24, మే 2022, మంగళవారం

"అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత- శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి" - అనమయ్య కీర్తన - చిత్రం : పొన్నాడ మూర్తి


 

అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత-
శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి ॥పల్లవి॥


అంభోధి లంఘించితివి హనుమంతుడా
కుంభినీజదూతవైతి గురు హనుమంతుడా
గంభీరప్రతాపమున కడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి ॥అఖిల॥


అంజనీదేవికుమార హనుమంతుడా
కంజాప్తఫలహస్త ఘన హనుమంతుడా
సంజీవని దెచ్చిన శౌర్యుడవు
రంజిత వానరకుల రక్షకుండ వైతివి ॥అఖిల॥


అట లంక సాధించిన హనుమంతుడా
చటుల సత్త్వసమేత జయ హనుమంతుడా
ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశునకు
తటుకన బంటవై ధరణి నిల్చితివి ॥అఖిల॥

17, మే 2022, మంగళవారం

అప్పని వరప్రసాది అన్నమయ్య






పద కవితా పితామహుడుఅన్నమయ్య పై చిన తిరుమలాచార్యుడు రచించిన కీర్తన


అప్పని వరప్రసాది అన్నమయ్య

అప్పసము మాకే కలడన్నమయ్య ||


అంతటికి ఏలికైన ఆదినారాయణు తన

అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య

సంతసాన చెలువొందే సనకసనందనాదు-

లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య ||


బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు

హరిమీద విన్నవించె అన్నమయ్య

విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల

అరసి తెలిపినాడు అన్నమయ్య ||


అందమైన రామానుజ ఆచార్యమతమును

అందుకొని నిలచినాడు అన్నమయ్య

విందువలె మాకును శ్రీవేంకటనాధునినిచ్చె

అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||


ఈ కీర్తన గురించి డా. ఉమాదేవి ప్రసాదరావు గారు ఇలా వ్యాఖ్యానించారు. ఆమెకు నా ధన్యవాదాలు.


ఓం నమో వేంకటేశాయ 🙏

సనకసనందనాదులతో సమానమైనవాడు, ఆశ్రీనివాసుడికి బిరుదులు పలుకుతూ పట్టిన ధ్వజముల వంటి కీర్తనలు రచించినవాడు, వేదార్థములను గ్రహించి తన కీర్తనలలో పొదిగినవాడు అయిన అన్నమయ్య మాకే భగవంతుడిచ్చిన వరప్రసాది.

తాను అందమైన రామానుజమతాన్ని స్వీకరించి మనకు వేంకటపతిని మనసుకు, వీనులకు విందుగా తన కీర్తనలతో అందించినవాడు అన్నమయ్య !
అద్భుతమైన చిత్రం అన్నగారూ 🙏🏼
పదకవితా పితామహునికి నీరాజనం
A

7, మే 2022, శనివారం

అలమేలు మంగా హరి అంతరంగ


 వారం వారం అన్నమయ్య అంతరంగా... అన్నమయ్య కీర్తన


ఈ వారం కీర్తన : ప : అలమేలుమంగా హరియంతరంగా

~~~~~~~~🍁🍁~~~~

విశ్లేషణ డా. Umadevi Prasadarao Jandhyala 

చిత్రలేఖనం : పొన్నాడ మూర్తి


ఓం నమో వేంకటేశాయ 🙏

🌻ప్రార్థన


*******

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై

రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై!

శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై!!


🌻కీర్తన లిరిక్స్

************

ప : అలమేలుమంగా హరియంతరంగా

కలితనాట్య రంగా కరుణాపాంగా


చ : అలినీలవేణి అంబుజపాణి

వెలయగ జగదేక విభునిరాణి


చ : స్మి(శి)తచంద్రవదనా సింగార సదనా

చతుర దాడిమ బీజచయ సనా(రదనా)


చ : హితవైన శ్రీవేంకటేశుడిదే ననుగూడె(డునిన్నిదేకూడె)

ప(త)తి తలపోతల సమ(తన)కూడె కూడె


🔹కీర్తనకు అద్భుతమైన చిత్రం వేసిన ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి కృతజ్ఞతలు 🙏


🌻కీర్తన సారాంశం తెలిసినంత 

————————————

హరిఅంతరంగమే అలమేలు మంగ!

ఎంత అద్భుతంగా ఉంది ఈ వాక్యం!


భార్య భర్త అంతరంగాన్ని గ్రహించాలి. భర్త భార్యను తన అంతరంగంలో నిలుపుకోవాలి. భార్యాభర్తల అనుబంధం ఇలా ఉండాలి! 


అలరు అంటే పద్మం . మేల్ అంటే పైభాగం. పద్మావతి, పద్మజ అని అర్థం. ఆ పద్మం శ్రీహరి హృదయపద్మమే. ఇంతకూ లక్ష్మీదేవి ఆయన వక్షస్థల నివాసిని ఎలా అయింది? దానికో కథ ఉంది. 


శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి మీద ఎనలేని ప్రేమతో ఏదైనా కోరుకో మన్నాడట. “మీ ప్రేమకన్నా నాకు వేరే ఏంకావాలి” అన్నదట. నిజమే కానీ పరమేశ్వరానుగ్రహం కలిగితే మరింత మంచిదని శివుని గురించి తపస్సు చేయమని చెప్పాడట. లక్ష్మీ దేవి తపస్సు ప్రారంభిస్తూ వినాయకుని పూజించడం మరిచిపోవడంతో ఆమె మనస్సు లగ్నం చేయలేకపోతున్నదట. నారదుని సలహాతో గణపతిని ప్రార్థించినా ఫలితం లేకపోయింది. ఆ తరవాత ఆమెరుద్రహోమం జరిపింది. అందులోనుండి ఆకలి … ఆకలి అంటూ వచ్చిన ఒక భయంకరమైన అగ్నిరూపానికి తన ఎడమ రొమ్మును కోసి నివేదించింది. శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమై ఆమె ఎప్పుడూ పతి వక్షస్థలంలో ఉండేలా వరమిచ్చాడు. 


ఇవ్వాలి అనే సంకల్పం కలిగేది అంతరంగంలో. ఆ అంతరంగంలో సంపదలకు అధిష్ఠాన దేవత లక్ష్మీ దేవి ఉండటం వలననే స్వామి భక్తుల కోరికలు తీర్చగలుగుతున్నాడు. ఆమే లేకపోతే ఆయనకు ఇవ్వాలని ఉన్నా ఇచ్చేందుకు ఏమీ ఉండదన్నమాట! 

అన్నమయ్య ఒక్క వాక్యంలో ఇంత విశేషముంది!


‘కలిత నాట్యరంగా!కరుణాపాంగా!’

లక్ష్మీ దేవి నట్టింట నాట్యం చేస్తోంది అంటుంటాం మనం. ఘల్లుఘల్లున లక్ష్మీ దేవి నడయాడితేనే సిరుల పంట. ఇక నాట్యం చేస్తే అశేష సంపద ప్రసాదించిందని అర్థం .

ఆ సంపద చూసి అహంకారం తలెత్తితే ఆమె శిరసున నాట్యం చేస్తుందట! 

ఆమె కరుణాపాంగ! కంటి కొసల నుండి కృపతో చూస్తే చాలు. తరించి పోతాం. 


కీర్తన చరణాలు చూద్దాం.


1)మొదటి చరణంలో అమ్మ అలమేలు మంగ అందాన్ని మనకు చూపుతున్నాడు అన్నమయ్య.

ఆమె నిడుపాటి నల్లని కురులు కలది. చేతిలో పద్మాన్ని పట్టుకొని వయ్యారంగా నిలబడింది.

‘పద్మం చుట్టూ ఏం ఉన్నా నువ్వు, నీమనసు  స్వచ్ఛంగా ఉండాలి’ అనడానికి గుర్తు. పుట్టిన మకిల నుండి ఎదగడం నేర్చుకోమని చెప్పడానికే పద్మాన్ని ధరిస్తుంది.


అలాగే ఆరోగ్యానికి, మానసికమైన ఒత్తిడి లేనివారికి పొడవాటి కురులుంటాయి. ఆలోచనలతోటే జుట్టు ఊడిపోతుంది. స్త్రీత్వానికి, అందానికి, మానసిక బలానికి నిదర్శనం ఒత్తైన పొడవైన జుట్టు.

జగదేక విభుడైన నారాయణునికి అర్థాంగి కావడానికి ఎన్నో అర్హతలు గలతల్లి లక్ష్మీదేవి. అందుకే అన్ని విధాల గుణవతియైన, చూడగానే బాగున్న  స్త్రీని మహాలక్మిలా ఉన్నావమ్మా అంటారు.


*రెండవ చరణంలో వర్ణింపబడిన లక్ష్మీ దేవి మహిళలకే మార్గదర్శకం. ఒక మంచి గృహిణి ఇలా ఉండాలి… అని చెబుతున్నట్లుంటుంది. మనసు హాయిగా ఉండాలంటే ఒకరకమైన కౌన్సిలింగ్ ఇది.


ఆమె వదనం ఎప్పుడూ చిరుదరహాసంతో శోభిస్తుంటుంది.అలా నవ్వినప్పుడు దానిమ్మ గింజలవంటి ఆమె పలువరస చూడముచ్చటగా ఉంటుంది. ఆమె భవనం ఎప్పుడూ అలంకరింపబడి కనులకింపుగా ఉంటుంది.


అందమైనదీ, అనుకూలవతి అయిన ఆ హృదయరాణిని గోవిందుడు గుండెలో పెట్టుకున్నా ఎప్పుడెప్పుడు ఆమె చెంత చేరుతానా అని  ఆయన

మనసంతా ఆమెతలపులతో నిండిపోతుందిట!


ఉ॥

తామర చేతబట్టి కనుదామరలందుకృపాకటాక్షముల్ 

తామస హారియై బరపి, ధాన్యధనంబులు రాసిబోయదే!  

శ్రీమహలక్షి నర్తనము జేయను సజ్జనులింట నెమ్మితో!  


క్షేమము గూర్ప నాస్మితముఖిన్ నిరతంబును గొల్వగాదగున్!

( స్వీయ రచన) 


స్వస్తి

