20, మార్చి 2022, ఆదివారం

జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి ఆణిముత్యముల చల్లలవి నీకు కొల్లలా - అన్నమయ్య కీర్తన


 

వారం వారం అన్నమయ్య
ఈ వారం అన్నమయ్య కీర్తన - జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు కొల్లలా
విశ్లేషణ : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
~~~~~~🔹🔹~~~~~~~
🌻ఒక ప్రార్థన పద్యం..( భాగవతము)
కం॥
నీ నగవులు నీ చూడ్కులు
నీ నానావిహరణములు నీ ధ్యానంబుల్
నీ నర్మాలాపంబులు
మానసముల నాటి నేడు మగుడవు కృష్ణా!
******************
🔹అన్నమయ్య కీర్తన👇🏿
జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు కొల్లలా
పోయవే కొసరుచల్ల బొంకుగొల్లెతా , వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మూయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా, వోరి
పోయవో పోవొ మాచల్ల పులు సేల నీకునుII
చిలుకవే గోరంజల్ల జిడ్డు గొల్లెతా ,
వోరి..పలచిని చల్ల నీకు బాతి గాదురా
కలచవే లోనిచల్ల గబ్బి గొల్లెతా ,
వోరి..తొలగరా మా చల్లేల దొరవైతి నీకు II
అమ్మకువే చల్లలు వయ్యారి గొల్లెతా
వోరి.. క్రమ్మర మాతోడనిట్టె గయ్యా
ళించేవు
సొమ్మెలం బోయేవేలె సొంపు గొల్లెతా, వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును II
~~~~~~~~~~~~~~~~
💥నాకు తెలిసినంతలో వివరణ👇🏿
అదుగో వ్రేపల్లె!
రోజూలాగే గొల్లభామ చల్లలమ్ముకోడానికి బయలుదేరింది.
గోపాలకృష్ణుడు దారికి అడ్డంగా రానే వచ్చాడు.
వచ్చినడుంమీద చెయ్యి పెట్టుకొని నిలబడి “భామా! ఎక్కడికి వెళుతున్నావు? ఆ కుండలో ఏముంది?” అన్నాడు కొంటెగా?
“నన్ను పోనివ్వు కన్నయ్యా! పనుంది” అని తప్పించుకొని వెళ్ళబోయి ఉంటుంది.
అప్పడు …. ఆగోపికాకృష్ణుల మధ్య జరిగిన సంభాషణ అన్నమయ్య చేతిలో అందమైన కీర్తనగా రూపుదిద్దుకుంది.
“ ఇదుగో గొల్లపిల్లా! చాలించు నీ జాణతనం ! ఊకదంపుడు మాటలు
మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా?”అన్నాడు కృష్ణుడు చిలిపిగా నవ్వుతూ!
“ఈ కుండలో ఉన్నవి… మీయింట్లో కొల్లలుగా ఉండే చల్లలేనయ్యా కృష్ణమూర్తీ!ఆణిముత్యాలు కాదు” అంది మూతి విరుస్తూ!
“ ఏయ్ అపద్ధాలకోరూ! అవినిజంగా చల్లలైతే ఏదీ కాసినిటు పొయ్యి…” అన్నాడు దోసిలిపట్టి.
“మాయింటి చల్లమీద మనసైందా నీకు!… అంటూ చల్లకుండ పైకి ఎత్తుకో బోయింది।
“ఆఁ… ఆఁ… ముూత పెట్టవాకు.
నువ్వెంత చాడీల మారివో నాకు తెలుసులే… ముచ్చు మొఖమా!” అన్నాడు ఆటపట్టిస్తూ.
ఆ గొల్లభామకూ ఈ అల్లరి గోవిందుడికి సరిపోయింది. ఎలా మాటకు మాట విసురుకుంటున్నారో చూడండి।
“పో పోవోయ్! మా పుల్లమజ్జిగ నీకు కావల్సి వచ్చిందా! “
“ఏదీ గోటితో కాస్త గీకు…బాగానే జిడ్డుందే.”
“అబ్బే… చాలా పలచగా ఉంది. నీకు ఇది నచ్చదు. ఇలాంటి మజ్జిగ నీకు పొయ్యడం న్యాయమూ కాదు. నన్ను పోనీ.”
“ ఏది … కలబెట్టొకసారి”
“ తప్పుకో ... తప్పుకో ..మీరు పెద్దింటోళ్ళు..దొరలు! మా నీళ్ళ మజ్జిగ నీకెందుకు?”
