30, ఆగస్టు 2016, మంగళవారం

జమున - పెన్సిల్ చిత్రం - Jamuna, Pencil drawing



తెలుగు తెరనేలిన అందాల నటీమణులులో జమున ఒకరు. ఈమె అందాల రూపాన్ని నా పెన్సిల్ ద్వారా చిత్రీకరించుకున్నాను.
జమున, తెలుగు సినిమా నటి. తెలుగు మాతృభాషకాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార.
జమున 1937 ఆగష్టు 30 న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాస రావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది గుంటూరు జిల్లాదుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులొ చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.
తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.
ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగ పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామలొ జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మనాజర్‌ దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.[1]
సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన మిస్సమ్మఇల్లరికంఇలవేల్పులేతమనసులుగుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.
జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు(1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.
తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.

24, ఆగస్టు 2016, బుధవారం

P.V. Sindhu - బ్యాడ్మింటన్ కళాకారిణి - విజయ దరహాసాలు


రియో ఓలింపిక్స్ లో అద్భుతంగా ఆడి రజత పతకం సాధించి భారత దేశానికికే కీర్తిప్రతిష్టలు సంపాదించిపెట్టిన తెలుగు బిడ్డ 'సింధు' తన తల్లితో. నా పెన్సిల్ చిత్రం.

23, ఆగస్టు 2016, మంగళవారం

టంగుటూరి ప్రకాశం పంతులు గారు - పెన్సిల్ చిత్రం

నేడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి. (పెన్సిల్ చిత్రం)
“రండిరా ఇదె ! కాల్చుకోండిరా” యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి
పట్టింపువచ్చెనా బ్రహ్మంతవానిని
గద్దించు నిలబెట్టు పెద్దమనిషి
తనకి నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు
సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞము నందు
హోమ మ్మొనర్చిన సోమయాజి
అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మికొల్పిన ఏకైక నాయకుండు;
మన “ప్రకాశము” మన మహామాత్యమౌళి
సరిసములు లేని “ఆంధ్రకేసరి” యతండు :
(కరుణశ్రీ)

21, ఆగస్టు 2016, ఆదివారం

ఎన్టీఆర్ 'నర్తనశాల'


