26, మే 2020, మంగళవారం

మనసు - కవిత


నా చిత్రానికి అమ్మాయి 'అనుశ్రీ' కవిత

!!! మనసు !!!
నిజంగా నీ అంత ఇష్టం నీ అంత ప్రేమ
ఎవరు చూపిస్తారు నాపై
ఎవరికీ తెలుసు నేనేంటో
ఎవరికి తెలుసు నాలో అలజడెంతో
మౌనంగా రోదిస్తూ
నా కన్నీళ్ళని తుడుస్తూ
ఉలిక్కి పడి లేచిన ప్రతిసారి, ఫరవాలేదని
అస్తమిస్తున్న ఆశలకు ఆయువు పోస్తూ...
నన్ను కనిపెట్టుకుని నాకలలన్నీ పట్టుకుని
తీరం చేర్చే దిశగా అడుగులు వేయిస్తూ..
నిద్రని వెలేసిన ఎన్నో రాత్రులలో
నన్ను నాకు పరిచయం చేస్తూ..
ఆవేశాన్ని అణచివేస్తూ
ఆక్రందనలని అనునయిస్తూ..
ఎన్ని వేల సార్లు మరణించావో
నన్నిలా బ్రతికించేందుకు
ఎన్ని సార్లు ముక్కలయ్యావో
నేను ఓడించిన సమయాలను తలచి
ఎల్లలు లేని నీ ఆలోచనా సమీరాలని
నాకోసం గిరిగీసుకుని
నలుగుతూ నడిపిస్తున్న నిన్ను
నాకేమవుతావో ఎలా చెప్పను
సంతోషాల ఊయలలో ఊగినపుడు
నవ్వుల జల్లై మురిసి పోతూ...
విషాదాల వేటుకి గాయపడినప్పుడు
ఓదార్పువై సేద తీర్చుతూ
కాలానికో మనిషిని హితులంటూ చూపితే
ఏడుస్తూ తిరస్కారాల శాపాలు భరించి..
నాతో పాటే నడిచి అలసి సొలసినా
నను వీడలేక నాతో పయనిస్తున్నావు
విశ్రమించే తరుణం ఆసన్నమైనపుడు
మట్టిలో సైతం తోడొచ్చే నేస్తానివి
నాతో కలిసి అంతరించే అంతరంగానివి
పేరు అడిగితే ఏమనగలను
నాతో పాటే పుట్టిన నా మనసువననా
చూపించమంటే నాలోనే ఉన్నావని
నన్ను నాలో చూసుకుని మురిసిపోనా.
అనూశ్రీ...

కామెంట్‌లు లేవు:

జయహనుమాన్ జయతి బలసాగర!

  జయహనుమాన్ జయతి బలసాగర! ~~~~~~~~🌸🌸🙏🌸🌸~~~~~ 1) ఉ॥ పుట్టుకతోనె కర్ణముల భూషణముల్ యుప వీతమున్, మొలన్  బొట్టము, శీర్షమందు ఘన బొమ్మికమున్,కట...