వారం వారం అన్నమయ్య...
కీర్తన : తందనాన అహి తందనాన, భళా తందనాన
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..
ఓం నమోవేంకటేశాయ
ప్రార్థన పద్యం ( పోతన గారిది)
సీ॥
భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా-
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ
కిద్ధరూపికి, రూపహీనునకునుఁ,
జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ-బరమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు
ఆ.వె
మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి, సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
*********************
ఈ వారం అన్నమయ్య కీర్తన
••••••••••••••••••••••
తందనాన అహి, తందనాన పురె తందనాన భళా,తందనాన ‖
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే ‖
కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ ‖
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర – అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే చండాలుడుండేటి సరిభూమి యొకటే ‖
అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే |
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ‖
కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే వరస పరిమళముపై వాయు వొకటే ‖
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ‖
నాకు తెలిసినంతలో వివరణ
*************************
ఉపనిషత్ సారాన్ని, భగవద్గీత సారాన్ని
కీర్తన రూపంలో అన్నమయ్య సులభ గ్రాహ్యంగా అందించాడు ఈ కీర్తనలో.
ఈ ఆత్మానాత్మ వివేచన చేయాలంటే, పరమాత్మ తత్వం గ్రహించాలంటే యోగిపుంగవులకే సాధ్యం।కానీ చిన్న మాటలలో అన్నమయ్య చిందేస్తూ ‘తందనానా బలే తందనానా’అంటూ
పాటక జనానికి కూడా అర్థమయ్యే విధంగా తానూ వారిలో ఒకడై పోయి పాడిన పదమిది.
ప్రాణులన్నీ ఒకటే . అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మే. మరిక కులాలలో అధికమేమిటి? హీనమేమిటి?
పరమాత్మ ఎప్పటి నుంచీ ఉన్నాడు? ఎక్కడున్నాడు?
ఏదీ లేనప్పుడు మొదట ఉన్నవాడు పరమాత్మ.ఆ పరమాత్మే ఈ చరాచర సృష్టి చేసి తానే అన్నింటిలో ప్రవేశించడం జరిగింది.
ఆకాశం అంటే ఖాళీగా ఉన్న ప్రదేశం. కుండలో కాళీ కూడ ఆకాశమే. ఎక్కడ కాళీ ఉంటే అదంతా ఆకాశమే. కానీ మనం మనకు పైన కనిపించేదే ఆకాశ మనుకుంటాం. పరమాత్మకూడా అంతే. రూపం, గుణం, తనకంటూ ఒక చోటు లేనిదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ శక్తి అనేక రూపాలలో చేరింది.
పరబ్రహ్మ సనాతనుడు.సర్వాంతర్యామి.
ఉన్నది బ్రహ్మమొక్కటే! మిగిలినదంతా లీలావిలాసం!
ఆత్మవత్ సర్వభూతాని,
ఏకమేవాద్వితీయం బ్రహ్మ,
ఏకో విశ్వస్య భువనస్య రాజా,
ప్రజ్ఞానం బ్రహ్మ,తత్త్వమసి,
అహం బ్రహ్మా௨స్మి,
ఆయమాత్మాబ్రహ్మ - —
ఇత్యాది ఉపనిషద్వాక్యాలు పరమాత్మ, జీవాత్మ వేరుకాదని చెబుతున్నాయి.ఎక్కడినుంచి ఏర్పడ్డామో, ఎవరివలన ఈ నేలమీదకు వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళి ద్వయాన్ని మరిచి అద్వైత సిద్ధిని పొందడమే జీవి కర్తవ్యం. అందుకు ఎన్ని జన్మలు పడతాయో , ఎన్నిసార్లు జారిపడి పైకి లేవాలో అదంతా మనకర్మల మీద ఆధారపడి ఉంటుంది.నేను వేరు , పరమాత్మ వేరు అనుకుంటే ఈ సిద్ధి కలగదు. ఆ మెట్టు దాటి అందరిలోనూ, నీలోనూ కూడ పరమాత్మను చూడు.అంటూ అన్నమయ్య ఈ కీర్తనలో అన్యాపదేశంగా చెబుతున్నాడు.
మనిషి బుద్ధి వక్రత వలన తేడాలను, హెచ్చుతగ్గులను చూడటమే పనిగా పెట్టుకొని పతనమై పోతున్నాడు.
అన్నమయయ్య ఈ కీర్తనలో అడుగు తున్నాడు… ఏమని?….
‘ఎందుకు వేరుగా చూస్తున్నావు! పైపై వేషాలు, బీద గొప్ప తేడాలు వేరు కావచ్చు. కానీ హృదయం పొందే అనుభూతికి తేడా ఉందా?
రాజు హంసతూలికా తల్పం మీద పడుకున్నా, ఆయవ సేవకుడు కటిక నేలమీద పడుకున్నా నిద్ర ఒకటే. అదిచ్చే
హాయిలో తేడా ఉందా?
పంచభక్ష్య పరమాన్నాలు తినేవాడికీ, పూటకు గతిలేని వాడికీ ఆకలి ఒకటే కదా!
ఈ ప్రపంచంలో అల్పజీవి నుంచి మహారాజులవరకూ కామసుఖం ఒకటేగదా!
ఎండ ఏనుగు మీదా పడుతుంది. కుక్క మీదా పడుతుంది. ఎండకు అంతా ఒకటే!
రాత్రీ పగలూఅనేవి ధవికుల కైనా పేదలకైనా ఒకేసారి వచ్చిపోతాయి కదా!
గాలి సువాసనగలపూవులమీద, మురికి కుప్పమీద కూడా వీస్తుందే. గాలికీ అంతా ఒకటే!
ఇక ఉన్నవాడేంటి లేనివాడేమిటి.. ఈ భూమిమీద పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదే. ఏకులం వాడైనా ఉండేది నేలమీదే… చేరేది ఆ మట్టిలోకేగా.
మృత్యువుకూ అంతా ఒకటే!
ఇంక మూణ్ణాళ్ళ బ్రతుకులో ఇన్ని తేడాలెందుకు?
ఎలాగైతే పంచభూతాలకు ప్రాణికోటి పట్ల భేదం లేదో అలాగే జీవకోటి పట్ల భగవంతుడికీ భేదం లేదు. భక్తి, విశ్వాసము, నడతే ఆయనకు ముఖ్యం!
ఆ పరబ్రహ్మ తానుసృషించిన జగతి నిర్వహణలో భాగంగా బహురూపాలను ధరించాడు. తన శక్తిని సృష్టి, స్థితి, లయములకు అనుగుణంగా మలుచుకున్నాడు.
కులమత భేదాలు చాలవన్నట్లు భగవంతుని రూపాలన్నిటికీ మూలం పరబ్రహ్మే అది మనలోనే ఉన్నదని గ్రహింపక ఈర్ష్య తో ఒకరూపాన్ని ఆరాధించేవారు మరొక రూపాన్ని ద్వేషిస్తూ మసలుకుంటున్నాం.
మన కర్మ పరిపక్వత కలిగించగలిగేది ఆ వేంకటేశ్వరుని నామం ఒక్కటే !
పుణ్యం చేసినవాళ్ళనూ, పాపంచేసిన వాళ్ళనూ కావగలది ‘ఆ గోవిందా’అనే నామమే.
‘అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకార: సమదుఃఖసుఖ: క్షమీ ||’
ఏ భక్తులు సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా ఉంటారో, స్నేహపూరితముగా, కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వాళ్ళకు ధనము మీద మమకారం ఉండదు. అహంకారం చూపరు. సుఖ-దుఃఖాలలో ఒకే విధంగా ఉంటారు. క్షమించే మనస్సుకలిగి తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మనిగ్రహంతో, ధృడ సంకల్పంతో మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.( భగవద్గీత 12)
అన్నమయ్య తన కీర్తనలో లోకానికి చెప్పదలచినది ఇదే!
తే.గీ
విజ్ఞులగువారు చూపరు వేఱడంబు
హెచ్చుతగ్గులనెంచునే యెండ, వాన!
ఎడము బెట్టక,లోనున్న యెదను జూడు
ప్రాణు లన్నిటఁబరమాత్మ ప్రతివసించు
స్వస్తి
~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం- శ్రీ Pvr Murtyగారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి