నివాళి - నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలానా గుర్తుకొస్తాడు. ఈ రోజు వారి జయంతి సందర్భంగా నా pencil sketch.
చినమౌలాని 1976 సంవత్సరంలో కళై మామణి అనే బిరుదంతో తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది.1977 లో భారతప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదంతో గౌరవించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1977 లోనే అవార్డునిచ్చి తరించింది.ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ 1980 లో ‘గానకళా ప్రపూర్న’ బిరుదు ...1981 లో రాజమండ్రి సంగీత రసికులు ‘గాంధర్వ కళానిధి’ అని బిరుదు.1984 లో మచిలీపట్నం ‘సరస్వతి కళాసమితి’ వారు ’నాద స్వర కళానిథి’ బిరుదు.ఆంధ్ర విశ్వవిద్యాలయం 1985 లో ‘గౌరవ డాక్టరేట్’ పట్టము.1987 లో తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం.1988 లో విజయవాడ త్యాగరాజ సంగీత కళా సమితి ‘ సంగీత విద్వన్మణి’ బిరుదు.ఇవేకాకుండా అమెరికా, సోవియట్ యూనియన్, హాంకింగ్..లాంటి దేశాల్లో నాదస్వర కచేరీ! రాముణ్ణి, అల్లాని.. కృష్ణున్ని, త్యాగయ్యనీ...నాదస్వరంతో పూజించే ఒక మహా విద్వాంసుడు, ఒక సత్పురుషుడు, ఒక తత్త్వవేత్త....అన్నిటినీ మించి ఒక మానవతా వాది శ్రీ షేక్ చినమౌలా!
(సేకరణ : వికీపీడియా)
వీరి గురించి మరిన్ని వివరాలు అందించిన మిత్రులు, సంగీత విద్వాంసులు శ్రీ సుధాకర్ మోదుమూడి గారికి నా ధన్యవాదాలు.
"కర్ణాటక సంగీతంలోని గమకాలను, యథాతథంగా పలికించగల వాద్యాల్లో అగ్రతాంబూలం నాదస్వరానిదే!..పురాతనమైన ఆ వాద్యం ఎంతో మంగళప్రదమైనది కూడా! అందుకే శుభకార్యాలలో ఆ వాద్య శ్రవణం చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది.
మన తెలుగునాట,ఆ వాద్యంలో నిష్ణాతులైన విద్వాంసులు అరుదనే చెప్పాలి.తమిళనాట,ప్రసిద్ధ ఆలయాలు అధికంగా ఉండటం,నిత్యం ఆ ఆలయాలలో జరిగే సేవలలో విధిగా నాదస్వర వాద్యాన్ని వినియోగించడంచేత, ఎక్కువమంది నాదస్వర కళాకారులు అక్కడ ఆదరించబడ్డారు.ఎక్కడ ఆదరణ ఉంటుందో,అక్కడ ఆ విద్య పరిఢవిల్లుతుంది.
మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కరవది గ్రామం, నాదస్వర కళాకారులకు పుట్టినిల్లు.అక్కడ,వేణుగోపాలస్వామి ఆలయంలో మూడు వందల ఏళ్ళకు పైగా నాదస్వర ఆస్థాన విద్వాంసులుగా ఉన్న వంశంలో, 1924లో జన్మించారు షేక్ చిన మౌలానాగారు.వీరి వంశానికి మూలపురుషులైన విద్వాన్ ఆదంసాహెబ్,దేవగాంధారి రాగం వాయించడంలో గణుతికెక్కినవారు.విశేషమేమంటే,వీరి వంశంలో నాదస్వర విద్వాంసులే కాక, అమరకోశం, వాల్మీకి రామాయణం వంటి గ్రంథాలను అవపోసన పట్టిన సంస్కృత పండితులూ ఉన్నారు!
పసితనంలో పాలపీక బదులు సన్నాయిపీకతో పెరిగారేమో...చినమౌలానాగారు, తన తొమ్మిదవఏటనే కరవది ఆలయంలో తొలి నాదస్వర కచేరీ చేశారు! ఆయన పేరు తెలుగునాట మారుమోగిపోయింది.
పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా,వారి ఇల్లు వైదిక సాంప్రదాయాలకు నిలయంగా దర్శనమిచ్చేది! పట్టుబట్టలు కట్టుకొని,కుంకుమబొట్టు పెట్టుకొని, పెరుమాళ్ళను అర్చించే,చినమౌలానాగారు నిత్య నాదోపాసకునిగా దర్శనమిచ్చేవారు!
ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించి,అక్కడి దేవతామూర్తుల్ని తన నాదస్వరగంగతో అభిషేకించి, అక్కడి స్థానికులచే 'తమ ప్రాంతంలోనే నివాసం ఉండమని' అభ్యర్థనలనందుకొన్న భాగ్యశాలి ఆయన!నాదస్వరంలో మేరుపర్వతం వంటి రాజరత్నం పిళ్ళేగారి శైలిని అమితంగా ఇష్టపడే చిన మౌలానా, ఆయననే తన మానసిక గురువుగా ఆరాధించి,ఆ బాణీని స్వంతం చేసుకున్నారు.
తమిళనాట,కావేరీ తీరాన, శ్రీరంగంలో కొలువైన రంగనాథస్వామి సన్నిధిని తన స్థిర నివాసం చేసుకొన్నారాయన.దక్షిణాదిన,ఆయన నాదస్వరంతో ప్రతిధ్వనించని దేవాలయం లేదు.ఆయన అందుకోని సత్కారం లేదు. భారత ప్రభుత్వంచే 'పద్మశ్రీ', కేంద్ర సంగీత,నాటక అకాడెమీ పురస్కారాలు, తమిళనాడు ప్రభుత్వం నుండి 'కలైమామణి',ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీవారి 'గానకళా ప్రపూర్ణ' బిరుదు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు...అందులో కొన్ని.1973 లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారత స్వాతంత్ర్య రజతోత్సవాలలో కేంద్రప్రభుత్వం ఆహ్వానంపై కచేరీ చేశారాయన! విదేశాలెన్నో పర్యటించి, తన సంగీతంతో విశ్వమానవుల నీరాజనాలందుకున్నారు! అమెరికాలో 'నాదస్వర ఆచార్య' అనే బిరుదుతో సత్కారం పొందారు! అసంఖ్యాకంగా వారి నాదస్వర ఆడియో రికార్డులు విడుదలయ్యాయి.
చినమౌలానా గారి నాదస్వర కచేరీని 1980వ సంవత్సరం, మచిలీపట్నం సరస్వతి కళాసమితిలో మొట్టమొదటిసారిగా నేను వినడం జరిగింది. సుమారు మూడున్నర గంటలపాటు సాగిన ఆనాటి కచేరీ, శ్రోతలపై పన్నీటి జల్లులు కురిపించింది.'వాతాపి గణపతిం భజే' కృతిలో ఆయన ఎంత సుదీర్ఘంగా స్వర ప్రస్థారం చేశారో,శ్రోతలూ అంతే సుదీర్ఘంగా హర్షధ్వానాలిచ్చారు.
విశేషమేమంటే...కచేరీకి వెళ్ళే ముందు, ఆయన వెంట ఒక శిష్యుడు,శ్రుతిపెట్టెను మెడలో ధరించి, శ్రుతిని నిరంతరాయంగా వినిపిస్తుంటే,ఆయన అది వింటూ, తన పనులన్నీ పూర్తిచేసుకుని,కచేరీకి సిద్ధమయ్యారు.
చినమౌలాగారు, పెద్దలయెడ అపార గౌరవం కలవారు.తెలుగునాట లబ్ధప్రతిష్టులైన నాదస్వర విద్వాంసులు దాలిపర్తి పిచ్చిహరిగారు(పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి ప్రియ శిష్యులు) నివసించిన ఇల్లు ఎక్కడో వాకబుచేసి, మచిలీపట్నంలోని ఆ ఇంటికి తనబృందంతో వెళ్ళి, ముమ్మార్లు ప్రదక్షిణచేసి,వారి స్మృతికి నమస్కరించి,అక్కడి ధూళిని నుదుట భూతిగా రాసుకున్న వినయశీలి.
శ్రీరంగంలో 'శారదా నాదస్వర సంగీత ఆశ్రమ్' ను స్థాపించి,నాదస్వర వాద్యంలో ఎంతో మందిని నిష్ణాతుల్ని చేశారాయన.
మన తెలుగునాట,టిటిడి వారి ఆధ్వర్యంలోని తిరుపతి ఎస్వీ సంగీత కళాశాలలో తప్ప,ఎక్కువగా నాదస్వర,డోలు వాద్యాలలో శిక్షణ జరగటంలేదు.
ఇప్పటికైనా,ప్రభుత్వాలు చొరవ తీసుకుని,సంగీత కళాశాలలలో నాదస్వరం,డోలు,వేణువు,క్లారినెట్ మొదలైన వాద్యాలలో శిక్షణ తరగతులు ప్రారంభిస్తే,ఆ విద్య పదికాలాల పాటు నిలుస్తుంది., ఎంతోమందికి విద్యార్థులకు,గురువులకు భుక్తి కల్గుతుంది.
- సుధాకర్ మోదుమూడి"
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిత్రులు, ప్రఖ్యాత గజల్ రచయిత శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు నా చిత్రానికి రచించిన గజల్ :
"ఈ గజల్ నాదబ్రహ్మ షేక్ చినమౌలానా గారి దివ్యస్మృతికి.. మాన్యశ్రీ పి. వి. ఆర్ మూర్తి గారి చిత్రం సాక్షిగా అంకితం..
గజల్ 3785
సన్నాయికి పరవశములు..నింపినావు దివ్యముగా..!
స్వరములకే రెక్కలెన్నొ..తొడిగినావు దివ్యముగా..!
మౌలానా అనగానే..గాలికెంత పులకింతో..
కళ్యాణీ వసంతాలు..ఒలికినావె దివ్యముగా..!
"కళై మామణీ" బిరుదాంచిత నాదస్వరార్ణవా..
మన భారత 'పద్మశ్రీ'గ..వెలిగినావు..దివ్యముగా..!
సంగీత విద్వన్మణి..గాంధర్వ కళానిధీ..రాగాంబుధీ..
గానకళా ప్రపూర్ణుడవై..నిలచినావు దివ్యముగా..!
జనరంజక మధురామృత..స్వరబ్రహ్మవే నీవు..
స్వర్గంగా వాహినినే దింపినావు దివ్యముగా..!
ఘనయశమ్ము నందిన 'చినమౌలానా' ధన్యుడవో..
మాధవునే పరవశింప..జేసినావు దివ్యముగా..!"