ఎన్టీయార్ యాభై ఏళ్ళ క్రితం చెప్పిన మనసులో మాట...
సాహసోపేతంగా బృహన్నల పాత్ర పోషించిన ఎన్టీయార్‌ 'నర్తనశాల' 1963 అక్టోబరు 11న దసరా కానుకగా విడుదలై ఘన విజయం సాధించి, జాతీయ అవార్డుకు కూడా ఎంపికైంది. ఆ సందర్భంలో, తన మనసులో మాటను పత్రికా ముఖంగా ఎన్‌.టి.రామారావు పంచుకున్నారు. క్లిష్టమైన ఆ పాత్రపోషణ జనామోదం పొందడంలో తెరపై కనిపించే తన కృషితో పాటు తెర వెనుక ఉన్న మహానుభావుల శ్రమను ప్రత్యేకంగా పేర్కొన్నారు.50 ఏళ్ళ క్రితం ఆయన చెప్పిన అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు...
చిత్ర విజయంతో సిద్ధించిన ప్రతిష్ఠలో ప్రథమ తాంబూలం మా (దర్శకుడు) కమలాకర కామేశ్వరరావుగారిది. ఊహాతీతమైనది 'బృహన్నల' పాత్ర. ...భారతం రచించిన ఆ మహాకవే - 'ఇదీ' అని గుర్తుపెట్టి, వర్ణించి, విమర్శించి, రూపొందించని పాత్ర - బృహన్నల. (నిర్మాత) శ్రీమతి లక్ష్మీరాజ్యం గారు నన్నీ పాత్ర ధరించమన్న ప్పుడే నాకు దిగ్భ్రమ కలిగింది. 'ఇది పరిహాసమా' అన్నాను. ఆమె, 'కాదండీ! నిష్కల్మషంగా నేననుకున్నాను - మీరు ఆ పాత్రకు జీవం పోయగలరని! కనుక మీరు బృహన్నల పాత్ర ధరిస్తేనే నేనీ చిత్రం తీస్తాను. లేకపోతే లేదు' అన్నారు. రెండు రోజుల వ్యవధి కోరాను - నా నిర్ణయం తేల్చిచెప్పడానికి!
ఒకే మథన - వేయాలా? వేయకూడదా? ఏదైనా చిత్రంలో రెండు, మూడొందల అడుగుల ఆడవేషం ధరించాల్సిన అవసరం కలిగితేనే నా మీద నాకు జుగుప్స వేసి, భయం కలుగుతుందే! మరి ఈ 13 వేల అడుగుల దీర్ఘంగా సాగిన పాత్ర నిర్వహణ ఎలా? విజయం సిద్ధించు కొనేదెలా? పైగా ఆ పాత్ర నిర్వహణతో ఆనాడు భారత వీరుడైన అర్జునుడు విజయంగా నడిపిన అజ్ఞాతవాస కథ - ఈనాడు ఈ నా పాత్ర ధారణతో అపజయమైతే? ఇవి నాలో చెలరేగిన భయాందోళ నలు. ఒక పక్క పేరుప్రతిష్ఠలు, మరోపక్క 'మీరే తగినవాళ్ళు. మీరు బృహన్నల వేష ధారణ చేయకపోతే చిత్రం ఆపుచేస్తామ'నే నిర్మాత మాటలు. ఏమిటి గత్యంతరం?
సరే! ఆనాటి కొక దృఢసంకల్పానికి వచ్చాను. (నిర్మాతలు) శ్రీ శ్రీధర్‌, శ్రీమతి లక్ష్మీరాజ్యం గార్లతో నా నిర్ణయం చెప్పాను - ''సరే! మీకీ సంకల్పం ఎలా కలిగిందో నాకు తెలియదు. నాకీ పరీక్ష ఎందుకు వచ్చిందో తెలియదు. నేను నటించిన శతాధిక చిత్ర నటనానుభం అండగా ఉంచుకొని, తప్పకుండా వేషధారణ చేస్తాను'' అని మాటిచ్చాను.
ఇక ఆ నాటి నుంచి చిత్ర నిర్మాణం ఆఖరు వరకూ కొనసాగిన నా దీక్షలో నాకు అనుక్షణం అండగా నిలిచి, నా ఆవేశానికి అపశ్రుతి రానీయకుండా, నా భావాలకు రూపకల్పన చేసి, నాలో ఆ పాత్ర ఈనాడు రూపొందించుకున్న ఘనతకు కారణభూతులైనవారు అయిదుగురు (పంచ బ్రహ్మలు).

రచయిత: ఇల్లాలుకు మాంగల్యం, ఇంటికి దీపం ఎంత జీవమో, అలాగే పాత్రకు ప్రాణం సంభాషణ. ..సందర్భ సన్నివేశాలకు అవసరమైన ఆవేశంతో, భావంతో, అందరికీ అర్థమయ్యేలా బృహన్నల మనోజ్ఞ ప్రవృత్తిని తెలియ జేసేది - సముద్రాల వారి సరస సంభాషణా చాతురి. ఇది వారి రసమయ సృష్టి.
కళా దర్శకుడు: కవివర్యుల మానస వీధుల్లోని మూర్తికి ఆకృతి కల్పించి, అలంకరణ సల్పి, సజీవంగా ప్రేక్షకుల ప్రత్యక్ష సన్నిధిని ఈ పాత్రను నిలిపిన చాతురీ ధురీణుడు, ఊహోపాసనా శిల్పి - టి.వి.ఎస్‌. శర్మ గారు.
అలంకరణ, వేషధారణ: కళాదర్శకుని కుంచె జాలులో రూపం కల్పించుకొని, లావణ్యతనూ, భావాన్నీ ముఖకమలం మీద రంగులతో లాలనగా అద్ది, నేనా? పాత్రా? అన్న విధంగా నా మీద ముద్ర వేసి, ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన కళాస్రష్ట - మేకప్‌ చీఫ్‌ హరిబాబు గారు.
చాయాగ్రాహకుడు: పాత్రానుగుణ్యమైన రూపకల్పనకు, జ్యోతులతో నీరాజనం ఇచ్చి, చూపరులకు నయనానందంగా, సుజన కళాపోషకుల సన్నిధిని - నన్నీ స్థానంలో నిల్పిన చాతురీ ధురీణుడైన ఛాయాగ్రాహకుడు - ఎం.ఏ. రెహమాన్‌ గారు. మగ కాని మగటిమి, ఆడతనం చాటున తొణికిసలాడే ధీరోదాత్తత, చీకటి వెలుగుల సయ్యాటలలో చిద్విలాసంగా చిత్రించి, నాకు పరమార్థం దక్కించిన చిత్రకారుడు- ఈ కెమేరా శిల్పి.
నృత్య దర్శకుడు: శాపప్రభావంతో రూపం మారినప్పుడు అధ్యాపకుడై, విరటుని 'నర్తనశాల'ను పునీతం చేసిన నాటి నాట్యాచార్యుడు (బృహన్నల) ఎక్కడీ నేటి నేనెక్కడీ (ఆ నాట్య విలాస ప్రదర్శనలో నాకు) ఏ కాస్త అయినా పరమార్థం దక్కితే, అది పారంపర్యంగా దేశానికి గురువులుగా నాట్యకళామ తల్లికి నీరాజనం పట్టే 'కూచిపూడి' వారి సాంగత్యం వల్లనే! ఆ ఘనతంతా వెంపటి వారి సత్యం గారిది!
నా పాత్ర నా అభిమానులనూ, కళాప్రియులనూ రంజింపజేసిందంటే - ఇందరి కళాకారుల అశేష ప్రజ్ఞా విశేషాలు దానికి బాసటగా నిలిచాయి గనకనే!
ఇక, ఆ పాత్ర నిర్వహణలో నా ప్రజ్ఞ ఎంత ఉన్నదన్నది నా కన్నా కళాపోషకులైన ప్రజానీకానికే తెలుసు. వారి మన్ననలే నా భాగ్యం. వారి ఆనందమే నా ఆకాంక్ష. వారి తృప్తే నా ఆశయం.

19, ఆగస్టు 2016, శుక్రవారం

ఎంచి చూడరో ఘనులార ఇందీవరాక్షుడు రక్షకుఁడు సంచితముగ నీతని శరణంబే సర్వఫలప్రద మిందరికి - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. ఎంచి చూడరో ఘనులార ఇందీవరాక్షుడు రక్షకుఁడు
సంచితముగ నీతని శరణంబే సర్వఫలప్రద మిందరికి. ||
౧. హరి గొలువని కొలువులు మరి యడవిఁగాసిన వెన్నెలలు 
గరిమల నచ్యుతు వినని కథలు భువి గజస్నానములు,
పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళమున నిదానంబులు
మరుగురునికిఁ గాని పూవులపూజలు మగడులేని సింగారంబులు ||
౨. వైకుంఠుని నుతియించని వినుతులు వననిధిఁగురిసిన వానలు
ఆ కమలోదరుఁ గోరని కోరిక లందని మానిఫలంబులు
శ్రీకాంతునిపైఁజేయని భక్తులు చెంబుఁమీది కనకపుఁబూఁత
దాకొని విష్ణుని తెలియని తెలువులు తగనేటినడిమి పైరులు ||
౩. వావిరిఁగేశవు నొల్లని బతుకులు వరతఁగలవు చింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు
భావించి మాధవుపై లేని తలపులు పలు మేఘముల వికారములు
శ్రీ వేంకటపతి కరుణ గలగితే జీవుల కివియే వినోదములు. ||
భావము: ఘనులార! కలువకన్నులవాడైన శ్రీహరియే ఎల్లరకు రక్షకుడు. ఈ సంగతి చక్కగా గ్రహించిన ఆ దేవుని శరణాగతియే అందరికీ సమస్తఫలములను సమకూర్చునది.

శ్రీహరి ని కొలువక ఇతరత్రా చేయు సేవలు అడవిగాచిన వెన్నెలవలె నిష్ప్రయోజనములు. ఘనుడైన అచ్యుతుని గురించి వినక ఇతరముల గురించి విను కథలెల్ల ఏనుగుచేయు స్నానము వలె వ్యర్థములు. పరమాత్ముడగు హరిని గూర్చి కాక ఇతరుల గురించి చేయు తపములు పాతాళముననున్న పాతరల వలె అక్కరకు రానివి. మన్మథుని తండ్రియైన మాధవునికి గాక అన్యులకొనర్చు పూజలెల్ల మగడు లేని మగువ సింగారము వలె నిష్ఫలములు. మరియు అనుచితములు.

వైకుంఠుని నుతించని వినుతులు సముద్రములో కురిసిన వాన వలె నిష్ప్రయోజనములు. ఆ పద్మనాభుని గాక అన్యులను గొరెడు కోరికలన్నియు అందని మానిఫలంబుల వలె అసాధ్యములు. అట్టి కోరికలు నెరవేరవు. శ్రీకాంతునిపై జేయక ఇతరులపై జేయు భక్తి చెంబుపై బంగారుపూత వలె విలువలేనిది. ప్రయత్నించి విష్ణుని గూర్చి తెలిసికొనక ఇతరులను గూర్చి తెలిసికొను విజ్ఞానము లన్నియు వరదపాలై పోవు ఏటి నడుమ పెంచిన పైరుల వలె నిష్ఫలములు.

భక్తితో కేశవుని అంగీకరింపక ఒరులపై మోహము పెంచుకొని బ్రతుకు బ్రతుకులు వరదలో గలిసిన చింతపండువలె వ్యర్ధమవును. గోవిందునికి గాక అన్యుల కొనర్చు మొక్కులు గోడలేని పెద్ద చిత్రములవలె ఉనికి లేనివే యగును. మరియు మాధవుని గాక ఇతరులను గూర్చి చేయు భావనలు నానావిధములైన మబ్బుల ఆక్రుతులవలె నిలకడ లేనివి యగును.
పై జెప్పినవెల్ల అంతర్గతముగా విష్ణుపరములైనచో జీవులు వేంకటేశ్వరుని దయకు పాత్రులు కాగలరు. అప్పుడా సాధనలెల్ల వినోదకరములే యగుచున్నవి. కాన విష్ణుని శరణు జొచ్చుటయే ముఖ్య కర్తవ్యమని అన్నమయ్య భావము.
వ్యాఖ్యాత : సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, ఎం.ఏ. -  (పొన్నాడ లక్ష్మి.)

15, ఆగస్టు 2016, సోమవారం

ఏ దేశమేగినా ఎందు కాలెడినా - రాయప్రోలు సుబ్బారావు గారి పూర్తి గీతం




మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రాయప్రోలు సుబ్బారావు గారి పూర్తి గీతం.


ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.

లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము.

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక

దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర

వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర
దీవించె నీ దివ్య దేశంబు పుత్ర
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట

పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ
కానలా కస్తూరి కాచరా మనకు.

అవమానమేలరా ? అనుమానమేలరా ?
భారతీయుడన౦చు భక్తితో పాడ!

13, ఆగస్టు 2016, శనివారం

ఆమె కన్నులు - దేవులపల్లి కృష్ట్నశాస్త్రి

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి "ఆమె కన్నులు"
.
ఆమె కన్నులలో ననంతాంబరంపు
నీలినీడలు కలవు
వినిర్మలాంబు
పూరగంభీర శాంత కాసార చిత్ర
హృదయములలోని గాటంపు నిదురచాయ
లందు నెడనెడ గ్రమ్ము
.
సంధ్యావసాన
సమయమున నీపపాదప శాఖి కాగ్ర
పత్ర కుటిల మార్గముల లోపల వసించు
ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు
.
వినబడుచునుండు
మరికొన్ని వేళలందు
వానకారుమబ్బుల మెయివన్నె వెనుక
దాగు భాష్పమ్ము లామె నేత్రములలోన
పొంచుచుండును
.
ఏదియొ అపూర్వ మధుర
రక్తి స్ఫురియించుకాని అర్థమ్ముకాని
భావగీతమ్ములవి

Translation into English, Courtesy : teluguanuvadalu.wordpress.com

In her eyes,

There are the dark delicate shades of the infinite expanse of the blue sky;

The still reflections in the pure crystal waters of a silent swelling lake are scattered here and there;

The susurrations at dusk of the settling darkness, lying amidst the umbrage in the crown of Cadamba, are heard now and then;

And on other occasions,  tears rearing behind the black nimbi of the rainy season  lurk behind them;

Though they ring some sweet exceptional haunting chants in mind, they are still, indecipherable rare romantic melodies…

.

Devulapalli Krishna Sastry

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...