13, జూన్ 2017, మంగళవారం

మదిభావం ॥ఆనందహేళ॥ - మనసు -


నా పెన్సిల్ చిత్రానికి కవితలు

శ్రీమతి జ్యోతి కంచి గారి కవిత
మదిభావం ॥ఆనందహేళ॥
~~~~~~~~~~~~~~~
ఒకసారి మళ్ళీ నా ఆలోచన తట్టిలేపవా!!
వెలుగురేడు వెంపు కమలదళాలన్నీ ఆర్తిగా చూసిన ఆచూపులోని కొంత కొత్తదనాన్ని నా కనురెప్పల ముద్రిస్తావు!!
గళగీతాలన్నీ ఏకమై ఎదలో లహరీనాదాలనే చేస్తుంటే
ఆ సవ్వడి లోని చిరుమువ్వను నానవ్వులో పొదిగిస్తావు!!
సాంధ్యహారతులెత్తే తారకల మిలమిలలు మంగళమౌతుంటే
వెన్నెలనైవేద్యాలతొ నా దోసిళ్ళునింపేస్తావు!!
బడబాగ్నులన్నీ ఒక్క అనునయంతో చిప్పిల్లినట్లు
నాజీవితసాహచర్యమై అద్భుతంగా నీ కొనగోట నాచుబుకాన్నలా నీవైపు తిప్పుకుంటానంటే....
సఖుడా!!
పలుమార్లు ఇలా అలుకలు నటించగలేనా??....


శ్రీమతి అనుశ్రీ గారి కవిత
!!! మనసు !!!
నిజంగా నీ అంత ఇష్టం నీ అంత ప్రేమ
ఎవరు చూపిస్తారు నాపై
ఎవరికీ తెలుసు నేనేంటో
ఎవరికి తెలుసు నాలో అలజడెంతో....!!
మౌనంగా రోదిస్తూ నా కన్నీళ్ళని తుడుస్తూ
ఉలిక్కి పడి లేచిన ప్రతిసారి ఫరవాలేదని...
అస్తమిస్తున్న ఆశలకు ఆయువు పోస్తూ...
నన్ను కనిపెట్టుకుని నా కలలన్నీ పట్టుకుని..
తీరం చేర్చే దిశగా అడుగులు వేయిస్తూ..
నిద్రని వెలేసిన ఎన్నో రాత్రులలో
నన్ను నాకు పరిచయం చేస్తూ..
ఆవేశాన్ని అణచివేస్తూ
ఆక్రందనలని అనునయిస్తూ..
ఎన్ని వేల సార్లు మరణించావో
నన్నిలా బ్రతికించేందుకు.......!!
ఎన్ని సార్లు ముక్కలయ్యావో
నేను ఓడించిన సమయాలను తలచి....
ఎల్లలు లేని నీ ఆలోచనల సమీరాలని
నాకోసం గిరిగీసుకుని
నలుగుతూ నడిపిస్తున్న నిన్ను
నాకేమవుతావో ఎలా చెప్పను....!!
సంతోషాల ఊయలలో ఊగినపుడు
నవ్వుల జల్లై మురిసి పోతూ...
విషాదాల వేటుకి గాయపడినప్పుడు
ఓదార్పు వై సేద తీర్చుతూ....
కాలానికో మనిషిని హితులంటూ చూపితే
ఏడుస్తూ తిరస్కారాల శాపాలు భరించి..
నాతో పాటే నడిచి అలసి సొలసినా
నను వీడలేక నాతో పయనిస్తున్నావు...!!
విశ్రమించే తరుణం ఆసన్నమైనపుడు
మట్టిలో సైతం తోడొచ్చే నేస్తానివి
నాతో కలిసి అంతరించే అంతరంగానివి
పేరు అడిగితే ఏమనగలను
నాతో పాటే పుట్టిన నా మనసువననా
చూపించమంటే నాలోనే ఉన్నావని
నన్ను నాలో చూసుకుని మురిసిపోనా....!!
అనుశ్రీ...

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...