19, ఆగస్టు 2016, శుక్రవారం

ఎంచి చూడరో ఘనులార ఇందీవరాక్షుడు రక్షకుఁడు సంచితముగ నీతని శరణంబే సర్వఫలప్రద మిందరికి - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. ఎంచి చూడరో ఘనులార ఇందీవరాక్షుడు రక్షకుఁడు
సంచితముగ నీతని శరణంబే సర్వఫలప్రద మిందరికి. ||
౧. హరి గొలువని కొలువులు మరి యడవిఁగాసిన వెన్నెలలు 
గరిమల నచ్యుతు వినని కథలు భువి గజస్నానములు,
పరమాత్మునికిఁ గాని తపంబులు పాతాళమున నిదానంబులు
మరుగురునికిఁ గాని పూవులపూజలు మగడులేని సింగారంబులు ||
౨. వైకుంఠుని నుతియించని వినుతులు వననిధిఁగురిసిన వానలు
ఆ కమలోదరుఁ గోరని కోరిక లందని మానిఫలంబులు
శ్రీకాంతునిపైఁజేయని భక్తులు చెంబుఁమీది కనకపుఁబూఁత
దాకొని విష్ణుని తెలియని తెలువులు తగనేటినడిమి పైరులు ||
౩. వావిరిఁగేశవు నొల్లని బతుకులు వరతఁగలవు చింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు
భావించి మాధవుపై లేని తలపులు పలు మేఘముల వికారములు
శ్రీ వేంకటపతి కరుణ గలగితే జీవుల కివియే వినోదములు. ||
భావము: ఘనులార! కలువకన్నులవాడైన శ్రీహరియే ఎల్లరకు రక్షకుడు. ఈ సంగతి చక్కగా గ్రహించిన ఆ దేవుని శరణాగతియే అందరికీ సమస్తఫలములను సమకూర్చునది.

శ్రీహరి ని కొలువక ఇతరత్రా చేయు సేవలు అడవిగాచిన వెన్నెలవలె నిష్ప్రయోజనములు. ఘనుడైన అచ్యుతుని గురించి వినక ఇతరముల గురించి విను కథలెల్ల ఏనుగుచేయు స్నానము వలె వ్యర్థములు. పరమాత్ముడగు హరిని గూర్చి కాక ఇతరుల గురించి చేయు తపములు పాతాళముననున్న పాతరల వలె అక్కరకు రానివి. మన్మథుని తండ్రియైన మాధవునికి గాక అన్యులకొనర్చు పూజలెల్ల మగడు లేని మగువ సింగారము వలె నిష్ఫలములు. మరియు అనుచితములు.

వైకుంఠుని నుతించని వినుతులు సముద్రములో కురిసిన వాన వలె నిష్ప్రయోజనములు. ఆ పద్మనాభుని గాక అన్యులను గొరెడు కోరికలన్నియు అందని మానిఫలంబుల వలె అసాధ్యములు. అట్టి కోరికలు నెరవేరవు. శ్రీకాంతునిపై జేయక ఇతరులపై జేయు భక్తి చెంబుపై బంగారుపూత వలె విలువలేనిది. ప్రయత్నించి విష్ణుని గూర్చి తెలిసికొనక ఇతరులను గూర్చి తెలిసికొను విజ్ఞానము లన్నియు వరదపాలై పోవు ఏటి నడుమ పెంచిన పైరుల వలె నిష్ఫలములు.

భక్తితో కేశవుని అంగీకరింపక ఒరులపై మోహము పెంచుకొని బ్రతుకు బ్రతుకులు వరదలో గలిసిన చింతపండువలె వ్యర్ధమవును. గోవిందునికి గాక అన్యుల కొనర్చు మొక్కులు గోడలేని పెద్ద చిత్రములవలె ఉనికి లేనివే యగును. మరియు మాధవుని గాక ఇతరులను గూర్చి చేయు భావనలు నానావిధములైన మబ్బుల ఆక్రుతులవలె నిలకడ లేనివి యగును.
పై జెప్పినవెల్ల అంతర్గతముగా విష్ణుపరములైనచో జీవులు వేంకటేశ్వరుని దయకు పాత్రులు కాగలరు. అప్పుడా సాధనలెల్ల వినోదకరములే యగుచున్నవి. కాన విష్ణుని శరణు జొచ్చుటయే ముఖ్య కర్తవ్యమని అన్నమయ్య భావము.
వ్యాఖ్యాత : సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, ఎం.ఏ. -  (పొన్నాడ లక్ష్మి.)

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...