..
వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన - దాచి వుండనీ
వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా
..
నానాలికపైనుండి - నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను -బొగడించితివి
వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా
..
యీమాట గర్వము గాదు - నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను - నేరము లెంచకుమీ
శ్రీమధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా
సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య ఈ కీర్తన విశేషాంశములు ఇలా తెలియబరిచారు.
భగవన్నామ సంకీర్తన రూపములైన తన సంకీర్తనలను అన్నమయ్య భగవంతునికి తాను కావించిన పూజలుగా పేర్కొన్నాడు. ఇందుచే ఆయన భగవత్ కైంకర్యపరత్వమెట్టిదో తెలుస్తోంది. భగవంతుని కీర్తి రూపపుష్పములుగా ఈ కీర్తనలను రూపించుటచే ఈ కీర్తనలో ఆ దేవుని యశస్సును ప్రకటించుటకే రచించబడిన పూజా కుసుమాలుగా గ్రహించుకోవచ్చు.
అన్నమయ్య వేలకొలది సంకీర్తనలు రచించాడు. వాటిలో ఒక్క సంకీర్తన తమ్ము రక్షించుటకు చాలునని చెప్పుకుంటున్నాడు. తన ప్రతి కీర్తన సంసారతరుణోపాయ మగుటలో ఆయనకు గల ఆత్మవిశ్వాసమెంత దృఢమైనదో దీనినిబట్టి వెల్లడగుచున్నది.
తపోధ్యానాదులతో పోల్చినచో నామ సంకీర్తనము పేలవముగ కనపడవచ్చును. అందలి శ్రమ ఇందు లేదు గదా ! అయినను దీని మహిమ వాటికె లేదనుటకే ఫలమధికము అని చెప్పబడినది.
"పలికించెడు వాడు రామభద్రుండు" అని పోతన చెప్పినట్టే "నా నాలిక పై నుండి నాచే నిన్ను బొగడించితివి" అని అన్నమయ్య చెప్పాడు. ఇందుచే ఆయన వినయాతిశయము ప్రకటమగుతోంది. "ఇది గర్వపుమాట గాదు. నా స్వాతంత్ర్యము నేను చెప్పుకొనలేదు. నీ మహిమనే ఇట్లు కొనియాడితిని" అన్న ఆ పదకవితా పితామహుని భక్తి తాత్పర్యము నిరుపమానము గదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి