21, ఆగస్టు 2016, ఆదివారం

ఎన్టీఆర్ 'నర్తనశాల'


ఎన్టీయార్ యాభై ఏళ్ళ క్రితం చెప్పిన మనసులో మాట...
సాహసోపేతంగా బృహన్నల పాత్ర పోషించిన ఎన్టీయార్‌ 'నర్తనశాల' 1963 అక్టోబరు 11న దసరా కానుకగా విడుదలై ఘన విజయం సాధించి, జాతీయ అవార్డుకు కూడా ఎంపికైంది. ఆ సందర్భంలో, తన మనసులో మాటను పత్రికా ముఖంగా ఎన్‌.టి.రామారావు పంచుకున్నారు. క్లిష్టమైన ఆ పాత్రపోషణ జనామోదం పొందడంలో తెరపై కనిపించే తన కృషితో పాటు తెర వెనుక ఉన్న మహానుభావుల శ్రమను ప్రత్యేకంగా పేర్కొన్నారు.50 ఏళ్ళ క్రితం ఆయన చెప్పిన అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు...
చిత్ర విజయంతో సిద్ధించిన ప్రతిష్ఠలో ప్రథమ తాంబూలం మా (దర్శకుడు) కమలాకర కామేశ్వరరావుగారిది. ఊహాతీతమైనది 'బృహన్నల' పాత్ర. ...భారతం రచించిన ఆ మహాకవే - 'ఇదీ' అని గుర్తుపెట్టి, వర్ణించి, విమర్శించి, రూపొందించని పాత్ర - బృహన్నల. (నిర్మాత) శ్రీమతి లక్ష్మీరాజ్యం గారు నన్నీ పాత్ర ధరించమన్న ప్పుడే నాకు దిగ్భ్రమ కలిగింది. 'ఇది పరిహాసమా' అన్నాను. ఆమె, 'కాదండీ! నిష్కల్మషంగా నేననుకున్నాను - మీరు ఆ పాత్రకు జీవం పోయగలరని! కనుక మీరు బృహన్నల పాత్ర ధరిస్తేనే నేనీ చిత్రం తీస్తాను. లేకపోతే లేదు' అన్నారు. రెండు రోజుల వ్యవధి కోరాను - నా నిర్ణయం తేల్చిచెప్పడానికి!
ఒకే మథన - వేయాలా? వేయకూడదా? ఏదైనా చిత్రంలో రెండు, మూడొందల అడుగుల ఆడవేషం ధరించాల్సిన అవసరం కలిగితేనే నా మీద నాకు జుగుప్స వేసి, భయం కలుగుతుందే! మరి ఈ 13 వేల అడుగుల దీర్ఘంగా సాగిన పాత్ర నిర్వహణ ఎలా? విజయం సిద్ధించు కొనేదెలా? పైగా ఆ పాత్ర నిర్వహణతో ఆనాడు భారత వీరుడైన అర్జునుడు విజయంగా నడిపిన అజ్ఞాతవాస కథ - ఈనాడు ఈ నా పాత్ర ధారణతో అపజయమైతే? ఇవి నాలో చెలరేగిన భయాందోళ నలు. ఒక పక్క పేరుప్రతిష్ఠలు, మరోపక్క 'మీరే తగినవాళ్ళు. మీరు బృహన్నల వేష ధారణ చేయకపోతే చిత్రం ఆపుచేస్తామ'నే నిర్మాత మాటలు. ఏమిటి గత్యంతరం?
సరే! ఆనాటి కొక దృఢసంకల్పానికి వచ్చాను. (నిర్మాతలు) శ్రీ శ్రీధర్‌, శ్రీమతి లక్ష్మీరాజ్యం గార్లతో నా నిర్ణయం చెప్పాను - ''సరే! మీకీ సంకల్పం ఎలా కలిగిందో నాకు తెలియదు. నాకీ పరీక్ష ఎందుకు వచ్చిందో తెలియదు. నేను నటించిన శతాధిక చిత్ర నటనానుభం అండగా ఉంచుకొని, తప్పకుండా వేషధారణ చేస్తాను'' అని మాటిచ్చాను.
ఇక ఆ నాటి నుంచి చిత్ర నిర్మాణం ఆఖరు వరకూ కొనసాగిన నా దీక్షలో నాకు అనుక్షణం అండగా నిలిచి, నా ఆవేశానికి అపశ్రుతి రానీయకుండా, నా భావాలకు రూపకల్పన చేసి, నాలో ఆ పాత్ర ఈనాడు రూపొందించుకున్న ఘనతకు కారణభూతులైనవారు అయిదుగురు (పంచ బ్రహ్మలు).

రచయిత: ఇల్లాలుకు మాంగల్యం, ఇంటికి దీపం ఎంత జీవమో, అలాగే పాత్రకు ప్రాణం సంభాషణ. ..సందర్భ సన్నివేశాలకు అవసరమైన ఆవేశంతో, భావంతో, అందరికీ అర్థమయ్యేలా బృహన్నల మనోజ్ఞ ప్రవృత్తిని తెలియ జేసేది - సముద్రాల వారి సరస సంభాషణా చాతురి. ఇది వారి రసమయ సృష్టి.
కళా దర్శకుడు: కవివర్యుల మానస వీధుల్లోని మూర్తికి ఆకృతి కల్పించి, అలంకరణ సల్పి, సజీవంగా ప్రేక్షకుల ప్రత్యక్ష సన్నిధిని ఈ పాత్రను నిలిపిన చాతురీ ధురీణుడు, ఊహోపాసనా శిల్పి - టి.వి.ఎస్‌. శర్మ గారు.
అలంకరణ, వేషధారణ: కళాదర్శకుని కుంచె జాలులో రూపం కల్పించుకొని, లావణ్యతనూ, భావాన్నీ ముఖకమలం మీద రంగులతో లాలనగా అద్ది, నేనా? పాత్రా? అన్న విధంగా నా మీద ముద్ర వేసి, ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన కళాస్రష్ట - మేకప్‌ చీఫ్‌ హరిబాబు గారు.
చాయాగ్రాహకుడు: పాత్రానుగుణ్యమైన రూపకల్పనకు, జ్యోతులతో నీరాజనం ఇచ్చి, చూపరులకు నయనానందంగా, సుజన కళాపోషకుల సన్నిధిని - నన్నీ స్థానంలో నిల్పిన చాతురీ ధురీణుడైన ఛాయాగ్రాహకుడు - ఎం.ఏ. రెహమాన్‌ గారు. మగ కాని మగటిమి, ఆడతనం చాటున తొణికిసలాడే ధీరోదాత్తత, చీకటి వెలుగుల సయ్యాటలలో చిద్విలాసంగా చిత్రించి, నాకు పరమార్థం దక్కించిన చిత్రకారుడు- ఈ కెమేరా శిల్పి.
నృత్య దర్శకుడు: శాపప్రభావంతో రూపం మారినప్పుడు అధ్యాపకుడై, విరటుని 'నర్తనశాల'ను పునీతం చేసిన నాటి నాట్యాచార్యుడు (బృహన్నల) ఎక్కడీ నేటి నేనెక్కడీ (ఆ నాట్య విలాస ప్రదర్శనలో నాకు) ఏ కాస్త అయినా పరమార్థం దక్కితే, అది పారంపర్యంగా దేశానికి గురువులుగా నాట్యకళామ తల్లికి నీరాజనం పట్టే 'కూచిపూడి' వారి సాంగత్యం వల్లనే! ఆ ఘనతంతా వెంపటి వారి సత్యం గారిది!
నా పాత్ర నా అభిమానులనూ, కళాప్రియులనూ రంజింపజేసిందంటే - ఇందరి కళాకారుల అశేష ప్రజ్ఞా విశేషాలు దానికి బాసటగా నిలిచాయి గనకనే!
ఇక, ఆ పాత్ర నిర్వహణలో నా ప్రజ్ఞ ఎంత ఉన్నదన్నది నా కన్నా కళాపోషకులైన ప్రజానీకానికే తెలుసు. వారి మన్ననలే నా భాగ్యం. వారి ఆనందమే నా ఆకాంక్ష. వారి తృప్తే నా ఆశయం.

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...