~~~~~🙏🏼~~~~~~

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

'అమ్మ ..' పద్యాలు

#కందము 

అమ్మను మించిన దైవము

కమ్మని లాలన గల యొడి కలదా జగతిన్..

అమ్మకదా మన సర్వము

నమ్మే తొలి గురువు నయ్యె నక్షరమగుచున్..!!


#కందము 

తన్మయమును బొందు జనని

చిన్మయ రూపుడని ముద్దు సేయుచు శిశువున్..

జన్మ తరింపగ నవ్వులె

సన్మానమదియని తలచి సాకుచు మురియున్.!!


#కందము 

పెంచును ప్రేమను మమతలు 

పంచుచు నమ్మే సకలము పాపకు చూడన్

యెంచదు భారముననుచును

కంచెగ మారుచునుతాను కాచును శిశువున్..!!


#కందము 

తల్లి యొడిన జేరగనే

త్రుళ్ళుచునాడును శిశువులు దోగాడుచునే...

మెల్లన యడుగుల ముద్దుగ

మళ్లించును దృష్టి నంత మాటల తోడన్..!!

Sujathanagesh..✍️✍️

 

9, ఏప్రిల్ 2022, శనివారం

దేవదేవుడెక్కినదె దివ్యరథము మావంటివారికెల్ల మనోరథము - అన్నమయ్య కీర్తన


 



దేవదేవుడెక్కినదె దివ్యరథము

మావంటివారికెల్ల మనోరథము


జలధి బాలులకై జలధులు వేరఁజేసి
పగటునఁ దోలెనదె పైడిరథము
మిగులగ కోపగించి మెరయురావణుమీద
తెగియెక్కి తోలెనదె దేవేంద్ర రథము
దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు
పక్కన మరలిచె పుష్పకరథము
నిక్కు నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె
వెక్కసపు రెక్కలతో విష్ణు రథము
బలిమి రుఖ్మిణి దెచ్చి పరులగెల్చి యెక్కె
అలయేగుబెండ్లి కల్యాణరథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి
కలకాలమును నేగె ఘనమైన రథము!

డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు ఇచ్చిన విశ్లేషణ :

తెలిసినంతలో విశ్లేషణ
******************
చిన్నపిల్లల అక్షరమాల పుస్తకాలలో కూడ ర- దగ్గర రథము బొమ్మ ఉంటుంది. రథము అనే పదం వినగానే మనఊరి గుడి రథంనుంచి ,శ్రీవారి బ్రహ్మోత్స వాలలో వాడే స్వర్ణరథం, దారువు( కొయ్యరథం) వరకూ ఎన్నోగుర్తొస్తాయి। స్వామినీ , అమ్మవార్లను రథం మీద ఊరేగించడంఅన్నిటికన్నా గొప్ప సేవ అని చెబుతారు. రథోత్సవంతో సాధారణంగా ఉత్స వాలు ముగుస్తాయి. రథం పదం మనకు అనేక పురాణ గాథలను గుర్తు చేస్తుంది. ఉదాహరణకు రామాయణంలో సీతారాములు నూతన దంపతులుగా రథంలో అయోధ్యకు రావడం, సుమంత్రుడు వారిని అయోధ్య పొలిమేరలలో దింపి రావడం , యుద్ధంలో రాక్షసుల రథాలు, భారతంలో కంసుడు దేవకీ వసుదేవులను రథం మీద తీసుకొని వెళుతుంటే ఆకాశవాణి మాటలు, రుక్మిణీ కల్యాణం, నరకాసుర వథ, కర్ణుని రథ చక్రాలు భూమిలోకి కుంగడం, భీష్మ పర్వంలో ఘట్టాలు …. అన్నిటికన్నా కురుక్షేత్ర ప్రారంభంలో నిర్వీర్యుడైన అర్జునునికి భగవానుడు గీతబోధించడం ….. ఎన్నో వందల కథలున్నాయి.
బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవేంకట నాథునికి మొదటగా జరిపినవాడు బ్రహ్మ. ఈనాటికీ ఉత్సవానికి ముందు బ్రహ్మరథం నడపడం ఆనవాయితీ।
మనస్సులోని బలమైన కోరిక, చాలా గౌరవించటం అనే అర్థంలో మనోరథం, బ్రహ్రరథం అనే పేర్లు మీరు వినే ఉంటారు।
ఇక మన్మథుడిని శివుడిమీదకు యుద్ధానికి పంపుతూ కామధేనువు పూలరథం ఇచ్చిందంటారు పోతనగారు. ఇట్లా రథాలగురించి పెద్ద గ్రంథమే వ్రాయవచ్చు।
ఇక అన్నమయ్య కీర్తనలో విశేషాలు చూద్దాం.
తిరుమల శ్రీనివాసుని రథోత్సవం చూసిన అన్నమయ్యకు గుర్తొచ్చిన రథాలే కీర్తనగా రూపొందాయి.
మొట్టమొదట అంతా నీరే ఉండేది. ఆ జలధిని విభజించి భూ భాగాలను ఏర్పరచి వాటిని పరిపాలించే పాలకులను ఏర్పాటు చేసిన నియామకుడైన నారాయణుడు అదుగో బంగారు రథమెక్కి ఊరేగుతున్నాడు. ఇది స్వామికి దివ్యరథం, మనకు మనోరథం. (మన మనోరథములను తీర్చగలడని భావం)
రామరావణ యుద్ధం జరుగుతోంది.
రావణుడు రథంమీద ఉండటం , రాముడు నేలమీద ఉండటం సహించలేని దేవేంద్రుడు మాతలితో తన రథాన్ని, రథంతో పాటు ధనువు, కవచము, శక్తి కూడ పంపించాడు. దేవేంద్రుని కోరిక మన్నించి రాముడు రథమధిరోహించి రావణునితో సమరం సాగించాడు. ఆ దేవేంద్ర రథమే ఇది… అని అన్నమయ్య శ్రీవారి బంగరు తేరును చూచి పరవశిస్తున్నాడు.
విజయుడైన శ్రీరాముడు పత్ని సీతమ్మతో అయోధ్యకు వెళ్ళడానికి ఎక్కింది పుష్పక రథం. ఈ రథం ఆరథాన్ని తలపిస్తోంది.
ఇక నిక్కు( గర్వం) గల నరకాసురుడిని చంపడానికి బయలుదేరిన కృష్ణుడితో పాటు బయలుదేరింది సత్యభామ। అప్పుడు రథంనడిపే దారుకుడిని రావద్దని తానే నడిపింది సత్యభామ।అది రెక్కలుగల రథం!
ఇక రుక్మిణిని తనకు అడ్డుపడిన వారందరినీ గెలిచి తెచ్చుకున్నది రథం మీదనే. అలమేలు మంగమ్మతో ఊరేగే ఈ శ్రీనివాసుని ఘనమైన రథం నాటి రథానికి ప్రతిబింబంలా ఉంది.
అంటున్నాడు అన్నమయ్య.
ఈ దేహమే రథం. ఆ రథసారథి మన బుద్ధి. ఇంద్రియాలే గుర్రాలు. పాప పుణ్యాలే చక్రాలు. మనస్సే పగ్గం. రథం పదంలో ఇంత పరమార్థముంది.
ఇదే తేటగీతిగా వ్రాసాను చూడండి.
తే.గీ॥
తనువరదము, నింద్రియములు దాని తురగ
ములగు, సారథి జూడగ బుద్ధి , మాన
సమగు పగ్గము లద్దాని చక్రములన
పాప పుణ్యములని దెలిసి బ్రతుక వలయు
స్వస్తి🙏

చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి కృతజ్ఞతలు🙏
~~~~~~~~~~~~~॥
డా. ఉమాదేవి జంధ్యాల


6, ఏప్రిల్ 2022, బుధవారం

వినోబా భావే - భూదానోద్యమ నేత

charcoal pencil sketch

భారతదేశంలోని పల్లెల్లో జీవించే సగటుజీవి అనుభవించే కష్టాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కృషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడా భావించారు. ఈ ధోరణి క్రమేణా సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదానోద్యమం. నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్థించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.


మరిన్ని వివరాలు క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. 


https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%AC%E0%B0%BE_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87



పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...