానే, రాజమ్మ" అంటూ పిలిచాడు. " నేను చెప్పేది కొంచం శాంతంగా విను. రేపు వెంకట నరసయ్యకు కబురు చేస్తాను. శుక్రవారం పూలు, పండ్లు పెట్టుకుందామని. చిన్నోడు మనసులో మాట చెప్పలేకున్నాడు. వాడికా పిల్ల బాగా నచ్చింది,వాడి మనసు మెత్తన, మనకు ఎదురు చెప్పలేక లోలోపల భాధ పడుతున్నాడు. ఎందుకు కట్నమనీ, పొలమనీ ఆశపడి వాడిని ఎందుకు భాద పెట్టాలి? మనవూర్లోనే పెళ్లిచేసి భోజనాలు ఏర్పాటు చేద్దాము, సరేనా"

రాజమ్మ ఏదో అంబోయింది." ఇంకేమీ మాట్లాడకు రాజమ్మా, మొన్న వనజ మాట్లాడిన ఆటలు విన్నావుకదా, మళ్ళీ ఆ కుటుంబంలోంచే ఇంకోపిల్ల వద్దు. వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే, రెండోవాడినీ మనకు దక్కనిచ్చేలాగా లేరు, సరేనా" 

" రాజమ్మ " నీ ఇష్టమే నా ఇష్టం' అంటూ నవ్వింది.

 శుక్రవారం పిల్ల ఇంటికి పెద్ద కొడుకు , కోడలూ, కూతురు, అల్లుడు, వియ్యాలవారి తో కలిసి   

వెళ్లారు. వనజ మొహం గంటు పెట్టుకొనే ఉంది. భోజనాలయ్యాక కావాలనే పెరటి లోకి ఆఖర్న వెళ్ళాడు అచ్యుత. అతను చేయి కడుక్కుకోవటానికి నీళ్లు చేతిమీద పోస్తూ నెమ్మదిగా అన్నది చంద్రకళ" మీరుపెళ్లికి ఒప్పుకొంటారని అనుకోలేదు" అని.

చేప గాలానికి చిక్కినట్టు , నేను నీ ముక్కెరకి చిక్కానని మా నాన్న కనిపెట్టి, ఒప్పుకున్నాడు" అన్నాడు కొంటెగా అచ్యుత. . చంద్రకళ సిగ్గుపడింది ఆ మాటకి, వెళుతూ, వెళుతూ అచ్యుత ఎప్పటికి మర్చిపోలేని ప్రేమ, సిగ్గు కలబోసిన వాలుచూపు ఒకటి విసరి, లోపలి కెళ్ళింది చంద్రకళ.

8, జూన్ 2024, శనివారం

వేమవరపు రామదాసు


 వేమవరపు రామదాసు పంతులు - ఆంధ్రరాష్ట్ర ఉద్యమం (charcoal pencil sketch) 


వేమవరపు రామదాసు పంతులు (1873 - 1944) ప్రముఖ న్యాయవాది, సహకారోద్యమ ప్రముఖుడు. అఖిల భారత సహకార సంస్థల సంఘానికి అధ్యక్షుడు. 1935 నుండి 1944లో మరణించేవరకు ఇండియన్ కో-ఆపరేటివ్ రివ్యూ పత్రికకు సంపాదకత్వం వహించాడు. వేమవరపు రామదాసు కృష్ణా జిల్లాలోని వేమవరంలో 1873 అక్టోబరు నెలలో జన్మించాడు.

చాలా ఉద్యమాల మాదిరిగానే చరిత్ర, రచనలు, పత్రికలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి పునాదులు నిర్మించాయి. 1911లో ‘తెలుగు ప్రజల నేటి పరిస్థితి’ శీర్షికతో హిందూ పత్రిక ఆరు వ్యాసాలు ప్రచురించింది. ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో వాటితో వెల్లడించింది. కొద్ది నెలల ముందు చిలుకూరి వీరభద్రరావు రచన ‘ఆంధ్రుల చరిత్ర’ను విజ్ఞాన చంద్రికా మండలి 1910లో ప్రచురించి అప్పటికే ఒక అవగాహన తెచ్చింది. జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చట్టి నరసింహారావు 1911లో ఆంధ్ర దేశ చిత్రపటం రూపొందించారు. 1912లో కొండా వెంకటప్పయ్య, కె.గురునాథం ఆంధ్రోద్యమం’ అన్న చిన్న పుస్తకం ప్రచురించి, ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి సూచనలు చేశారు.

