5, మార్చి 2018, సోమవారం

ఈలపాట రఘురామయ్య

ఈలపాట రఘురామయ్య కు నివాళి (నా పెన్సిల్ చిత్రం)
తెలుగు నాటకరంగంలో «ఈలపాట రఘురామయ్య ధృవతారగా వెలుగొందారు. 82 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య పేరు చిరస్థాయిగా నిలిచింది. 45వేల నాటకాలు ప్రదర్శించడమే కాకుండా వంద సినిమాల్లో నటించిన ఈయన తెలుసు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమ 1932లో ఆవిర్భవిస్తే, 1933వ సంవత్సరంలో ఈయన ‘పృధ్వీ పుత్ర’ అనే మొదటి సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. చూపుడు వేలు నాలుక కింద పెట్టి ఈలపాటతో ఆయన చేసిన వేణుగానం వల్ల ఈలపాట ఇంటిపేరుగా మారింది. 1901వ సంవత్సరం మార్చి 5వ తేదీన గుంటూరు జిల్లా సుద్దపల్లిలో జన్మించిన రఘురామయ్య 8వ ఏట నుంచే నాటకరంగ ప్రవేశం చేశారు.
శకుంతల, రత్నావళి, రాణి సంయుక్త వంటి స్త్రీ పాత్రలు, రాముడు, కృష్ణుడు, నారదుడు, భవానీ శంకరుడు వంటి పౌరాణిక పాత్రల్లో ఈయన నటించారు. చింతామణి, భక్తమార్కండేయ, కృష్ణప్రేమ, శ్రీకృష్ణాంజనేయ యుద్దం వంటి చిత్రాల్లో హీరోగా నటించిన రఘురామయ్య ఎన్నెన్నో వైవిధ్య పాత్రలు ధరించారు. సినిమాలు చేస్తున్నా, నాటకాన్ని వదలలేదు. అద్భుత నటన, అమరగానం, మురిపించే రూపం, మైమరిపించే ఈలపాటతో ఆరున్నర దశాబ్దాల పాటు రంగస్థలాన్ని ఏలారు. జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రబీంద్రనాథ్ టాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్‌లు ఈయన కళాచాతుర్యాన్ని మెచ్చుకున్నారు. రాష్ట్రపతిగా వివి గిరి ఉన్నపుడు ఈలపాట రఘురామయ్య గారితో శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేయించుకున్నారు.
శివాజీగణేషన్, ఎం.జి.రామచంద్రన్, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంలు ఈలపాట రఘురామయ్యను అభినందించారు. ఈలపాటతోపాటు తన నటనతో తెలుగునాట ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ఈలపాట రఘురామయ్య 1975వ సంవత్సరంలో తనువు చాలించినా, ఆయన జ్ఞాపకాలు మాత్రం అజరామరంగా నిలిచాయి.

2, మార్చి 2018, శుక్రవారం

మదన్ మోహన్ - Woh kaun thi - ఆమె ఎవరు



చిత్రసీమ లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. మదన్ మోహన్ ఓ అద్భుత సంగీత దర్శకుడు.  'Woh kaun thi' చిత్రం కోసం వారు స్వరపరచిన Naina barase ఓ సూపర్ హిట్ సాంగ్. లతమంగేష్కర్ విదేశీ యాత్రలో ఉన్న కారణంగా ఈ పాట చిత్రీకరణ కి జాప్యం జరుగుతొందిట. అప్పుడు మదన్ మోహన తానే ఈ పాటను పాడి రికార్డు చేసారు. తదనుగుణంగా నటి  సాధన lip movement చేసారట. లత విదేశాలనుండి తిరిగివచ్చాక తిరిగి ఈ పాట లత గారి చేత పాడించి సినిమాలో చొప్పించారట. మదన్ మోహన్ గారి గళంలో ఈ పాట వినండి మరి.





ఈ చిత్రాన్ని 'ఆమె ఎవరు' అనే title తో తెలుగులో కూడా నిర్మించారు. ఈ పాట ని అదే tune తో చిత్రీకరించారు. వేదా గారు సంగీతం సమకూర్చారట. సుశీల గారు ఈ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మదన్ మోహన్ గారి సంగీత దర్శకత్వం వహించిన పాడే అదృష్టం లేకపోయినా వారు సమకూర్చిన 'నయనా బరసే' పాట తెలుగులో పాడుకునే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషించానని చెప్పుకున్నారు. ఆమె పాడిన వీడియో కూడా తిలకించండి మరి.





24, ఫిబ్రవరి 2018, శనివారం

మనసున మల్లల మాలలూగెనే - దేవులపల్లి కృష్ణశాస్త్రి



మనసున మల్లెలు మాలలూగెనే

ఈ రోజు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి.


మిత్రులు శ్రీ Vinjamuri Venkata Apparao  గారి facebook పోస్ట్ నుండి సేకరణ - వ్యాసం తో పాటు నేను చిత్రించిన ఆ మహనీయుని pencil చిత్రాలు కూడా క్రిందన పొందుపరుస్తున్నాను. 
 .
మాట్లాడే భాషకు హృదయవీణలద్ది తేట తెలుగు స్వచ్చందనాలతో తెలుగు సినిమా పాటలను మూడు దశాబ్దాల పాటు హిమవన్నగంపై నిలిపిన అరుదైన కవులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒకరు. కోటి కోయిలలు ఒక్క గొంతుకతో తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో దేవులపల్లి పాటను విని మనం అనుభూతి చెందవచ్చు.
మావి చిగురు తినగానే కోయిల పలికేనా... ఆకులో ఆకునై పూవులో పూవునై.... నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... గోరింట పూచింది కొమ్మా లేకుండా... ఆరనీకుమా ఈ దీపం... వంటి హృదయంగమ గీతాలను అందించిన కృష్ణశాస్తి తొలి సినిమా గీతం పాత 'మల్లీశ్వరి' చిత్రంతో మొదలు కావడం విశేషం.
ఒక దీర్ఘ నిరీక్షణ అనంతరం. ఇక కలుసుకోవడం అసంభవం అనిపించిన బావ తన కళ్ల ముందే కదులాడితే... ఆ వెన్నెలరాత్రి.. ఉద్యానవనం నీటి మడుగు దాపున తనను కలవబోయే మహత్తర క్షణాల్లో ఒక పల్లె పడచు హృదయం కొట్టుకునే గుండె చప్పుళ్లే కృష్ణశాస్త్రి మనసున మల్లెల మాలలు...
తెలుగు పాట ఇంత కమ్మగా, తీయగా ఉండేదా అని భవిష్యత్ తరాల తెలుగు వారు పొగుడుకునేటటువంటి అజరామరమైన సినిమా గీతాలు కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారాయి మల్లీశ్వరి నుంచి ప్రారంభించి ఆయన అందించిన సినిమా పాటలు సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు.
కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ కృష్ణశాస్త్రి రచన కృష్ణ పక్షము ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగాన్ని దీప్తింపజేసిన ఒక ముఖ్య క్షణం. ఇదే దాదాపు 50 ఏళ్ల తర్వాత మేఘ సందేశంలో సినిమా పాటగా మారి తెలుగు వారు గర్వంగా చెప్పుకునే గొప్ప గీతంలా చరిత్రలో నిలిచిపోయింది.
మల్లీశ్వరి సినిమాలో ఆయన తొలి గీతం చూద్దాం... పల్లెటూరులోని బావను వీడి అనుకోకుండా రాయలవారి అంతఃపురంలో నివసించవలసి వచ్చిన మల్లి.. తన బావను అదే అంతఃపురంలో కలుసుకునే క్షణం కోసం ఎదురు చూడవలసి వచ్చినప్పుడు... ఒక దీర్ఘ నిరీక్షణ అనంతరం. ఇక కలుసుకోవడం అసంభవం.. ముఖాముఖంగా చూసుకునే అవకాశం అసంభవం అనిపించిన బావ తన కనుల ముందు స్పష్టాస్పష్టంగా కదులాడితే... ఆ వెన్నెలరాత్రి.. ఉద్యానవనంలోని నీటి మడుగు దాపున కలవబోయే మహత్తర క్షణాల్లో ఒక పల్లె పడచు భావోద్వేగ హృదయం కొట్టుకునే గుండె చప్పుళ్లను కృష్ణశాస్త్రి గారు మనసున మల్లెల మాలలూగిస్తూ మనకు వినిపిస్తారు...
సున్నిత భావ ప్రకటనకు, ఒక ప్రియురాలి విరహ వేదనకు ఈ పాట ఒక సజీవ సాక్ష్యం... గువ్వల సవ్వడి వినిపించినా, గాలి కదులాడినా, కొలనులో అలలు గలగలమన్నా, కొంచెం దూరంలో వేణు గానం గాల్లో తేలుతూ హృదయాన్ని తాకినా నా బావే వచ్చాడంటూ ప్రకపించే ఒక తెలుగు ముగ్గ సుకుమార సౌందర్యాన్ని ఆ పాట, ఆ పాట చిత్రీకరణ నభూతో నభవిష్యతి అనేంత మహత్తరంగా మన కళ్లకు కట్టిస్తాయి. ఆ రాత్రి ఆ ప్రియురాలి మృత్యుశీతల అనుభవాన్ని ఆస్వాదించడానికైనా ఆ పాటను వినాలి. చూడాలి.
మీలో ఎవరైనా పాత తెలుగు మల్లీశ్వరిని చూసి ఉండకపోతే జీవితంలో ఒకసారైనా ఆ సినిమాను తెప్పించుకుని చూడండి. మన తర్వాతి తరాలవారికి తెలుగు సినిమా గొప్పతనం చూపించేందుకయినా ఆ సినిమా సిడి లేదా డివిడిని భద్రంగా పదిలపర్చుకోండి. మన భానుమతి పాడి, నటించినటువంటి జన్మానికో చల్లటి అనుభవం లాంటి ఆ పాటను తనివి తీరా వినండి.
మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల డోలలూగెనె
ఎంత హాయి ఈరేయి నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో కొమ్మల గువ్వల సవ్వడి వినినా

రెమ్మల గాలుల సవ్వడి వినినా
ఆలలు కొలనులొ గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చెవని నీపిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియె యేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో
ఎంత హాయి ఈరేయి నిండెనో

క్రింది లింకు క్లిక్ చేసి ఈ మధురగీతాన్ని వినండి.



23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మనిషి - కవిత


మిత్రులు శ్రీ Vemuri Mallik గారి కవిత కి నా చిత్రం వారి అనుమతితో. వారికి నా ధన్యవాదాలు. చదవండి.
మనిషీ నీవో వింతజీవివే..
తనువుని బంధించుకుంటూ..
మనసుకు బందీవై..
గెలిచాననుకుంటూ ఓడిపోతూ..
ఓటమి సైతం నీ గెలుపనుకుంటూ..
అందనివన్నీ పులుప‌నుకుంటూ..
అందినవన్నీ చేదని తలపోస్తూ..
నిజాన్ని ఒప్పుకోలేక..‌
అబద్ధమని చెప్పుకోలేక..
ఇలలో గిరిగీసుకుంటూ..
కలలో హద్దులు చెరుపుకుంటూ..
ఉన్న మాటలకు ఉలిక్కిపడుతూ..
అంతరాత్మ పీకినులిమి..
ఎదుటివాడికి వేలుచూపుతావు..
నిన్ను చూపే మూడు వేళ్ళకు..
గంతలు కడతావు..
లోకానికి ఓ హరిశ్చంద్రుణ్ణి నేనంటావు..
సఛ్చీలతే నా సొత్తంటావు..
ఆషాఢభూతినే అనుకరిస్తావు..
మన:తనువులుగా విడిపోతావు..
మనో వాక్కులంటూనే..
రెండు ముసుగులతో ఉంటావు..
మనిషీ నువ్వో రెండుకాళ్ళ వింతజీవన్నది నిజమనిపిస్తావు..‌!!

22, ఫిబ్రవరి 2018, గురువారం

తెలుగు తల్లి - మాతృభాష

నేనొక చిత్రకారుణ్ణి - బహుశా బాపు గారు వేసిన చిత్రమనుకుంటాను. దానికి రంగులద్ది ఇక్కడ  పోస్ట్ చేసాను.
రోజురోజుకీ మితిమీరిన  ఆంగ్ల పదాలతో  తియ్యని మన తెలుగు కలుషితం అవుతోంది.. ఈ విషయంలో నేను ఆవేదన చెందుతుంటాను. 'నీరు' అన్న పదం మరచిపోయారు, ఇప్పుడు వాటర్ అన్న పదం తెలుగులోకి చేరిపోయింది.  ఇలా ఒకటేమిటి, ఎన్ని పదాలో అవసరాన్ని మించి మన భాషలో కలిపేసుకుంటున్నాం. ఇంక సినిమాలు, కధలు, నవలల సంగతి సరేసరి. చివరికి సినెమా పేర్లు కూడా ఇంగ్లీష్ పదాలనే వాడుతున్నారు, ఉదాహరణకి : లెజెండ్, ఇంటలిజెంట్, ఇగో, స్కెచ్, ఇత్యాదివి. ఇంతటి మార్పు మన తెలుగుకి తీసుకురావడం అవసరమా .. ఇది నన్ను వేధిస్తున్న ప్రశ్న.    ఇలా ఎన్నొ పదాలు తెలుగు మన వాడుక భాషలోకి, సినిమాల్లోకి, కధల్లో కి, నవలల్లో కి చేరిపోతున్నాయి.

February 21 మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలువురు మిత్రులు whatsapp లో మన తెలుగు భాషమీద ఉన్న మమకారాన్ని వ్యక్తపరచుకున్నారు. మన భాషలో వస్తున్న మార్పుకి ఆవేదన చెందుతూ, రచనలూ కవితలూ పెట్టారు.  నా దృష్టికి వచ్చిన కొందరి  రచనలు, కవితలు, పద్యాలు క్రిందన పొందుపరుస్తున్నాను.
-------------------------------------------------------------------------------------------------------------------

ఫిబ్రవరి 2016 శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా  యిచ్చిన సమస్య "దేశభాషలందు తెలుగు లెస్స" అన్న పద్య పాదం తో పద్యం.
 దీనికి సిలికానాంధ్ర సుజనరంజని
 మాసపత్రిక  మార్చి 2016 లో ప్రచురితమైన నా పద్యం.

సీ* ఏభాషలో మాట లేదేశ వసతైన
మురిపించి తెలిగించుముచ్చటలను
ఏభాషలో పాట లింపార సొంపార
 స్వరముల రసహేల సంతరించు
ఏభాషలో యాస లెందేని వినిపించ
ఏప్రాంతవాసులోఎరుకపరచు
ఏభాషలో పద్యమేయింటపఠియించ
 తెలుగింటి వారంచు తెలియబరచు
 అట్టి సరస మధుర సాహిత్యసంగీత
ఆశుకవితల కలితావధాన లలిత
మాటపాటలందుమేటియైమెప్పించు
దేశ భాషలందు తెలుగు లెస్స
      గండికోట విశ్వనాధం
--------------------------------------------------------------------------------------------------------------------------

మాతృ భా (ఘో )ష

మీరు మరచిపోతున్న
మాతృభాష ను నేను
ఆదరణ కరువవుతున్న
అమృత భాషను నేను

నన్నయ్య ఇచ్చాడు నాకు కావ్యగొరవం
చిన్నయ్య కూర్చాడు నాకు వ్యాకరణం
తిక్కన్న నాలోని సొగసుల్ని చూశాడు
పోతన్న నాలోని తీయదనం చూపాడు

అన్నమయ్య కీర్తనలో భక్తిరసం నేనేను
కృష్ణ శాస్త్రి పాటలోని ఆర్తియన్న నాదేను
గురజాడకు అందించా అభ్యుదయపు వాడి నేను
శ్రీ శ్రీ లో చూపించా కవిత్వంపు పదును

అన్ని భాషలలోన మిన్న నేనేనన్న
ఖ్యాతినే పొందాను
కనుకనే పొంగాను
తెలుగు తేటయన్న
మాటదక్కిందన్న
భావనతో మైమరిచా
ధన్యనంటు నే తలచా

శతకాలతో జాతికి నీతుల్ని నేర్పాను
ప్రబంధాలతో శృంగార లోతుల్ని చూపాను
అవధానపు ప్రక్రియలో ప్రత్యేకత చాటాను
ఆధ్యాత్మ భావాల అంచులే తాకాను

విన్నారా!
ఇది అంతా గతకాలపు వైభవం
చూశారా !
నేడు నాది శోచనీయ అనుభవం

నేను రానంటారు
నన్ను వద్దంటారు
అభివృద్ధి పథాన నా ఉనికి
ఆటంకం అంటుంటారు
అమ్మపాలతో పాటుగా అలవడేటి నన్ను
అమ్మ జోల పాట లోని హాయినయిన నన్ను
నేడు
అవహేళన చేస్తున్నారు
అల్పంగా చూస్తున్నారు

మనసారా నన్ను తాము
నేర్వలేని నిర్భాగ్యులు
నోరారా మాతృభాష
పలుకలేని పాపాత్ములు
నన్ను జీవచ్ఛవాన్ని చేస్తున్నారు
అన్యభాషా పదాల అతుకులేస్తున్నారు

అన్ని భాషలలోనున్న కొన్ని వేల పదాలను
అచ్చులతో చేయూతనిచ్చి
అక్కున చేర్చుకున్న నాకు
ఆ ఔదార్యగుణమే నేటికి
ఆత్మహత్యా సదృశమయ్యింది

నా భవితవ్యపు ఆశలిప్పుడు
భాషాభిమానుల‌ చేతుల్లో విడిచాను

బడుగుభాషను కాను
మీ జీవనాడిని
కానివ్వండి మననిచ్చి
నన్ను చిరంజీవి ని.

సింహాద్రి జ్యోతిర్మయి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం
( న ర సం ) ఉపాధ్యక్షురాలు
21.2.2018. - Simhadri Jyotirmayi

--------------------------------------------------------------------------------------------------------------------------


వృక్షాగ్ర భాగాన పక్షమ్ము లదలించి‌
     పాడెడి కోకిల పాటలందు,
ఉద్యాన వనముల హృద్యత పురివిప్పి
      యాడెడి కేకి నృత్యములయందు,
హ్లాదమౌ మానస లహరుల దేలుచు
నడయాడు రాయంచ నడల యందు.,
గిరి శృంగముల నుండి ఝరులౌచు గలగల
 ప్రవహించు సెలయేటి పరుగులందు
పూవు తావుల,ఘంటికా రావములను,
జానపదములు సుడులెత్తు జనుల నోట
నీదు చరితమ్ము వినిపించు నిక్కువమ్ము
తెలియ తరమౌనె నీశక్తి తెలుగు తల్లి.

సకల భాషల వీడక సఖ్యగతిని
మెలగు చుండెడి భాష యీ తెలుగు భాష
దేశభాషల లెస్సరా తెలుగుభాష
దీని బ్రతికింప దీక్షను బూనుడయ్య.

మద్దూరి రామమూర్తి.
--------------------------------------------------------------------------------------------------------------------------

Hemadri Rao garu :
మిత్రులకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు:

 అమ్మభాషలో అమ్మదనం
మాతృభాషలో కమ్మదనం

అమ్మభాష అమృతం
మాతృభాష సమ్మోహితం

తెలుగుభాష తియ్యదనం
తెలుగు మాట కమ్మదనం

తెలుగు పలుకు తేనెలొలుకు
తెలుగు మాట వెలుగు బాట

తెలుగు పాట తేనేలోమాగినట్టి
తియ్య మామిడి ఊట

తెలుగు జిలుగు తాకని
నేల లేదేందు ఈ జగతిలోన

తెలుగు ప్రభలు ప్రసరిల్లు
నలు చెరగులు

తెలుగు రేఖలు విరజిల్లు
సుమ్మోహన పరిమళాలు

గగన సిగన త్రివర్ణ కేతనం ఎగురునందాక
ఆ చంద్ర తారార్కం
నిలుచునందాక

అమ్మ ప్రేమెంత కమ్మనిదో
తెలుగు మాటంత తియ్యనిది
------------------------------------------------------------------------------------------------------------------------
తెలుగు పలికే నేలపై పుట్టిన ఘనులము మనమంతా.....సిరులతో పనిలేదు తెలుగు భాష యనే  అనంత సిరిసంపదలకు వారసులం మనం......ఇంతటి మధురమైన తెలుగు భాషకు వారసులైన ప్రతీ తెలుగువాడి జన్మ ధన్యమే

* మధురం మధురం నా తెలుగు మధురం *
1.
కదళి  ఫలము  ద్రాక్ష  కర్జూరముల కన్న
పనస  జామ  రేగు  పండ్ల  కన్న
అచ్చ  తెనుగు  భాష  అత్యంత  మధురంబు
విశ్వ  సత్య  మిదియె  విశ్వసింపు

2.మధుర మకరంద మాధుర్య సుధలు నిండి
వీనులలరించి మురిపించు! విరుల భంగి
సొబగు లీనెడు నాభాష సోయగమ్ము
దేశ భాషలందునమేటి తెలుగు సుమ్ము

3.
పూత రేకులరిశె పూర్ణంపు భక్ష్యాలు
కాకినాడ కాజ కజ్జి కాయ
పాల కోవ పుణుగు బందరు లడ్డూల
తీపి కన్న నాదు తెలుగు మేటి.

4.
మాతృ భాష పట్ల మమకారమే లేని
వాడు హీను డౌను పశువుకన్న
తల్లి నేర్పియున్న తనభాషనేవీడ
మాతృద్రోహి యగును మహిన వాడు.

5.
విశ్వమందు చెరగు వివిధ భాషల లోన
నాదు తెలుగు మిన్న నాణ్యతెన్న
అంధుడైన వాడి కందుమాధుర్యము
నేలయెరుగ గల్గునిలన ఖలుడు

6.
తెలుగు భాషయనిన తేలికంచు దలచి
ఆంగ్లమొకటె యవని నధిక మంచు
భ్రాంతిలోన బ్రతుకు బానిస పుత్రులీ
తెలుగు తల్లి కంట నలుసు లైరి

ఒక ముఖపుస్తక స్నేహితుడి సహాయ సహకారములతో.. (Whatsapp నుండి సేకరణ)

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

మనసుకన్న విందుసేయు..మేఘబాల ఎవ్వరోయి - గజల్





మనసుకన్న విందుసేయు..మేఘబాల ఎవ్వరోయి..!?
చేమంతుల పసిడివాన..పూలబాల ఎవ్వరోయి..!?
ఊరించే తనచూపుల..ఊయలనే నిలిపెనుగా..
కవ్వించక కదిలించే..కలువబాల ఎవ్వరోయి..!?
ప్రతిరేయిని ముచ్చటగా..నిదురపుచ్చు చిత్రముగా ..
కలలవీణ మీటుతున్న..రాగబాల ఎవ్వరోయి..!?
నిదురించని కంటిపాప..ఎంత పరమ సాక్షి అసలు..
సున్నితమౌ మౌనసుధా..కావ్యబాల ఎవ్వరోయి..!?
గజలింటను నాట్యమాడు..చిరునవ్వుల మెఱుపుతీవ..
రెప్పపాటు మాటు నిలచు..గంధబాల ఎవ్వరోయి..!?
ఈ మాధవ అక్షరాల..గగనసీమ నేలేనే..
సర్వము మరి తానయ్యిన..సరసబాల ఎవ్వరోయి..!?

 (నా చిత్రానికి శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు అల్లిన గజల్)

19, ఫిబ్రవరి 2018, సోమవారం

పూవనిలో ఆమని - కవిత




పూవనిలో ఆమని (కవిత - Courtesy : Meraj Fathima)
నా చిత్రానికి ఓ video పాటలో అదనపు హంగులు అద్దిన రాణి రెడ్డి గారికి కృతజ్ఞతలు
మంచులో ముంచిన మల్లెవు నీవు,
మంచితో నిండిన మమతవు నీవు,
అరుణోదయంలో విచ్చిన మందారం నీవు
చంద్రోదయంలో విచ్చిన కలువవు నీవు
తెలిమబ్బుపై తేలియాడే తరుణం నీవు
తొలిపొద్దుపై తేటయని కిరణం నీవు
పగడపూలలో విరజిమ్మే సువాసన నీవు
ప్రగతి బాటలో నటించే జన సమూహం నీవు
అనురాగ సరాగాల ప్రవాహం నీవు
అందని అపురూపాల ప్రశంసవు నీవు
మంచు బిందువులు ముద్దాడిన నందివర్ధనం నీవు
మలినమంటని స్వచ్చమైన చందమామ నీవు
తూరుపు ఉషోదయ తుషార బిందువు నీవు
గంధర్వలోకాన పూవనిలో అరుదెంచిన ఆమని నీవు

బెజవాడ రాజారత్నం - నటి, గాయని

   బెజవాడ రాజారత్నం -  pencil sketch  ​అలనాటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలితరపు నటి మరియు తొలి నేపథ్య గాయనీమణులలో బెజవాడ రాజారత్నం గారు ప్...