PVR మూర్తి గారి బొమ్మకు కథ.
శీర్షిక: " సన్నాయి పాట" కథ, రచన : భవాని కుమారి బెల్లంకొండ
సుబ్బారాయుడు భార్య రాజమ్మ తో కలిసి రెండో కొడుకు అచ్యుత పెళ్ళిచూపులకని బయల్దేరాడు. సుబ్బారాయుడు స్వశక్తి తో పైకి వచ్చిన మనిషి. ఆయనకు ముగ్గురు పిల్లలు , ముగ్గురిలోకి పెద్దయిన సరోజకి ఐదెకరాల పొలం కట్నం గా ఇచ్చి పెళ్ళిచేసాడు. రెండోవాడు జోగారావు. ఎక్కువ కష్టపడకుండా పైకి రావాలని, డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుండేవాడు. అందుకే అతని అందం చూసి మోహపడి చేసుకోవాలని మోజుపడిన వనజని పెళ్లి చేసుకొని , ఇల్లరికం పోయాడు. వనజ డిమాండ్ మీద ఐదెకరాలు పెద్ద కొడుక్కి రాసిచ్చాడు సుబ్బారాయుడు. . రాజమ్మ కొడుకు పరాయి వాడైపోయాడని భాధ పడటం చూసి నవ్వేవాడు సుబ్బారాయుడు.
" ఇవ్వాళ్ళ, రేపు ఎవరుంటున్నారే కన్నోళ్ల దగ్గిర, చదువుకున్న వాళ్ళు అంతే, వ్యవసాయం చేసుకొనే వాడైనా ఇంతే,రేపు అచ్యుత అయినా మన దగ్గిర ఉంటాడా ఏమిటీ ?పెళ్లి కాగానే వేరుపడడా ఏమిటి" అంటూ భార్యని ఓదార్చేవాడు సుబ్బారాయుడు.
తండ్రి అలా మాట్లాడినప్పుడల్లా అచ్యుత తమాషాగా నవ్వి " అబ్బా నీ పెంపకం మీద నీకెంత నమ్మకం నాన్నా" అనేవాడు.
ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత కాడెత్తుకున్నాడు అచ్యుత. మిగిలిన పదెకరాల భాద్యత నెత్తికెత్తుకున్నాడు. వయసుమీద పడుతున్న సుబ్బారాయుడులో రోజు, రోజుకీ శక్తి సన్నగిల్లుతోంది. పల్లెనుడి పట్నం వలసపోయిన కూలిచేసే వాడినైనా పెళ్లిచేసుకోవటానికి అమ్మాయిలూ సిద్దపడుతున్నారుగానీ, అచ్యుత్ లాంటి యువరైతులకి మ్యాచెస్ రావటం కష్టమవుతుంది రోజు, రోజుకి. సుబ్బారాయుడుకి ఇదే చింత. పట్నానికి పాతిక కిలోమీటర్ల దూరం లోఉన్న వూరిలో ఉండటానికి కూడా అమ్మాయిలు ఇష్టపడటం లేదు.
పట్నానికి ఆవలివైపు మరో ముప్పై కిలోమీటర్ల దూరంలో వున్న మరో చిన్న టౌన్ అది.పిలపేరు చంద్రకళ. పదోక్లాస్ చదివింది. ఇల్లు సామాన్యంగా వుంది. ముగ్గురాడపిల్లల్లో చివరిది చంద్రకళ. . పెద్ద కళ్ళు, తీరైన రూపురేఖలు, చక్కటి శరీర సౌష్టవం తో చక్కని చుక్కలా వుంది. అచ్యుత చూపు ఆమె ముక్కు మీద నిలిచింది. ముక్కుకున్న ముక్కెర గమ్మత్తుగా అనిపించింది. మనసంతా ఆ ముక్కెర లో చిక్కుకు పోయినట్టనిపించింది అచ్యుతకు. అదెందుకు పెట్టుకుందో అర్ధం కాలేదతనికి. తమవైపు ఇటువంటి ఆచారం లేదు.
ఏతా, వాతా తేలిందేమంటే పిల్ల తండ్రికి ఇద్దరు కూతుళ్ళ ను పెళ్లి చేసి సాగనంపేసరికి , మిగిలింది రెండెకరాల మాగాణి, ఒక ఎకరం మెట్ట. ఎట్లాగో రెండు లక్షలు కూడబెట్టాడు, అందులోనే పెళ్లి ఖర్చులు, వాళ్లకిచ్చే సొమ్ము అంతా అందులోనే అంటూ చెప్పుకొచ్చాడు. రాజమ్మకి ఈ సంబంధం సుతరామూ నచ్చలేదు. తోటి రైతు ఆవేదన సుబ్బారాయుడుకి అర్ధమయ్యిందికానీ భూమి కట్నం గ ఇచ్చే వాళ్ళైతే బావుండుననుకున్నాడు.
వెళుతూ, వెళుతూ అచ్యుత కేసి ఒకసారి చూసి, లోపలికెళ్ళింది చంద్రకళ.
.ఇంటికి తిరిగొచ్చాక అడిగాడు సుబ్బారాయుడు కొడుకుని" ఏమంటావురా?" కొడుకు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.
అచ్యుత ఏదో అనేలోపే రాజమ్మ అన్నది," పిల్ల చక్కగా వుంది, ఈ వయసు వాళ్ళు అదొక్కటే ఆలోచిస్తారు, మంచి, చెడ్డా పెద్దవాళ్ళం మనం ఆలోచించాలిగానీ" అన్నది విసురుగా.
అచ్యుత మరేమీ మాట్లా డలేదు. తన వాళ్ళు తన శత్రువులు కారు. . కానీ చంద్రకళని మర్చిపోలేకుండా వున్నాడు. ఆ ముక్కెరఅతని హృదయాన్ని . గాలానికి చిక్కిన చేపపిల్లలా కలవర పెడుతోంది. పాపం, వాళ్ళ నాన్న తానేమైనా మాట్లాడతానేమోనని ఎంత ఆశగా చూసాడు! అసలు ఒకళ్ళని ఇబ్బంది పెట్టి లాగేసుకున్న భూమి తనకు సంతోషమిస్తుందా? కానీ నాన్న మాట తీసెయ్యలేకుండా వున్నాడు. ఆయన తమని ఏంటో ప్రేమతో పెంచి పెద్ద చేసాడు. కష్టజీవి. అన్నయ్య ఇల్లరికం పోయాడని చాలా భాధ పడున్నాడు ఇప్పటికీ, నాన్నకు ఏమి చెప్పాలి? నుకుంటూ పొలానికి వెళ్ళాడు.
మరో రెండు రోజుల తర్వాత కోడలు వనజ ఫోన్ చేసి, వాళ్ళ పిన్నికూతురు వున్నది, చూసిమాట్లాడుకోవచ్చని చెప్పింది. ఈ సారి అచ్యుత లేకుండా రాజమ్మని తీసుకొని వెళ్ళాడు. అచ్యుత ఏమీ మాట్లాడలేదు, నిర్లిప్తంగా ఊరుకున్నాడు.
కోడలి తో కలిసి పిల్లని చూడటానికి వెళ్లారు. అచ్యుత మంచి పొడవు, బావుంటాడు. పిల్ల సన్నగా పీలగా వున్నది. . పిల్ల తండ్రి ఐదెకరాల పొలం, మూడు లక్షల కాష్ ఇచ్చి, పెళ్లి బాగా చేస్తామని చెప్పాడు.
ఇంటికొచ్చాక వనజ అన్నది." వాళ్ళు మీకో విషయం చెప్పమన్నారు, మాకిచ్చినట్టే అచ్యుత పేరున ఐదెకరాలు పెట్టమన్నారు. మిగతా ఐదెకరాలు ఇప్పుడే చెరి సగం రాసిస్తే ఒప్పుకుంటామని చెప్పమన్నారు".అన్నది.
" నేనింకా బ్రతికే వున్నా కదమ్మా" కోపంగా అన్నాడు సుబ్బారాయుడు.
"కానీ మామయ్యా, అంతా మీస్వార్జితం కదా, అచ్యుత మీతోనే ఉంటున్నాడు, రేపు మీరు మిగతా ఐదెకరాలు అచ్యుతకో, వదినకో రాస్తే, మేము అన్యాయమవమా ? అన్నది.
రాజమ్మకి ఒళ్ళుమండిపోయింది, " చాల్లే, పెద్ద చెప్పొచ్చావు, ఇంక చాలు, మేము బ్రతికుండగానే పిండం పెట్టేలాగున్నావు. ఎవరూ మాకు పెట్టనక్కర్లేదు,ఒకడిని నీకు ధారాదత్తం చేసాంగా, ఇంక చిన్నవాడిని కూడా వదులుకోమంటావా, మా ఆస్థి, మా ఇష్టం" అంటూ సర్రున లేచి"పదయ్యా, వెళదాం" అంటూ సుబ్బారాయుడిని బయల్దేరదీసింది.
రాజమ్మ.
అచ్యుత తెల్లవారకముందే లేచి పొలానికి వెళ్లి, కూరగాయల మళ్లకు నీరు పెట్టాడు. మనసు మనసులోలేదు, మాటి, మాటికీ ముక్కెరే గుర్తొస్తోంది. మద్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి వెళ్లాలనిపించలేదు. నిర్విరామంగా పనిచేశాడు రెండింటిదాకా.. తర్వాత వేపచెట్టు క్రింద నవారు మంచం వేసుకొని మోచేయి మొహానికి అడ్డం పెట్టుకొని పడుకున్నాడు. తండ్రి కి మనసువిప్పి చెప్పలేని అశక్తత. కంట నీరు తిరిగింది, చంద్రకళ గుర్తొచ్చి.
మూడయినా కొడుకు భోజనానికి రాకపోయేసరికి తానే బయల్దేరి వచ్చాడు పొలానికి సుబ్బారాయుడు. . వేళకాని వేళ అలా పడుకొన్న కొడుకుని చూసి ఆలోచనలో పడ్డాడు>
"అచ్యుతా , అచ్యుతా ఏందిరా అయ్యా ఈ టైములో పడుకున్న వేందిరా ప్రాణం బాగాలేదా ఏంటిరా?" కొడుకు నుదిటిమీద చేయివేసి చూస్తూ అన్నాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అచ్యుత, కొడుకు కళ్ళల్లో నీళ్లు చూసి ఖిన్నుడయ్యాడు సుబ్బారాయుడు.
పదరా అయ్యా, అన్నం తిందువుగానీ" అంటూ వెంట తెచ్చిన క్యారియర్ అచ్యుత కు ఇచ్చి, అరటి ఆకు కోసుకొచ్చి, అచ్యుత తిన్నదాకా ఉండి, ఇంటికెళ్ళాడు.ఇంటికెళ్ళగానే, రాజమ్మ" అంటూ పిలిచాడు. " నేను చెప్పేది కొంచం శాంతంగా విను. రేపు వెంకట నరసయ్యకు కబురు చేస్తాను. శుక్రవారం పూలు, పండ్లు పెట్టుకుందామని. చిన్నోడు మనసులో మాట చెప్పలేకున్నాడు. వాడికా పిల్ల బాగా నచ్చింది,వాడి మనసు మెత్తన, మనకు ఎదురు చెప్పలేక లోలోపల భాధ పడుతున్నాడు. ఎందుకు కట్నమనీ, పొలమనీ ఆశపడి వాడిని ఎందుకు భాద పెట్టాలి? మనవూర్లోనే పెళ్లిచేసి భోజనాలు ఏర్పాటు చేద్దాము, సరేనా"
రాజమ్మ ఏదో అంబోయింది." ఇంకేమీ మాట్లాడకు రాజమ్మా, మొన్న వనజ మాట్లాడిన ఆటలు విన్నావుకదా, మళ్ళీ ఆ కుటుంబంలోంచే ఇంకోపిల్ల వద్దు. వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే, రెండోవాడినీ మనకు దక్కనిచ్చేలాగా లేరు, సరేనా"
" రాజమ్మ " నీ ఇష్టమే నా ఇష్టం' అంటూ నవ్వింది.
శుక్రవారం పిల్ల ఇంటికి పెద్ద కొడుకు , కోడలూ, కూతురు, అల్లుడు, వియ్యాలవారి తో కలిసి
వెళ్లారు. వనజ మొహం గంటు పెట్టుకొనే ఉంది. భోజనాలయ్యాక కావాలనే పెరటి లోకి ఆఖర్న వెళ్ళాడు అచ్యుత. అతను చేయి కడుక్కుకోవటానికి నీళ్లు చేతిమీద పోస్తూ నెమ్మదిగా అన్నది చంద్రకళ" మీరుపెళ్లికి ఒప్పుకొంటారని అనుకోలేదు" అని.
చేప గాలానికి చిక్కినట్టు , నేను నీ ముక్కెరకి చిక్కానని మా నాన్న కనిపెట్టి, ఒప్పుకున్నాడు" అన్నాడు కొంటెగా అచ్యుత. . చంద్రకళ సిగ్గుపడింది ఆ మాటకి, వెళుతూ, వెళుతూ అచ్యుత ఎప్పటికి మర్చిపోలేని ప్రేమ, సిగ్గు కలబోసిన వాలుచూపు ఒకటి విసరి, లోపలి కెళ్ళింది చంద్రకళ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి