26, జూన్ 2017, సోమవారం

నీతో నేను - అనునిత్యం - నా చిత్రానికి కవితలు




!!..నీతో నేను...!! (Anu Sree కవిత)

దేవుడు నాకొక పాత్రనిచ్చాడు
విజయవంతంగా,అర్థవంతంగా
పోషించమని.
అది నీ భార్యగా నా పాత్ర
నువ్వు నేను కలిసిన మన జీవితంలో
నా పాత్రని నేను ఆలోచిస్తున్నా..
నాలా ఉండడాన్ని హరించిన
నీభార్య పాత్రలో
నేనెలా విజయవంతం కావాలో తెలియట్లేదు...!!
మూడుముళ్ళ బంధంతో ఏడడుగుల చేరువలో , నీ పరిధి దాటని నాలో నేనెప్పుడో మాయమైపోయాను...!!

కనిపించని చెరసాలలో యావజ్జీవశిక్ష అనుభవించేవాళ్ళకు తప్ప అర్థం కాదు..!!
నువ్వు మంచి వాడివైతే నేను చాలా అదృష్టవంతురాలినట...!!
లేదంటే అంతా నాతలరాతేనట
నాతలరాత రాసేది బ్రహ్మ కాదు నువ్వేగా..!!

నువ్వేలాంటి వాడివైనా, నాతో నీ ప్రవర్తన ఎలా ఉన్నా, నేను సహనంగా మౌనంగా ఉంటే ఉత్తమ ఇల్లాలినేనట,
ఎదురుతిరిగితేనే వింతనట..!!

నీకు వ్యసనాలతోనో ,నీ నిర్లక్ష్యంతోనో
జరగకూడనిది ఏదైనా జరిగాతే..
నా మాంగళ్య బలం సరిగ్గా లేకేనట,
వైధవ్యం నా నుదుటిపై రాసిపెట్టుంటే నువ్వు కూడా ఏము చేయలేవట...!!

చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తున్నా
ఏదో ఒకరోజు నువ్వు మారుతావని
ప్రతిరోజూ ఎదురుచూడాలట
నేను మాత్రం మారకూడదట..!!

ఏదైనా ఒకరోజు నువ్వు మారితే అదృష్టం అనుకుని వెంటనే ఖచ్చితంగా నీ సేవమొదలుపెట్టాలట..
నా జ్ఞాపకాల్లో నువ్వు చేసిన గాయాల మంటలు నన్ను కాలుస్తున్నా సరే..!!

కష్టాల కడలిని ఈదలేక మునిగిపోతుంటే
రక్షించే చేయి నీదే కావాలట
అందులో తోసింది నువ్వైనా సరే,
అదే చేయి పరాయిదైతే ఊరంతా
నాదే చర్చట...!!

నా గురించి మాట్లాడే వాళ్ళు వేరెవరో కాదు, నాదగ్గరి వాళ్ళే, నా కష్టం, నష్టం, కన్నీళ్ళు చూసిన నావాళ్ళే, రోజూ నన్ను గమనించే నా సొంతవాళ్ళే..!!
వాళ్ళందరికీ నువ్వు పెట్టిన పేరు "సమాజం"
ఆ సమాజానికి నువ్వేందుకు విలువిస్తావో కూడా తెలుసు, తప్పెవరిదైనా శిక్ష నాకేవేస్తుంది కదా మరి..!!
ఆ శిక్షకు భయపడే కదా
అందరూ నీ వశమయ్యేది..!!

అంతఃపురంలో బంగారు సీతకు కన్నీటి నీరాజనాలు పట్టినా,
అడవుల్లో సీతకి కష్టాలు తప్పలేదు కదా..
అదే సమాజం అదే భార్య పాత్ర..
బహిరంగంగా బంగారు సీతను కాను
కానీ నా అంతరంగంలో అరణ్యరోదనే
అది నువ్వు వినకున్నా,
నేను మునుగుతున్నా
నిన్ను మాత్రం సరైన తీరానికి చేర్చడమే
నా కర్తవ్యం, పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చే ఉత్తమ ఇల్లాలిని కావాలిగా మరి..!!

పుట్టింటి నుండి ఇంటి పేరుని కూడా తెచ్చుకోని నా పాత్రకి న్యాయం...!!!!!

అను-----4



అనునిత్యం ।। ( అనిత్యం) (శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి కవిత)
-------------------------------


అంతులేని ఆవేదన మోస్తున్నా అనునిత్యం!
ఎందరినో నాలాగే చూస్తున్నా అనునిత్యం!

ఎండిపోదు ఈ గాయం కాలమెంత కదిలినా
ఓపికగా లేపనాన్ని పూస్తున్నా అనునిత్యం!

మ్రోడులు చిగురించాయే బీడులు చమరించాయే
రసహీనపు కావ్యాన్నే రాస్తున్నా అనునిత్యం !

ఎంతదూరమో గమ్యం ? అగోచరం - అనిశ్చితం!
అయినావడివడి అడుగులు వేస్తున్నా అనునిత్యం!

ఆగడులే ఆసూర్యుడు ఆగదు ఈభూగోళం
భగవంతుని బొమ్మలాట చూస్తున్నా అనునిత్యం!

వెతకటమే కళ్ళకుపని ఎపుడోనువు వస్తావని 
శూన్యమైన తోటలోకి వెళుతున్నా అనునిత్యం!

--------------
(చిత్రం --పొన్నాడ మూర్తి గారు)పై చిత్రానికి నాగజల్


మదిభావం॥అనామిక॥
~~~~~~~~~~~~~
నాలో నాకే తెలియని అనామిక
నన్ను లాలిస్తూ బుజ్జగిస్తూ
నన్ను శూన్యంవైపు లాగేస్తూ....
పరదాల మేఘాలలో ఒరవడులు సృష్టిస్తూ
దాన్నే వయస్సన్నది
వృత్తాలనేగీస్తూ పరిధన్నది
దాటలేను దాగనివ్వదు

నాలో నాకేతెలియని అనామిక
తలొంచితాళికట్టించుకోమనంది
ఆశల పందిరికింద తలంబ్రాలఊసేలేదు
రెక్కలగుర్రం ఏదిక్కుకేగిందో ఊహేలేదు
జీవితంమాత్రం పాతాళాంలో బాటరాళ్ళు వెతుక్కుంటోంది
నాలో నాకే తెలియని అనామిక
రక్తం పంచిన బిడ్డలను
అడ్డాలుగాచూపిస్తూ ఇంకా బతకమంటుంది
ఛస్తూ బతకమంటుంది
తనకేంపోయింది
నలిగిపోతోంది నేనుకదా....
త్యాగాన్ని పెనవేసుకొని ఎదగడం నాకలవాటేకదా
నవ్వుతూ ఎదురెళ్ళమంటుంది .....
నాలో నాకేతెలియని అనామిక
రెక్కలొచ్చి బిడ్డలు,
రుణంతీరి బంధాలన్నీ దూరమైనా
నను వీడదూ,వసి వాడదూ
పసి తనపు జ్ఞాపకాలను నెమరేయమంటూ ...
నన్ను బలవంతపెట్టి
తనుమాత్రం కన్నీటి చుక్కైజారుతూ
గుండెతలపు తడుతూ,తడుపుతూనేఉంటుంది
నాలో నాకే తెలియని అనామిక
నాలో నేనే చూడని సాలభంజిక......J K
(చిత్రం Pvr Murtyబాబాయ్ గారు!!ధన్యవాదాలు బాబాయ్ )

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...