14, జనవరి 2016, గురువారం

సంక్రాంతి శుభాకాంక్షలు


మిత్రులకు , మిత్రుల కుటుంబ సభ్యుల కూ సంక్రాంతి శుభాకాంక్ష లు
..ధనుర్మాసం నెల రోజులూ తెల్లవారు ఝామున మొదలయ్యే జన జీవితం పండగల్లో కలిసిపోయేది. బ్రతుకే ఒక పండగలా వుండేది.
కుంకుడుకాయలు, కాగుబిందెల్లో నీళ్ళు
వీధిచివర మంటలు, వంటింట్లో వంటలు
పోగుచేసిన పిడకల దండలు
గుమ్మాలకి మావిడి మండలు
గడపల నిండా పూసిన పసుపులు
కడుపులనిండా మేసిన పశువులు
ముణగదీసి కప్పుకున్న గొంగళ్ళు
మిరియాల ఘాటుతో పొంగళ్ళు
అమ్మాయిల తల్లో కంటే గొబ్బెమ్మల్లోనే అందంగా వుండే బంతిపూలు !
వినువీధిని అలంకరించే పతంగులు
వీధివీధీ రంగవల్లులతో ఆడంగులు
అంత ఆరాటం ఇప్పుడెందుకు లేదు?
అంత చలి ఇప్పుడెందుకెయ్యడంలేదు??
స్వగృహంలో చేసుకునే వంటలుకాస్తా
స్వగృహానించి తెచ్చేసుకుంటున్నాం !
పట్టుదలగా వేసే భోగిమంటల్ని
ఓ పట్టు కర్రల్తో కానిచ్చేస్తున్నాం !
మాయింటికి రండనే రోజులుపోయి
మాటీవీ చూసుకునే రోజులొచ్చాయి
సంక్రాంతంటే కులమతాలకతీతం
సంబరాలతో అంబరాన సంతకం
మూడురోజులూ మూడాటలూ చూసేవాళ్ళు
మూడుపూటలూ పేకాటలోనే గడిపేసేవాళ్ళు
ముచ్చటగా అలంకరించిన సందె గొబ్బిళ్ళు
ముద్దబంతులతో మెరిసే తెలుగు లోగిళ్ళు
సంక్రాంతంటే....
పరవశించి ప్రకృతి కాంతకి మనంచే సే సీమంతం
పశుపక్ష్యాదుల్ని గౌరవించే విశిష్ట సంప్రదాయం
పండించింది పదిమందికీ పంచిచ్చే దాతృత్వం
వీలైనంతలో వినోదం పొందండి
చేతనైనంత సహాయంచెయ్యండి
శుభాకాంక్షలు....

(శ్రీజగదీష్ కొచ్చెర్లకోట గారి కి, శ్రీ అవధానుల రామారావు గారికి ధన్యవాదాలతో షేర్ చేసుకుంటున్నాను)

13, జనవరి 2016, బుధవారం

అమ్మదనం - నా పెన్సిల్ చిత్రం - శ్రీమతి శశికళ ఓలేటి గారి పద్యాలు


పద్య రూపంలో శ్రీమతి శశికళ ఓలేటి గారు ఇచ్చిన స్పందనకి ధన్యవాదాలు 

****అమ్మ*************
ఆ.వె
1.అమ్మ మనకు నిలను నమ్మకమగు నేస్తు.
కనని దైవమె మన కన్న తల్లి.
తనువు లోన మోసి తనివి తీరగ బెంచి,
తనకు నున్న వన్ని తనయు/తనయ కిచ్చు.
******************
2. అందలాల నెక్క నందించు చంద్రుణ్ణి
కంద కుండ బిడ్డ కనుల గాచు.
చిందు లిడగ జూసి చిట్టి పాదాలను
అందె రవళి మురియు నమ్మ మనసు.
******************
3. గోరు ముద్ద జేసి గోముగ తినిపించి,
జోల పాట పాడి ఝూల జేయు.
బోసి నవ్వు పాప చూసి నవ్వగ నమ్మ,
గుండె పొంగ నవును గుడియె తాను.
******************
4. మమత నిండు కనుల మైనమవును తాను,
మరచి పోయి జగము మురిసి పోవు.
అమ్మతనము లోని యమృత మంత గ్రోలి,
అమర మౌను జన్మ యమ్మ వలన.
******************
5.వెలుగ కనుల బిడ్డ వెన్నెల్ల తనకంట,
వెతలు మరిచి, మరియు సుతలు మరిచి,
కలత లున్న తనకు కన్నీరె మరియున్న
కంటి పాపయె గద చంటి బిడ్డ.