1912 మే నెలలో వేమవరపు రామదాసు అధ్యక్షతన నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల సమావేశం జరిగింది. ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించాలని ఈ సమావేశంలోనే చట్టి నరసింహారావు సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, సైన్యంలో, ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులకు అవకాశం కల్పించాలని కూడా తీర్మానించారు. ఈ భావనలకు ‘దేశాభిమాని’, ‘భరతమాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణాపత్రిక’ మద్దతు పలి కాయి.

నిడదవోలు సభ నిర్ణయం మేరకు 1913, జూన్‌ 26న బాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వేమవరపు రామదాసు ప్రతిపాదించారు. కానీ ఇలాంటి తీర్మానానికి సమయమింకా ఆసన్నం కాలేదని, వచ్చే సమావేశాలలో చర్చిద్దామని పలువురు పెద్దలు వాయిదా వేశారు. విశాఖ ఉత్తర ప్రాంతాలు, గంజాం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకత ఉండేది. ఈ అంశంలో ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వారిని కూడా సానుకూలురను చేసుకోవాలని సభ అభిప్రాయపడింది. తొలి ఆంధ్ర మహాసభ సమావేశాలు 1913లో బాపట్లలో జరిగాయి. ఆ సభకు రెండు వేల మంది అతిధులు, 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభకు కోస్తా, రాయలసీమ ప్రతినిధులతో పాటు, నాగపూరు, వరంగల్, హైదరాబాదులనుండి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రమహాసభ కాంగ్రేసు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తు ఉండేది. 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది.

తొలి ఆంధ్ర మహాసభ సమావేశాలు 1913లో బాపట్లలో జరిగాయి. ఆ సభకు రెండు వేల మంది అతిధులు, 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభకు కోస్తా, రాయలసీమ ప్రతినిధులతో పాటు, నాగపూరు, వరంగల్, హైదరాబాదులనుండి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రమహాసభ కాంగ్రేసు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తు ఉండేది. 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది,

( వికీపీడియా సౌజన్యంతో )

4, జూన్ 2024, మంగళవారం

జయంతి రామయ్య పంతులు



Charcoal pencil sketch 

జయంతి రామయ్య పంతులు (జూలై 18 1860 -  ఫిబ్రవరి 19, 1941) కవి శాసన పరిశోధకులు తెలుగులో వ్యవహారిక భాషా ఉద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథిక వాదులకు నాయకత్వం  వహించి పోరాడాలి దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన పొందారు.


ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రతి ఏడాది బి. ఏ. స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని ఇస్తారు.

(వికీపీడియా నుండి సేకరణ)

3, జూన్ 2024, సోమవారం

" కళాప్రపూర్ణ " ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ



 


'కళాప్రపూర్ణ' పాతూరి నాగభూషణం



నా పెన్సిల్ చిత్రం 

పాతూరి నాగభూషణం (20 ఆగష్టు 1907 - 24 జూలై 1987) భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమానికి డోయెన్‌గా వర్ణించబడ్డారు. 

పాతూరి జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు మరియు గాంధీజీ  యొక్క గొప్ప అనుచరుడు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడంలో, వయోజన అక్షరాస్యత ప్రచారంలో Andhrapradesh Library Association బలోపేతం చేయడంలో , గ్రంథాలయ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి లైబ్రరీ పాఠశాలను స్థాపించడం మరియు రాష్ట్ర ప్రభుత్వ ధృవీకరణ కింద గ్రంథాలయ విద్యను అందించడం మరియు పుస్తకాలను ప్రచురించడంలో ఆయన చేసిన కృషి గమనించదగినది. , పీరియాడికల్స్, LIS పాఠ్యపుస్తకాలు.  ఈయన విజయవాడలోని సర్వోత్తమ గ్రంధాలయం స్థాపకుడు.   

సౌజన్యం : వికీపీడియా 

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...