30, మే 2020, శనివారం

"వేచి చూసిన కాలమంతా కరిగి పోయెను చిటికెలో " - "ప్రేమ సీమల్ రాగ హేలన తూగిపోతే మధుర మేగా" - గజల్



శ్రీమతి  శారద మంచిరాజు గారి గజల్

వేచి చూసిన కాలమంతా కరిగిపోయెను చిటికెలో
సమయమన్నది పరుగులెత్తుతు జారిపోయెను చిటికలో!

ఎన్ని ఊసులు పంచినావో నేడుమౌనము ఏలనో
పులకరింతల వెల్లువంతా వీగిపోయెను చిటికలో!

 పూలపందిరి అల్లుకున్నాం- కర్కశంగా విరుతువా ?
ఆశలన్నీ తూలికలుగా ఎగిరిపోయెను చిటికలో!

పరిష్వంగపు మత్తులోనీ అధరసుధలే తేనెలూరే
కాలకూటం సెగలు చిమ్ముతు నవ్విపోయెను చిటికలో!

శ్వాస ఒకటిగ బాసఒకటిగ ఉన్నమన అనుబంధమే !
కాలరాసిన కారణమ్మే మలగిపోయెను చిటికలో!

ప్రేమభావన తెలియగలరా మూర్ఖులైనా పరిజనం !
హంసమనలను గేలిచేస్తూ వెడలిపోయెను చిటికలో!

 కలతపెట్టే  పాతకథలే ఏచరిత్రను చదివినా
శారదమ్మకు నచ్చచెపుతూ
నిమిరిపోయెను చిటికలో !!

(శ్రీ పి.వి.ఆర్.మూర్తిగారికి కృతజ్ఞతతో  --  శారద మంచిరాజు)



నా చిత్రానికి శ్రీమతి సావిత్రి రమణరావు గారి గజల్

ప్రేమ సీమల రాగ హేలన
తూగి పోతే మధుర మేగా
మోహ నమ్మవు మోహనము లో
తేలి పోతే మధుర మేగా
వణుకు పెదవుల వలపు మధువులు
కొసరి కోరుగ కోడె ప్రాయము
తొంద రించే తేటి విందున
రేగి పోతే మధుర మేగా
కనులు కనులూ కలిపి పాడే
ప్రణయ గీతికి లిపులు ఏలా
పొంగు ప్రణయం చింద రాగం
ఊగి పోతే మధుర మేగా
విరియు ప్రేమల రంగు విల్లులు
ప్రణయ లోకపు రంగ వల్లులు
కలల సీమన తరుణ కళలన
వెలిగి పోతే మధుర మేగా
సంజె ఎరుపుల చెలిమి పిలుపుల
ఊసు లె న్నో , ఊహ లెన్నో
ఉరుకు వాగై కడలి ఒడిలో
ఒదిగి పోతే మధుర మేగా
స్నేహ రాగం,మోహ గీతం
ఆలపించగ మరుల లహరులు
తనువు వీణై అణువు అణువున
మోగి పోతే మధుర మేగా
నీవు నేనని లేనె లేనీ
సంగ మము లో సావిత్రీ
కోర్కె అలలా కోటి పులకల
సాగి పోతే మధుర మేగా
ఈ అబి వ్యక్తి కి ప్రేరణ శ్రీ Pvr Murty గారి చిత్రం. వారికి నా హృదయ పూర్వక కృతఙ్ఞ తాభి వందనాలతో..

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...