అద్భుత గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేను నాకు ఇష్టమైన పెన్శిల్ మాధ్యమం ద్వారా చిత్రించిన వారి చిత్రం. వారి గురించి నేను సేకరించిన వివరాలు టూకీగా ..
సిరివెన్నెల 1986 సంవత్సరంలో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం., భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాశాడు. ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయారు.
శాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. తర్వాత కాకినాడకీ ఇంటర్ పూర్తిచేసారు. .ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ "సిరివెన్నెల" సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది. భారత దేశ పురస్కారం పద్మశ్రీ ఈయనను 2019 వరించింది
విధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.
నా చిత్రానికి మిత్రులు, ప్రఖ్యాత గజల్ రచయిత శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన చక్కటి గజల్. వారికి నా బ్లాగు ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మాటమాటు మౌనమేల..వెన్నెలగా కురిసిందో..!
"సిరివెన్నెల" భావనే..తేనియగా పంచిందో..!
"సిరివెన్నెల" భావనే..తేనియగా పంచిందో..!
సంప్రదాయ మాధురులకు..గజ్జెకట్టె దివ్యముగా..
మనసంస్కృతి విలువలెల్ల..సంపదగా కాచిందో..!
మనసంస్కృతి విలువలెల్ల..సంపదగా కాచిందో..!
నాగరికత పోకడలకు..నవస్వరాలు పొదిగెనా..
ఒక విప్లవ శంఖధార..జ్వాలికగా ఎగసిందో..!
ఒక విప్లవ శంఖధార..జ్వాలికగా ఎగసిందో..!
చిత్రసీమ గీతాలకు..మెఱుపులేల పొదిగెనో..
అక్షరాల గమకాలకు..ఏలికగా మిగిలిందో..!
అక్షరాల గమకాలకు..ఏలికగా మిగిలిందో..!
ప్రేక్షక జన హృదయాలను..గెలుచుకున్న గేయమహో..
గాయాలకు విరహాలకు..ఊరటగా పొంగిందో..!
గాయాలకు విరహాలకు..ఊరటగా పొంగిందో..!
ఏకాకిగ మాధవుడా..జగమంత కుటుంబమాయె..
సీతారామ శాస్త్రి తపము..పాటగా నిలిచిందో..!
సీతారామ శాస్త్రి తపము..పాటగా నిలిచిందో..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి