5, మార్చి 2018, సోమవారం

ఈలపాట రఘురామయ్య

ఈలపాట రఘురామయ్య కు నివాళి (నా పెన్సిల్ చిత్రం)
తెలుగు నాటకరంగంలో «ఈలపాట రఘురామయ్య ధృవతారగా వెలుగొందారు. 82 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య పేరు చిరస్థాయిగా నిలిచింది. 45వేల నాటకాలు ప్రదర్శించడమే కాకుండా వంద సినిమాల్లో నటించిన ఈయన తెలుసు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమ 1932లో ఆవిర్భవిస్తే, 1933వ సంవత్సరంలో ఈయన ‘పృధ్వీ పుత్ర’ అనే మొదటి సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. చూపుడు వేలు నాలుక కింద పెట్టి ఈలపాటతో ఆయన చేసిన వేణుగానం వల్ల ఈలపాట ఇంటిపేరుగా మారింది. 1901వ సంవత్సరం మార్చి 5వ తేదీన గుంటూరు జిల్లా సుద్దపల్లిలో జన్మించిన రఘురామయ్య 8వ ఏట నుంచే నాటకరంగ ప్రవేశం చేశారు.
శకుంతల, రత్నావళి, రాణి సంయుక్త వంటి స్త్రీ పాత్రలు, రాముడు, కృష్ణుడు, నారదుడు, భవానీ శంకరుడు వంటి పౌరాణిక పాత్రల్లో ఈయన నటించారు. చింతామణి, భక్తమార్కండేయ, కృష్ణప్రేమ, శ్రీకృష్ణాంజనేయ యుద్దం వంటి చిత్రాల్లో హీరోగా నటించిన రఘురామయ్య ఎన్నెన్నో వైవిధ్య పాత్రలు ధరించారు. సినిమాలు చేస్తున్నా, నాటకాన్ని వదలలేదు. అద్భుత నటన, అమరగానం, మురిపించే రూపం, మైమరిపించే ఈలపాటతో ఆరున్నర దశాబ్దాల పాటు రంగస్థలాన్ని ఏలారు. జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రబీంద్రనాథ్ టాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్‌లు ఈయన కళాచాతుర్యాన్ని మెచ్చుకున్నారు. రాష్ట్రపతిగా వివి గిరి ఉన్నపుడు ఈలపాట రఘురామయ్య గారితో శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేయించుకున్నారు.
శివాజీగణేషన్, ఎం.జి.రామచంద్రన్, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంలు ఈలపాట రఘురామయ్యను అభినందించారు. ఈలపాటతోపాటు తన నటనతో తెలుగునాట ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ఈలపాట రఘురామయ్య 1975వ సంవత్సరంలో తనువు చాలించినా, ఆయన జ్ఞాపకాలు మాత్రం అజరామరంగా నిలిచాయి.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...