11, జనవరి 2016, సోమవారం

గురుశిష్యుల అనుబంధం - కీ.శే. ద్వారం వెంకటస్వామి నాయుడు, కీ.శే. ఘంటసాల


గురు శిష్యుల అనుబంధం:
నాయుడు గారు ఘంటసాల గార్ల ఋణానుబంధం:
ద్వారం వేంకటస్వామి నాయుడు గారు 8.11.1893 న బెంగుళూరు లో జన్మించారు. వారి తండ్రి గారు ద్వారం వెంకట రాయలు. తాత గారైన ద్వారం వెంకట స్వామి నాయుడు గారి పేరే మనవడికి పెట్టుకున్నారు. తండ్రి, తాత ఇద్దరూ మైసూరు సంస్థానపు మిలిటరీ శాఖలో ఉన్నత పదవులు అలంకరించిన వారే. నాయుడు గారికి ఇద్దరు సహోదరులు, నలుగురు సోదరీమణులు. పెద్ద కుటుంబం. నాయుడు గారి 9 ఏ ళ్ళ ప్రాయంలో, బంగళూరు నుండి అనకాపల్లి పయనం, మరి కొంతకాలం తరువాత విశాఖపట్నం కడపటి గా విజయనగరం లో స్థిరనివాశం. నాయుడు గారి పెద్దన్నయ్య వేంకట కృష్ణయ్య గారు కూడ వాయులీన విద్వాంశులే. నాటి ప్రఖ్యాత సంగీత విద్వాంశులు శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారి కచేరీలలో ఆయనకు పక్క వాయిద్య కళాకారుడుగా వయోలిన్ వాయించేవారుట. దైవనిర్ణయం ఎవరికి ఎరుక - ఎవరు కాదన గలరు మిలిటరీ దుస్తులు ధరించిన కుటుంబం నుండీ వచ్చిన వారు జీవనోపాధికై ఫిడేలు పట్టుకోవలసి వస్తుందని. నాయుడు గారు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు మహోపాధ్యాయులుగా ఉన్న సమయంలోనే వాయులీన సంగీత శాఖలో ఉపాధ్యాయులుగా విజయనగర మహరాజావారి సంగీత కళాశాలలో ప్రవేశించి వారి తదనంతరం, మహోపాధ్యాయులుగ నియమితులయ్యారు. ద్వారం వారి ప్రతిభా పాటవాలు కిట్టని కొందరు సమకాలీన ఫిడేలు విద్వాంశులు ఓర్వలేనితనంతో, ఆయనపై దుష్ప్రచారానికి దిగారుట. ఆ ప్రచారం ఆయనను ఎంతగా కృంగతీసిందంటే, నాయుడు గారు రెండు వత్సరముల పాటు ఫిడేలు ను తాకకుండా నిరాశ నిస్ప్రుహలతో వుండిపోయారుట. కాలగమనంలో, దృష్టిలోపమున్నా, నిరంతర పట్టుదల, అ కుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో, తన ప్రతిభను దేశం గుర్తించాలన్న పట్టుదలతో, 72 మేళకర్త రాగాలను వాయులీనంపై వాయిస్తూ, నూతన ఒరవడిని సృష్టిస్తూ అఖండమైన పేరు ప్రఖ్యాతులు గణించేరు. అదిగో ఆ సమయంలోనే ఘంటసాల గారు కూడా విజయనగర సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న రోజులు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా చేతినున్న బంగారు ఉంగరం అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో విజయనగరం చేరుకున్న ఘంటసాల గారికి సంగీత కళాశాల శలవుల మూలంగా మూయబడి ఉండడంతో, వారు గాత్ర పండితులుగా అప్పుడు ఉన్నట్టి శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారిని కలవడం జరిగింది. అప్పుడు వారు సాలూరు చిన్న గురువు గారిగా మంచి ఖ్యాతి ఉన్న మహా మంచి మనిషి. 
పాఠశాల శలవులానంతరం శ్రీ ద్వారం వారిని కలిస్తే, గాత్ర పరీక్షణ చేసి, ఘంటసాల గాత్ర గంభీరత, కంఠమాధుర్యానికి ఆశ్చర్యపడి గాత్ర సంగీతం వేయి రెట్ల పేరు ప్రఖ్యాతులను తెచ్చేలా చేస్తుందనీ నాడే భవిష్య వాణి పలికేరుట గురువుగా. 1941లో విద్వాన్ పట్టా తీసుకుని, శ్రీ ఆదిభట్ల వారి చేతులమీదుగా తంబూరాను అందుకుని స్వంతఊరుకి చేరుకున్న ఘంటసాల 1944 మే నెలలో మద్రాసు కు పయనమవడం, శ్రీ సముద్రాల గారి ఇంట్లో మకాం, శ్రీ నాగయ్య గారు, శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గార్ల ప్రోత్సాహం ఆయనను రేడియో శ్రోతలకు, సినీ ప్రేక్షకులకు, సంగీతాభిమానులకు, ఆంధ్ర, తమిళ దేశ ప్రజల హృదయాలకు చేరువ చేసింది. 1951 నాటికి ఘంటసాల గారు మద్రాసు నగర నివాశి అయి స్వంత ఇంటికి యజమాని అయేరు. ఉస్మాన్ రోడ్ గృహప్రవేశానికి గురువులందర్నీ ఆహ్వానించడంతో, సముద్రాల వారూ పట్రాయని వారు, ద్వారం వారు అందరూ విచ్చేసి ఆశీర్వదించేరు. శ్రీయుతులు యామిజాల పద్మనాభ స్వామి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆత్రేయ, సముద్రాల, రామానుజం, కొసరాజు, దాశరధి, ఆరుద్ర, నారాయణ రెడ్ది, కేశవదాసు గార్లాంటి మహానుభావులే కాక, పుష్పగిరి స్వామీజీ, బెజవాడ గోపల రెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, శృంగేరీ స్వామీజీలు, పొట్టి శ్రీరాములు గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆ ఇంటికి తరచూ వస్తూండే వారట. ద్వారం వారు అయితే ప్రతీ సంవత్సరం మూడు నాలుగు సార్లు కచేరీ ల కోసం 7-8 మంది బృందం తో వచ్చి శిష్యుడి ఇంట్లోనే మకాం. శిష్యుడు సంపాదన, ఖ్యాతి ఆయనను ముగ్ధుల్ని చేసేదట. నిజమే ఆ అనుబంధానికి పదాలు చాలవు. కచేరీ చేసి వచ్చి ఆ అందిన సొమ్ము ఎంత అని చూడకుండా ఘంటసాల గారి చేతిలో పెట్టి, అబ్బాయ్ తిరుగు ప్రయాణానికి ఇంత సొమ్ము ఉండాలిరా అనేవారట. అంత అత్మీయానుబంధం వారిద్దరిదీ. శిష్యుడ్ని పెంచిన గురువు, గురువుని మించిన శిష్యుడు. ఇద్దరూ దానాల్లో దానకర్ణులే. వారి గృహం ఎంతమందికో అన్నపూర్ణాశ్రయమే. 
కార్వేటి నగర రాజవంశీయులు శ్రీ ఆర్ బి రామకృష్ణం రాజు గారు అప్పటి ఎం ఎల్ సి గా ఉన్న హోదాతో నాటి గవర్నర్ గారైన త్రివేదీ గార్ని కలుసుకుని నాయుడు గారి సంగీత కచేరీ తో బాటు ఒక సన్మాన సభ ఏర్పాటు చేయించి వారిని సత్కరించి 25000 రొక్కమును బహూకరింప చేయించిరట. రాజు గారి సలహా మేరకు మద్రాసు లో మకాం గురించీ శిష్యుడైన ఘంటసాల తో ఆలోచన చేసి ఆ పూర్తి రొఖ్ఖం ఘంటశాల చేతిలో పెట్టి మంచి ఇల్లు కొని పెట్ట మన్నారుట. గురువు గారి ఋణం తీర్చుకునే తగిన సమయం ఇదే ననీ, వారి జ్యేష్ట గురు పుత్రులు తమ్ముడి తో సమానమైన శ్రీ ద్వారం సత్యనారాయణ తో మద్రాస్ మహాపట్టణపు వీధుల న్నీ తిరిగి, శోధించీ, చివరికి శ్రీ శంకర రావు అనబడే ఒక అభిమాని, స్నేహితుడి బంగళా లాంటి ఇంటిని ట్రిప్లికేను లో బండ్ల వేణుగొపాల్ వీధిలో గురువు గారు అందజేసిన సొమ్ముతో బాటు తన వద్ద ముందు దాచిన సొమ్ము కూడా కలిపి 35, 000 రూప్యములు చెల్లించీ ఇంటి తాళాలను స్వాధీనం చేసుకున్నారు. ద్వారం వారి కుటుంబ సభ్యుల సమేతంగా గృహప్రవేశం చేయించడమే కాకుండా, తాను వీనుల విందైన మూడు గంటల సంగీత కచేరీని గృహప్రవేశం రోజు చేసి, “గురు ఋణం” తీర్చుకున్నాననీ ఘంటసాల వారు సంతృప్తి చేందేరుట. 
అలా ఘంటసాల గారు తన తొలి దినాల్లో సహాయం అందించిన ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా జ్ఞాపకం ఉంచుకుని వారి ఋణం తగిన రీతిలో తీర్చేరు అనడానికి ఎన్నెన్ని వివరణలో.. తరువాతి భాగాల్లో చదువుకుందాం.

