వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక |
పంచమహాపాతకులభ్రమవాపవశమా ॥
కీర్తన
*****
అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక |
పంచమహాపాతకులభ్రమవాపవశమా ॥
కాననియజ్ఞానులకు కర్మమే దైవము |
ఆనినబద్ధులకు దేహమే దైవము |
మాననికాముకులకు,మగువలే దైవము।
పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా ||
యేమీ నెఱుగనివారికింద్రియములు దైవము|
దోమటిసంసారి కూరదొర దైవము |
తామసులకెల్లాను ధనమే దైవము |
పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా ||
ధన నహంకరులకు తాదానే దైవము |
దరిద్రుడైనవానికి దాత దైవము |
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము |
పరులముంచినయట్టి భ్రమ బాపవశమా ||
********************
నాకు తెలిసినంత వరకు వివరణ
——————-
పుణ్యకార్యాలవలన, దైవ భక్తివలన, నిర్మోహత్వం వలన, ఆత్మజ్ఞానులు కొందరు హరియే దైవమని గ్రహిస్తారు. కానీ కొందరు పంచ మహాపాతకాలవలన వలన అజ్ఞానులై, అనేక భ్రమలకు లోనై
భగవంతుని తెలుసుకొనలేరు.
ఎవరెవరు దైవాన్ని తెలుసుకొనలేక దారితప్పుతున్నారో ఈ కీర్తనలో అన్నమయ్య విడమరిచి చెప్పాడు.
*దైవం అంటే ఏమిటో, దైవం ఉనికి ఏమిటో కానని వాడు తాను చేసే కర్మలే దైవమనుకుంటాడు. తానేంచేస్తే అది పుణ్యప్రదమని భావిస్తాడు. ఎవరి తప్పులు వాళ్ళకు కనబడవు. తమకు తెలిసినదే సత్యమనే భ్రమ. తానున్న బావి జగత్తనుకుంటుంది కప్ప.అటువంటి అజ్ఞానం వీరిది.
*బంధాలకే అంటుకు పోయిన వాళ్ళకు
దేహమే దైవం. దేహచింతన తప్ప దైవ చింతన ఉండదు వీళ్ళకు. కర్మబంధాలను వీడలేరు. దేవుడిని తెలుసుకోలేరు. ఈ దేహంతో అనుభవాలే శాశ్వతమనుకునే సంసార లంపటులైన ఇటువంటి వారు వర్తమానంలోని జన్మకు అతీతంగా ఆలోచించరు. వీరికి లౌకిక చింతనే తప్ప అలౌకిక జ్ఞానం కలగదు.
*కొందరికి కామవాంఛ తప్ప మరొక ఆలోచన ఉండదు.
ఇంద్రియలోలత్వంతో లైంగిక సుఖమే దైవమనుకుంటారు. ఆ కామాన్ని తీర్చుకోడానికి ఎంతకైనా తెగిస్తారు.’మగువతో పొందే వీరికి బ్రహ్మానందం !’ఇటువంటి వారొక కోవ! పనిగట్టుకొని ఈ భ్రమలను మానిపించటం సాధ్యమా!
——
* పరమాత్మ, ఆత్మ వంటి ఆలోచనలు లేని సామాన్యులకు ఇంద్రియాలే దైవం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నందుకు పొందే సుఖమే దైవం. చూడటం, వినడం, తాకడం, వాసన చూడటం, మాట్లాడటం వారికి నచ్చినట్లు జరిగితే చాలు. ఇదీ భౌతికమైన లంపటమునకే పరిమితం. ఇంద్రియాలనుఆడించే బుద్ధికూడా శబ్ద స్పర్శ రూప రస గంధములకే పరిమితమైపోతుంది.
* మాయలోబడిన సంసారికి తన ఊరిదొరే దైవం. ఆ దొరకు మొక్కితే చాలనుకుంటాడు.
*తామసులు( అజ్ఞానాంధకారంలో ఉన్న తమోగుణ ప్రథానులు) డబ్బేదైవం. వాళ్ళ దృష్టంతా డబ్బు సంపాదించడం, దాచడం మీదే.
ఇటువంటి అవివేకులకు చెప్పడం, మార్చడం ఎవరితరం!
———
*ధనం సంపాదించగానే అహంకారం పెరుగుతుంది. ధనమదం గలవాళ్ళు నేనే దేవుడిననుకుంటారు. అంతా తననే దేవుడని పూజించాలనుకుంటారు.
*ఇక డబ్బులేని పేదవాళ్ళు తమకు ఎవరు ధన సహాయం చేస్తే ( దాత)వాళ్ళను దేవుడనుకుంటారు.
(తమ స్వార్థం కోసం, పేరుకోసం డబ్బు పంచేవాళ్ళూ, ఇళ్ళు కట్టించడం వంటి కపట సేవలు చేసేవాళ్ళూ, వీళ్ళకు దేవుళ్ళుగా కనిపిస్తారు.వీరు నిజమైన దాతలు కాదు.)
*స్థిరమై భువిన కొలువైన ఆ వేంకటేశ్వరుడే దైవమనుకునే మేము పరుల భ్రమలను పోగొట్ట గలమా!
~~~~~~~
కీర్తనకు అద్భుతమైన చిత్రం వేసిన సోదరులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి ధన్యవాదములు.
~~~~~~~~~~~
కీర్తనకు నా పద్యములతో స్పందన
కం॥
ఒక్కడవే రావలెగద
ఒక్కడవే పోవగవలె నుడిగెడి వేళన్
దక్కగ నుత్తమ గతులను
ఎక్కడివక్కడ మరచుట నెరుగగ వలెరా!
కొలువకుమీ,యూరిదొరల
తలపకు మెన్నడు ధనమును దైవంబనుచున్
గెలువుముకామప్రవృత్తిని
నిలుపుము నీమదిని హరిని నిరతము నరుడా!
***************
డా.ఉమాదేవి జంధ్యాల
చిత్రం-శ్రీ Pvr Murtyగారు . వారికి కృతజ్ఞతలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి