30, మే 2020, శనివారం

ఎదను తొలిచి మనసు దోచి - గజల్

💥 ఈ వారం చిత్రానికి గజల్
————————————

ఎదను తొలిచీ మనసు దోచీ
వీడి పోవుట ఎందుకో !
అదను తెలిసీ సుధను గ్రోలగ
వచ్చిపోవుట ఎందుకో  !

మొగలిపూవులు  గుచ్చుకున్నా
 జడను దాల్చక ఉందుమా?
  బాధలోతోసేసినా , నే వాలి
 పోవుట ఎందుకో  !

నీవు వచ్చిన గుర్తులన్నీ
ఊపిరిని నింపేనులే
 కౌగిలించీ పాత తప్పులు
తుడిపి పోవుట ఎందుకో !

మండుటెండలు వచ్చిపోవా
మంచివానకు  ముందుగా
ముద్దు చేస్తూ మాయమంత్రం
వేసిపోవుట ఎందుకో  !

అంత కోపం మంచులాగా
కరిగిపోదా  చూడగా
ప్రేమకేగొళ్ళాన్నితీస్తూ
 మురిసిపోవుట ఎందుకో !

కలతలన్నీ నీటి సుడులే
కౌగిలిస్తే ఉండునా ?
ప్రణయకలహం సహజమేనని
తేల్చి పోవుట ఎందుకో !

అలసిపోయిన ఎదల సొదలకు
ఆటవిడుపే మురిపెమూ
వేటగాడా కరుణమాలీ
కొట్టిపోవుట ఎందుకో !

ప్రేమజలధిన పడవసాగే
జంటచిలుకలు నడపగా
ఈశ్వరా ! నీ కేమి మోదము ?
ముంచి పోవుట ఎందుకో !

కోర్కెలన్నీ కూడబెట్టా
ఆరగింపును చేయగా !
వారబోసిన దేవి నిచ్చట
వదిలి పోవుట ఎందుకో !
—————————
డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం - Sri. Pvr Murty garu

కామెంట్‌లు లేవు:

తెలుగమ్మాయి - గజల్

  మూర్తిగారి తెలుగమ్మాయి బొమ్మకు స్పందనగా గజల్  రచన చల్లా రాంబాబు  పడుచుదనపు పరువాలతొ తెలుగమ్మాయి  అరవిరిసిన చిరునవ్వుతొ తెలుగమ్మాయి అచ్చతెల...