(courtesy ; Sudhakar Yadavalli garu - Facebook post of 9th Jan. 2016)

10, జనవరి 2016, ఆదివారం

గోదావరి జిల్లాలు - మర్యాదలు - ఆంధ్రప్రదేశ్


ఏండే...ఓసారిటు సూడండి..ఆయ్.. smile emoticon

సిటీల నుంచి వచ్చి గోదావరి జిల్లాలను హేళన చేస్తున్న వారికి ప్రత్యేకం....

చూసారాండే ఎంత అద్భుతంగా ఉందో... గోదారి జిల్లాల్లో ఊరిఊరికీ, ఈదిఈదికి ఇలాంటి సీన్లు సేనా కనిపిత్తాయండి. అసలు పేడతో అలికిన పూరి పాకల్లో ఉన్నా కూడా మేమున్నంత సుఖంగా.. సంతృప్తిగా మీ సిటీల్లో కోట్లు ఖర్చెట్టి కట్టుకున్న పాలరాతి బంగ్లాల్లో, అపార్ట్ మెంట్లలో మీరుండగలరేంటండే..., "భలేటోరే...!"

ఆమాటికొత్తే మీరు తిన్నారో ఉన్నారో పట్టించుకునే దిక్కూ లేదు, ఆప్యాయంగా పలకరించుకునే లక్కూ లేదు. కానీ మా పల్లెటూళ్ళలో అలాకాదండి ఎవరికి కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఊరంతా పంచుకుంటాది. ఆఖరికి ఊరులో చీమ చిటుక్కుమన్నా కూడా ఊరంతా పోగవ్వుద్ది. ఇక్కడ మనిషికి మనిషే సాయం కానీ మెషీన్లు కాదండి. మాకు ఇలా బంధాలు అనుబంధాలు, అనురాగాలూ ఆప్యాయతలు పెంచుకోవడమే తెలుసు తప్ప లెక్కలు కట్టి బ్యాంకు బ్యాలెన్స్ ఒక్క సంక్రాంతి టైం లోనే జల్సాలకీ, పందేలకీ ఖర్చెట్టేత్తాం కదండే బాబా..! smile emoticon

అసలు పెపంచకం మొత్తానికి గోదారి జిల్లాలంత అందమైన జిల్లాలు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండులో కూడా లేవని మా ఊరి "సోషల్ మేట్టారు" అనీవోడండి. అందుకేకదండి మరి సినిమావోళ్ళు కూడా షూటింగులంటే గోదారి జిల్లాలకి పరిగెడతారు. మా గోదారి జిల్లాల్లో మమకారాలతో పాటు ఎటకారాలూ, సరదాలతో పాటు సరసాలూ కూడా బెమ్మాండంగా ఉంటాయండి. మాకు అనురాగాలూ ఆప్యాయతలే కాదు పంతాలూ పౌరుషాలు కూడా ఎక్కువేనండి, పరువుకోసం పేనాలైనా ఇచ్చేత్తారు తప్ప ఒకడి ముందు తలవంచరండి.

ఇంక మర్యాదల విషయానికొత్తే సెప్పేదేముంది దానికి మాకు మేమే సాటి. సిటీల్లో చుట్టం వత్తే టీ ఇవ్వడానికి కూడా ఏడిసేవాళ్ళున్న ఈ పెపంచకంలో.. మేం చుట్టం వత్తే పంచభక్ష్య పరమన్నాలతో, కడుపు నిండా తిండి పెట్టి సంతోషంగా పంపిత్తామండి , ఆయ్.. ఎవరైనా కొట్టి సంపేత్తారు "మేము పెట్టి సంపేత్తాం" కదండి మరి. ...

ఏండే అని అంటున్నామంటే ఎదటోడికి గౌరవం ఇవాలనే కానీ మాకు 'ఏరా' అని పిలవడం రాక కాదు. నోరు ఇప్పితే అమ్మనాబూతులు మాటాడగలం. కానీ పెద్దలు నేర్పిన సంస్కారం అడ్డొచ్చి ఆ పని చెయ్యం.

చివరిగా ఒక్కమాట.... పండగలకే కాదు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా ఊళ్ళకి రండి , ఉండాలనుకున్నన్ని రోజులు ఉండండి. సిగ్గు పడకుండా కావాల్సింది అడిగి తినండి, మర్యాద నిలబెట్టుకుని ఎల్లండి. అంతేకాని ఇక్కడికొచ్చి మా గోదావరి జిల్లాలను కానీ, ప్రజలను కానీ, పద్దతుల్ని కానీ, భాషని కానీ హేళన సెయ్యలని సూడకండి. మేం మీకంటే ముదర్లం. మీగురించి మీజీవితాల గురించీ మేం మాటాడటం మొదలెడితే మీరు జన్మజన్మలకీ మర్చిపోలేరు.


Courtesy: Venu Gopal Raju garu and Vydehi Murthy of Facebook.

7, జనవరి 2016, గురువారం

సిగ్గేస్తాదోయి బావ సిగ్గేస్తాది, (pencil drawing)


సిగ్గేస్తాదోయి బావ సిగ్గేస్తాది,
మొగ్గలేను ఒగ్గలేను మొగమెత్తి చూడలేను
సిగ్గేస్తాదోయి బావ సిగ్గేస్తాది 
(అర్ధాంగి చిత్రంలో ఓ పాట కి పల్లవి)

మిత్రురాలు శశికళ ఓలేటి గారు ఈ బొమ్మకి తన పద్య రూపంలో ఇలా స్పందించారు. వారికి నా ధన్యవాదాలు :

సిగ్గు మొగ్గ లవుచు చేతులడ్డు బెడుతు,

చిరు నగవుల మోము, చిక్కు పడగ!
అర్ధ చంద్ర బింబ మదియన, నలవోక
చూపులె శరములుగ సూదు లయ్యె!!
******************
వద్దు వద్దు యనుచు ముద్దు పల్కుల తోను,
ముద్దరాలు యడ్డె ముగ్ధ వోలె.
హద్దు లన్ని రద్దు . ఒద్దు యడ్డు యనుచు
సద్దు చేసె ప్రియుడు సందె వేళ..
*********************
పట్టు కొమ్మ బెట్టు పట్టుదలగ జూపి
ఉట్టి పట్టు బట్టి ఉరిమి చూసె.
సెగయె లేని యామె చిలిపి చూపులు జూసి,
మురిసి, తడిసె నామె ముసురు లోన. 

మిత్రులు Shree Swamy (facebook)  తన కంద పద్యం ద్వారా ఇలా స్పందించారు. వారికి నా ధన్యవాదాలు

కందం

చాటుగ చూపులు చూసెడి
మేటిగ మెచ్చిన పడతియు మీటెను మనసున్..

కాటుక కన్నుల కాంతియు
చాటుగ నామనసుచేర శాంతియు లేదే..


5, జనవరి 2016, మంగళవారం

దీపికా పాదుకొనే - పెన్సిల్ చిత్రం


వర్ధమాన నటి దీపికా పాదుకొనే కి జన్మదిన శుభాకాంక్షలు. ఇటీవల విడుదలయి విజయ ధంకా మ్రోగిస్తున్న చరిత్ర ఆధారంగా నిర్మించిన 'బాజీరావ్ మస్తాని' చిత్రంలో 'మస్తాని' పాత్ర అద్భుతంగా పోషించారు. ఈ బొమ్మ చూసి నా facebook మిత్రురాలు శశికళ ఓలేటి తన పద్య రచన ద్వారా ఇలా స్పందించారు :

1. దీప కళిక యామె దీపికా పడుకొనె,
దక్షిణాది భామ తళుకు లీనె.
హింది చిత్ర సీమ నందలాల కెగసె,
యంద చందములను చంద మామె!!!!
********************
2.
సిరులు గురిసె నామె సినిమాల కన్నింట,
ప్రతిభ కనరె నామె ప్రగతి యందు.
రామ లీల, బాజి రావు మస్తానిగా,
చెన్నైసుందరి గదె చెలియ సొగసు.
*******************
3.
కలువ కొలను లవియె కనులందము గనిన,
పొడుగు పడచు నిక పొగడ తరమ!
నటన యన్నతనకు నల్లేరు నడకయె.
గర్వ కారణ మెగ కళల వల్లి.  

2, జనవరి 2016, శనివారం

హరికధా పితామహుడు - ఆదిభట్ల నారాయణదాసు - స్మృత్యంజలి


అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (Ajjada Adibhatla Narayana Dasu) ప్రముఖ హరికథా కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.
1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.
ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు. (వికీపెడియా నుండి సేకరణ)

ఈ బొమ్మకి నా facebook మిత్రురాలు శ్రీమతి  శశికళ ఓలేటి గారు తన పద్యాల ద్వారా ఇలా స్పందించారు

హరికధా పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి వర్ధంతి సందర్భంగా వారికి స్మృత్యంజలి. కందము. ****** 1. అజ్జాడ దిగ్గజము యదె, విజ్జయ నగరమున బుట్టి, వినుతిని బొందన్. యొజ్జై హరికధను గూర్చె, ముజ్జగములు, యబ్బుర పడ, మూల పురుషుడై. కం************** 2. సంగీత, నాట్య మిళితము, వాంగ్మయ భూషిత, పురాణ భరిత, హరికధన్, వాగ్దేవి కరుణ, నిచ్చెన్, భాగవతోత్తముని భంగిఁ, భక్తితొ, భువికిన్. *************** ఆ.వె3. ఆది భట్టు యదియె యాది నారాయుణౌ, లయ బ్రహ్మ వలె కళలను విరిసె. రాసె వాసి మీర, రామ చంద్ర శతకం, హరి కధామృతమును యరయ ప్రీతి. *************** 4.ఆ.వె. కాళ్ళ గజ్జె కట్టి, కంచు కంఠము తోడ, చిడత గొట్టు లయకు చేవ గూర్చ. సంస్కృతాంధ్ర మందు సరిలేరు వారికి, రాగ నవతి వృతము వ్రాసె భళిగ. *************** 5. ఆ.వె. వన్నె దెచ్చె బిరుదు సాహితీ స్వర బ్రహ్మ. తాత గారు వారు, తనదు(దనర) వృత్తి. కంచు కంఠ మదియె కంఠీరవుని గాంచ, సరసి జాక్షి దయతొ సంగతించ. *************** శీ. P.V..R. మూర్తి గారి అద్భుత పెన్సిల్ చిత్రానికి. ***************

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...