“అయినా… ఇంటి పాడి ఇట్లా అమ్ముకోవచ్చా?”
“ పోయేటప్పుడూ వచ్చేటప్పుడూ నీ గోలేవిటయ్యా గోపాలా!”
“ ఎంత డబ్బు సంపాయించినా పోయేదేనే పిల్లా!”
“ ఓరోరీ … ఎక్కడ పడితే అక్కడే కనబడతావు . దిమ్మరివినీవు. నీ మాటల మాయకు మేం కట్టుబడి పోయామయ్యా కోనేటిరాయా! నువ్వు కనిపిస్తే కదల్లేక పోతున్నాం” అంది నిట్టూరుస్తూ!
ఇక్కడ గొల్లెత అన్నమయ్యే!గోపాలుడు ఆ శ్రీనివాసుడే!
🌺కృష్ణుడు గోపిక వెంటబడటం, ఆమె ఆ కొంటె బాలుడిని విసుక్కోవడం పైకి కనిపించే విషయం. మరి అంతరార్థమేమైనా ఉందా ఈ పాటలో… చూద్దాం.
హరి అవతారాలన్నింటిలో ఒక కృష్ణుడినే కృష్ణపరమాత్మ అంటాం. అందరికన్నా ఉన్నతుడైన పరమాత్మ దిగివచ్చేది మనల్ని ఉద్ధరించడానికే కదా! ఎక్కడెక్కడి భక్తులకూ ఎదురుపడతాడు. అంతటా తిరిగే దిమ్మరి!
వ్యాసుడు భాగవత ప్రారంభంలోనే కృష్ణపరమాత్మను స్తుతిస్తూ….
“ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే।
తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయమ్॥”అన్నాడు.
కృష్ణుడు గోపికకు అడ్డుపడటం వెనక చెప్పదలచింది ఏమిటంటే …
“సంసారం, పాలూ పెరుగు అమ్ముకోవడం వంటి వాటికంటే నీ ఆరాధన పరిపక్వతకు నన్ను తెలుసుకో …. నీదగ్గర ఉన్నది దాచవద్దు.
భగవదర్పణం చేయడానికి సంశయించకు. నేను పలచన అనే న్యూనతా భావం విడిచి పెట్టు. నీలో నీకే తెలియని భక్తి సాంద్రత ( మజ్జిగపై జిడ్డు) ఉంది” అని. కర్మబంధములనుంచి బయట పడితేనే కృష్ణతత్వం అర్థమౌతుంది. కృష్ణ తత్వం అర్థమైతేనే కర్మబంధాలు తొలుగుతాయి. తొలగ వలసినది కృష్ణుడుకాడు. గోపికలోని అజ్ఞానం. కలపని, కదపని మజ్జిగలో చిక్కదనమంతా అడుగుకు పోయినట్లు, మనసులోని భక్తి, సంసార బాధ్యతల వలన పైకి రాలేక పోతోంది. ఒక్కసారి మనస్సనే మజ్జిగకుండను కదిపి చూడండి. పరమాత్మ దొరే. ఆయనకు మనదగ్గర ఉన్నదేదీ అక్కరలేదు. అన్నీ కొల్లలు గానే ఉన్నాయి. అమ్మకు అక్కరలేకపోయినా “ఏదీ నాక్కొంచెం పెట్టవా! అని బిడ్డను అడిగినట్లు… పరమాత్మ మనకు అర్పణబుద్ధి ఉందా .. లేదా అని పరీక్షిస్తుంటాడు.
భగవంతుడికి దుష్టశిక్షణ ఎంత బాధ్యతో, తననే ఆరాధించే భక్తులకు దారిచూపి ఉద్ధరించడమూ అంతే బాధ్యత.
ఎందుకు గోపికలకు అడ్డం పడుతున్నాడనడానికి భాగవతంలోని ఈ పద్యమే జవాబు చెబుతుంది.
॥తరలము॥
హరినెఱుంగక యింటిలో బహుహాయ
నంబులు మత్తుఁడై
పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవ
నేర్చునె? వాఁడు సం
సరణముం బెడఁబాయఁ డెన్నఁడు; సత్య మా హరినామ సం
స్మరణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!
స్వస్తి 🙏
~~~~~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
కీర్తనకు మనోహరమైన చిత్రాన్ని వేసినవారు శ్రీ Pvr Murty గారు 🙏
(అంతరార్థానికి ఆకునందించిన అన్నగారు శ్రీమాన్ Tirumala Pallerlamudi Raghavachari.గారు.🙏
Ref -బ్రహ్మశ్రీ షణ్ముఖశర్మగారి ప్రవచనాలు)🙏

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...